19, ఏప్రిల్ 2012, గురువారం


ఓ చిట్టి తల్లి కోసం...

   నిరుపేద ఆరాటం



డపిల్ల...ఈ పదం వింటేనే అబార్షన్లు చేయించుకునే రోజులివి...పుట్టగానే వడ్లగింజ వేసి చంపేస్తున్న కాలికాలమిది. పేగు బంధాన్ని కాలరాస్తూ కుప్పతొట్టిలలోనో, మురుగుకాలువలలోనో వేస్తున్న సందర్భం...కారుచీకటిలో మిణుగురు వెలుగులా ఓ తల్లిదండ్రులు పేదరికంతో చేస్తున్న పోరాటం... ఏడాదిన్నరగా మంచానికే పరిమితమయిన ఆడపిల్ల కోసం అమ్మానాన్నలు పడుతున్న ఆరాటం...కన్నబిడ్డ చనిపోతుందని చెప్పినా నవమాసాలూ మోసి కన్న ఆడ బిడ్డకోసం తాహతుకు మించి ఖర్చుచేస్తున్న తల్లిదండ్రుల దీనగాథ ఇది..

చౌదరి, ధనలక్ష్మి... దంపతులిద్దరూ ఇద్దరూ రోజు కూలి చేస్తే తప్పితే ఇల్లు గడవదు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి రమ్య, చిన్నమ్మాయి రాణి. కుందనపు బొమ్మలా ముద్దులొలుకుతూ కనిపించే ఈ చిన్నారిని చూశారా...ఈ చిన్నారే రాణి. ఆరు సంత్సరాల ఈ పాప నిన్నటి వరకూ అందరిలాగే ఆటలాడేది... స్కూల్ కు వెళ్ళేది. సంత్సరం క్రితం వచ్చిన జ్వరం పాప భవిష్యత్తును చీకటిమయం చేసింది. చలాకిగా తిరిగే ఆ చిన్నారి ఇప్పుడు మంచానికే పరిమితమై పోయింది. 

జ్వరంగా రాగానే స్థానిక ఆసుపత్రిలో చూపించారు. మామూలు జ్వరమే కంగారు పడొద్దంటూ మందులు ఇచ్చి పంపేశారు. తగ్గినట్టే తగ్గిన జ్వరం రెండు రోజుల తరువాత తిరగబెట్టింది. కంగారు పడిన తల్లిదండ్రులు  స్వంతూరు విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని వెంకటపద్మ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. పాప పుట్టింది కూడా అక్కడే. అక్కడ వైద్యులు చూశారు.  విషయం ఏమిటో చెప్పకుండానే విశాఖలోని పెద్ద ఆసుపత్రులలో చూపించండి అంటూ పంపించేశారు. ఇక్కడ దాదాపుగా చిన్న పిల్లల పెద్దఆసుపత్రులన్నింటికీ తిప్పారు. ఎవ్వరూ జ్వరం ఎందుకు తగ్గటం లేదో చెప్పలేదు. వివిధ పరీక్షల పేరుతో, వెంటిలేటర్లు పెట్టాలనే వంకతో ఆ పేదల రక్తాన్ని పీల్చిపిప్పి చేశాయి ఆ కార్పొరేట్ ఆసుపత్రులు. అంతా అయిన తరువాత తలలో గాలిసంచులు ఉన్నాయనీ, అవి తీస్తే పాప బ్రతుకుతుందని కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులు తేల్చారు. మా ఆసుపత్రి లో అయ్యే ఖర్చు మీరు తట్టుకోలేరు, కేజీహెచ్ కు తీసుకు వెళ్ళండి అంటూ చేతులుదులుపుకున్నారు. ప్రారంభంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేజీహెచ్ వైద్యులు ఆ తరువాత అన్ని పరీక్షలు చేశారని పాప తల్లి ధనలక్ష్మి చెప్పింది. పాప తలకు నాలుగు ఆపరేషన్లు చేసిన వైద్యులు ఏం ఫర్వాలేదంటూ భరోసా ఇచ్చారు. ఆపరేషన్ల తరువాత తలలోనుంచి పైపులు పెట్టి నీరు తొలగించాల్సి వచ్చింది. ఆ సమయంలో పాపకు కాళ్లు, చేతులు వంకర్లు పోవటంతో పాప తల్లిదండ్రులు పరుగుపరుగునా డాక్టర్ల వద్దకు పోయారు. పాపకు ఏదో అయిపోతుంది, కాపాడంటూ మొరపెట్టుకున్నారు. పరీక్షించిన వైద్యులు పాప రెండు రోజులుకు మంచి బతకదంటూ చెప్పారు. మూడు నెలలు ఆసుపత్రిలో పాపను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఆ నిరుపేద తల్లిదండ్రులు భోరుమన్నారు. దేవుడిపై భారం వేసి చీపురుపల్లికి సాగిపోయారు.

