14, ఏప్రిల్ 2014, సోమవారం

ఒకింత పొగురుగానే...

నేను ఒకింత పొగురుతో మాట్లాడతానే. అంతా చదివిన తరువాత వీడికి చాలా పొగురే అని నేను చెప్పిన విషయాన్నే చెప్పటానికి ఇది చదవద్దు.

నేను టివి ఛానల్ లో పనిచేయటానికి విశాఖ వచ్చిన తరువాత చాలా సార్లు గర్వంగా ఫీల్ అయ్యాను. ఇంటికి, చాలా సార్లు కార్యాలయం వద్దకూ నడిచి వచ్చిన పచ్చకాగితాలను కాదనుకున్నప్పునడు... మైళ్ళ కొద్దీ నడిచి మంచి కథనాలను అందించినప్పుడు... మా ఆవిడతో గొడవపడినప్పుడు... నా జీవిత భాగస్వామి నన్ను కోపప్రేమతో పలకరించినప్పుడు... మా పెద్దోడు అచ్చం నేను వున్నట్లే స్వతంత్రంగా వుంటున్నప్పుడు... చిన్నోడు నేను కొంచె డిఫరెంట్ అని చాటాలని ప్రయత్నిస్తున్నప్పుడు... నాన్న ప్రశ్న ధిక్కార స్వరాన్ని తీసుకున్నప్పుడు... ఒరే, చచ్చిపోయేలోపు అందరూ కలిసి కనిపిస్తారా? అంటూ అమ్మ నన్ను ఓ ఉదయాన్నే అడిగినప్పుడు అంతేనా... ఆర్ధికంగా ఓడిపోతున్న ప్రతీ రోజూ, పడగవిప్పే కోర్కెలను కాల్చిచంపుతున్న ప్రతీక్షణం నేను గర్వంగానే ఫీలవుతూనే వున్నా.

ఇప్పుడు మరో సారి మరింత గర్వంగా, పొగురుగా తలెగరేస్తున్నా. నా సహచరులు నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా సాగారని తెలిసిన ఆనందతో లేచిన తలపైకి కళ్ళెక్కాయి. వందల మంది ముందు ఓ పార్టీ ఎంపి అభ్యర్థి ''మిమ్మల్ని లోబరుచుకోవటానికి సొమ్ములు నేనే పంపించాను. తీసుకుని వుంటే మీరు ఈసరికి ఇక్కడ వుండేవారు కాదు. అవసరమైతే నరికేయటానికైనా స్కెచ్ సిద్ధం చేశాను'' అంటూ మాట్లాడితే... అంత తేలికగా లొంగే రకం మేము కాదులే అంటూ మనకు సిగ్గులేకుండా ఎన్నుకున్న ఆ ప్రజాప్రతినిథికి ఘాటుగా, ఒకింత నమ్రతగా సమాధానం చెప్పిన నా సహచరరులు విప్లవ కమ్యూనిస్టులు కాదు... ప్రకటనల కోసం వచ్చాం కాబట్టి తగ్గాం. లేకుంటే అంత పబ్లిక్ గా మాట్లాడేవాడా? వాడితో యుద్ధమే జరిగేది. తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎంత ధైర్యం వాడికి? చేసిన ముండాకోర్ పనిని ఎంత నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నాడు? అంటూ నా సహచరుల ఆవేదనాగ్రహాల ప్రదర్శన చూసి ఈ నిజాయితీ ఎర్రజెండాలో వుంటేనా? అనుకుంటూ నా పొగురు ఒకింత నిస్పృహకు గురైంది. అంతలోనే నా సహచరులు నాకన్నా మెరుగ్గా వున్నారని అనిపించి మరలా తల పొగురుగా పైకి లేచింది. కళ్ళు ఒకింత గర్వాతిశయంలో విప్పారాయి.

పాత్రికేయరంగంలో ఇంకా ఎంతోకొంతమంది ఇలాంటి వాళ్ళు వుండబట్టే... మరింత మంది రావాలి. మరింతమందికి ప్రేరణ కావాలి. మరింత పొగురుగా మా జాతి తలలెగరేయాలి. అవును, లాల్చీలు వేసినా, మాసిన గెడ్డాలతో వున్నా, ఒకింత ఇష్టంతో యాజమాన్యం హెచ్చరికలు చేసినా మారకపోవటానికి కారణం, నేను ఒదులుకోవటానికి సిద్దపడని పొగురే కారణం. ఇంత పొగురుతో పైకెగిసే తల పైనోళ్ళు తలొంచుకోవాల్సిందే అంటూ చెప్పే ప్రతీసారీ చెప్పారని కాదుకానీ... సిగ్గుతో తలదించుకుంటూనే వున్నా... దేవుడా... నీవనేవాడివే వుంటే తలదించుకునే సందర్భాలు మరిన్ని నాకు రాకుండా చూడు. లేదా, నీవు లేవన్న, ఒట్టి రాయివేనన్న నా నమ్మకాన్ని మరింత బలపరిచినట్లేనని ఒకింత పొగురుగానే హెచ్చరిస్తున్నా.  

2, ఏప్రిల్ 2014, బుధవారం

కొల్లేటి జాడల నుంచి బయటపడి...

చాలాకాలం తరువాత కొల్లేటి జాడలు పుస్తకాన్ని మూడు దఫాలుగా 10రోజుల్లో పూర్తి చేశాను. ఈ పుస్తకాన్ని అడిగిన వెంటనే ఇచ్చిన మిత్రుడు అనిల్ కి ముందుగా ధన్యవాదాలు. ఇదే పుస్తకాన్ని పూటలో పూర్తి చేసిన దూర గతంతో పోల్చుకుంటే ఎక్కువే అయినా నిన్నమొన్నటితో పోల్చుకుంటే తొందరగా చదివినట్టే. ఇలా చదివించింది రచయిత శైలా? లేక విషయాంశమా? లేక రెండూనా? ఈ అనవసరమైన సంశయాలజోలికి పోకుండా నాకు కలిగిన సందేహాలను గురించే మాట్లాడతాను.
ఇప్పటి వరకూ మానవసమాజంలో సాగిన, సాగుతున్న అభివృద్ధిలో వనరుల హననం, ప్రకృతికి ఎదురీత సాహసం లేకుండా ఎప్పుడైనా వుందా? కమ్యూనిస్టు మేథావులు చెపుతున్న నాటి రష్యా, చైనాలలో నైనా సరే(ఇప్పుడు వాటి గురించి మాట్లాడలేమని వారే అంటున్నారు కాబట్టి). ప్రకృతితో సహజీవనం చేస్తూ వనరులను పరిమితంగా ఉపయోగించుకుంటూ, నవల చివరి పేజీలలో పేర్కొన్న ప్రకృతి విధ్వంసాన్ని జరగనీయకుండా చూడటం సాధ్యమేనా? ఉదయాన్నే చెంబుపట్టుకుని వెళ్ళటానికి కూడా ఎంత సిగ్గుచచ్చిపోయేదే వివరించిన రచయిత ఇప్పుడు ఆ పరిస్థితులు లేకపోవటం ఎలా అభివృద్ధి కాదో కూడా చెప్పాలి. ఒక సారి ఊరి నుంచి బయటకు వెళ్ళిన పిల్లలు తిరిగి ఆ ఊరికి రావాలంటే ముదనష్టపు ఊరని తిట్టుకునేటంత విసిగి వేశారిపోయే పరిస్థితులు ఇప్పుడు లేవంటే అది అభివృద్ధి కాదా?
అభివృద్ధి పేరుతో వస్తున్న టెక్నాలజీ ప్రవాహంలో మనం కొట్టుకుపోతూ ఏ మాత్రం ఎదురీదే ప్రయత్నాలు చేయకుండా నిష్ఠూరపడటం ఎంత వరకూ సబబు? చివరిపేజీలలో ఉన్నట్లుగా 40ఏళ్ళలో ఎన్నడూ ఊరిగడప తొక్కనివాడికి ఇలా అయిపోయిందిమిటా అన్న బాధ పడే హక్కుకూడా లేదేమో? సమిష్ఠి సాగు అద్భుత ప్రయోగమని భావిస్తున్న చాలామందిమి అభివృద్ధి సాగుతున్న క్రమంలో వ్యష్ఠి భావనలు ఎందుకు పెరుగుతున్నాయో కూడా సమాజానికి వివరించగలగాలి. వ్యక్తి పూజలను, వ్యక్తిగత ప్రతిష్ఠలను వదిలించుకోలేని మన ఆలోచనలను ముందుగా మనం తోడెయ్యగలిగితే... ప్రతీ నిర్ణయానికీ ముందు సహేతుకమైన సమిష్ఠితత్వంతో నిండిన శాస్త్రీయ ప్రశ్నలను వేసుకోగలిగితే...
ఏదేమైనా ఇన్ని ఆలోచనలు రేపిన నవల ప్రభావం చిన్నదేమీ కాదు. పైన మాట్లాడిన మాటలన్నీ తక్కువ చేసేవీ కావు. చదువుతూన్నంత సేపూ మదినితొలిచిన ప్రశ్నలు మాత్రమే. అసలు నేను వేసుకుంటున్న ప్రశ్నలలో హేతుబద్ధత ఎంత? మళ్ళీ ఆలోచనల్లోకి జారుతున్నాను... వుంటానే...