24, ఫిబ్రవరి 2013, ఆదివారం

మావోలపై పోలీసుల అనుబంధాల వల

కొండ దిగుతూ...
 ఆంధ్ర ఒడిష్షా సరిహద్దులలో, విశాఖ మన్యంలో మావోయిస్టులను పూర్తిగా కట్టడి చేయటానికి పోలీసులు త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారా? ఎన్ని ప్రచారాలు సాగుతున్నా మావోయిస్టులు తమ ఉనికిని వీసమెత్తు కూడా బయటపెట్టకుండా చాపకింద నీరులా సాగిపోతున్నారా? అంతుపట్టని నిశ్శబ్ధం వెనుక సాగుతున్నదేమిటి? పోలీసులు అమలు చేస్తున్న వ్యూహాలు నిజంగానే ఉద్యమ ప్రభావాన్ని తగ్గించేస్తాయా? వీటికి సమాధానం వెతికే క్రమమే ఈ కథనం.

నిషేధిత మావోయిస్టు పార్టీ ఆంధ్రా ఒడిష్షా సరిహద్దు ప్రాంతంలో ఉత్తరాంధ్రలోని విస్తారమైన అటవీప్రాంతంలో పట్టును కలిగి వుంది. తమ ప్రాబల్యాన్ని చాటుకోవటానికి గత కొన్నేళ్ళుగా మావోలు అనేక ఘటనలకు పాల్పడుతూ వస్తున్నారు. ప్రభుత్వాస్థుల విధ్వంసం, రాజకీయ నాయకులను, అధికారులను ఖతం చేయటం, ఇన్ ఫార్మర్లను హత్య చేయటం వంటి అనేక సంఘటనలు కలకలం సృష్టించాయి. బలిమెల ఘటనలో పదుల సంఖ్యలో బలగాలు దుర్మరణం పాలవటాన్ని ప్రభుత్వం, సాయుధ పోలీస్ బలగాలు సీరియస్ గానే పరిగణలోకి తీసుకున్నాయి. రెండో వైపు మావోలను కట్టడి చేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ అదే స్థాయిలో సాయుధ బలగాలతో మావోలపై విరుచుకుపడ్డాయి. హక్కుల సంఘాలు బూటకపు ఎన్ కౌంటర్లని ఆరోపిస్తున్న ఘటనలలో ఎంతో మంది మావోయిస్టు పార్టీ కీలక నేతలు, ఎర్ర సైనికులు చనిపోయారు. ఇరువైపులా సాగుతున్న ఈ ఆధిపత్య పోరులో గిరిజన పల్లెలు తల్లడిల్లి పోయాయి. అన్నల రాకతో అంతోఇంతో ప్రశ్నించే తత్వాన్ని, జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నామని అనుకున్న తరాన్ని వెనక్కు నెడుతూ మరో తరం గిరిజన తండాలలో నడయాడుతోంది. కేవలం ఆయుధంతో మాత్రమే మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయటం సాధ్యం కాదని, గ్రామాల్లో మావోయిస్టుల ఏరివేత పేరుతో సాగుతున్న 'ఆపరేషన్స్' తో గిరిజనంలో తమ పట్ల వ్యతిరేకత ప్రబలుతోందని, ఆ ద్వేషం మావోయిస్టుల పట్ల ప్రేమగా మారుతోందని కాలక్రమంలో ప్రభుత్వం గుర్తించింది. దీనితో తన తంత్రానికి పదునుపెట్టింది.  గ్రేహౌండ్స్, సిఆర్ పిఎఫ్, బిఎస్ఎఫ్, సాయుధ పోలీస్ దళాలు ఓ పక్క గ్రామాలను జల్లెడ పడుతున్నాయి. అడివిలోని ప్రతీ ఆకునీ అనుమానిస్తూ సాగుతున్నాయి. ప్రభుత్వం వందల కోట్లను గిరిజనుల అభివృద్ధి నిమిత్తం ఖర్చు చేస్తున్నట్లు ప్రకటనలు గుప్పిస్తోంది. రహదారులు, పాఠశాలలు, వసతి గృహాలు, తాగునీరు, వైద్యం వంటి మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా ప్రయత్నం సాగిస్తోంది. మరో వైపు అన్నింటికీ మూలమైన డబ్బును ఎరగా చూపిస్తూ లొంగిపోయిన వారికి లక్షలాది రూపాయలు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తోంది. పై ప్రయత్నాలకు సమాంతరంగా విశాఖ జిల్లాలో పోలీసులు సరికొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టారు. మావోయిస్టుల పెట్టని కోటలుగా చెలామణీ అవుతున్న లోతట్టు గ్రామాలలోకి ఎన్నడూ అడుగుపెట్టని పోలీస్ ఉన్నతాధికారులు సద్భావనా యాత్ర పేరుతో మందీ మార్భలంతో సాగుతున్నారు. విశాఖ జిల్లా రూరల్ ఎస్పీ జి శ్రీనివాస్ నేతృత్వంలో మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా వున్న పలువురి స్వగ్రామాలకు, ఇళ్ళకు పోలీసులు సాగుతున్నారు... ఆత్మీయానురాగాలు ఒలికిస్తున్నారు. వారితో మాట, పాట కలుపుతున్నారు. మేం మీ స్నేహితులమంటూ నమ్మబలుకుతున్నారు. 
 
''మీ బిడ్డలను చూసుకునే అవకాశం లేక ఈ వయస్సులో మీరు ఎంతలా కుమిలిపోతున్నారో మాకు తెలుసు. పార్టీని వీడి రమ్మని వారికి చెప్పండి. లొంగిపోయిన వారికి ఎలాంటి హానీ వుండదు. మాది హామీ. వారిని మా సోదరుల్లా చూసుకుంటాం. మీకు ఏ సాయం కావల్సి వచ్చినా మేం వున్నాం. మేమూ మీ బిడ్డల వంటి వారిమే'' వంటి మాటలతో వారి మనస్సులను గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మావోయిస్టు సీఆర్సీసికి చెందిన మొదటి కంపెనీకి నాయకత్వం వహిస్తున్న కుడుముల వెంకట్రావు అలియాస్ రవి స్వగ్రామం, చింతపల్లి మండలంలోని కొమ్మంగికి జి శ్రీనివాస్ చేరుకున్నారు. రహదారి, ప్రాంతమూ రాత్రివేళ ప్రమాదకరమని తెలిసినా మావోయిస్టు నేత తల్లిదండ్రులతో, గ్రామస్తులతో ఆయన తన బృందంతో సుమారు నాలుగు గంటలకు పైగా గడిపారు. చలిమంటల నడుమ వారి కష్టసుఖాలను పంచుకున్నారు. గ్రామ సమస్యలను పరిష్కరించటానికి హామీలను, గుడి నిర్మాణానికి సాయం చేస్తామన్న మాటను వారికి ఇచ్చారు. మావోయిస్టు నేత తల్లిదండ్రులకు సంప్రదాయబద్ధంగా పండ్లు, స్వీట్లతో పాటు నూతన వస్త్రాలనూ అందించారు. మావోయిస్టులు లొంగిపోయి స్వేచ్ఛా జీవితాన్ని కొనసాగించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మావోయిస్టు నేతల ఫోటోలు, వారి తలలకు కట్టిన వెలతో కూడిన క్యాలెండర్లను అదే సమయంలో పోలీసులు గ్రామస్తులకు విస్తారంగా పంచిపెట్టారు. కుడుముల రవి అలియాస్ వెంకట్రావు తల్లిదండ్రులు ఆరుపదులు దాటిన వయస్సు. ఎస్పీ శ్రీనివాస్, ఓఎస్డీ దామోదర్ తదితరులు తన ఇంటికి రావటం, తనకు నూతన వస్త్రాలను అందించి, పండ్లు పలహారాలు చేతిలో పెట్టడంతో కళ్ళనీళ్ళు తిరిగాయి. ఎప్పుడో 1997లో దళాలలోకి వెళ్ళిపోయిన కొడుకు ఆరోగ్యం సక్రమంగా లేదని తెలిసిన ఆ తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. కనిపించీ కనిపించకుండా వున్న ఈ వయస్సులో కొడుకు వచ్చేస్తే బాగుంటుందని ఆ తండ్రి ఆశిస్తున్నాడు. ఇంటిల్లపాదీ వెంకట్రావు ఇంటికి రావాలనే కోరుకుంటున్నారు. రవికి నమ్మకం కలిగించి తీసుకురావటానికే ప్రయత్నిస్తామని కుటుంబం చెపుతోంది. తల్లి మాత్రం కళ్ళావేళ్ళాపట్టుకుని బతిమలాడుదామనుకుంటే కంటికి కనిపించటమే కరవయ్యిందని వాపోయింది. పోలీసులు మీకు డబ్బులేమైనా ఇచ్చారా? అన్న ప్రశ్నకు రవి తండ్రి శ్రీరామమూర్తి కోపగించుకున్నారు. కష్టార్జితంతో కట్టుకున్నామని, పోలీసుల