23, డిసెంబర్ 2018, ఆదివారం

నేతల్లారా వర్థిల్లండి

యాంకర్: రాజకీయం అంటే నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్ లే కానక్కర్లేదు. మనిషి రాజకీయ జీవి. వాటికి అతీతంగా సమాజంలో బతకడం సాధ్యమే కాదని సాంఘిక, రాజకీయ పండితులు ఎప్పుడో తేల్చేశారు. జీవిక గురించి, జీవితం గురించి, ఓ ఘటన గురించి మనం మాట్లాడుకోవడమంటే, చర్చించుకోవడం అంటే దానిచుట్టూ ఉన్న రాజకీయం గురించి ఆలోచించడమే. కాకపోతే ఇక్కడ పడికట్టు పదజాలం ఉండదంతే.

వాయిస్ ఓవర్: సందర్భం గుర్తుకురావడం లేదు. ఓ కేంద్ర విశ్వవిద్యాలయంలో చదువుపూర్తి చేసుకొని ఓ ఖరీదైన బడిలో పంతులుగా పనిచేస్తున్న యువకుడొకడు చెప్పిన మాట వెంటాడుతోంది. కేంద్ర విశ్వవిద్యాలయం కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మట్టిలోమాణిక్యాలు అక్కడకు సహజంగానే చేరతాయి. దురదృష్టంలో అదృష్టమేమిటంటే సొమ్ములున్నోళ్ల పిల్లలు చాలామంది వాటి దరిదాపుల్లోకి వెళ్లడం దాదాపుగా మానేసి చాలా రోజులే అయ్యింది. ప్రతిమాటకూ మినహాయింపులుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో? ఇంటర్ కాగానే ఒడిసా నుంచి వచ్చాడో ఓ నూనుగు మీసాల యువకుడు. బితుకుబితుకుమంటూ ఆరంభమైన జీవితం, చదువే లక్ష్యంగా సాగింది. ఎన్నడూ పల్లె దాటని తన తల్లిదండ్రులకు, తన ఊరి జనాలకు సరికొత్త లోకం చూపించాలన్న అంతర్లీన తపనతో వాడు ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. పీహెచ్ డీలో చేరాడు. డాక్టర్ అనిపించుకోవడంలో వాడికేదో సరికొత్త ఆనందం దొరికినట్లే అనిపించింది. విదేశాలలో ఓ పేపర్ ని సబ్మిట్ చేయడానికి అనుమతులు వచ్చాయి. వీసా తయారయ్యింది. హఠాత్తుగా వాడికి జ్వరం. విశ్వవిద్యాలయంలోని ఆరోగ్య కేంద్రలో మందుబిళ్లలు తీసుకొన్నాడు. రెండు రోజులైనా పాడు జ్వరం విడవకుండా వస్తోంది. అక్కడ వైద్యుడు మరో ఆసుపత్రికి రిఫర్ చేశాడు. ఆ ఆసుపత్రిలో సరైన పరికరాలు లేవు, చికిత్స సరిగాలేదని దానిని నల్లజాబితాలో పెట్టి చాలాకాలమైంది. అలాంటి ఆసుపత్రికే ఆ కుర్రోడిని పంపించాడు. వాడికి అర్థమవుతూనే ఉంది అది మామూలు జ్వరం కాదని. ఆసుపత్రిలో ఐసీయూలో పెట్టారు. రెండు రోజుల తరువాత మరో ఆసుపత్రికి... వెళ్లగానే పరీక్షలన్నీ చకచకా చేశారు. డెంగ్యూ అని నిర్ధారించారు. అప్పటికే శరీరంలోని అంగాలు చాలా వరకూ దెబ్బతిన్నాయని తేల్చేశారు. బతకడం కష్టమని ప్రకటించారు. అంత బాధలోనూ చివరిక్షణాలని తెలుస్తూనే ఉంది. వాడికి అర్థంకానిదల్లా ‘తనకు అర్థమైంది, ఆ వైద్యులకు ఎందుకు అర్థం కావడం లేదు?’ అన్నదే. ధర్మసందేహంతోనే వాడు పోయాడు. బహుశా ఆ క్షణాన వాడి అప్రకటిత బాధ అంతా వాడి నిరుపేద, నిరక్షరాస్య తల్లిదండ్రుల గురించేనేమో? ఊరుదాటని వాడి అమ్మాబాబూ ఆ నగరానికి వచ్చారు. ఒరియా తప్ప మరేభాషారాని ఆ పల్లె నిరుపేద తల్లిదండ్రుల ఆవేదనకు మద్దతుగా రెండు రోజులు గొడవచేశారు విద్యార్థులంతా. ఆ తరువాత సెలవులు వచ్చాయి. అందరూ ఇంటికి వెళ్లారు. అలవాటవ్వాల్సిన దుఃఖం తోడుగా ఆ నిరుపేద తల్లిదండ్రులు కూడా ఊరికి చేరుకొన్నారు. ఊరు, విశ్వవిద్యాలయం... ఎక్కడ? ఏమిటి? అన్నది అప్రస్తుతం. అది ఎక్కడైనా... దేశంలో ఒక్కటే.

వాయిస్ ఓవర్: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం దేవాలయం వంశపారంపర్య ధర్మకర్తల కుటుంబానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు ఆయన. తన కుటుంబం ఆస్థిని... ఇంటి స్థలంతో సహా రెవెన్యూ అధికారుల అండదండలతో స్వయంగా తన్న అన్న కొడుకే నిర్లజ్జగ్గా అమ్మేస్తుంటే నాలుగేళ్లపాటు స్థానిక రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేశారాడు. చివరికి గత్యంతరం లేక తన వాహనాన్నే అవినీతి వ్యతిరేక ప్రచార అస్త్రంగా మలుచుకొని రాజధాని అమరావతిలోని సెక్రటేరియట్ కు చేరుకొన్నాడు. అలాగైనా సీఎం చంద్రబాబు చూడకపోతాడా? న్యాయం జరగకపోదా? అన్న పిచ్చి భ్రమతో ఆ సీనియర్ సిటిజన్ ఇక్కడి వరకూ వచ్చారు పాపం. కర్నూలు జిల్లా వెలుగోడు మండలం మాదవరం గ్రామానికి చెందిన ఓ రైతు ‘లంచం ఇవ్వాలి. ధర్మం చేయండి’ అంటూ భిక్షాటన చేస్తూ కనిపించిన దృశ్యం హృదయాలను కలిచివేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో తన స్వంత ఇంటి స్థలాన్ని కమ్యూనిటీ హాలుకు ఇవ్వాలంటూ జన్మభమి కమిటీ చేస్తున్న ఒత్తిళ్లను భరించలేకపోయాడో సామాన్యుడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక చావును ఆశ్రయించాడు. తన కుటుంబానికైనా ఆ స్థలం మిగులుతుందన్న గంపెడాశతో.

వాయిస్ ఓవర్: ఈ మధ్య కాలంలో జరిగిన, వెలుగులోకి వచ్చిన అతికొద్ది ఘటనల సమాహారమే ఇది. ఈ ఘటనలన్నీ నేటి సామాజిక రాజకీయ ఆర్థిక దుస్థితికి అద్దంపట్టేవే. ప్రభుత్వాల పనితీరుని ఎత్తిచూపేవే. ఆంధ్రప్రదేశ్ లోనా, తెలంగాణలోనా... లేక మరేదైనా ప్రాంతంలోనా? ఊరు, మనిషి పేరు మారుతుందేమో. అంతే. ఇంచుమించు బాధలన్నీ ఒకేలా ఉంటున్నాయి. ఈ వాస్తవాన్ని మీడియా పెద్దగా పట్టించుకోవడం మానేసింది. తన ప్రపంచానికి సంబంధం లేని విషయంగా భావిస్తోంది. వాస్తవ సమాజానికి దూరంగా మార్కెట్ మాయాజాలంలో చిక్కుకొని పరాయీకరణకు లోనవుతోంది. అడపాదడపా చిన్నా చితకా వార్తలేసి... ఆ ఘటనకు మాత్రమే పరిమితమైన పరిష్కారాన్ని సాధించి తన ఘనతేనంటూ భుజాలు చరుచుకొనే సరికొత్త సంస్కృతి ఇప్పుడు చలామణిలో ఉంది.

