2, నవంబర్ 2008, ఆదివారం

నీతోనే ఎప్పుడూ

లే లేత చిగుర్లతో
ఊసులాడుకున్నంత
తేలికకాకపోవచ్చు
రేపటి మన జీవితం
మబ్బుల్లో దాక్కొనే
సూర్యుడితో ఆడుకున్నంత
తేలిక కాకపోవచ్చు
రేపటి మన భవిష్యత్తు
ఆక్షణం తప్ప ఏమీ తెలియని రోజుల్లో
గంటల తరబడి కబుర్లు ఆడుకున్నంత
తేలిక కాకపోవచ్చు
రేపటి మన సహగమనం
భవిష్య చిత్రపటంపై
చిత్రకారుడి కుంచెలా
చకచకా సాగకపోవచ్చు కూడా
కాని...
రేపటి మన కలయిక
సాధ్యం కానంత కష్టం
కాదుకదా నేస్తం...
జీవితపు అలల ఆటుపోట్లతో
రాటుదేలడానికి
నీతో నేను ఎప్పుడూ...

1, నవంబర్ 2008, శనివారం

నేను ఇలా...

నిలువ నీరులా, ఒంటి కాలు కొంగలా, 
గోతికాడి నక్కలా ఎలా సాధ్యం? 
జీవనదిలా గలగలా పారుతూ
జీవం కలిగిన జీవితాన్ని అనుభూతిస్తూ
స్నేహ మాధుర్యాన్ని పంచుతూ... 
నిన్నటిలా నేడు వుండదనీ
నేడులా రేపు సాగదనీ 
గతం కంటే భవిష్యత్ 
ఎప్పుడూ అందంగానే ఉంటుందనీ 
కలలు ఆనందాన్ని ఇచ్చినా 
వాస్తవం ఒడ్డున బతకడం లాంటిదనీ
స్వేచ్ఛ అంటే నాతోపాటే ఇతరుల 
ఆనందం గురించి కూడా ఆలోచించడమనీ
తారతమ్యాలు, బేధాలు మనుషులు 
తెచ్చిపెట్టుకున్నవేననీ నమ్ముతూ... 
శత్రువులు లేని, ఈర్ష్యాసూయలు లేని 
మంచి లోకంలో సజీవంగా, సచిత్రంగా నిలుస్తూ....