13, డిసెంబర్ 2017, బుధవారం

చిక్కుముడి

వెంటాడుతూనే వుంది. ఊహ తెలిసిన నాటి నుంచీ ప్రతీక్షణం నీడలా వదలనంటోంది. ఊహెందుకు అందంగా వుంటుంది? సెల్యూలాయిడ్ అంతగా ఎందుకాకర్షిస్తుంది? మళ్ళీ ఈ రోజు కొత్తగా నా బుర్రలోకి పాత ప్రశ్నే వచ్చి చేరింది. ‘ఓ మై ఫ్రెండ్‘ సినిమాలో లాజిక్ నాకు అర్థమయ్యింది. కాదు కాదు నేను కన్విన్స్ అయ్యాను. ప్రతీ స్నేహమూ ప్రేమకే దారితీయాల్సిన అవసరం లేదని, ప్రతీ ప్రేమలోనూ పరిపూర్ణ స్నేహం వుండకపోవచ్చునని.
స్నేహంలో ఆశించటా లేమీ లేవు. కాని ప్రేమలో స్వార్థం వుంటుంది. దర్శకుడు బలంగానే చెప్పాడు. చిత్రమైపోయిన తరువాత మరలా ఆ లాజిక్ లో మతలబు వుందా? చిన్న సందేహం. అదేమిటో అర్థమై చస్తే కదా ఈ చిన్నబుర్రకి. అర్థం కాని విషయంపై అంతలా తలబద్ధలు కొట్టుకోవాలసిన అవసరం ఇప్పుడుందా?

ఒకటి మాత్రం నాకు బాగా అర్థమయ్యింది. అమ్మాయి మాట్లాడితే చాలు మనస్సులో అష్ఠావక్ర ఆలోచనలతో సతమతమ య్యే ఓ తరం క్రమంగా మరుగున పడుతోంది. ఇప్పటి తరానికి మరింత క్లారిటీ పెరిగింది. సన్నటి గీతపై నడవటం కాదు కాదు జిమ్నాస్టిక్స్ చేయటం ఈ తరానికి అలవోకగా అలవడుతోంది. అలాంటి తరాన్ని చూసి తొందరపడి ముద్రలేస్తే ఇబ్బంది పడేది మనం మాత్రమే కాదు, వాళ్ళు కూడా అని అనిపిస్తోంది.

చూసిన దాని గురించి మాత్రమే మట్లాడాలని, చూడటంలో మనదైన ఊహాలోచనలకు స్థానం ఇవ్వకూడదని చాలా కాలం నుంచీ నేను మొత్తుకుంటున్న విషయాన్ని మరో సారి వచ్చిన సందర్భాన్ని వాడుకుని మొరిగేస్తాను.

తక్షణ స్పందనలకు చారిత్రిక సత్యాలను, భవిష్య దార్శనికతనూ జోడించి గుట్టుమట్టులు విప్పిచెప్పే విప్లవాత్మక కర్తవ్యాన్ని అందిపుచ్చుకుని నెరవేర్చే బాధ్యతలను తలకెత్తుకున్న వారు వేరే వుంటారని నా గట్టినమ్మకం. నేనైతే ఆ కోవకు చెందనన్న ది విస్పష్టమే.
భావం అభావమై నిశ్శబ్ధమైనప్పుడు... అభావం శబ్ధమై భావంగా మారకుండా ఎలా వుంటుందబ్బా?

సమస్యంతా నాతోనే. అన్నీ ముందుముందుగానే... చిన్నప్పుడు మాటలు త్వరగా... పెద్దవుతున్న కొద్దీ స్నేహాలూ పెద్దవిగానే... స్నేహప్రేమమోహ సమ్మిళిత భావోద్వేగాలు చల్లబడకముందే... విడగొట్టి వడకట్టకముందే... దడికట్టిన జీవిత బరిలో అడుగుపెట్టాను. ఇష్టమో అయిష్టమో తేలకుండానే నాన్నా అన్న పిలుపు వచ్చి చేరింది. ప్రమేయం లేకుండానే అనుమానావేశాలు పెనుద్రేకాలై జీవకాలాన్ని కాటేశాయి. అన్నీ నాలుగడుగులు ముందే వచ్చి చేరాయి ముసలితనంతో సహా. మరో నాలుగు అడుగులు ముందుకేసి భౌతికానంతర జీవితం మాత్రం నన్ను కౌగలించుకోకుండా వుంటుందా?

