21, మార్చి 2015, శనివారం

మావోయిస్టు కోటను దత్తత తీసుకున్న పోలీస్

విశాఖ ఏజెన్సీ బలపం పంచాయతీ మావోయిస్టులకు పెట్టని కోట. నిత్యం మావోయిస్టుల రాకపోకలు సాగే ఈ ప్రాంతంలో పోలీసులు, పారామిలటరీ బలగాలు కాలుపెట్టడం ప్రయాసతో కూడిన వ్యవహారం. అలాంటి ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్ దత్తత తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మొట్టమొదటి సారిగా ఓ జిల్లా ఎస్పీ రోడ్డు మార్గంలో బలపం పంచాయతీ, కోరుకొండ గ్రామానికి వెళ్ళారు. మావోయిస్టులను ఎదుర్కోవటానికి పోలీసులు తీసుకున్న సరికొత్త పంథాపై కథనం...

విశాఖ జిల్లా ఏజెన్సీలోని చింతపల్లి మండలంలో బలపం పంచాయతీ మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతం. పంచాయతీలోని 32 గ్రామాలలో అత్యధిక గ్రామాలలో మావోయిస్టు మిలీషియా చురుకుగా పనిచేస్తోంది. మావోయిస్టు గ్రామ కమిటీలు పనిచేస్తున్నాయన్న విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులూ అన్యాపదేశంగా అంగీకరిస్తున్న అంశం. ఈ మధ్య కాలంలో గెమ్మెల సంజీవరావును మావోయిస్టులు చంపటం... మావోయిస్టుల చర్యతో తక్షణాగ్రహానికి గురైన వీరవరం గ్రామస్తులు తిరగబడి మావోయిస్టు నేత శరత్, గణపతిలను చంపేసిన ఘటన చోటు చేసుకున్నదీ ఈ పంచాయతీలోని కోరుకొండ గ్రామంలోనే. 32 గ్రామాల ప్రజలూ ప్రతీ ఆదివారం నిత్యావసర వస్తువుల కొనుగోళ్ళ కోసం వచ్చే సంతబయలు వున్నదీ ఈ కోరుకొండ గ్రామంలోనే. ఇప్పుడు ఈ ప్రాంతంలో పాగా వేయటానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నగరాలలోని వార్డులను, గ్రామాలను దత్తత తీసుకోవటానికి అందరూ ముందుకు రావాలని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ దిశగా ఓ అడుగు ముందుకు వేసి అరకు వ్యాలీని దత్తత తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అదే బాటన సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవ్వరూ వెళ్ళటానికి కూడా సాహసించని బలపం పంచాయతీలోని 32 గ్రామాలను దత్తత తీసుకోవాలని జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ నిర్ణయించుకున్నారు. ఏజెన్సీలోని ప్రజలకు దగ్గర కావటానికి సద్భావన యాత్రల పేరుతో గతంలో ప్రారంభించిన కార్యక్రమానికి కొనసాగింపుగా జిల్లా పోలీసులు సహపంక్తి భోజనాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. ఆయా గ్రామాలలో యువకులుకు వాలీబాల్స్, నెట్ లను అందించటం, మహిళలకు చీరలను ఉచితంగా పంచటం, వైద్య శిబిరాల నిర్వహణ వంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు జిల్లా ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్ సహపంక్తి భోజనాల పేరిట అత్యంత సాహసోపేతంగా రోడ్డు మార్గంలో బలపం పంచాయతీలోని కోరుకొండకు చేరుకున్నారు.

