28, జనవరి 2018, ఆదివారం

రాజకీయం రంజు

విష్యత్తుపై బెంగ ఇప్పుడు అందరినీ వేధిస్తోంది. చేయవలసిన పనిని పక్కదారిపట్టించారు. రేపటి చింతనలో ముని గితేలుతున్నారు. వర్తమానపు వెలుగుచీకట్లు రాబోయే రోజుల్లో ఫలితాలను నిర్దేశిస్తాయన్న గీతాసారాన్నీ వదిలేశా రు. పనిచేయవలసి రావటం విసుగ్గా మారటంతో కొందరు... ఇప్పటికే చేయవలసినదంతా చేసేశాం, అందుకే అంతా అనుకూలం అన్న ధీమాతో మరికొందరు సర్వభ్రష్టత్వానికి పునాదులేస్తున్నారు. విశాఖ జిల్లాలో కనిపిస్తున్న ఈ ఛాయలు రాష్ట్ర వ్యాపితంగా వుండే అవకాశాలను కొట్టిపారేయలేమని తెలుగు తమ్ముళ్ళు దిగులు పడుతున్నారు. అదేమిటో వివరంగా అర్థం కావాలంటే ఈ కథనాన్ని చూడాల్సిందే.
చేతినిండా పని వున్నోడూ... ఏ పనీ లేకుండా తిరగాలని ఆశపడుతున్నోడూ ఇప్పుడు ఒక్కటవ్వటమే చికాకుగా మారింది. చెప్పిందే చెప్పటం, పనో అంటూ 24గంటలూ తిరగటం, తిప్పేయటం... ఇదేమైనా బాగుందా చెప్పండి? ఎన్ని అని చేస్తాం. ఒకటా రెండా. ఆలోచన వచ్చిందే తడవు. అమలులోకి తెచ్చేయాలి, జనాలకు ఏదో చేసేయాలని తాపత్రయపడుతున్నట్లు ఊగుతూండటం తప్ప... వెనుక వస్తున్నారో లేదో చూసుకోవద్దూ. కొంతమంది అంతే. ఎంత మారదామనుకున్నా, మారరు. పదేళ్ళ కాలం ఎంత సుఖంగా సాగిపోయింది. అమాత్యులో, ప్రభుత్వంలోని పెద్ద అధికారులో గట్టిగా అడిగితే... అదీ కాస్త బలం వున్నాళ్ళే సుమా... పనిచేసేస్తే మనం సేఫ్. మిగిలిన సమయంలో చేసుకున్నోడికి చేసుకున్నంత. పని తక్కువ, జేబుకు బరువెక్కువ. మరి ఇప్పుడో. బొక్కసం నిండే మార్గాలన్నింటినీ పూడ్చేస్తామంటే ఎలా కుదురుతుంది? వాళ్ళేమో రాజమార్గాలు వేసుకుంటారా? మాకేమో వున్న కాస్త మట్టిరోడ్లనూ తీసేస్తారా, ఎంత అన్యాయమెంత అన్యాయం. ఈ టెక్నాలజీ ఏంటో మనకు అర్థం కాదు. పనంతా సులభమని మాటలు చెప్పినంత తేలికగా పనులేమీ సాగటం లేదిక్కడ. అయినా మనం అనేసుకోటమేకానీ పెద్దోనికి అర్థమవుతుందా? పాడా. ఈ బాధను ఇంక భరించటం మన వల్ల కాదు. సరైన సమయంలో మనం కత్తులు తీయా ల్సిందే. నిశ్శబ్ధంగా కోసేయాల్సిందే. చాప కింద నీరులా పాకుతోంది. గ్రామాల్లోకి వెళ్తున్న నాయకులకు అసలు విషయాలు అర్థమవుతున్నాయి. చేయాల్సినది చాలానే వుంటున్నా, చేయించలేని నిస్సహాయత. రేపు దెబ్బేసేస్తారేమోనన్న భయం ఇప్పుడు సరికొత్తగా పసుపు శ్రేణుల్లో మొదలయ్యింది. నాయకుడు వాస్తవాన్ని చూడటానికి తగ్గ అవకాశాలు వున్నాయా? ఎప్పటిలానే చేతులు కాలాక ఆకులు పట్టుకోవాలా? ఆలోచనలు సంద్రంలోతుల్లో సుడుల్లా కనిపించకుండానే నవనాడుల్నీ లాగేస్తున్నాయి.
