9, సెప్టెంబర్ 2014, మంగళవారం

చర్చజరగాల్సిందే

కలంలో ఇంకు పోయాలా వద్దా? పాళీకి పదునుపెట్టాలా వద్దా? గత కొద్ది రోజులుగా వున్న ఊగిసలాటకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నా. ఇది మొదలు పెట్టిన సమయంలోనే టివిలలో కెటిఆర్ మాట్లాడుతున్నారు... ఎంఎస్ఓలకు, మీడియాకు మధ్య వున్నది వ్యాపార సంబంధం... 600 ఛానళ్ళ ప్రసార బాధ్యత మాది కాదు... మీరేమైనా తప్పు చేస్తే వారికి క్షమాపణ చెప్పుకోండి... ఆయన మాటలకు వేదికపై కోటులేసుకున్న బ్యూరోక్రాట్లు, ఇతరులు నవ్వటం... తాబేదారు పనులు చేయటానికి మాత్రమే అలవాటుపడిన
యంత్రాంగం అంతకంటే ఏం చేస్తుంది. ఇక్కడ మీడియా ఎవరన్నది సమస్యకానేకాదు. ఎబిఎన్, టివి 9... లేక వి6, టి ఛానలా అన్నది ప్రశ్నకాదు? వ్యతిరేక వార్తలు వ్రాస్తే కేసులు పెట్టడం, నచ్చని విషయాలను ప్రస్థావిస్తే మీడియాలను నిషేధించటం వంటి చర్యలు ప్రజాస్వామ్యవ్యవస్థలో ఎవరికీ మంచిదికాదు. ప్రజాస్వామిక హక్కుల గురించి గొంతెత్తి కూసిన విప్లవకమ్యూనిస్టులు కానీ, వామపక్ష, విప్లవభావజాలం కలిగిన తెలంగాణ ఉద్యమకారులు కానీ సుమారు మూడు నెలల నిషేధంపైన ఏ మాత్రం గొంతెత్తకపోవటం... భయమా? లేక ప్రభుత్వ చర్యలను వారు కూడా సమర్థిస్తున్నారా? తెలంగాణ ప్రజల ఆకాంక్షను వెల్లడించటానికి జరిగిన ఉద్యమం ఎన్నో సార్లు దుందుడుకు స్వభావాన్ని సంతరించుకుంది. తమ ఆకాంక్షలను బంద్ ల రూపంలో, వివధ నిరసన ప్రదర్శనల ద్వారా వ్యక్తం చేశారు. అలా వ్యక్తం చేయటం ప్రజాస్వామికమని నమ్మిన నాటి గొప్ప ఉద్యమకారుడు ఇప్పుడు రూపం మార్చాడు. అదే ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన తెలుపుతున్న మహిళా పాత్రికేయులును అరెస్టు చేయటం ఒక ఎత్తైతే... పోలీసులు తమ స్వామిభక్తిని ప్రదర్శించుకోవటానికి అత్యంత కిరాతకంగా వ్యవహరించిన తీరు నేటి ఖాకీ స్వభావాన్ని మరో మారు బట్టబయలు చేసింది. విశ్వనగరంగా హైదరాబాదును మార్చాలనుకుంటున్న వారెవ్వరైనా తెలుసుకోవాల్సిన మరో విషయం... కేవలం భవనాలు, రహదారులు మాత్రమే విశ్వనగరానికి ప్రతీకలు కాబోవు. పరిఢవిల్లే ప్రజాస్వామ్యం, ఉచ్ఛనాగరికతలు మాత్రమే విశ్వనగరంగా హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దుతాయి. పోలీసు యంత్రాగాన్ని ఆధునీకరించటమంటే అధునాతన వాహనాలు, ఆయుధాలు సమకూర్చటం ఒక్కటే కాదు... మానవీయకోణాన్ని అద్దటం కూడా...

