26, మార్చి 2023, ఆదివారం

తప్పా... ఒప్పా..?

 

వివరణ ఇవ్వాలని అనిపిస్తోంది. ఇది మీకు సమాధానం మాత్రమే కాదు. నన్ను నేను పరకాయించుకోవడం కూడా. అందుకే తర్జనభర్జనల తరువాత ముందుకే వెళ్తున్నా. వరుణ్ తో నా బంధమేమీ పూర్తి నిస్వార్థమైనదేమీ కాదు. అలా అని నేను నన్ను నేను నమ్మించుకోవడానికి ప్రయత్నించినా, మీకు చెప్పినా అంతా ఆత్మవంచనే అవుతుంది. నాకు స్టంట్ వేయాలని నిర్ణయించినపుడు తను అత్యంత శ్రద్ధ తీసుకున్నాడు. అక్కడితో ఆగిపోతే మరోలా ఉండేది కథ. కాని, తను మరింత బాధ్యతపడి ఆర్థికంగా సుమారుగా రూ.60 వేలకుపైగా తను నాకు ఇబ్బంది తప్పించాడు. ఆ తరువాత కోవిడ్ సమయంలో ఇంటిలో ఎవరికి అవసరమైనా మందులు, వైద్యం తనే. అమ్మ, నాన్నకు కొవిడ్ వస్తే పైసా తీసుకోకుండా తను వైద్యం చేశాడు. చివరికి అమ్మకి కవాట మార్పిడి చేయాలని వైద్యులు చెపితే... నాన్న మొత్తం డబ్బులు తీసినా 10 లక్షలకు మించవు. చివరికి కష్టంమీద అంత మాత్రమే సమకూర్చగలిగారు. మిగిలిన పది లక్షలూ ఇచ్చింది వరుణే. అలాగని సౌకర్యాల్లో ఏమైనా తక్కువ చేశాడా అంటే అదీ లేదు. నాకు గత ఏడెనిమిది నెలులుగా మందులు, వైద్యం పూర్తి ఉచితం. నాకే కాదు మీ అమ్మకి కూడా. మొన్నటికి మొన్న... రెండు రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తే... సూట్ రూంలో ఉంచి వైద్యం అందించాడు. మీ అమ్మమ్మకు పైసా తీసుకోకుండా చూశాడు... ఇదంతా ఎందుకు? నా చేత తిట్లు తినడానికా? లేక అతను వేసే ప్రతి అడుగునూ నిశితంగా చూస్తూ నాకు నచ్చని వ్యవహారాలని మాత్రమే అడ్డుకుంటూ ఉంటున్నందుకా? అంతకు మించి నేను చేస్తున్నది లేశమాత్రమైనా లేదు. దీనికోసం నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఆసుపత్రి సిబ్బంది మొత్తం సేవ చేస్తుంది. అతను నాకు ఇచ్చిన ప్రాధాన్యం, నా అవసరాలను అతను గుర్తించి అందిస్తున్న సాయం ముందు నేను చేస్తున్నది అంత పెద్దదేమీ కాదన్నది నా భావన. ఎందుకంటేపైన పేర్కొన్న విషయాలేవీ నాకుగానేను చేయగలిగిన స్థోమత లేదు. దీనిలో నన్ను అతను వాడుకుంటున్నాడన్న వాదనకు తావేది? నేనే ఓరకంగా వరుణ్ ని ఉపయోగించకుంటున్నా. నా అవసరాల కోసమే అతనికి ఆసరాగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడు చెప్పండి పిల్లలూ... నేను చేస్తున్నది తప్పా? ఒప్పా?