నిబద్ధతతో పనిచేస్తున్నోళ్ళు చాలా మందే వున్నా, కావాలని జిల్లా, నగర ప్రజాప్రతినిథులు మూకుమ్మడిగా పార్టీ పగ్గాలు ఏరికోరి అప్పచెప్పిన ఫలితం. ఇప్పుడు సెగ బలంగానే తాకుతున్నట్లుంది. జిల్లాలో పొగమాత్రమే కనిపిస్తూంటే, నగరంలో ఏకంగా సన్నని మంటలు కూడా కనిపిస్తున్నాయంటూ జెండా గుసగుసలాడుతోంది. ఎవరికి మాత్రం వుండదు. మతం, కులం వున్న తరువాత... మాది ఫలానా అని ముద్రవేసుకున్న తరువాత, అవాజ్యమైన ప్రేమ పుట్టకుండా ఎలా వుంటుంది? అధికార సాధనకు అది కూడా ఓ మార్గమైనప్పుడు ఆ ప్రేమ మరింత గాఢమైనట్లు గట్టిగా కనిపించటం అత్యంత సహజం. అలా కాకపోతే రాజకీయాలకు పెద్దగా పనికిరాడని భావిస్తున్నారనుకుంటున్న పవన్ కళ్యాణ్ లా అయిపోతామేమోనని లోలోపల్లో బెంగకూడా వుంటుంది. అవసరమో, అనవరసరమో చర్చోపచర్చల్లోకి వెళ్ళటం అనవసరం. వున్నది అర్థణానే అయినా అందరికి జున్నుముక్క కావాల్సిందే. అవకాశాలు పెద్దగా పెరగటం లేదు, రావటం లేదు. అయితేనేం, ఆ కేటగిరీలో వుంటే లాభమేదైనా వుంటుందేమోనన్న ఆశ. మెల్లగా డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. మమ్మల్నీ ఎస్టీల్లో చేర్చంచండి అంటూ ఇప్పుడు విశాఖలో హఠాత్తుగా రోడ్లపైన కార్యక్రమం ప్రారంభమయ్యింది. దీని వెనుక ఓ అధికార పార్టీ ప్రజాప్రతినిథి వున్నారన్న బహిరంగ రహస్యాన్ని ఎవ్వరూ పెద్దగా మట్లాడుకోవటం లేదు. ఆ మధ్య మంత్రివర్యులు స్వయంగా శిబిరం వద్దకు వెళ్ళి సంఘీభావం కూడా తెలిపారు. అదే బలమనుకున్నారో ఏమో సిఎం వచ్చిన రోజు ఆయన వద్దకు తనవారిని తీసుకుని సదరు ప్రజాప్రతినిథి స్వయంగా వెళ్ళారు. అప్పటికే నిఘా వర్గాల సమాచారంతో సహనాన్ని కోల్పోయిన పెద్దాయన నోరుపారేసుకున్నాడు. ఎవ్వరికైనా అది ఇబ్బందికరమే. దీనితో సదరు సామాజికవర్గం నేతలంతా ఇప్పుడు గుర్రుగా వున్నారు. కొందరు మాత్రం సందర్భశుద్ధిలేని మావాడివల్ల వచ్చిన సరికొత్త తలపోటని జుత్తు పీకేసుకుంటున్నారుట.  
నోరుపారేసుకున్న బాబుగారు క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ ఇప్పుడు అసలు నినాదమై కూర్చుంది. లాభపడదామని వేలెట్టిన నేతకు ఇప్పుడు రోకటిపోటుతో చేయి చితికింది. ప్రతిపక్షానికి ఉపయోగించుకోవటం చేతకావటం లేదు కానీ, భలే అస్త్రం దొరికిందని సంబరపడుతోంది. పెద్దాయన ముక్కచివాట్లు పెట్టాడంట కదా? అంటూ ఆనోటా ఆనోటా విషయం ఊరంతా పాకింది. గబ్బులేచింది. మొగుడుకొట్టి నందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకన్నట్లయ్యింది ఇప్పుడు పరిస్థితి. ఎన్ని చేశాను. ప్రతీదీ ప్రత్యేకమే. ఎంత ఖర్చుపెడుతున్నాను. నగరానికి నేతనే అయినా, ఏనాడైనా నా నియోజకవర్గం దాటానా? అందుకు కదా, నన్నే రెండో సారి కూర్చోబెట్టారు నా సహచరులంతా. నియోజకవర్గంలో నావారికి ఏ కష్టమొచ్చినా నిమిషాల్లో వాలిపోయాను కదా. ఇప్పటి వరకూ ఎంత మందికి ఎన్ని లక్షలు ఇచ్చాను. రోడ్డు అయితేనేం, బతకటానికి బాబూ అంటూ రాసిచ్చేశాను కదా. అందుకే నా వాళ్ళంతా నా వెనుకే వున్నారు. అలాంటి నన్ను పట్టుకుని ఎంత నాయకుడైతే మాత్రం నన్ను నానా మాటలు అంటాడా? ఛస్ వచ్చే ఎన్నికలలో సీటు ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు. ప్రతిపక్షం నుంచి పోటీ చేసినా గెలుపు మనదే. అసలు మనం కాకుండా ఇక్కడ ఎవరైనా ఎట్లా గెలుస్తారు? అబ్బ ఎంత ధీమాతో కూడిన ప్రకటన. జనం దాకా వచ్చిన ఈ మాటలు పైదాకా పాకకుండా వుంటాయా? అయితేనేం అన్నింటికీ తెగించేశాం. జనం నా వెంటే వున్నారన్న భరోసా, గెలుపు ఖాయమన్న థిలాసా తెచ్చిన తెంపరితనం. అంతా విన్న జెండా మరో సారి మడతపడుతోంది. అసలైన కార్యకర్తను పట్టించుకోకుండా, పార్టీ అంటే తెలియనోళ్ళని పార్టీకే నేతలుగా చేస్తే ఇలానే వుంటుంది. కొందరు కులుకుతున్నారు, మరికొందరు ఖేదంతో వెక్కుతున్నారు. 