మరో విషాదాన్ని ఈ సందర్భంగా మాట్లాడేతీరాలి. ఇలాంటి వ్యవహరాలపై అటు పౌరసమాజంకానీ, ఇటు మీడియా ప్రపంచం కానీ స్పందించకపోవటం... ఇది కేవలం ఆ రెండు ఛానళ్ళ స్వంతవ్యవహారంగా చూడటం... నిజంగా దురదృష్టకరమే. ఎవరికి నచ్చని మీడియాను వారు నిషేధించుకుంటూ పోతే చివరికి ప్రజాస్వామ్యవ్యవస్థలో మూల స్థంభాలలో ఒకటిగా చెప్పుకునే మీడియా పూర్తిగా చచ్చిపోతుంది. నిరసన తెలుపుతున్న పాత్రికేయుల అరెస్టును ఖండించటానికి కూడా తెలంగాణ పాత్రికేయ ప్రపంచం సాహసించలేకపోవటం... నేడున్న పరిస్థితులలో నా రాతలు ఓ ఆంధ్రా పాత్రికేయుడి రాతలుగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలోని పాత్రికేయులు చూస్తారన్న అనుభవానుమానం వెంటాడుతున్నా... నేను ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఈ నిరసనలు జరుగుతున్న సమయంలోనే ప్రజలకోసం, ప్రజాస్వామిక విలువలకోసం కడవరకూ సాహితీసమరం చేసిన కాళోజీ శతజయంతోత్సవాలకు వరంగల్ కు ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చారు. ఆయన ఎదుట తమ నిరసన తెలుపుతున్న పాత్రికేయులపై పోలీసులు లాఠీఛార్జి, అరెస్టు

చివరిగా... ఉమ్మడి రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణను బహిరంగంగా సమర్థించిన వ్యక్తిని. ఆయా సమూహాల ఆకాంక్షలను, వ్యక్తీకరణలను చిన్నబుచ్చటం సరికాదంటూ చెప్పటానికి ప్రయత్నించిన అనేకమందిలో నేనూ ఒకడిని. దీని అర్థం సంపూర్ణ ఆరాధన అనికాదు. ఈ వ్యవస్థలో, ఈ ప్రభుత్వాల ఏలుబడిలో చీలికలైనా, ఏకమైనా సామాన్యునికి ఒరిగేదేమీ లేదన్నది నా నమ్మిక. అయితే మెజారిటీ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ, నా అభిప్రాయాలను విస్పష్టంగానే చెపుతూవచ్చాను. ఇక్కడ కూడా నా అభిప్రాయాలకు భిన్నంగా వున్నా... సమైక్యాంధ్ర ఉద్యమాన్ని గౌరవిస్తూనే వచ్చాను. ఇది న్యాయమనే నమ్మాను. ఈ రోజు ఫెడరేషన్ పిలుపు
మేరకు విశాఖలో జరిగిన ప్రదర్శనలో దాదాపుగా అన్ని ఛానల్స్ కు చెందిన పాత్రికేయులు పాల్గొని మద్దతుగా నిలవటం మంచిపరిణామం. ఈ స్పిరిట్ తెలంగాణలో లేకపోవటం తప్పు పాత్రికేయులదా? యాజమాన్యాలదా? చర్చజరగాల్సిందే...

3, జులై 2014, గురువారం

మానవ హత్యలు


మానవ నిర్లక్ష్యం మరోసారి తెగబడింది. నిశ్శబ్ధంగా, ఎలాంటి అలికిడీ లేకుండా ఊరిని కమ్ముకుంది. ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా నగరంకు వచ్చి టీ కొట్టుపెట్టి ఊరోళ్లకు తలలో నాలుకలా మారిన వాసు ఇప్పుడు దేవుడయ్యాడు. రోజూ లేచినట్టే తెల్లవారుఝామునే లేచి పనిలో నిమగ్నమవుతున్న వాసుకు ఆ క్షణాన తెలియదు. మృత్యుదేవత ప్రళకాళరక్కసిలా నోరు తెరుచుకుని వుందని. ఆ విషకౌగిలి నుంచి తప్పించుకునే అవకాశమే లేదని వాసుకే కాదు... బహుశా మృతులకు, సజీవులకూ... ఎవ్వరికీ తెలిసి వుండదు. పొయ్యి వెలిగించిన ఉత్తర క్షణంలో భారీ విస్ఫోటనం... వాసుతో సహా ఆ ఇంటిలోని వారిని, అప్పుడే అటుగా గుడికి వెళుతున్న ఓ చిన్నారితో సహా కుటుంబాన్ని మాడ్చేసింది. ఇప్పటికి మొత్తం మృతుల సంఖ్య 20కి చేరుకుంది. ఇంకా పెరుగుతుంది. వాసు అదృష్టవంతుడు... మృతుల జ్ఞాపకాలతో ఏడ్చి ఏడ్చి ఎండి పగుళ్ళిచ్ఛిన చెరువులా మిగలటానికి ఆ కుటుంబంలో మరెవ్వరూ లేరు. 75 ఏళ్ళ అమ్మ నాన్న ఒక్కడే ఇప్పుడు మిగిలాడు. మతిస్థిమితం లేనివాడిలా దిక్కులు చూస్తున్నాడు. అంతటి విషాదాన్ని జీర్ణించుకోవటానికి ఆయన మూడు పాతికల వయస్సు చాలటం లేదు. 