వాయిస్ ఓవర్: వాటన్నింటికన్నా ముఖ్యం రాబోయే ఎన్నికలు. అందుకనే రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి. కుల జనాభా లెక్కలు ఫైనల్ చేసే పనిలో నేతలు బిజీబిజీగా ఉన్నారు. పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న నేతలు నోట్ల కట్టలను సిద్ధం చేసుకోవడానికి రంగంలోకి దూకారు. అభిమానాన్ని నిండా నింపేసుకొని జెండా కోసం జీవితాన్ని బలిచేసుకొన్న కార్యకర్తలు, పెద్దగా సంపాదనే ఎరుగని నేతలు మరోసారి నిట్టూరుస్తున్నారు. పదవులు తమకు దొరకని ఎండమావులేనని మరోసారి గుర్తిస్తున్నారు. వేలాది కిలోమీటర్లు నడిచినా తనకెందుకు రావాల్సినంత గుర్తింపు రాలేదా అన్న పరిశీలనలో ప్రతిపక్షనేత మునిగితేలుతున్నాడు. మరోసారి సుడిగాలి యాత్రేమైనా చేపట్టాలా? అన్న ఆలోచనలో ఉన్నాడన్నది అభిజ్ఞ వర్గాల భోగట్టా. మరోవైపు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో గెలుపుకోసం వ్యూహాలకు పదునుపెడుతూనే కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకోవడానికి మార్గాల వెతుకలాటలో పడ్డారు. ఏ మార్గంలో వెళితే ఎంత వ్యతిరేకత వస్తుందో లెక్కలేసుకొనే క్రమంలో వార్తా కథనాలు పత్రికల్లో పతాక శీర్షికలవుతున్నాయి. మొత్తానికి రాష్ట్రంలో రాజకీయం వెడెక్కుతోంది. ప్రజల ఈతిబాధలు సంగతి దేవుడెరుగు... మనం గట్టెక్కే మార్గాలను చూసుకోవాలి ముందు... నేతల్లారా వర్థిల్లండి.

నర్మగర్భంగా...

భావోద్వేగాలు, భావావేశాలు ఒకింత చల్లబడ్డాయి. రెండు ప్రాణాలను కోపావేశంలో మావోయిస్టులు బలి తీసుకుని వారం దాటుతోంది. పోలీసులు, రాజకీయ నేతలు పరామర్శకో, పరిశీలనాత్మక శోధనకు వచ్చిపోవటం తగ్గుముఖం పట్టింది. కారు బారుల సడి తగ్గింది. ఆలోచనలు నాలుగు కోణాలలోనూ పరకాయిస్తున్నాయి. అనేకానేక ప్రశ్నలు సామాన్యులను సైతం వేధిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్ఫుటంగా దళిత గొంతుక ‘గిరిజన నేతలను చంపటానికి కారణమేమిటో చెప్పండి’ అంటూ నిలదీసింది. అందుకు కాకపోయినా అందరూ వేసుకోవలసిన ప్రశ్నే ఇది. ఎందుకు ఎర్ర తూటాలు పేలాయి? కేవలం ప్రతీకారేచ్ఛేనా? పోలీసులు చెబుతున్నట్లు మావోయిస్టులు ఒకరి పక్షం తీసుకున్నారా? తీసుకుంటే వారి రాజకీయ, సామాజిక లక్ష్యం ఏమిటి? అసలు ఎవరినైనా చంపటం, చావటం... ఉద్యమం జనోద్యమంగా, ప్రజా యుద్ధంగా వాస్తవ రూపంలో కనిపించకుండా పోయినప్పుడు జరగటం ఎవరికి ప్రయోజనకరం? పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం ఎంత? ఈ ప్రశ్నలకు సమాధానాలను ఏదో ఒక స్థాయిలో ఇనుప గోడల చట్రాల వెలుపల వెతకాల్సిందే.

