3, జులై 2014, గురువారం

మానవ హత్యలు


మానవ నిర్లక్ష్యం మరోసారి తెగబడింది. నిశ్శబ్ధంగా, ఎలాంటి అలికిడీ లేకుండా ఊరిని కమ్ముకుంది. ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా నగరంకు వచ్చి టీ కొట్టుపెట్టి ఊరోళ్లకు తలలో నాలుకలా మారిన వాసు ఇప్పుడు దేవుడయ్యాడు. రోజూ లేచినట్టే తెల్లవారుఝామునే లేచి పనిలో నిమగ్నమవుతున్న వాసుకు ఆ క్షణాన తెలియదు. మృత్యుదేవత ప్రళకాళరక్కసిలా నోరు తెరుచుకుని వుందని. ఆ విషకౌగిలి నుంచి తప్పించుకునే అవకాశమే లేదని వాసుకే కాదు... బహుశా మృతులకు, సజీవులకూ... ఎవ్వరికీ తెలిసి వుండదు. పొయ్యి వెలిగించిన ఉత్తర క్షణంలో భారీ విస్ఫోటనం... వాసుతో సహా ఆ ఇంటిలోని వారిని, అప్పుడే అటుగా గుడికి వెళుతున్న ఓ చిన్నారితో సహా కుటుంబాన్ని మాడ్చేసింది. ఇప్పటికి మొత్తం మృతుల సంఖ్య 20కి చేరుకుంది. ఇంకా పెరుగుతుంది. వాసు అదృష్టవంతుడు... మృతుల జ్ఞాపకాలతో ఏడ్చి ఏడ్చి ఎండి పగుళ్ళిచ్ఛిన చెరువులా మిగలటానికి ఆ కుటుంబంలో మరెవ్వరూ లేరు. 75 ఏళ్ళ అమ్మ నాన్న ఒక్కడే ఇప్పుడు మిగిలాడు. మతిస్థిమితం లేనివాడిలా దిక్కులు చూస్తున్నాడు. అంతటి విషాదాన్ని జీర్ణించుకోవటానికి ఆయన మూడు పాతికల వయస్సు చాలటం లేదు. 


ఓదార్పు చేసినంత తేలిక కాదు. కోటి ఇవ్వండి, 50 లక్షలు ఇవ్వండి... ఎంత ఎక్కువ అడిగితే బాధితులకు అంత మంచి అవుతాం... కుహనా రాజకీయ విలువలు... ఓట్ల రాజకీయాలు... జనానికీ కావలసింది అదే... పాతిక లక్షలు ప్రకటించటానికి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి అందరూ తరలివచ్చారు. ఎంత అరాచక జనమిది. చంద్రబాబుని చూడటానికి ఎగబడ్డారు... తోసుకున్నారు... శ్మశానంలోనూ జిందాబాద్ లు కొట్టారు. తల్లడిల్లుతున్న కుటుంబాలను ఓదార్చటానికి, చావుబతుకుల మధ్య రక్షించండంటూ కేకలు పెడితే పట్టించుకోవటానికి, కాలిన గాయాలతో చివరిసారిగా గుక్కెడు నీళ్ళకోసం తపించిపోతున్న చిన్నారి గొంతు తడపటానికి ముందుకు రాని ఆ జనం చంద్రబాబు కోసం తొడతొక్కుడుకు దిగారు. ఓ వైపు లైవ్ లో మాట్లాడుతూనే మదిలో కదిలే భావాలకు అక్షర రూపం అద్దంకుండా వుండటానికి పడిన ఇబ్బందిని తట్టుకోవటం కష్టమే. నేను మరీ అంత ద్విముఖుడిని కానని చెప్పుకోవటంలో హిపోక్రసీ ఏమీ లేదు. 