ఆనందం, దు:ఖం, సుఖం, సంతోషం, వేదన, రోదన, సౌందర్యోపాసన... రాసుకుంటే పోతే ఎన్నో భావోద్వేగాలు... అన్నీ క్షణికాలే. వాటిని వదిలేసి వెంపర్లాట... దేనికోసమో? ఇంకా సాగుతూనే వుంది ఆలోచనా రాగం.

5, డిసెంబర్ 2017, మంగళవారం

వ్యాపార'సాగు'

ఈ వ్యాసం చదివన వాళ్ళు నాకు ఏదో ఒక రాజకీయ పార్టీ ముద్ర వేయకుండా వుండాలన్న ఒకే ఒక తీవ్ర కాంక్షతో మాత్రమే రెండు మూడు వాక్యాల సోదిని వ్రాస్తున్నాను. నేను ఎలాంటి రాజకీయ పార్టీతోనూ అంటకాగుతున్న వ్యక్తిని కాదు. గత ఎన్నికలలో ఏరికోరి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన చదువరిని మాత్రమే. మూడు రోజుల పాటు ఎంతో అట్టహాసంగా పోలీస్ పహారాలో జరిగిన అగ్రిటెక్ సదస్సును ఓ పాత్రికేయుడిగా నిశ్శబ్ధంగా గమనించిన తరువాత, అనేక మంది రైతులతో, వ్యవశాయ శాఖ అధికారులతో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మాట్లాడిన తరువాత నాలో సుడులు తిరుగుతున్న భావోద్వేగావేదన నిజమైనదేనని ఓ మేరకు నిర్ధారించుకున్న తరువాత మాత్రమే అక్షర రూపం ఇవ్వటం అవసరమని భవించి రాస్తున్నాను. వ్యాసం ఆసాంతం చదివిన తరువాత వారి వారి రాజకీయ భావోద్వేగాలకు అనుగుణంగా తిట్టుకునే వారితోనూ, పొగిడే వారితోనో నాకు ఎలాంటి అనుబంధమూ వుండాలని భావించటం లేదు. రాజకీయ భావోద్వేగాలను, భావావేశాలను పక్కన పెట్టి నిర్వికారంగా కేవలం రైతు గురించి మాత్రమే ఆలోచిస్తే... ఏమైనా చేయగలమేమోనన్న చిరు ఆశతో మాత్రమే ఓ నాలుగు ముక్కలు నాదైన భాషలో.

విశాఖ ఎపిఐఐసి ప్రాంగణంలో భారీగా వేసిన తాత్కాలిక ఖరీదైన చలిగుడారాలలో సుమారుగా రూ.30కోట్లకు పైగా ఖర్చుతో ఎపి ఎజిటెక్ సమ్మిట్ 2017 సదస్సు మూడు రోజుల పాటు జరిగింది. ఏర్పాట్ల కోసం అధికారులకు ఇచ్చిన సమయం తక్కువే అయినా వచ్చిన వారికి పెద్దగా లోటు లేకుండా ఏర్పాట్లు చేయటంలో సఫలమయ్యారనే చెప్పుకోవాలి. మంచినీళ్ళ ఖరీదు ఎక్కువగా వుందనీ, చివరి రోజు బిల్ గేట్స్ వచ్చే ముందు నిండిపోయిన హాలులోనికి ప్రవేశం లేదని చెపుతున్నా తోసుకుని రావాలని ప్రయత్నించిన వారిని బయటకు నెట్టేశారన్న ఫిర్యాదులు తప్ప పెద్దగా మాట్లాడుకోవటానికి ఏమీ లేదు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దొరకటం లేదని... ఇలా అనేకానేక విషయాలపై నిత్యం మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఈ సదస్సు నిర్వహణ సాగిందన్న విషయాన్ని ముందుగా ప్రస్థావించే తీరాలి. రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న వారిలో 75శాతంకు పైబడిచిన్న, సన్నకారు, మధ్య తరగతి రైతులే వున్నారు. ఆరుగాలం కష్టపడటం, పంటను వచ్చినకాడికి అమ్ముకోవటం తప్ప మరేమీ పెద్దగా పట్టని రైతులు వీరంతా.