సివేరి సోమ మాజీ ఎమ్మెల్యే. కిడారి సర్వేశ్వరరావు వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీలోకి దూకిన ప్రస్తుత ప్రజా ప్రతినిధి. వీరిద్దరూ ఎంతో కొంత మైనింగ్ కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నవారే. రంగురాళ్ల తవ్వకంలోనూ, అమ్మకాలతోనూ వీరికి సంబంధం ఉందంటూ వచ్చిన వార్తలనూ కొట్టిపారేయలేము. గంజాయి అక్రమ రవాణాదారులతో వీరికి స్నేహ సంబంధాలున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్నీ తప్పుపట్టలేం. ఇన్ని తప్పులు చేశారని అనుకుంటున్న వీరిద్దరూ ప్రజా కంటకులని స్థానికులు వాపోయిన సందర్భాలు లేవనే చెప్పాలి. సోమ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో చైనా క్లే తవ్వకాల విషయంలో తలెత్తిన వివాదంలో స్థానికులు తిరగబడి తరిమికొట్టారు. దీని వెనుకా రాజకీయాలున్నాయన్న వాదనను కూడా ప్రస్తుతానికి పక్కన పెడదాం. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా... ఒక విధంగా చెప్పాలంటే అన్ని విధాలా వెనుకబడిన గిరిజన జాతికి చెందిన వారు వీరు. ఒకరు కొండదొర అయితే, మరొకరు వాల్మీకి తెగకు చెందిన వారు. అట్టడుగున ఉన్న జాతిలో ఈ వ్యవస్థలో ఎదుగుతున్న నేతలు. సంపాదించారంటున్న ఆస్థి మొత్తం కుప్పేసినా... నేడున్న అనేక మంది నేతలతో పోల్చటమంటే హస్తిమశకన్యాయమే. అలాంటి వారిని మావోయిస్టులు ఎందుకు దారుణంగా చంపేశారు?

చనిపోయిన వారి నుంచి మనకు ఎలాంటి సమాచారం అందదు. చంపిన వారి నుంచి ఎలాంటి సమాధానం ఉండకపోవచ్చు. కాబట్టి పై ప్రశ్నకు సమాధానాన్ని గత అనుభవాల నుంచి, పరిణామ క్రమం నుంచి ఊహించవలసిందే. విశాఖ ఏజెన్సీ సరిహద్దుల్లో ముంచంగిపుట్టు మండలం కేంద్రం నుంచి సుమారు 50కి.మీ దూరంలో ఉన్న రామగుడ అటవీప్రాంతంలో మావోయిస్టులను చుట్టుముట్టి పోలీసు బలగాలు కాల్పులు జరిపాయి. ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగిన ఈ కాల్పుల్లో మొత్తం 32 మంది మావోయిస్టులు చనిపోయారు. వారిలో ఎనిమిది మంది నిరాయుధులు. దీనిని ఘన విజయంగా పోలీసులు, రాజ్యం ప్రకటించుకున్నాయి. మరిన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించి, మావోయిస్టులను పూర్తిగా ఏరివేస్తామంటూ ప్రకటించారు. ఈ ఏకపక్ష కాల్పులను ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పులుగా పోలీసులు అధికారికంగా ప్రకటించుకున్నారు. నాటి నుంచి మావోయిస్టులు సరైన సమయం కోసం వేచిచూస్తున్నారన్న వాస్తవాన్ని కప్పిపుచ్చలేం. సమస్యలు ఉన్నంత వరకూ ఏదో రూపంలో మావోయిజం బతికే ఉంటుందని అంతర్గత సమావేశాలలో అంగీకరించే పోలీస్ ఉన్నతాధికారులు బహిరంగ ప్రకటనలో మాత్రం ఏరివేస్తామంటూ హూంకరిస్తూనే ఉంటారు.