చింతపల్లి మండలంలోని లోతుగెడ్డ జంక్షన్ నుంచి పాడేరు రహదారిలో సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో లోతుగెడ్డ వంతెన వుంది. అక్కడ నుంచి లోపలికి 19కి.మీ. అత్యంత దుర్భరంగా వుండే రహదారాలో ప్రయాణిస్తే జిల్లా ఎస్పీ ప్రవీణ్ దత్తత తీసుకున్న బలపం పంచాయతీకి చేరుకుంటాం. అలాంటి ఈ గ్రామానికి ఇప్పుడు లోతుగెడ్డ జంక్షన్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని మూలకొత్తూరుకు రహదారి నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నాయి. పోలీసుల పహరా నడుమ ఈ రోడ్డు పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే గ్రావెల్ రోడ్డు పూర్తయ్యింది. ఏప్రిల్ నాటికి తారురోడ్డు పూర్తయ్యే అవకాశం వుందని అధికారులు చెపుతున్నారు. మూలకొత్తూరు నుంచి కొండవాలుల్లో సాగే ఘాట్ రోడ్డుపై మరో 11కి.మీ. ప్రయాణం చేయాలి. గ్రామ పంచాయతీ కేంద్రమైన బలపంకు వెళ్లే మార్గంలోని మావోయిస్టు స్థూపం వద్దనే గత ఏడాది డిసెంబర్ లో గమ్మెల సంజీవరావును మావోయిస్టుల చంపేశారు. ఎస్పీ ప్రవీణ్ అక్కడ ఆగి సంజీవరావుకు నివాళులర్పించారు. రెండునిమిషాలు మౌనం పాటించారు. అక్కడ నుంచి ఎస్పీ నేరుగా కోరుకొండ సంతబయలు వద్దకు చేరుకున్నారు. సంతబయలులో ఆయన ఎబిఎన్ తో మాట్లాడుతూ, బలపం పంచాయతీ ఒకటి వుందన్న విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావటం, అభివృద్ధికి ఆమడదూరాన వున్న ఈ గ్రామాలలోని ప్రజలకు రహదారి, మంచినీరు, వైద్యం, విద్యా సౌకర్యాలను అందించాలన్న లక్ష్యంతో దత్తత తీసుకున్నానని వివరించారు.

సుమారు రెండు క్రితం నుంచే దాదాపుగా 700 మంది పోలీస్, పారామిలటరీ బలగాలు ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. శనివారం నాటికే ఒఎస్డీ విశాల్ గున్ని, చింతపల్లి డిఎస్పీ రాఘవేంద్రరావు తదితర పోలీస్ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మావోయిస్టుల చేతిలో చనిపోయిన గెమ్మెల సంజీవరావు గ్రామమైన వీరవరంతో సహా పలు గ్రామాలలో ఆ అధికారులు సుడిగాలి పర్యటన చేశారు. గ్రామస్తులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారు. ఆయా గ్రామాలలో ఎంతమంది వుంటున్నారు? యువకులు ఎంతమంది వున్నారు వంటి సమాచారాన్ని సేకరించారు. ఇంత గ్రౌండ్ వర్క్ చేసుకున్న ఎస్పీ కోయ ప్రవీణ్ ఆదివారం నాడు జరిగిన సంతలో ప్రజలతో మమేకమవ్వటానికి ప్రయత్నించారు. వారితో మాట్లాడారు. సంతలో కలియతిరిగారు. గ్రామస్తులను వారి వారి సమస్యలను చెప్పమని అడిగారు. పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ, తమకు తాగటానికి మంచినీటి వసతిని కల్పించాలని డిమాండ్ చేశారు. పది కుటుంబాలు మాత్రమే వున్న గ్రామాలకు మంచినీరు ఇవ్వమని రెవెన్యూ అధికారులు చెపుతున్న తీరును ఎస్పీకి వివరించారు. మరికొందరు మాట్లాడుతూ, హుద్ హుద్ తుఫాను నష్టపరిహారం ఇప్పటికీ అందని వైనం గురించి చెప్పుకున్నారు.