చీపురుపల్లి నుంచి కొద్ది కాలానికే బతుకుదెరువు కోసం విశాఖకు తిరిగి చేరుకున్నారు. ఇప్పుడు కైలాసపురం, ఎన్ జి జీవోఎస్ కాలనీలో వుంటున్నారు. రెండు రోజులు, వారం... నెల ఇప్పటికి ఏడాదిన్నర అయ్యింది. పాప మంచానికే పరిమితమయ్యింది. వంకరపోయిన కాలు, చేయితో ఎక్కడికీ కదలలేని దుస్థితి. ఎవరు పిలిచినా పలకలేదు. అలాగని కోమాలో వుందని అనుకోవటానికీ లేదు. ఆ రోజు నుంచీ ఈ రోజు వరకూ ఆ చిన్నారికి అమ్మా, నాన్నే అన్నీ అయ్యారు. సమయానికి ఏం కావాలో చూసి ఇస్తూ, సాకుతున్నారు. ఏడాదిన్నరగా కేవలం పాలు మాత్రమే ఆహారం.

చిన్నారి రాణి చనిపోతుందన్న 'నారాయణుల' మాట వేదవాక్కుగా భావించి అంతకుమునుపు చేయించిన వైద్య పరీక్షల కాగితాలేవీ దాచకుండా పారేసిన అమాయక నిరక్షరాస్యులు ఆ తల్లిదండ్రులు. కూలికెళితే కాని పూటగడవని ఆ తల్లిదండ్రులే పాపకు అన్నీ చేయాలి. తలకు మించిన భారంగా మారినా వారిలో నిరాశలేదు. పాపను కాదనుకోవటం లేదు. ఇప్పటికీ ఓ మూల చిన్న ఆశ. ఏదైనా అద్భుతం జరగకపోతుందా? పాప తిరిగి నట్టింట తిరగకపోతుందా? రెండు రోజులకు మించి బతకదని తేల్చేసిని వైద్యనారాయణుల మాటలు డొల్ల అంటూ ఏడాదిన్నరకుపైగా సజీవంగా వున్న పాపను ఎలాగైనా బతికించుకోవాలన్న తపన వారిలో ఇప్పుడు రోజురోజుకూ పెరుగుతోంది. దాతలెవరైనా స్పందించి మంచి ఆసుపత్రిలో చూపిస్తే పాప తిరిగే అవకాశముందేమోననుకుంటున్న ఆ తల్లితండ్రుల పేదాశ ఫలించేనా? ఎంతో మందిని కాపాడిన దాతలో, ప్రాణాలు కాపాడతాం అందుకే ఆరోగ్యశ్రీ అంటూ ప్రకటిస్తున్న పాలకులో స్పందించే అవకాశం వుందా?

స్పందించే మనసులు పిలవాల్సిన నంబరు - 9392986569 (పాప తండ్రి నెంబర్)