ఓదార్పు చేసినంత తేలిక కాదు. కోటి ఇవ్వండి, 50 లక్షలు ఇవ్వండి... ఎంత ఎక్కువ అడిగితే బాధితులకు అంత మంచి అవుతాం... కుహనా రాజకీయ విలువలు... ఓట్ల రాజకీయాలు... జనానికీ కావలసింది అదే... పాతిక లక్షలు ప్రకటించటానికి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి అందరూ తరలివచ్చారు. ఎంత అరాచక జనమిది. చంద్రబాబుని చూడటానికి ఎగబడ్డారు... తోసుకున్నారు... శ్మశానంలోనూ జిందాబాద్ లు కొట్టారు. తల్లడిల్లుతున్న కుటుంబాలను ఓదార్చటానికి, చావుబతుకుల మధ్య రక్షించండంటూ కేకలు పెడితే పట్టించుకోవటానికి, కాలిన గాయాలతో చివరిసారిగా గుక్కెడు నీళ్ళకోసం తపించిపోతున్న చిన్నారి గొంతు తడపటానికి ముందుకు రాని ఆ జనం చంద్రబాబు కోసం తొడతొక్కుడుకు దిగారు. ఓ వైపు లైవ్ లో మాట్లాడుతూనే మదిలో కదిలే భావాలకు అక్షర రూపం అద్దంకుండా వుండటానికి పడిన ఇబ్బందిని తట్టుకోవటం కష్టమే. నేను మరీ అంత ద్విముఖుడిని కానని చెప్పుకోవటంలో హిపోక్రసీ ఏమీ లేదు. 

వాసు పొయ్యి వెలిగించే సమయానికే ఓ కిలోమీటరు పరిథిలో ఎలాంటి అనవాళ్ళనూ ఇవ్వకుండా కొబ్బరితోటల్లో నిర్లక్ష్యంగా వదిలేసిన గెయిల్ గొట్టం నుంచి బయటకు దూకిన సహజవాయువు మృత్యువై వ్యాపించింది. వాసు తన రోజువారీ కార్యక్రమాన్ని వాయిదా వేసినా... ఒకింత బద్ధకించి మరికొంత సేపు  ఆగినా... మరింత మంది రోడ్డుపైకి వచ్చే వారు... అప్పుడు జరిగే మారణకాండను చూసి తట్టుకోవటం ఎవ్వరికీ సాధ్యం అయ్యేది కాదేమో?!. అందుకే తనవాళ్ళనూ, తననూ కోల్పోయిన వాసు ఇప్పుడు ఆ ఊరికి దేవుడు. ఈ విషయం ఆ ఊరివాళ్ళు, మిగిలిన వాసు బంధువులు మరిచిపోతారు. ఎందుకంటే కళ్ళ ఎదురుగా కనిపించే దేవుడికన్నా ఎప్పటికీ కనిపించే అవకాశమే లేని దేవుడికే ప్రాధాన్యమిక్కడ. అందుకే రాయిదేవుళ్ళారా వర్ధిల్లండి.