బలపం పంచాయతీలోని పలుగ్రామాల ప్రజలు చెపుతున్న సమస్యలను ఎస్పీ కోయ ప్రవీణ్ ఓపికగా విన్నారు. మంచినీటి సమస్యను తీర్చాలంటే బోర్లు వేయాలని, అవి వేయాలంటే బోరు కోసే యంత్రాలు కావాలని, అవి రావాలంటే రహదారి నిర్మాణం సాగాలని ఆయన వారికి వివరించే ప్రయత్నం చేశారు. అయితే రోడ్లు వేయకుండా కొందరు ముసుగు మనుషులు అడ్డుకుంటున్నారని, రోడ్డు వేసే యంత్రాలను తగలపెడుతున్నారని, వారికి సహకరించవద్దని ఆయన గిరిజనులను కోరారు. ఈ క్రమంలోనే ఆయన పలుమార్లు మాకు రోడ్డు కావాలి అంటూ గిరిజనుల చేత పలికించారు. అదే సమయంలో మీరు కోరుకుంటే పోలీస్ స్టేషన్ కూడా మీ చెంతకు కోరుకొండ వస్తుందని ఆయన అంటూ, మీకు పోలీస్ స్టేషన్ కావాలా? అంటూ వారిని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు గిరిజనులు ఒక్కరు కూడా స్పందించలేదు. పదే పదే ఎస్పీ అడుగుతున్న వారిలో ఎలాంటి స్పందనా కనిపించలేదు. దానిని అర్థం చేసుకున్న ఎస్పీ తిరిగి రహదారి నిర్మాణం గురించి మాట్లాడి ముగించారు. ఈ సందర్భంలో ఓ గిరిజనుడు ఎబిఎన్ తో మాట్లాడుతూ, పోలీసులు పిలిచినా రావాలి... అన్నలు పిలిచినా రావాలి... లేకపోతే కష్టం సారూ... అన్న మాటలు అక్కడ కొనసాగుతున్న అప్రకటిత యుద్ధవాతావరణాన్ని మనకు పట్టిస్తుంది.

అత్యంత క్లిష్టమైన ఆ ప్రాంతానికి మూడు నెలలకొకసారైనా వస్తానని జిల్లా ఎస్పీ ప్రవీణ్ చెప్పారు. ఏజెన్సీలో గిరిజన యువతీ, యువకులకు సుమారు 1500 మందికి పారామిలటరీ బలగాలలో చేరటానికి శిక్షణ ఇస్తున్నామని, మెగా రిక్రూట్ మెంట్ క్యాంప్ పాడేరులో నిర్వహిస్తామని ఆయన చెప్పారు. మావోయిస్టుల చేస్తున్న గెరిల్లా పోరాటానికి ధీటుగా సమాధానం చెప్పటానికి కేవలం ఆయుధం మాత్రమే సరిపోదని, స్థానిక ప్రజల మనస్సుల్లో కూడా స్థానం సంపాదించుకోవాలని పోలీసులు గట్టిగానే నమ్ముతున్నట్లున్నారు. ఎస్పీ ఎంతో ధైర్యంగా బలపం పంచాయతీని దత్తత తీసుకోవటం వెనుక యుద్ధతంత్రమూ అంతర్లీనంగా వుండే వుంటుందన్న మాటల్లో చెప్పలేని ఓ మూగ అనుమానం ఆ ప్రాంత ప్రజలను వెన్నాడుతున్న ఛాయలు కనిపించాయి. సహపంక్తి భోజనాలకు రండి అంటూ పోలీసులు పిలస్తున్నా వినిపించుకోకుండా తిన్నవాళ్ళ ఫోటోలు తీస్తున్నారహే... రండి రండి అంటూ ఓ మహిళ తనవారిని తీసుకుని దూరంగా సాగిపోయింది. తుపాకులతో సహవాసం ప్రమాదమన్నది వారి జీవితం నేర్పిన అనుభవమా? ఎప్పుడో ఒక్కసారి వచ్చే పోలీసుల కోసం అన్నలకు కోపం తెప్పించటం ఎందుకన్న లోకజ్ఞానమా? ఏదైతేనేం... పోలీసులు ఓ కార్యక్రమం ముగించామనుకుంటూ ఇళ్ళదారిపడితే... అక్కడ వున్న గిరిజనం... రేపు అన్నలతో ఏం తంటా వస్తుందోనన్న భయాలోచనలతో కాలిబాటపట్టారు. ఏ మందు పాతరా పేలనందుకు, ఏ తూటా మోగనందుకు ఆనందిస్తూ మీడియా కథనాల కోసం కొండదిగి పరుగులు పెట్టింది. 

కామెంట్‌లు లేవు: