9, జూన్ 2020, మంగళవారం

వాడు భయపెడుతూనే ఉన్నాడు


వాడు ఊహించని హఠాత్ పరిణామం
నా ప్రేమోన్మత్త కాంక్షాభరిత ప్రపంచానికి
వాడో సుతిమెత్తని అడ్డమన్న భయం
వాడు.. వాడే, నువ్వు.. నువ్వే 
అభయాన్నీ స్వీకరించనివ్వని వైకల్యం
ఎంత చెప్పినా... పట్టు సడలిందన్న భావన
కాదు కాదు... వాడు ఆక్రమించేశాడు మెల్లగా
మెట్టుపై చెప్పిన కథలను... పంచిన సుధలనూ
మింగేసిన బుర్ర తక్కువ కర్కశత్వం
లేతాకుపై పురుగు చేసిన గాయం
ప్లాస్టిక్ సర్జరీలు లేవు.. లేపనమూ లేదు
ఒకటా రెండా... సమ్మెట పోటులెన్నో
గొడ్డలి దెబ్బకు చీలిన చెట్టు
పదును మొద్దుబారినా గాయం మానదు... 
ప్రతిబింబమై నిలిచిన రూపు వాడు
ఇప్పుడూ భయపెడుతూనే ఉన్నాడు
సారం వేరై... సడి లేని నవ్వుతో
సొదలు లేని ‘సుర’లు పంచుతూ

8, జూన్ 2020, సోమవారం

పాదచారులకు ప్రవేశం లేదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 6వ తేదీ విలేకరుల సమావేశం విన్న తరువాత ఇంత కాలం లోలోపలే ఉండిపోయినదేదో బయటకు వచ్చేయాల్సిందే నంటూ తెగ ఇబ్బంది పెడుతోంది. ఇది రాయడంతోనే నాపై ఆంధ్రోడు అంటూ సామాజిక మాధ్యమాల్లో దాడి జరిగితే జరగచ్చు గాక... ఇక్కడ నాకు లేని, నేను ఎన్నడూ చెప్పుకోని సామాజిక వర్గానికి నన్ను ప్రతినిధిని చేసి దునుమాడుదురే గాక... అయితేనేం రాయకుండా ఉండలేని ఒకానొక మానసిక దౌర్భల్యం నన్ను వెన్నాడుతోంది. బయట పడకపోతే కరోనాతో క్వారంటైన్ అయిన వారికీ నాకూ మధ్య పెద్ద తేడా ఏమీ ఉండకపోవచ్చు.  

కొద్ది కాలంగా నేను పనిచేస్తున్న పత్రిక భవిష్యత్తుపై అనేకానేక ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. వాటినన్నింటినీ యాజమాన్యం ఖండిస్తూ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అధికారంతో పెట్టుకొని ప్రకటనలు దాదాపు లేని స్థితికి పత్రిక చేరుకొంది. దీనికి భిన్నంగా మారుతున్న రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో స్థానిక, జాతీయ పత్రికలనేకం ఆయా ప్రభుత్వాల ప్రాపకం కోసం పాకులాడుతున్న ప్రత్యేక సందర్భంగా కళ్ళ ముందు ఉంది. దీనిని గుర్తిస్తూనే గుర్తించనట్లు యాజమాన్యం వ్యవహరిస్తూ లొంగే ప్రసక్తే లేదంటూ ఓ విధంగా తెంపరితనాన్ని (ఎలాంటి వ్యూహ్యమూ లేకుండా సాగడం) ప్రదర్శించింది. ఆంధ్రలో గత ప్రభుత్వంపై  విపరీత అవాంఛనీయ మమకారాన్ని ప్రదర్శించడమూ మరో రూపంలో చెరుపునే తెచ్చింది. (రాష్ట్రంలోని మరో పెద్ద పత్రికతో పోల్చితే గత ప్రభుత్వపైనా అంతో ఇంతో సునిశిత విమర్శ చేసిన పత్రిక ఇదే అన్నది నిస్పాక్షింగా చూసిన వారికెవరికైనా అర్థమవుతుంది. )

జాతీయ, స్థానిక తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రణాళికలతో కాకుండా తాత్కాలిక ప్రయోజనాలు ఇచ్చే ఆర్థిక ప్రేరేపిత పథకాలకు ప్రథమ పీటను వేయడం, సంకుచిత కుల, మత రాజకీయాలను విద్వేషపూరిత స్థాయికి తీసుకొని వెళ్లడం చాలా మంది గమనిస్తూనే ఉంటారు. ఈ అభిప్రాయాన్ని రాజకీయ పక్షాలు అంగీకరిస్తాయా? లేదా? అన్నది పక్కన పెడితే... దేశంలోని సాధారణ పౌరుల్లో చాలా మంది అంగీకరించే పరిస్థితి నేడు కనిపించడం లేదు. పైపెచ్చు ఈ అభిప్రాయాన్ని వ్యక్తీకరించిన వారెవరైనాసరే దేశ, జాతి ద్రోహులుగా చిత్రీకరించి వెంటనే మానసిక, భౌతిక దాడులకు దిగడానికి సిద్ధమవుతున్న గుంపు... ఇంకెంత మాత్రమూ ముసుగులతో ఉండాల్సిన పనిలేదంటూ నిస్సిగ్గుగా బోర ఎత్తుకు తిరుగుతోంది. వెంటాడుతోన్న అశాస్త్రీయ కరోనా మరణ భయం ఓ మతం పట్ల సృష్టిస్తోన్న భీతావాహక విద్వేషం మరో మెట్టు ఎక్కడానికి సిద్దంగా ఉంది. పాలకుల సంగతి నాకెందుకు?... ‘నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఏం కోరుకుంటుందో దానినే పాలకులు ఇస్తున్నారని ఎందుకు అనుకోవు’ అన్న  ఓ పెద్దాయన మాటలను గుర్తు చేసుకొంటే మనసుకు ఒకింత ఊరట. దూరదృష్టి లేకపోవడం, గుడ్డి వ్యక్తి అనుసరణ, ప్రశ్నకే తావులేని ముఢ భక్తి మనకేమీ కొత్త కాదుగా. అవి ఉన్నంత కాలం మన జీవితాల్లో పెద్ద మార్పేమీ ఉండదు.

కరోనాని ఓ మహమ్మారిగా, పెను రక్కసిగా చూపిస్తూ ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. బహుశా దానిలో అవి దాదాపు శతశాతం విజయాన్ని సాధించాయి. ఇదే అదునుగా భావించిన ప్రయివేటు కంపెనీలు తమదైన శైలిలో స్పందించడానికి మెల్లగ అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగానే మీడియా సంస్థలు తమ తమ పత్రికల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తీసివేయడం. ఉద్యగంలోకి తీసుకొనేటప్పుడు రాయించుకొన్న ఒప్పంద పత్రాల్లోని సూత్రాలను ఏకపక్షంగా తుంగలోకి తొక్కేసి మరీ తీసివేతలు జరుగుతున్నాయి. ఉన్న పళాన ఉద్యోగంలోంచి వెళ్లిపోవాలి. అదీ స్వచ్ఛందంగా తొలుగుతున్నట్లు లేఖ రాసి, ఉద్యోగితాధారాలన్నీ సమర్పించి న్యాయం జరుగుతుందో లేదో తెలియకపోయినా, అంత సత్తా లేకపోయినా పోరాటం చేయడానికి ఏకోశాన అవకాశం లేకుండా బయటకు నెట్టేస్తున్నారు. దీనికి ఏ ఒక్క పత్రికా మినహాయింపు కాదు. చివరికి కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో నడుస్తున్న పత్రికలకు కూడా లేదు. 

గతంలో ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఏనాడూ ఉద్యోగిని తీసేసి ఉసురు పోసుకొన్న సందర్భాలు లేవన్న ఓ ఖ్యాతి నేను పనిచేస్తున్న సంస్థకు ఉండేది. చిన్న చిన్న మినహాయింపులు లేవని కాదు. ఆ మానవీయ కోణం నచ్చేది. కష్ట సుఖాలు తెలిసిన యాజమాన్యం అని ఓ గట్టి నమ్మకంతో ఉండిపోయాను. ఈ సుదీర్ఘ కాలంలో యాజమాన్యమూ కొన్ని సుఖాలకు అలవాటు పడిందనీ, పోరాట పటమని ప్రదర్శిస్తున్నామనే పేరుతో స్వీయ రాజకీయ ధోరణలకు తలొగ్గిందనీ, ఈ క్రమంలో అవసరమైతే ఉద్యోగులను, చివరికి సంస్థనూ పణంగా పెట్టడానికి వెనుకాడదనీ అర్థమయ్యే సరికి ఆలస్యమైంది. ఈ యాజమాన్యమూ స్వీయ లాభాపేక్షలే లక్ష్యంగా పనిచేయడం మినహా మరో మార్గం లేదంటూ చేతులు ఎత్తేసింది. కొద్ది నెలల సంక్షోభాన్ని, కష్టాలను ఏ మాత్రం తట్టుకొనే ఓపిక మాకు లేదంటూ విస్పష్టంగా తేల్చేసింది. బయటకు వెళ్లిన వాళ్లు బతకడానికి యుద్ధంచేస్తారు. విజేతలుగా నిలబడతారు. కొద్ది మంది తీవ్ర ఒడిదుడుకులతో నష్టపోతారు. నిజమే కాని... గత కొద్ది కాలంగా బీటలు వారుతూ వస్తున్న సంస్థ ఉమ్మడి తత్వమన్న ప్రహరీ భారీ శబ్ధంతో బద్దలైంది. మరోసారి ఈ గోడను కట్టడం కష్టమే. అందుకనే సరికొత్తగా ముళ్ళ కంపేస్తున్నారు. ఇక్కడ పాదచారులకు ప్రవేశం లేదు.