అరకు వ్యాలీ ప్రాంతం పర్యాటక స్వర్గధామంగా అభివృద్ధి చెందుతున్న తరుణం. ఈ ప్రాంతంలో మావోయిస్టులు అన్న పదం వినపడి సుమారుగా 10 ఏళ్లకు పైబడే అయ్యింది. పోలీసు బలగాలు కూంబింగ్ ఆపరేషన్ ఈ ప్రాంతంలో నిర్వహించి చాలా కాలమయ్యింది. మైదాన ప్రాంతాలలో పోలీసులకు ఉన్న అన్ని అవలక్షణాలూ ఇక్కడ బహిరంగంగానే వారిలో కనిపిస్తాయి. మిగిలిన ఏజెన్సీ ప్రాంతంలో ఎంతో కొంత ఉన్నప్పటికీ విచ్చలవిడితనం లేకపోవటానికి మావోయిస్టులే కారణమన్న సత్యాన్ని ఎవ్వరూ తోసిపుచ్చలేరు. గంజాయి, రంగురాళ్లు, అక్రమమైనింగ్, ఆటోలు, జీపు డ్రైవర్ల దగ్గర మామూళ్లు ఇలా చెప్పుకుంటూ పోతీ ఎన్నో మనకు నిత్యం అరకు ప్రాంతంలో కనిపిస్తాయి. మరో వైపు రాజకీయ నాయకులు, మావోయిస్టులకు మధ్య లోపాయికార సంబంధాలను కూడా ఇక్కడ ప్రస్థావించాల్సిందే. మావోయిస్టులకు ఎంతో కొంత సహకరించకుండా ఇక్కడ ప్రజాప్రతినిధుల మనుగడ కష్టం. ఏ నిమిషంలో ఎటు వైపు నుంచి వచ్చి చంపుతారో ఊహించటం కూడా అసాధ్యమే. అలాగని 24 గంటలూ పోలీసుల మధ్యనే ఉండటం ప్రజాప్రతినిధికి అసాధ్యమైన విషయం. ఒక ఎమ్మెల్య వెళ్లే ప్రతీ గ్రామానికి గ్రేహౌండ్స్ బలగాలు రోడ్ ఒపెనింగ్ పార్టీగా వెళ్లటమూ అసాధ్యమే. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఎదో ఒక స్థాయిలో మావోయిస్టులతో సంబంధాలను కలిగి ఉంటారన్న సత్యం ఇటు పోలీసులకు కూడా తెలియనది కాదు. కిడారి ఎన్నికయైన తరువాత మావోయిస్టులతో సమావేశమయ్యాడని, వారికి సహకరిస్తూ వచ్చడంటూ వినిపించిన వార్తలను లోపాయికారిగా అయినా అంగీకరిస్తున్నారు. మరి ఎందుకు చంపారు?

ఏజెన్సీలో రాజకీయ వైరి వర్గాల హస్తం ఉందంటూ ఘటన జరిగిన రెండో రోజే చిన్న పీలర్ హల్ చల్ చేసింది. అది ఎమ్మెల్యే వాసుపల్లి నోటి నుంచి వైసీపీగా బయటకు వచ్చి ఆ తరువాత రోజుల్లో తెలుగుదేశం నేతతో సహా అంటూ దాదాపుగా నిర్ధారించే స్థాయికి చేరుకుంది.(ఈ వార్తా కథనం రాసే సమయానికి) వారు చెపుతున్న వ్యక్తులు నిజంగా ఆ స్థాయి కలిగిన వారేనా? ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు చనిపోతే వారికి కలిగే లబ్ధి ఎంత? అన్న ప్రాథమిక ప్రశ్నలను వేసుకోవటానికి పెద్దగా ఎవ్వరూ ఇష్టపడని సందర్భ సన్నివేశంలో మనం ఉన్నాం. అయతే మావోయిస్టుల యాక్షన్ కు పోలీసులు చెపుతున్న చోటా మోటా నేతల సహకారం ఉందా? అంటే పూర్తిగా తోసిపుచ్చలేము. తుపాకిని పాయింట్ బ్లాంక్ లో పెట్టి అడిగితే నిరాకరించే స్థాయి సామాన్యుడికి ఎవరికి ఉంటుంది? అలా బెదిరించి చెప్పింది చేయమని మావోయిస్టులు ఆజ్ఞాపించినపుడు ‘సహకరించారు’ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు మావోయిస్టుల చర్యను ఊహించే అవకాశం ఉంటుందని అనుకోవటం శుద్ధ దండుగ. కాదని నిరాకరించి అడవిలో ఉండలేరు, మైదానానికి వచ్చి బతుకీడ్చనూ లేరు. వారికి ప్రత్యామ్నాయం లేదన్న విషయం పోలీసులకు తెలియందీ కాదు.

