10, మార్చి 2022, గురువారం

నేటి భావం

 ఆయా రాష్ట్రాల తాజా ఎన్నికల ఫలితాలపై విడివిడిగా విశ్లేషణలకు వెళ్లడం లేదు. ఎందుకంటే ఇప్పటికే పాపులర్ మీడియాలో ఆమేరకు వివిధ అభిప్రాయాలు వెల్లడయ్యాయి. గత కొద్ది వారాలుగా ఈ ఎన్నికలపై వివిధ సామాజిక మాధ్యమాల్లో కమ్యూనిస్టు, దళిత, ముస్లీం మేధావులు వరుసగా తమ తమ అభిప్రాయాలను వెలువరిస్తూ ఉన్నారు. వారంతా ఏదో ఒక దశలో హిందూత్వ శక్తుల పతనం ఆరంభమయిందన్న భావనలను వెలిబుచ్చిన వారే. మినహాయింపులు గమనికలోనే ఉన్నాయి.


వారు ఊహించినట్లుగా దేశాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదిపిన సుదీర్ఘ రైతు ఆందోళన కానీ, పదేపదే మాట్లాడుతూ వస్తున్న బీజేపీ సంఘ్ పరివార్ హిందూత్వ రాజకీయాలు కానీ, కొవిడ్ మహమ్మారి సమయంలో కేంద్రం వైఫల్యాలు కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థల అమ్మకాలు కానీయండి... ఈ ఎన్నికల్లో ఎందుకని ఆయా శక్తులకు వ్యతిరేకంగా పనిచేయలేదు? లౌకికవాద శక్తులుగా పేర్కొంటున్న పార్టీల మధ్య ఎందుకు సారూప్యత లేకుండా పోయింది? అసలు ఈ దేశ యువత, మధ్య తరగతి జీవి, ఓటు కోసం  నిలబడే బడుగు, బలహీనులు ఏం ఆలోచిస్తున్నారు? ఏం ఆశిస్తున్నారు? ఈ దిశగా ఇప్పుడు విశ్లేషణ కొనసాగాల్సి ఉందేమో?


వాస్తవానికి ఆరేడు దశాబ్దాల క్రితం నుంచే హిందూత్వ శక్తులు తమ సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఆయా శక్తులు తమకు కావల్సిందేమిటన్నదానిపై అత్యంత స్పష్టతను కలిగి ఉన్నాయి. తమతో కలిసి వచ్చే శక్తులేవి, మిత్రపూరిత శత్రువు ఎవరు? రాజీలేని పోరాటం చేయాల్సిన శత్రువు ఎవరు? అన్న విషయాలపై లోతైన ఆలోచన కలిగి ఉన్నాయి. రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి రాజీలేని సాంస్కృతిక యుద్ధాన్ని నిశ్శబ్ధంగా చేస్తూ వచ్చాయి. అందులో భాగంగానే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను స్థాపించుకుంటూ పోయాయి. వాటిని అత్యుత్తమ విద్యా సంస్థలుగా ఉంచడానికి ప్రయత్నించాయి. అంతర్లీనంగా తమ పనిని తాము చేసుకుంటూ పోయాయి. 


కమ్యూనిస్టులు, లౌకికవాద శక్తులుగా తమను తాము పేర్కొంటున్న ఇతర రాజకీయ పార్టీలు ఆ దూరదృష్టిని పూర్తిగా కోల్పోయాయి. గతితార్కిక భౌతికవాదం వెలుగులో దీనిపై మరింత స్పష్టత కలిగి ఉండి, స్థానిక సాంస్కృతి, సామాజిక అంశాలపై పట్టును కలిగి ఉండాల్సిన కమ్యూనిస్టు పార్టీలు విచిత్రంగా తమ వెలుగుదివ్వెలను కోల్పోయాయి.. యాంత్రికంగా పనిచేసుకుంటూ పోయాయి. మనిషి భావోద్వేగాల సమాహారమని, వాటిని నియంత్రిత వేగంలో, సక్రమమైన దిశలోకి మళ్లించాల్సిన బాధ్యత చైతన్యవంతమైన రాజకీయ నాయకత్వానిదేనన్న విషయాన్ని వారు పూర్తిగా విస్మరించారు. 


వివిధ కమ్యూనిస్టు ఆచరణా స్రవంతుల నుంచి బయటకు వచ్చిన 50సంవత్సరాలకు పైబడిన వారే అత్యధికంగా సామాజిక మాధ్యమాల్లోని తమ తమ  ఖాతాల్లో విస్తృతమైన చర్చోపచర్చలు చేస్తూ వస్తున్నారు. అవి అవసరమా కాదా అన్న చర్చ కోసం నేను దీనిని ప్రస్తావించలేదు. పైన పేర్కొన్న వయస్సుకు దిగువన ఉన్నవారు అతి తక్కువమంది మాత్రమే ఈ చర్చల ధారలో తడిసిముద్దవుతున్నారన్న గమనికను ముందుంచడమే నా ఉద్దేశం. అత్యధికులు వీరికి వెలుపలే ఉన్నారన్న విషయాన్ని విస్పష్టంగా ఎత్తి చూపడమే లక్ష్యం. దీనికి కారణం అంతర్జాతీయమా? జాతీయమా? అన్న చర్చల్లోకి వెళ్లకుండా ... ఎందుకని ప్రగతిశీల శక్తులు మెజారిటీ ప్రజల వద్దకు వెళ్లలేకపోతున్నాయి? అన్న దిశగా ఆలోచన చేయడం అవసరమేమో? లాల్ నీల్ మైత్రి అంటూ నినాదాలిస్తారా... కమ్యూనిస్టు పార్టీల పునరేకీకరణ అవసరమని ఎలుగెత్తుతారా?... ఇంకేమైనా కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతారా? అన్న విషయాలపై మాట్లాడే అర్హత నాకు లేదు. కానీ, ఇప్పటికైనా మేల్కొనకపోతే ఈ దేశంలో రాజ్యాధికారాన్ని మెల్లమెల్లగానైనా హిందూత్వ మత శక్తులు తమ గుప్పెట్లోకి సంపూర్ణంగా తెచ్చుకుంటాయనే వాస్తవం నన్ను భయకంపితుడిని చేస్తోందన్న విషయాన్ని మాత్రం మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. 


రాజకీయ ఆలోచనలు, ఆచరణలకు తోడు సాహితీ సాంస్కృతికోద్యమం కూడా మహోధృతంగా  బాటెక్కాల్సి ఉంది. దీనికితోడు విద్యా వ్యవస్థలో తమదైన ప్రభావాన్ని వేయడానికి  పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసుకుంటూ సాగాలి. ఇది మరో సుదీర్ఘ ప్రయాణమే అవుతుంది. అయినా మనలోని ఆశను ఇది మాత్రమే సజీవంగా ఉంచుతుందని నా నమ్మకం.