వాసు పొయ్యి వెలిగించే సమయానికే ఓ కిలోమీటరు పరిథిలో ఎలాంటి అనవాళ్ళనూ ఇవ్వకుండా కొబ్బరితోటల్లో నిర్లక్ష్యంగా వదిలేసిన గెయిల్ గొట్టం నుంచి బయటకు దూకిన సహజవాయువు మృత్యువై వ్యాపించింది. వాసు తన రోజువారీ కార్యక్రమాన్ని వాయిదా వేసినా... ఒకింత బద్ధకించి మరికొంత సేపు  ఆగినా... మరింత మంది రోడ్డుపైకి వచ్చే వారు... అప్పుడు జరిగే మారణకాండను చూసి తట్టుకోవటం ఎవ్వరికీ సాధ్యం అయ్యేది కాదేమో?!. అందుకే తనవాళ్ళనూ, తననూ కోల్పోయిన వాసు ఇప్పుడు ఆ ఊరికి దేవుడు. ఈ విషయం ఆ ఊరివాళ్ళు, మిగిలిన వాసు బంధువులు మరిచిపోతారు. ఎందుకంటే కళ్ళ ఎదురుగా కనిపించే దేవుడికన్నా ఎప్పటికీ కనిపించే అవకాశమే లేని దేవుడికే ప్రాధాన్యమిక్కడ. అందుకే రాయిదేవుళ్ళారా వర్ధిల్లండి.

మారణకాండకు కారణమైన ఇదే పైపులైను గతమూడు  నెలల్లో రెండు సార్లు లీక్ కు కారణమైనా... గత నాలుగు రోజులుగా లీక్ అవుతోందంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా కాలుమీద కాలేసుకున్న గెయిల్ అధికారులు హంతకులు. ప్రభుత్వరంగ సంస్థలను కూడా ఫక్తు వ్యాపార సంస్థలుగా మార్చివేసి, ఎలాంటి సామాజిక బాధ్యతాలేని మార్వాడీ కొట్టుల్లా తీర్చిదిద్దిన ప్రభుత్వాలు, రాజకీయులు అసలు హంతకులు. ఇప్పుడు ఆ హంతకులే దర్జాగా కారుల్లోనో, విమానాల్లోనూ దిగి సానుభూతి వచనాలను వల్లిస్తున్నారు. మీ కష్టం తీర్చలేనిది, పూడ్చలేనిదంటూ పచ్చనోట్లతో మురిపించి మరిపించే మంత్రాన్ని... ఎప్పటికీ నిత్యనూతనంగా వుండే మంత్రాన్నిమరోసారి ప్రయోగించారు. రాజకీయాలకు తావువివ్వకుండా చేయాలన్న లక్ష్యంతో నాయుడు వెనువెంటనే బాధితులకు చెక్కులనూ ఇచ్చేశాడు. దీనితో గుండెలపై కుంపటిలా మారిన గ్యాస్ బావులు. పైపులు మాకొద్దంటూ గొడవ చేసిన వారంతా మరలాకనిపిస్తే ఒట్టు. 
నిన్నటి వరకూ ఒఎన్ జిసి, గెయిల్ సంస్థలు కోనసీమను నాశనం చేస్తున్నాయి. వ్యాపార అభివృధ్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాయంటూ అనేక మంది గగ్గోలుపెట్టారు. వీటికితోడు సికొత్తగా రిలయన్స్ సంస్థ తోడయ్యింది. కోనసీమ కుంగిపోతోంది... ఉప్పేసిపోతోంది... మంటల్లో మండుతోంది... అయితేనేం చనిపోయినవాళ్ళకు పచ్చనోట్ల పరిహారం అందుతుంది... అడపాదడపా లీకయ్యే ఆయిల్ నుంచి వచ్చే అదనపు సంపాదనా తోడవుతుంది... ఈ సంస్థలు సేకరించిన భూమిలో అడ్డంగా పెరిగిన రాజకీయుల అండతో దర్జాగా కబ్జాపాకలు వేసేయచ్చు... వీటన్నింటి వెనుకా తిరిగి మాఫియా, రాజకీయ నేతలూ వున్నారని, కోట్లు సంపాదిస్తున్నారనీ, ఇవన్నీ అమ్ముకోవటానికి పనికివచ్చే వార్తలేనా అని ఆలోచించే మీడియాలూ వున్నాయని తెలిసీ చలనం లేకుండా నిస్సిగ్గుగా పూజలందుకుంటున్న ఓ రాయిదేవుడా... పాపి చిరాయువు...