రైతుల కష్టాలను చూసి చలించిపోయి గట్టెక్కించాలని, అందుకు భూగోళంపై అందుబాటులో వున్న అత్యుత్తమ సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను ఏర్చికూర్చాలని ఏ నాయకుడైనా ప్రయత్నించటాన్ని హర్షించాల్సిందే. అయితే అందుకు ఎన్నుకున్న మార్గాలు, సాంకేతికత వాడకంలో ఉపయోగిస్తున్న విచక్షణే కీలకమన్నదానిలో పెద్దగా విభేదాలు వుండకపోవచ్చు. రాష్ట్రంలో వ్యవసాయం స్థితిగతులను మెరుగు పరచాలి. ప్రజారోగ్యాన్ని గాడిలో పెట్టాలి. ప్రజలందరికీ బలవర్థకమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలి. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి, ప్రజల ఆలోచనలను ఆ మేరకు వివేకవంతంగా మలచాలి. అందుకు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సాయాన్ని చంద్రబాబు అవసరాన్ని మించి వంగి మరీ అర్థించటాన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరమేలేదు. ఆయన అపార రాజకీయ పరిజ్ఞానం, శుద్ధ వ్యాపార వేత్తలా వ్యవహరించగలిగే వ్యవహారికతల ముందు కుప్పిగంతులు అనవరం. అవసరం కోసం వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టకున్నాడని పురాణాలే చెపుతున్నాయంటే తప్పులేదనేగా! అందుకనే బిల్ గేట్స్ ఉదార సాయం వెనుక వ్యాపార ప్రయోజనాలను మన పాలకులు చూడటం లేదనే ఎర్రజెండోళ్ళ మాటలను పెద్దగా పట్టించుకుని ఇక్కడ చర్చకు పెట్టబోవటం లేదు.

మొదటి రోజు సభకు హాజరైన ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరస్పరం గౌరవించుకున్నారు. నాయుళ్ళిద్దరూ ఒకరి ప్రతిభాపాటవాలను మరొకరు మనఃపూర్వకంగానే ప్రశంసించుకున్నారు. ఆ తరువాత మేథో చర్చలు సాగాయి. ఉపాధ్యక్షుడు, ముఖ్యమంత్రి కలసి ప్రదర్శనలో వుంచిన దుకాణాలను తిలకించారు. ప్రారంభ సభ తరువాత చర్చోపచర్చలు సాగాయి. రెండో రోజు ఉదయం పిచ్ కాంపిటీషన్స్ పేరుతో పోటీలను నిర్వహించారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో కొందరిని ఎంపిక చేశారు. వారు వారికి కేటాయించిన 10 నిమిషాలలో వారేంటో చెప్పాలి. తరువాత న్యాయనిర్ణేతల బృందం, లేక ప్రతినిథులు వేసిన ప్రశ్నలకు ఐదు నిమిషాలలో సమాధానాలు ఇచ్చి ముగించాలి. పిచ్ కాంపిటీషన్స్ పేరుతో నిర్వహించిన ఈ పోటీల తంతుని ముఖ్యమంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆసక్తిగా గమనించారు. మొత్తం ఐదుగురు స్టేజ్ మీదకు వచ్చి అత్యంత చాకచక్యంగా, సరళంగా తమ వ్యాపారాన్ని వివరించారు. రాష్ట్రాన్ని ఎలా ముందకు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నామో బొమ్మల సహితంగా కళ్ళకు కట్టారు.ఈ సీజన్ లో సిఎం మాట... రైతులలో చాలా మందికి అర్థంకాని పదార్థంగా మిగిలిపోయిన ఊబరైజేషన్ ను చాలా కంపెనీలు తమదైన భాషలో వివరించాయి. ''ప్రతీ పల్లెలోనూ ఓ దళారి వుంటాడు. మిల్లరుకి, రైతుకి మధ్యనో, రైతుకీ నగరంలో వున్న వ్యాపారికీ మధ్యనో దళారీ వుండి పంట రవాణాచేస్తూంటాడు. ఈ దళారీ నిత్యం మన మద్దెనే వుంటాడు కాబట్టి గట్టిగా అడిగో, బామాలో డబ్బులు తీసుకోవచ్చు. పిచ్ కాంపిటీషన్స్ లో పాలకులను మెప్పించిన వారంతా మా ఊరి దళారులకు ఆధునిక రూపమే. ఆధునిక దళారులతో మాట్లడటం మా బోంటి రైతులకు సాధ్యమే కాదు'' అని ఓ రైతు తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేశాడు. దళారి అనే పదం మరీ బాలేదేమో అని అంటే అంతకుమించి గొప్పపదమేదైనా వుంటే ఎవరినైనా తెలుగులో చెప్పమనండి అంటూ నాపై ఓ సవాల్ కూడా విసిరాడు. సదరు రైతుకు ఎర్రవాసనలు ఏమైనా వున్నాయేమోనని డౌటుపడి... మరికొందరిని కూడా పలకరించా. పదాలు అటూ ఇటూ అయ్యాయి. భావం మారలేదు.