మారణకాండకు కారణమైన ఇదే పైపులైను గతమూడు  నెలల్లో రెండు సార్లు లీక్ కు కారణమైనా... గత నాలుగు రోజులుగా లీక్ అవుతోందంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా కాలుమీద కాలేసుకున్న గెయిల్ అధికారులు హంతకులు. ప్రభుత్వరంగ సంస్థలను కూడా ఫక్తు వ్యాపార సంస్థలుగా మార్చివేసి, ఎలాంటి సామాజిక బాధ్యతాలేని మార్వాడీ కొట్టుల్లా తీర్చిదిద్దిన ప్రభుత్వాలు, రాజకీయులు అసలు హంతకులు. ఇప్పుడు ఆ హంతకులే దర్జాగా కారుల్లోనో, విమానాల్లోనూ దిగి సానుభూతి వచనాలను వల్లిస్తున్నారు. మీ కష్టం తీర్చలేనిది, పూడ్చలేనిదంటూ పచ్చనోట్లతో మురిపించి మరిపించే మంత్రాన్ని... ఎప్పటికీ నిత్యనూతనంగా వుండే మంత్రాన్నిమరోసారి ప్రయోగించారు. రాజకీయాలకు తావువివ్వకుండా చేయాలన్న లక్ష్యంతో నాయుడు వెనువెంటనే బాధితులకు చెక్కులనూ ఇచ్చేశాడు. దీనితో గుండెలపై కుంపటిలా మారిన గ్యాస్ బావులు. పైపులు మాకొద్దంటూ గొడవ చేసిన వారంతా మరలాకనిపిస్తే ఒట్టు. 
నిన్నటి వరకూ ఒఎన్ జిసి, గెయిల్ సంస్థలు కోనసీమను నాశనం చేస్తున్నాయి. వ్యాపార అభివృధ్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాయంటూ అనేక మంది గగ్గోలుపెట్టారు. వీటికితోడు సికొత్తగా రిలయన్స్ సంస్థ తోడయ్యింది. కోనసీమ కుంగిపోతోంది... ఉప్పేసిపోతోంది... మంటల్లో మండుతోంది... అయితేనేం చనిపోయినవాళ్ళకు పచ్చనోట్ల పరిహారం అందుతుంది... అడపాదడపా లీకయ్యే ఆయిల్ నుంచి వచ్చే అదనపు సంపాదనా తోడవుతుంది... ఈ సంస్థలు సేకరించిన భూమిలో అడ్డంగా పెరిగిన రాజకీయుల అండతో దర్జాగా కబ్జాపాకలు వేసేయచ్చు... వీటన్నింటి వెనుకా తిరిగి మాఫియా, రాజకీయ నేతలూ వున్నారని, కోట్లు సంపాదిస్తున్నారనీ, ఇవన్నీ అమ్ముకోవటానికి పనికివచ్చే వార్తలేనా అని ఆలోచించే మీడియాలూ వున్నాయని తెలిసీ చలనం లేకుండా నిస్సిగ్గుగా పూజలందుకుంటున్న ఓ రాయిదేవుడా... పాపి చిరాయువు... 

11, మే 2014, ఆదివారం

నేనూ అవినీతిపరుడినే...

