15, జనవరి 2013, మంగళవారం

స్వగతావేదన

చిన్ననాటి నవల పదే పదే గుర్తుకు వస్తూన్న సందర్భం... అవే సంఘటనలు పునరావృతమవుతూనే వున్నాయి. ఓల్గా వ్రాసిన నవల చతురలో ప్రచురితమైంది. ఆ నవల మొత్తం గుర్తు లేదు కానీ... దానిలో ఓ భాగంలో అప్పటి వరకూ అంతా ఒకే కుటుంబంలా మెలిగిన ఓ విప్లవ కమ్యూనిస్టు కూటమికి చెందిన వారు విభేదాలు రాగానే ఎంత విద్వేషపూరితంగా మారిపోతారో అంటూ కన్నీళ్ళు పెట్టిన విషయం... ఇది చదివి సుమారుగా 25సంవత్సరాలు పైబడే వుంటుంది. అప్పటి ఆ ప్రశ్న ఆ తరువాత కొండపల్లి కోటేశ్వరమ్మ తన జ్ఞాపకాలను పరిచినప్పుడూ ప్రశ్నించారు. శివసాగర్ మరణించినప్పుడు ఆమెతో మాట్లాడుతూంటే కళ్లలో నిలిచిన కన్నీటి చుక్కలను జారనీయకుండా పొదివిపట్టుకుని ఆమె వేసిన ప్రశ్న పచ్చిగా నాలో నిలిచిపోయిన నాటి ఆ కథా జ్ఞాపకాన్ని తట్టిలేపింది. లోలోతుల్లో నాకు తెలియకుండానే ఎంతగానో అభిమానించిన రామకృష్ణ గారు... చార్వాక రామకృష్ణగారు...నా మామగారు... ఆయన జీవన శైలి, ఆయన నిబద్దత, డబ్బుల పట్ల ఆయన అవసరవిముఖత నాలో తెలియకుండానే బలమైన ముద్రవేశాయి. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పోరాటాలు ఏకకాలంలో సాగాలంటూ ఆయన తుదిశ్వాస వరకూ చెప్పిన మాట బలంగా ముందుకు వస్తున్న నేపథ్యం ఆయనను మరిచిపోనీయకుండా చేస్తున్నాయి. కులం పట్టుగురించి ఆయనతో పంచుకున్న కొద్ది విషయాలే ఇప్పటికీ వెన్నాడుతూ వున్నాయి. అన్ని గ్రూపుల వారినీ ఆహ్వానిస్తూ ఎవరికీ స్వంతంకాకుండా అందరిదీ అయిన ఉద్యమంగా భావవిప్లవోద్యమాన్ని నడపాలని ఆయన తాపత్రయపడిన తీరు... ఆ క్రమంలో ఆయన ఎవ్వరికీ కాకుండా మిగిలిన దుస్థితి పదేపదే ప్రశ్నించుకున్న సందర్భాలు ఎన్నో. ఆయన మరణం తరువాత దగ్గరయిన కొద్దిమందీ రమకృష్ణగారి ఉద్యమశైలిపై వున్న అభిమానంతో కాక దానిని స్వంతం చేసుకోవాలని అని తెలిసినప్పుడు పూర్తిగా నిరాశలో కూరుకుపోయిన సందర్భం... ఓ ఉదయాన్నో గాఢ నిద్రలో వున్న నన్ను హఠాత్తుగా తట్టిలేపుతూనే వుంది. ఇప్పుడు మరోసారి... నాన్న అనుభవం... మరింత గాయం చేస్తూ నన్ను సలుపుతోంది. పదే పదే నాడు ఓల్గా వేసిన ప్రశ్నకు సమాధానం ఏమిటంటూ ప్రశ్నిస్తూనే వుంది. ప్రశ్నించటాన్ని భరించలేని కేంద్రీకృత ప్రజాస్వామ్యం... నియంతృత్వపోకడలతో వ్యక్తి నాయకత్వ వ్యామోహంతో సాగే విప్లవోద్యమాలు... ఓ వ్యక్తిని భావజాలదేముడిగా చేసి విగ్రహాలు పాతి పూజించే ఫక్తు భారతీయ సంస్కృతీ ప్రభావ బీజాలు... ప్రశ్నించిన ప్రతీగొంతుకా నొక్కబడుతూనే వుంది. వెలివేయబడుతూనే వుంది. ప్రశ్న ప్రతి కదలికా అనుమానాస్పదమే. ప్రతీ కలియకా ఓ విషపూరిత ప్రచారానికి వేదికే. నన్నంటుకోకు నా మాలకాకి అంటూ సాగే ఇనుపకచ్చడాల మధ్యసాగే గుంపు జీవితం... మందను కాపాడుకునే గొర్రెల కాపరిలా... అనుక్షణం అనుమానంతో కూడిన అప్రమత్తత. ఐక్యతకోసం అంటూనే అనైక్యతదిశగా సాగే లక్షణాలను మరింత బలోపేతం చేసుకుంటూ సాగే క్షణాలు... ఇదంతా ఓ అంతర్వేదన...ఆ కుటుంబాలలో పుట్టి రక్తసంబంధీకులకు, నా కులపోళ్ళకూ ఇవ్వని ప్రాధాన్యం భావసంబంధీకులకు ఇచ్చి నష్టపోయానే అన్న భావన కలిగిన క్షణాన వచ్చిన ఆవేదనా ప్రవాహం... ఇది నా స్వగతం... నాదైన స్వగతం...నాకు మాత్రమే స్వంతమైన ప్రకటితా పత్రం.