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన మూడో రోజు శిఖరాగ్ర సమావేశం రానే వచ్చింది. బిల్ గేట్స్ రాకకోసం విమానాశ్రయం లాబీలో ముఖ్యమంత్రి పావుగంటపాటు వేచియుంటారంటూ షెడ్యూల్ వచ్చింది. భిన్నంగా ముందుగానే వచ్చిన బిల్ గేట్స్ విమానం సుమారు 20 నిమిషాలు గాలిలో చక్కర్లు కొట్టినట్లు తెలిసింది. తనకంటే నాలుగు నిమిషాలు ముందుగానే దిగిన మిత్రుడు బిల్ ని సిఎం అత్యంత వినయపూర్వకంగా ఆహ్వానించారు. రన్ వే పై శాలువాకప్పారు. అలసటతో కుంగిపోవటం అంటే ఏమిటో తెలియని అవిశ్రాంత రాజకీయ శ్రామికుడు కొంచెం వంగి, ఠీవిగా నిలిచిన బిల్ తో చేతులు కలిపారు. సగౌరవంగా తోడ్కొని వచ్చారు. కేటాయించిన నాలుగు నిమిషాలను కాదని దయతలచి మరో మూడు నాలుగు నిమిషాలు దుకాణ సముదాయంలో బిల్, సిఎం గడిపారు. అంతర్గత సమావేశంలో ముగింపు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయమే తన ప్రథమ ప్రాధాన్యమని ప్రకటించారు. ఫీల్డ్ టు ఫోర్క్ విధానంలో వ్యవసాయాన్ని మార్కెట్ కు అనుసంధానించాలని చూస్తున్నామన్నారు. బిల్ గేట్స్ తాను ముందుగానే వ్రాసుకుని వచ్చిన ప్రసంగాన్ని చకచకా చదివేశారు. నాతో సహా నూటికి 90మందికి అర్థం కాలేదంటే అతిశయోక్తి కాదు.

80శాతంకు పైనే వున్న చిన్న, మధ్య తరహా రైతులను దృష్టిపెట్టుకుని జరగని ఏ కార్యక్రమమైనా నిలబడుతుందని భావిస్తే అది భ్రమమాత్రమే. వ్యవసాయ శాఖలో అంతో ఇంతో ఆసక్తిగా పనిచేసే సుమారు పది మందితో సదస్సు నిర్వహణ గురించి మాట్లాడితే... ముక్త కంఠం అని వాడితే అతిశయోక్తి అవుతుందేమో కాని అదే వాస్తవం. నాగలి, ఎడ్లు కూడా లేని వారే అత్యధికంగా వున్న వారి వద్దకు వచ్చి ద్రోణ్ లతో సాగు అని మాట్లాడటం హాస్యాస్పదమని తేల్చేశారు. చాలా ఊళ్ళలో కుళాయిలో నీళ్ళు రావు. సుదూరం నుంచి నీళ్ళు మోసుకొచ్చుకుంటారు. వారిని మరుగుదోడ్లు వాడండి అంటూ వాటిని కట్టి ఇవ్వటం వల్ల ఉపయోగం? అలాంటిదే ఇది కూడా అంటూ వారి ఆచరణాత్మక పరిశీలనను జోడించారు. డిగ్రీలు చదువుకుని వచ్చిన మాకే ఇప్పటి వరకూ ఈ సాంకేతిక అంశాలు తెలియదు. ఇంక వారికి తెలియాలంటే ఎంత సమయం పడుతుందో ఆలోచించండి అంటూ ముక్తాయించారు. మాకు శిక్షణ వుంటే కదా మేం రైతుకు చెప్పగలిగేది అంటూ మరో మాట జోడించారు. ఈ సదస్సు కోసమే స్వంత ఖర్చులతో ప్రత్యేకంగా వచ్చిన మరో రైతు మాట్లాడుతూ, పైసా ఖర్చు లేకుండా సాగుచేస్తున్న రాధాకృష్ణమూర్తికి శాలువాతో సన్మానం మాత్రమే దక్కితే, స్లైడు వేసి చూపించినోడితో రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం జత కట్టి వ్యాపారంచేస్తుందని ఒకింత అసహనంగానే వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన మరోరైతు మాట్లాడుతూ, అసలు పంటకు కనిష్ట గిట్టుబాటు ధరను నిర్ణయించకుండా ఏ మార్కెట్ కు అనుసంధానించినా రైతుకు ఒనగూరే లాభమేమిటో నాకు అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపుగా ఇవే ప్రశ్నలను చర్చల సందర్భంగా ఇద్దరు ముగ్గురు రైతులు ప్యానలిస్టులను అడిగారు. నిజమేనని అంగీకరించిన వారు వాటికి పరిష్కారాలను మాత్రం సూచించలేదు.

పొలంలో క్రిమికీటకాలపై యుద్ధం చేయటానికి బయోపెస్టిసైడ్ ను కనుక్కోవాలని ఓ రైతు 1978 నుంచి తాపత్రయపడ్డాడు. కేవలం 8వ తరగతి చదివిని ఆయన చేసిన ప్రయోగాల ఫలితాలపై ఎయులో 12 మంది పిహెచ్ డి పట్టాలను తీసుకున్నారు. రైతులకు అందించాలన్న తాపత్రయంతో ఆయన నాబార్డును ఆర్థికసాయం కోసం సంప్రదిస్తే యూనివర్శిటీ సాయం తీసుకొమ్మని సూచించారు. దీనితో ఆయన ఓ ప్రైవేటు యూనివర్శిటీ సాయం తీసుకున్నారు. ఏడాది గడిచిన తరువాత సదరు యూనివర్శిటీ ఆ ప్రయోగ ఫలితాన్ని తనఖాతాలో వేసుకోవటానికి ప్రయత్నించింది. దీనిని రైతు అడ్డుకున్నారు. తాజాగా అదే బయోపెస్టిసైడ్ ని తన ఖాతాలో వేసుకున్న ఆ విశ్వవిద్యాలయం అగ్రిటెక్ సదస్సులో ఓస్టాల్ ని నిర్వహించింది. ఇది తెలుసుకున్న ఆ రైతు మండిపడ్డాడు. మీడియా ముందు ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. సాధారణ రైతు బాధలన్నింటిలానే ఆయన ఆగ్రహానికీ సరైన చోటు దొరకలేదు.

అనుభవైక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని దానికి శాస్త్రీయతను జోడించి ముందకు సాగితే ఖర్చు తక్కువతో పైసలెక్కువ సంపాదించే వ్యవసాయం ఆవిష్కృతమవుతుంది. పిచ్ కాంపిటీషన్ల పేరుతో పిచ్చి కాంపిటీషన్లు పెడితే విఫల ప్రయోగమని ప్రజలు తిరస్కరిస్తారేమో? మరో సారి తప్పు చేశామని ప్రకటించుకునే దుస్థితి ఏర్పడుతుందేమో? అన్నదే భయం.