వును నేనూ అవినీతిపరుడినే. తెలుగురాష్ట్రంలో పచ్చనోటుకు ఓటను అమ్ముకున్న లక్షలాది మంది ఓటర్ల సరసన చేరటానికి అన్ని అర్హతలూ వున్న వాడిని. నేనేమీ పైకి కనిపించేటంత నిజాయితీ పరుడినేం కాదు. డబ్బున్నవాడికేనా పోటీ చేసే అర్హత అంటూ గంభీరంగా ప్రకటించే నేను చేతల్లో మాత్రం అవుననే అంటూ వుంటాను. వారసత్వ రాజకీయాలూ, కొత్తవారికి అవకాశమివ్వకుండా సాగే నియంతృత్వ పోకడలూ ప్రజాస్వామ్యానికి జఢత్వాన్ని, నిలువనీటి కంపునీ అంటిస్థాయంటూ గొప్పగా, వినేవాడు వున్నాడు కదా అని చెప్పే నేను ఆచరణలో పూర్తి భిన్నంగా వుంటాను. మహిళాసాధికారత గురించి రాజకీయ పార్టీలు పదేపదే చెపుతున్న మాటల్లో బూటకాన్ని కరకుగా ప్రశ్నించే నేను ఆచరణలో మాత్రం దానిని గుర్తించి, ప్రోత్సహించ నిరాకరిస్తాను. నా ఉద్యోగితను, ఉద్యోగం మరింత భద్రంగా వుండాలన్న సాకుతో అమ్ముకుంటాను. ఈ ఉద్యోగం పోతే నా జీవిక ఇంత సుఖమయంగా సాగదన్న భయంతో నిర్లజ్జగా ఉద్యోగితను అమ్ముకోగా వచ్చిన సొమ్మును జేబుల్లో కుక్కేసుకుంటాను. పంపకాలలో నిజాయితీగానే వున్నానుగా అనుకుంటూ ఆత్మను జోకొడతాను. డబ్బులు ఇచ్చిన వాడే నా వార్తల్లో ప్రముఖుడు. వాడే నాకు పరమమిత్రుడు. వాడెవ్వడైతే నాకేం. అవినీతి తిమింగలమైతే మాత్రం... నాకు డబ్బులు ఇచ్చిన దేముడు. అందుకనే ఈల నాకు కనపడదు... బ్యాటు బలం నాకు తెలియదు. ఆత్మ ఎక్కడ తలపైకెక్కి నిజాన్ని కేకపెడుతుందోనని దాని పీకనొక్కి అందరి ఎదుటా దోపిడీదారుల్లో నిజాయితీ పరుడని కితాబిచ్చే బాబునాయుడూ కనిపించడు. సర్వం నోటుమయం. గాంధీని అమితంగా ఇష్టపడే కుహనా లౌకికవాదుల్లో నేనూ ఒకడిని. నీతి ముసుగుమాటున అవినీతికి పాల్పడే అరాచక గుంపులో నాదీ ఉత్తమస్థానమే. అయినా నేను గౌరవంగానే వుంటాను. నావైపు చూపించే నాలుగువేళ్ళను పట్టించుకోకుండా ఎప్పుడూ వేలెత్తి చూపుతూనే వుంటాను. ఇప్పుడు చెప్పండి... నా అర్హతలను నిర్ధారించండి... నన్నూ అవినీపరుడిగా ప్రకటించండి... అవినీతోత్తముడు బిరుదు ప్రదానం చేయండి. 

14, ఏప్రిల్ 2014, సోమవారం

ఒకింత పొగురుగానే...

నేను ఒకింత పొగురుతో మాట్లాడతానే. అంతా చదివిన తరువాత వీడికి చాలా పొగురే అని నేను చెప్పిన విషయాన్నే చెప్పటానికి ఇది చదవద్దు.

నేను టివి ఛానల్ లో పనిచేయటానికి విశాఖ వచ్చిన తరువాత చాలా సార్లు గర్వంగా ఫీల్ అయ్యాను. ఇంటికి, చాలా సార్లు కార్యాలయం వద్దకూ నడిచి వచ్చిన పచ్చకాగితాలను కాదనుకున్నప్పునడు... మైళ్ళ కొద్దీ నడిచి మంచి కథనాలను అందించినప్పుడు... మా ఆవిడతో గొడవపడినప్పుడు... నా జీవిత భాగస్వామి నన్ను కోపప్రేమతో పలకరించినప్పుడు... మా పెద్దోడు అచ్చం నేను వున్నట్లే స్వతంత్రంగా వుంటున్నప్పుడు... చిన్నోడు నేను కొంచె డిఫరెంట్ అని చాటాలని ప్రయత్నిస్తున్నప్పుడు... నాన్న ప్రశ్న ధిక్కార స్వరాన్ని తీసుకున్నప్పుడు... ఒరే, చచ్చిపోయేలోపు అందరూ కలిసి కనిపిస్తారా? అంటూ అమ్మ నన్ను ఓ ఉదయాన్నే అడిగినప్పుడు అంతేనా... ఆర్ధికంగా ఓడిపోతున్న ప్రతీ రోజూ, పడగవిప్పే కోర్కెలను కాల్చిచంపుతున్న ప్రతీక్షణం నేను గర్వంగానే ఫీలవుతూనే వున్నా.

ఇప్పుడు మరో సారి మరింత గర్వంగా, పొగురుగా తలెగరేస్తున్నా. నా సహచరులు నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా సాగారని తెలిసిన ఆనందతో లేచిన తలపైకి కళ్ళెక్కాయి. వందల మంది ముందు ఓ పార్టీ ఎంపి అభ్యర్థి ''మిమ్మల్ని లోబరుచుకోవటానికి సొమ్ములు నేనే పంపించాను. తీసుకుని వుంటే మీరు ఈసరికి ఇక్కడ వుండేవారు కాదు. అవసరమైతే నరికేయటానికైనా స్కెచ్ సిద్ధం చేశాను'' అంటూ మాట్లాడితే... అంత తేలికగా లొంగే రకం మేము కాదులే అంటూ మనకు సిగ్గులేకుండా ఎన్నుకున్న ఆ ప్రజాప్రతినిథికి ఘాటుగా, ఒకింత నమ్రతగా సమాధానం చెప్పిన నా సహచరరులు విప్లవ కమ్యూనిస్టులు కాదు... ప్రకటనల కోసం వచ్చాం కాబట్టి తగ్గాం. లేకుంటే అంత పబ్లిక్ గా మాట్లాడేవాడా? వాడితో యుద్ధమే జరిగేది. తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎంత ధైర్యం వాడికి? చేసిన ముండాకోర్ పనిని ఎంత నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నాడు? అంటూ నా సహచరుల ఆవేదనాగ్రహాల ప్రదర్శన చూసి ఈ నిజాయితీ ఎర్రజెండాలో వుంటేనా? అనుకుంటూ నా పొగురు ఒకింత నిస్పృహకు గురైంది. అంతలోనే నా సహచరులు నాకన్నా మెరుగ్గా వున్నారని అనిపించి మరలా తల పొగురుగా పైకి లేచింది. కళ్ళు ఒకింత గర్వాతిశయంలో విప్పారాయి.

పాత్రికేయరంగంలో ఇంకా ఎంతోకొంతమంది ఇలాంటి వాళ్ళు వుండబట్టే... మరింత మంది రావాలి. మరింతమందికి ప్రేరణ కావాలి. మరింత పొగురుగా మా జాతి తలలెగరేయాలి. అవును, లాల్చీలు వేసినా, మాసిన గెడ్డాలతో వున్నా, ఒకింత ఇష్టంతో యాజమాన్యం హెచ్చరికలు చేసినా మారకపోవటానికి కారణం, నేను ఒదులుకోవటానికి సిద్దపడని పొగురే కారణం. ఇంత పొగురుతో పైకెగిసే తల పైనోళ్ళు తలొంచుకోవాల్సిందే అంటూ చెప్పే ప్రతీసారీ చెప్పారని కాదుకానీ... సిగ్గుతో తలదించుకుంటూనే వున్నా... దేవుడా... నీవనేవాడివే వుంటే తలదించుకునే సందర్భాలు మరిన్ని నాకు రాకుండా చూడు. లేదా, నీవు లేవన్న, ఒట్టి రాయివేనన్న నా నమ్మకాన్ని మరింత బలపరిచినట్లేనని ఒకింత పొగురుగానే హెచ్చరిస్తున్నా.  

2, ఏప్రిల్ 2014, బుధవారం

కొల్లేటి జాడల నుంచి బయటపడి...

చాలాకాలం తరువాత కొల్లేటి జాడలు పుస్తకాన్ని మూడు దఫాలుగా 10రోజుల్లో పూర్తి చేశాను. ఈ పుస్తకాన్ని అడిగిన వెంటనే ఇచ్చిన మిత్రుడు అనిల్ కి ముందుగా ధన్యవాదాలు. ఇదే పుస్తకాన్ని పూటలో పూర్తి చేసిన దూర గతంతో పోల్చుకుంటే ఎక్కువే అయినా నిన్నమొన్నటితో పోల్చుకుంటే తొందరగా చదివినట్టే. ఇలా చదివించింది రచయిత శైలా? లేక విషయాంశమా? లేక రెండూనా? ఈ అనవసరమైన సంశయాలజోలికి పోకుండా నాకు కలిగిన సందేహాలను గురించే మాట్లాడతాను.
ఇప్పటి వరకూ మానవసమాజంలో సాగిన, సాగుతున్న అభివృద్ధిలో వనరుల హననం, ప్రకృతికి ఎదురీత సాహసం లేకుండా ఎప్పుడైనా వుందా? కమ్యూనిస్టు మేథావులు చెపుతున్న నాటి రష్యా, చైనాలలో నైనా సరే(ఇప్పుడు వాటి గురించి మాట్లాడలేమని వారే అంటున్నారు కాబట్టి). ప్రకృతితో సహజీవనం చేస్తూ వనరులను పరిమితంగా ఉపయోగించుకుంటూ, నవల చివరి పేజీలలో పేర్కొన్న ప్రకృతి విధ్వంసాన్ని జరగనీయకుండా చూడటం సాధ్యమేనా? ఉదయాన్నే చెంబుపట్టుకుని వెళ్ళటానికి కూడా ఎంత సిగ్గుచచ్చిపోయేదే వివరించిన రచయిత ఇప్పుడు ఆ పరిస్థితులు లేకపోవటం ఎలా అభివృద్ధి కాదో కూడా చెప్పాలి. ఒక సారి ఊరి నుంచి బయటకు వెళ్ళిన పిల్లలు తిరిగి ఆ ఊరికి రావాలంటే ముదనష్టపు ఊరని తిట్టుకునేటంత విసిగి వేశారిపోయే పరిస్థితులు ఇప్పుడు లేవంటే అది అభివృద్ధి కాదా?
అభివృద్ధి పేరుతో వస్తున్న టెక్నాలజీ ప్రవాహంలో మనం కొట్టుకుపోతూ ఏ మాత్రం ఎదురీదే ప్రయత్నాలు చేయకుండా నిష్ఠూరపడటం ఎంత వరకూ సబబు? చివరిపేజీలలో ఉన్నట్లుగా 40ఏళ్ళలో ఎన్నడూ ఊరిగడప తొక్కనివాడికి ఇలా అయిపోయిందిమిటా అన్న బాధ పడే హక్కుకూడా లేదేమో? సమిష్ఠి సాగు అద్భుత ప్రయోగమని భావిస్తున్న చాలామందిమి అభివృద్ధి సాగుతున్న క్రమంలో వ్యష్ఠి భావనలు ఎందుకు పెరుగుతున్నాయో కూడా సమాజానికి వివరించగలగాలి. వ్యక్తి పూజలను, వ్యక్తిగత ప్రతిష్ఠలను వదిలించుకోలేని మన ఆలోచనలను ముందుగా మనం తోడెయ్యగలిగితే... ప్రతీ నిర్ణయానికీ ముందు సహేతుకమైన సమిష్ఠితత్వంతో నిండిన శాస్త్రీయ ప్రశ్నలను వేసుకోగలిగితే...
ఏదేమైనా ఇన్ని ఆలోచనలు రేపిన నవల ప్రభావం చిన్నదేమీ కాదు. పైన మాట్లాడిన మాటలన్నీ తక్కువ చేసేవీ కావు. చదువుతూన్నంత సేపూ మదినితొలిచిన ప్రశ్నలు మాత్రమే. అసలు నేను వేసుకుంటున్న ప్రశ్నలలో హేతుబద్ధత ఎంత? మళ్ళీ ఆలోచనల్లోకి జారుతున్నాను... వుంటానే...

17, మార్చి 2014, సోమవారం

రేణువునై...

మేను వాల్చినా
రెప్పమూయనంటోంది
మనస్సులోతుల్లో ప్రవహించే
భావావేశం కాగితంపై
అక్షరమై మెరిస్తే బాగుండు
నేనేమిటో అర్థమయ్యేది...
నిశీథిలో జాబిలమ్మ జాడవునీవంటే
అతిశయోక్తులంటూ కొట్టేస్తావు
సాదాగా... నీవు నా ప్రాణమంటే
సరికొత్త 'కోత'లొద్దంటావు
స్మృతుల విస్మృతే జీవితానందం
తీరం చేరిన ప్రతీ కెరటం
గర్భంలోకి తీసుకునే వెళుతుంది...
తిరిగి తీరానికి నెట్టే విసర్జకాలెన్నో...
అయినా...
తాజాగా మరోసారి తీరం వైపే పయనం...
అదే నమ్మకంతో
రేణువునై దరినే చూస్తున్నా...
అలవై నన్ను కలుపుకుపోతావని...