5, డిసెంబర్ 2022, సోమవారం

నాన్న లేఖ


చాలా రోజుల నుంచి రాయాలనుకుంటున్నా. ఇదనే కాదు... అనేక విషయాలపై... మీతో మాట్లాడాలనుకుని మింగేసిన అనేక అంశాలను మీ ముందు ఉంచాలనే అనుకున్నా. మనసులో మాటలు వేగంగా దొర్లుతుంటాయి. వాటిని ముద్రించడానికి అనువైన సమయం మాత్రం అందుబాటులోకి రావడం లేదంటూ నన్ను నేను మభ్య పుచ్చుకుంటూ కాలాన్ని నెట్టేస్తూ వస్తున్నా. ఇది కూడా రాయాలని అనుకుని కనీసం వారం రోజులు అయినా అయ్యే ఉంటుంది. బయటకు కాలు పెడితే కాదన్న భయంతో వాయిదా వేసి రాస్తున్నా. ఇవన్నీ నా భయాలే. ఎవరికైనా అభిప్రాయాలు, భయాలు, ప్రేమలు... తదితర భావనలన్నీ ఆయా కాలమాన పరిస్థితులు, జీవితంలో నడుచుకుంటూ వచ్చిన మార్గాలను అనుసరించే ఏర్పడతాయి. అందుకనే ఈ రాసే అక్షరాన్నీ అచ్చంగా నా భయాలు, అభిప్రాయాలు కాకుంటే ప్రేమానుమానాలు... నిక్కచ్చిగా అంతే.

డబ్బులు అవసరమే. అవసరమంటే... అవును నిజమే అది నాకు ఒకరంగా, మా బుజ్జికి మరోలా మీకు మరింత భిన్నంగా... అవును ప్రతి ఒక్కరూ విభిన్నమే. కనీసం ఒక డిగ్రీ తేడా నుంచి 360 డిగ్రీల వరకూ ఆ తేడా ఉండొచ్చు. అయితే కనీస అవసరాలు, కనీస సౌకర్యాలకు సరిపడా డబ్బులు ఎప్పుడూ అవసరమే అనుకుంటాను. ఎవరి స్థాయిలో వారికి... వాటి కోసమే సంబంధాలు పుడుతుంటాయి, కొన్నిసార్లు గిడుతుంటాయి. మీ తాత అనేవాడు... ‘‘ఈ ఆర్థిక వ్యవస్థలో ఏ ఇద్దరి మధ్య సంబంధాలైనా ఆర్థిక సంబంధాలే. అయితే దానిని యాంత్రికంగా అన్వయించుకోవద్దు. స్థూలంగా దానిని మనసులు ఉంచుకొని అప్రమత్తంగా మసలుకుంటే చాలు’’ అని. ఆ మాత్రం దానిని కూడా నేను అంగీకరించలేదు. అప్పుడు తాత... ‘‘దానిని అర్థం చేసుకోవాలంటే మార్క్సియన్ ఫిలాసఫీ వెలుగులో రాసిన సౌందర్య శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. మరెవరూ ఇప్పటి వరకూ స్పృశించని అనేకానేక జీవన పార్శ్వాలను మార్క్స్ తడిమాడు. అందుకనే అది అత్యున్నత మానవీయ శాస్త్రం అయింది’’ అంటూ చెప్పినప్పుడు నేను ఈయన అన్నింటికీ ఒకటే మాత్రం చెపుతున్నాడంటూ కొట్టిపారేశాను. అయితో లోతుల్లోకి వెళ్లి చదవకపోయినా పైపైన తడిమే అలవాటుతో అబ్బిన జ్నానంతో అది నిజమేనేమో అన్న అనుమానం వచ్చేసింది. ఆ ఎరుకతోనే జీవితాన్ని చూడడం మొదలుపెట్టాను. జీవితంలో ఒక్కో మజిలీ దాటుతున్నప్పుడు ఒక్కో అనుభవం, అనుభూతిలా మనల్ని చుట్టేసుకుంటుంది. అదిచ్చే వాసనలతో మరింతగా మనం ప్రజ్వలిస్తాం. నేనూ అంతే.

నేను, మా తమ్ముడు పెద్దగా మాట్లాడుకోలేదు. కాని మా మధ్య ఎప్పుడూ ఒక నిశ్శబ్ధం అవసరమైన పదాలను దొరిస్తూ పారుతూంటుంది. సెలయేరు సప్పుడు సేయకుండా సాగడాన్ని ఊహించండి...

మీ ఇద్దరూ అలా కాదు. మీ బంధం ఓ హోరు జలపాతం. మీ సమీపంలో ఎవరు ఉన్నా తడిచి ముద్దవడమే. అంతేనా...  ఆ జలపాతానికి అడ్డు వచ్చే దుంగలు, మట్టి కట్టలు కొట్టుకుపోవాల్సిందే. చివరికి ఆ నీరు మహోధృతంగా నురగలు కక్కుతూ, జనాకర్షణగా నిలవాల్సిందే.

రెండూ రెండు భిన్న ధృవ, దృఢ బంధాలు. వేటికవే విశిష్టమైనవేమో.

నిశ్శబ్ధం శబ్ధిస్తూనే ఉండాలి... జలపాతం హోరెత్తుతూనే సాగాలి.

మధ్యలో పిల్లకాలువలు వస్తుంటాయి. ఉప నదులు మమేకమవుతుంటాయి. మనదైన రూపాన్ని మార్చనంత కాలం, చెదిరిపోనివ్వనంత కాలం... ఇముడ్చుకుంటూ సాగిపోవడమే.

ఒడిదుడుకులు లేని జీవితం ఉప్పలేని కూరలా చప్పగా ఉంటుదని చెపుతుంటే నిజమేననుకున్నా. అయితే మరీ కుదుపులు ఎక్కువైనప్పుడు అవసరమైనదే ఆసరా. పడిపోకుండా, నడుములు విరక్కుండా చూసే ఓ భరోసా ఎప్పడూ అవసరమే. నన్ను చాలా సార్లు ఆ భావన బలంగానే నిలబెట్టింది. మీ బాబాయా, మీ తాతా లేకుంటే మీ అమ్మ... ఒక్కొక్కరు ఒక్కో సమయంలో... అంతే. అందుకనే ప్రతి సంబంధమూ పవిత్రమైనదే, ప్రేమపూర్వకమే.

‘‘ఇదంతా ఎందుకు చెప్పావు నాన్నా? ఒక్క ముక్క అర్థం కాలేదు. అసలు ఇంతకీ ఏం చెప్పాలనుకున్నావు? మా ఇద్దరి సంబంధాలు సజీవంగా ఉండాలని, వాటిని భౌతిక అవసరాలు అధిగమించకూడదనేనా?’’ అని అడుగుతారేమో మీరు.

అవునంటే... మా మీద అనుమానమా? అని కోపగించుకుంటారేమో?

కాదు... అనంటే మరెందుకు ఇప్పుడు ఇదంతా వ్యర్థం కాకుంటే... అని తిట్టిపోసుకుంటారేమో?

ఏం చేసినా మీరు పిల్లలేగా... నాకు వరకు నాకు ఇష్టమైన కష్టంగానే ఉంటుంది. మా నాన్న నేర్పించారు దీనిని.

x

కామెంట్‌లు లేవు: