18, నవంబర్ 2025, మంగళవారం

మరణ వేదన

 


న్నో విషయాల్లో చేదోడువాదోడుగా ఉండే మిత్రుడు అక్బర్ పాషా అన్నయ్య షాజహాన్ అనారోగ్యంతో మరణించారన్న వార్త తెలియగానే ఒకింత దుఃఖంలో మునిగిపోయా. అంతకు నెల రోజుల ముందు నుంచే ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంపై తీవ్ర ఆందోళనతో పాషా గడిపాడు. ఎన్నో పరీక్షలు, ఎంతో మంది డాక్టర్లు. చివరికి నా పెద్ద కోడలు రిపోర్టులన్నీ చూసి తన అభిప్రాయాన్ని చెప్పింది. జనరల్ ఫిజీయషన్ దగ్గరకు తీసుకొని వెళ్లాలి. స్వగ్రామం వేలేరుపాడు వెళ్లి వస్తానని చెప్పిన మనిషి మళ్లీ రాలేదు. అనారోగ్యం ఏమిటో నిర్ధారణ కాకుండానే మనిషిని కోల్పోవడం పెద్ద విషాదం. కుటుంబం మొత్తానికి పెద్ద దిక్కుగా నిలిచిన మంచి మనిషి, ఊళ్లో అందరికీ తలలో నాలుకలా నిలిచిన, హృదయమున్న మంచి మనిషిని కోల్పోవడం తీరని దుఃఖమే.

9 తేదీన రాత్రి సుమారు 8 గంటలకు షాజహాన్ చనిపోయారు. 10వ తేదీ ఉదయం పాషా వేలేరుపాడు బయలుదేరి వెళ్లారు. అదే రోజు పాషా వెంట వెళ్లాల్సింది. కుదరలేదు. చివరికి 17న మిత్రులు కృష్ణ, అమరయ్య, నరసింహారావు, చావా రవితో కలసి వెళ్లాను. అక్కడకు వెళ్లిన తరువాత నాకు అర్థమయింది.

కొద్ది నెలల క్రితం తమ్ముడు చనిపోవడం, జీవితాన్ని ఇచ్చిన పచ్చటి ఊరు పోలవరం ప్రాజెక్టులో మునిగిపోతుండడం... ఆయనను మానసికంగా వేధించాయి. తన వేదనను ఎవరికీ పంచకుండా మౌనంగా ఉండిపోయారు. మెల్లగా ఆహారం తగ్గిపోయింది. అది ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపించింది.

 ఊరు చూసిన తరువాత మిత్రులతో... ‘మైదానంలో ఉండే మనకు పుట్టి పెరిగిన పచ్చని పల్లెను,
విశాలమైన లోగిళ్లను, పూలు, పళ్ల చెట్లను, వదిలి వెళ్లడంలోని మరణ వేదన ఏమిటో తెలిసే అవకాశం లేదు. దురదృష్టవశాత్తు ప్రధాన మీడియాలో పనిచేసే వారిలో అత్యధికులు వారే. అదిగో అక్కడే అరుణ్ సాగర్ తో నేను ప్రేమలో పడింది. అరుణ్ రాసిన వాక్యం వెంట చూపు పరిగెడుతుంటే కళ్లు కన్నీళ్ల కాళ్లాపి చల్లుతుంటాయి. గుండె గునపం తీసుకుని రంకెలేస్తుంది. సర్కారిచ్చే డిక్కీ ఇళ్లు, చిన్నపాటి సొమ్ముతో జీవితం దుర్బరంగా మారుతుంది. వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేక, వంటకు అవసరమైన కూరగాయలు వేసుకోవడానికి పెరళ్లు లేక... ఊహించడానికే కష్టంగా ఉంటుంది కదూ. రేపటి నుంచి వాళ్లేమి చేయాలి?’ అని అన్నాను.

అందరితో మాట్లాడుతున్నా ఏదో వేదన హృదయాన్ని కోస్తూనే ఉంది. ఉగ్రగోదారి పరవళ్ల ప్రవాహానికి ఊరు మునగడం కొత్తేమీ కాదు. మొన్నటి వరకూ తల్లి కోపం తగ్గగానే కష్టమో నష్టమో ఒండ్రును శుభ్రం చేసుకోవడం, పనుల్లో పడిపోవడం వారికి మామూలయ్యింది. రేపటి నుంచి అది కాదు... ఎప్పటికీ ఆ ఊరితో సహా మొత్తం 175 ఊళ్లు శాశ్వతంగా నీళ్లలో సమాధి అవుతాయి. లక్షలాది మొక్కలు, వేలాది ఎకరాలు, వందలాది ఇళ్లు కనుమరుగవుతాయి. ముసలీ ముతక కొత్తగా పుట్టి పెరగాలి. అప్పటి వరకూ చట్టబద్ధంగా ప్రభుత్వాలు విదిల్చే పరిహారం కోసం దేబరిస్తూనే ఉండాలి.

న్నా షాజహాన్... నీ ప్రేమతో తడిచి ముద్దయిన పాషా కుటుంబం యావత్తూ... అంతేనా వేలేరుపాడులోని ఎంతో మంది... అదృష్టవంతులు.

గోదారమ్మ గర్భంలో నీ గురుతులు ఇక శాశ్వతంగా నిలిచిపోతాయి.

 ఫొటోలు: షాజహాన్ కుటుంబాలకు సంబంధించిన ఇళ్లు... మిత్రుడు సాగుబడి రాంబాబుకు చెందిన రెండెకరాల సువిశాలమైన దొడ్డిలో నిర్మితమైన నివాసం శిథిలమైన దృశ్యం... 150 ఎకరాలు సాగు చేసిన రైతుకు చెందిన పొగాకు బేరన్ పై రాసిన ఒకానొక వ్యాపార ప్రకటన...https://photos.app.goo.gl/8SChwUQzXCYjnnr46

1 కామెంట్‌:

pratika చెప్పారు...

అదృష్ట వంతుడు చనిపోయాడు