ఏ కాలంలోనైనా, ఏ అధికార రాజకీయ పార్టీలోనైనా ఒకరో ఇద్దరో వుండటం సహజం. అదేమిటో విశాఖలో ఇప్పుడు వారే ఎక్కువగా వుండటమే ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. మొన్నటి మొన్న మంత్రిగారే స్వయంగా వచ్చే ఎన్నికలలో నేను నా నియోజకవర్గంలో కాకుండా మరో చోట పోటీ చేస్తున్నానంటూ పరోక్షంగా చెప్పేశారు. ఆ తరువాత వివరణ కోరితే, ఎప్పటిలానే... అంతా సుప్రీం నిర్ణయమన్న రోటీన్ డైలాగ్ కొట్టేశారు. మరో వైపు, మంత్రిగారూ నేనూ ఒక్కటే అన్నంతగా తిరిగిన ఓ నేత ఇప్పుడు హఠాత్తుగా దూరంగా జరిగారు. ఇది ఒక్కరోజులో జరిగిందేమీ కాదనీ, ఇంటా బయటా వచ్చిన రచ్చే దూరం జరిపిందనీ కొందరు అంటూంటే... అబ్బే, అమాయకత్వం కాకపోతే... డబ్బులు పోకుండా బాకీ తీర్చుకోవటానికి ఇదో మార్గం, ఆ మాత్రం తెలియదూ అని అనే గిట్టని వారు మరికొందరు. వాటినన్నింటినీ పక్కన పెడితే, సదరు నేత మొన్నామధ్యెప్పుడో అనకాపల్లిలో పోటీ చేస్తున్నానంటూ ప్రకటించేశారు. ఏ పార్టీ అనేది చెప్పలేదనుకోండి. మరో వైపు ఓ ఎంపీ వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ విమానమెక్కననీ, అమరావతి రైలే ముద్దని నిర్ణయించేసుకున్నట్లే వున్నారు. నా ఎమ్మెల్యే సీటు నాదేనంటూ బహిరంగ, రహస్య మార్గాల్లో ప్రచారం చేసేసుకుంటున్నారు. మైదానానికే ఇవి పరిమితం కాలేదని, విశాఖ ఏజెన్సీలో కూడా ఇప్పుడు అదే పరిస్థితి వుందని అడపాదడపా వినిపిస్తున్న మాటలతో ఇప్పుడు పసుపు కరుగుతోంది. 
పాలేకర్ చెపుతూనే వున్నాడు. అధికోత్పత్తుల పేరుతో అదేపనిగా మందులు వాడితే సారం పోయి క్షోభ మిగులుతుందని. వింటున్న వారంతా యాంత్రికంగానే ఆలోచిస్తున్నట్లున్నారు. నేలమ్మకే కాదనీ, సూత్రం సర్వాంతర్యామి అనీ వారికి ఎప్పటి అర్థమవుతుందీ? గడ్డుకాలమే. కొట్టుకునే, కాట్లాడుకునే వారి సంఖ్య పెరుగుతూనే వుంటుంది. ఇక విశ్రాంతి తీసుకుందామని అనుకుంటున్నా అంటూ ప్రకటించిన మాటలు మెల్లగా తెరమాటుకు దారిచూసుకుంటూంటాయి. మరలా చుక్కేసుకోవటానికి వేలు సిద్ధమవుతూన్న కాలం వచ్చేస్తున్నట్లే వుంది. దూరమున్నా లేనట్లే రాజకీయం రంజుగా మారుతోంది.  

కామెంట్‌లు లేవు: