24, మార్చి 2009, మంగళవారం

పయనం

నీరు లేని నేల
ప్రాణం లేని కట్టె
తోడు లేని ప్రయాణం

నిదుర కోసం...

ఎక్కడికి వెళితే అక్కడకు
దారంతా వెంటపడుతూనే
వీడిజిమ్మడిపోను
వళ్ళంతా మండిస్తూ, ప్రాణం తీస్తూ...

‘కవిత’ చదువుతూ...

రేయి ముగియకుండానే 
పరుగు తెరుచుకున్న రెప్ప మరి పడదు 
తొలి సూరీడు, చిన్న చిన్న పాకలు 
నువ్వూ, నేనూ ఇబ్బంది పడే 
నల్లనీటి పిల్ల కాలువలు 
నా మనసులానే... 
తెలిమంచు వీడని శూన్యం 
భానుడు ప్రకాశుడై అందంగా పైకి, పైపైకి మెల్లగా
మెలమెల్లగా అంతా ‘నల్లద్దాల’ నడుమ 
చలువ పెట్టెలో కూర్చుని కదులుతూ... ‘కవిత’ చదువుతూ...

8, మార్చి 2009, ఆదివారం

విస్ఫోటనానికే


నిన్నటి వరకూ ఆరడుగులున్న నేను
ఇప్పుడు నాన్న చంకెక్కుతున్నాను
అక్కడే ఆగాలని లేదు
అమ్మ ఒడిలోకి చేరి
కాళ్లు ముడుచుకుని ఒద్దిగ్గా
నిదురోవాలని ఉంది
కాదు... కాదు...
అమ్మపొత్తిళ్లలోకి జారాలని ఉంది
అభద్రతల భద్రత నుంచి
బయటకు దూకాలని ఉంది
ఊహూ... ఇంకా...
అమ్మ కడుపులోకి
పిండాన్నై చేరాలని చూస్తున్నా
కళ్లు తెరవని ఆలంబన లేకుండా
బతకలేని పసిగుడ్డునవ్వాలని కాంక్షిస్తున్నా
అయినా... ఏది శాంతి
అమ్మ వింటున్నవీ, చూస్తున్నవీ, చేస్తున్నవీ
అన్నీ అనుభూతమవుతున్నాయే...
ఎలా...
మిగిలింది ఒక్కటే
నాన్న శుక్ర కణాల్లోని వై క్రోమోజోముగా
జారిపోతే... అలా వెనక్కి... వెనక్కి...
ఇదంతా... మరో విస్ఫోఠనానికే...
మరింతగా విస్ఫోటించడానికే...