మావోయిస్టుల తూటాలు రక్తం తాగాయి అంటూ వార్త వెలువడిన కొద్ది సేపటికే విశాఖరూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన మావోయిస్టు మిలటరీ వ్యూహాలలో ప్రసిద్ధుడైన చలపతి రాకపోకలు విశాఖ ఏజెన్సీలో ఉన్నాయన్న సమాచారం మాకు ఉందని ప్రకటించారు. గునుకురాయిలో చలపతి సమావేశం నిర్వహించిన విషయమూ తెలుసునంటూ వాకృచ్చారు. ఇన్ని తెలిసిన వ్యక్తులు ప్రజాప్రతినిధులు లోతట్టు ప్రాంతాలకు వెళుతున్నారన్న సమాచారం తెలిసినపుడు వారిని నిలువరించటమో లేక పోలీసు బలగాలను పంపించటమో ఎందుకు చేయలేదు? జాగ్రత్తగా ఉండండి అంటూ నోటీసు ఇచ్చిన విషయం బూటకమని ఇప్పటికే స్పష్టమైన నేపథ్యంలో పై ప్రశ్నకు ప్రాధాన్యం పెరిగింది. మావోయిస్టుల యాక్షన్ కు ముందు రోజు అరకు, పరిసర కూడళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఘటన జరిగిన రోజు మంత్రం వేసినట్లు ఎందుకు మాయమయ్యారు? లోతట్టు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు కదలికలపై సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోగలిగిన అత్యుత్తమ నెట్ వర్కింగ్ వ్యవస్థను కలిగి ఉన్నామని చెప్పుకొనే వీరికి మండల కేంద్రానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో మావోయిస్టుల కదలికలపై కనీస సమాచారం లేకుండా పోయిందా? ఒకరు కాదు ఇద్దరు కాదు... సుమారు 100 మంది వరకూ ఘటన జరిగిన ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నారు. అంత మంది వచ్చినా పోలీసులు పసిగట్ట లేదంటే ఎవరి వైఫల్యం? తాము రక్షించాల్సిన నేతల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా హమ్మయ్య ప్రాణాలు దక్కాయంటూ నిమ్మకుండి పోయిన గన్ మెన్ వ్యవస్థ ఎందుకు? మంచినీళ్ల బాటిళ్లు, చేతి రుమాళ్లు మోయటానికే పరిమితం చేయటంలో ఎవరి తప్పు ఎంత? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం బహిరంగంగా కాకపోయినా, అతర్గతంగా అయినా పోలీస్ వ్యవస్థ వెతికే తీరాలి. లేదంటూ ఈ సంఘటన చవరిది కాబోదు.

మావోయిస్టులు తాము నమ్మిన సిద్ధాంతానికి, తాము సాధించాలనుకున్న లక్ష్యానికి ఏ మాత్రం ఉపయోగపడని ఈ యాక్షన్ తో వాళ్లకు అవసరమైనంత ప్రాచుర్యాన్ని మాత్రం సంపాదించుకోగలిగారు. జాతీయ స్థాయిలో మరోసారి పతాక శీర్షికలలోకి ఎక్కారు. ఏపీలో కనీసం రెండు రోజులు పతాక శీర్షికలలోనూ, ఇప్పటికీ ప్రధాన పత్రికలో ఏదో ఒక స్థాయి వార్తగానూ చోటు సంపాదించుకోగలిగారు. ఇది మాత్రమే చాలనుకునే ఎత్తుకి వారు ఎదిగి ఉంటే మాట్లాడుకోవలసింది ఏమీ లేదు. అయితే అది నిర్ధారణ కావాల్సి ఉంది. చివరిగా ఓ రెండు మాటలను ఇక్కడ మాట్లాడుకోవలి. ఓ రాజకీయ నాయకుడు మాట్లాడుతూ, ‘‘అడవిలో తుపాకీ లేని ప్రతి ఒక్కరూ గిరిజనుడే. తుపాకీ ఉన్న ప్రతి ఒక్కరూ మావోయిస్టే’’ అన్న మాటలు ఎంత సత్యమో ఓ పోలీస్ అధికారి అన్నట్లు ‘‘ఇలాంటి సంఘటలు జరుగుతూండాలనే వ్యవస్థ కోరుకుంటుంది. లేదంటే తన మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని వ్యవస్థలు భావిస్తుంటాయి’’ అంటూ నర్మగర్భంగా చెప్పిన మాటలూ అంతే సత్యం.