31, జనవరి 2023, మంగళవారం

రేపటికి మామూలేలే

 కళ్లు బడలికగా రెప్ప విప్పుకున్నాయి. చెవులకు అలవాటయిన రింగ్ పిలుపు. దీప కాంతి చొరవ తెలివిడికి వస్తోంది. ఎక్కడ? అంటూ రెండు గదులూ వెతుకున్నా. మూడో గది నుంచి ఇక్కడున్నా అంటూ తను పలికింది. ఆ మరుక్షణమే సుధమ్మ చనిపోయింది? అంటూ ‘వార్త’. ఏం విన్నానో అర్థం కాలేదు. తేరుకునే లోపే ఉదయాన్నే అంట అంటూ వివరణ. చాలా అభావంగా చేతి వేళ్లు సెల్ ఫోన్ స్క్రీన్ పై కదిలాయి. మా వాట్సాప్ గుంపులో ‘సుధ అత్తయ్య మరి లేరు’ అంటూ వాక్యం పోస్టు చేశా. వరుసగా సంతాప సందేశాలు వీలువెంబడి వస్తూనే ఉంటాయి. ఈలోగా ఎలా వెళ్తావు? అని తనని అడిగా. ‘ఆంటీ’తో వెళ్తున్నా... అంటూ చెప్పి తన పని తను చేసుకుంటూ వెళ్లిపోయింది. సుషుప్తావస్థలో మళ్లీ మంచంపైకి శరీరం చేరింది. ప్రమేయం లేకుండానే చేతులు దుప్పటిని నిండా ముసుగేశాయి. అస్థిమితంగా ఆలోచనలు. మళ్లీ లేచాను. ఫోన్ తీసుకొని ఈ సారి నాన్నకి చేశా. సుధత్తయ్య చనిపోయారు అని చెప్పి ఫోన్ పెట్టేశా. అమ్మకి తెలిస్తే... తెలియాల్సిందే. తట్టుకోవాల్సిందే. నాన్న ఉన్నారుగా. వెళ్లకపోతే జీవిత కాలం బాధపడుతుంది. అందరూ కుడి ఎడంగా అదే వయస్సులో ఉన్నారు. ఎవరు ఎవరి గురించి ముందు వింటారన్నదే విషయం. చివరాఖరి వాళ్లకు తప్పదేమో ఎంతో కొంత వేదన. అలజడిగా ఉంది. రెండుసార్లు వెళ్లానా... మళ్లీ వెళ్లాల్సి వచ్చేటట్టుంది. ఈ మరణ వార్త మరేదో భయాన్ని తట్టిలేపుతుంది. జీవన్మరణాలు సహజమని, వాటి వెన్నంటే సుఖ దుఃఖాలు ఉంటాయన్న జీవన సత్యాన్ని ‘సర్వేశ్వరా’ అంటూ కేకేసే వాళ్లకీ జీర్ణం చేసుకోవడం కష్టమే. ఇంతకీ ఎందుకు రాస్తున్నా... తెలియదు. తెలిస్తే ఎందుకు రాస్తాను. పనిచేసుకుంటూ పోతాగా... ఎప్పుడో అన్నట్లు గుర్తు... భావం అభావమై విసిగిస్తోంది. దీనిని కప్పెట్టే పనేదే తలకెత్తుకోవాల్సిందే. 

మావయ్యా... మీకింక బాధ లేదులే... ఇంటికి ఎవరొచ్చానా... ‘‘చూడు ఆ మనిషికి ఏం పట్టదు. నిద్ర కూడా పోరు. ఎప్పుడూ పనే. మమ్మల్ని కూడా పట్టించుకోవాలా..?’’ అంటూ వదలలేని ప్రేమ విసుగు మాటలు మరి లేవు. ఇప్పుడు మీ రొటీన్ నుంచి ఓ పని తప్పుకుంది. కాస్త తెరిపి పడండి. మొన్నటి వరకూ ముగ్గురు చిన్న పిల్లలు. ఇప్పుడు ఇద్దరు. ఇంత సుదీర్ఘ కాలం విసుగూ విరామం లేకుండా ‘పిల్లల్ని’ పెంచడం మీకు మాత్రమే సాధ్యమయింది మావయ్యా. గుబులు గుబురు పొదలా చుట్టేస్తోంది. తెలియని ముల్లేదే గుచ్చుకుంటోంది. ఉంటాను... పరిగెత్తాలి. ఖాళీ లేకుండా చిన్న ఆలోచన కూడా చొరబడనీయకుండా అలిసిపోతే తప్ప ఈ రోజు విరామం దొరకదు. రేపటికి
మామూలేలే...