నుంచి పైసా కూడా ఆశించలేదని స్పష్టం చేశాడు. సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరం... లోయ అంచునే సాగే కాలిబాటలో ప్రయాణం. తుపాకికీ, తుపాకికీ నడుమ గెరిల్లాయుద్ధతంత్రంలో పాటించే వెడం. శత్రువు పొదలమాటు నుంచి దాడిచేసినా భారీ నష్టం కలగకుండా ముందస్తు వ్యూహం ప్రకారం సాగిన ప్రయాణం. ఈ ప్రయాణానికి రక్షణగా మొదటి కాంటూర్ పై రక్షణగా సాగుతున్న కూబింగ్ దళాలు... ప్రతీ అడుగూ అప్రమత్తంగా, గంటకుపైగా సాగిన నడక... శిఖరాగ్రాన వున్న ఆరు ఇళ్ళు... అదే జీ కే వీథి మండలంలోని దారాలబయలు గ్రామం. మావోయిస్టు సాయుధ మిలీషియా కీలకనేత జన్ను మోహనరావు స్వగ్రామం అది. పోలీసుల చేతిలో చావు దెబ్బలు తిని అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి రాజును పలకరించటానికి నాలుగు రోజుల క్రితమే ఆయన ఆ గ్రామానికి వచ్చి వెళ్ళారు. నాలుగు ల్యాండ్ మైన్లను తనకు రక్షణకవచంగా వుంచుకుని తల్లిదండ్రులతో యోగక్షేమాలను కలబోసుకున్నాడు. ఇప్పుడు అదే గ్రామానికి, ఆయన ఇంటికే నర్సీపట్నం ఓఎస్ డి దామోదర్, సిఐలు వెంకట్రావు, రామకృష్ణలు తమ బృందంతో చేరుకున్నారు. సీన్ రిపీట్. ఆ గిరిజన పల్లె ఎన్నడూ చూడని, ఖరీదైన స్వీట్లు, బిస్కెట్లు ఆ పది మంది గ్రామస్తులకూ పంచారు. దళసభ్యుడు మోహనరావు తల్లిదండ్రులతో అనునయంగా మాట్లాడారు. వారికి నూతన దుస్తులను అందించారు. అందిస్తున్న ఆర్థిక సాయాన్ని ఆ దళసభ్యుని కుటుంబం సున్నితంగానే తిరస్కరించింది. పిల్లాపాపలతో కలిసి ఓఎస్డీ కిందనే కూర్చున్నారు. పదాలమార్పు... అంతే, భావం మాత్రం అదే. లొంగిపోతే అంతా మంచే జరుగుతుంది అంటూ సాగిన మాటలు. కాకపోతే నిన్న ఎస్పీ శ్రీనివాస్... నేడు ఓఎస్ స్డీ దామోదర్. చీపురుగొంది గ్రామంలో షెల్టర్ తీసుకున్న దళసభ్యులను చుట్టుముట్టిన సాయుధ పోలీస్ బలగాలు ఎలాంటి కాల్పులకు పాల్పడకుండా గంటలు తరబడి సహనంతో వేచిచూసి ఆరుగురిని అదుపులోకి తీసుకుని క్షేమంగా కోర్టులో హాజరుపరిచిన ఘటనను ఈ సందర్భంగా ఓఎస్డీ దామోదర్ ప్రస్థావించారు.
పోలీసులు మంచిగనే చెపుతున్నారు. మేం కూడా సరెండర్ అవ్వమనే చెపుతున్నాం. లొంగిపోతే మావోయిస్టుల చేతిలో చావు తప్పదన్న భయం మా వాడిని వెన్నాడుతోందంటూ మోహన్రావు తండ్రి జన్ను చిన్నారావు మెల్లగా చెప్పాడు. మోహనరావు తమ్ముడు రాజు మాత్రం భయాన్ని దిగమింగుకుని తన తండ్రిని దారుణంగా కొట్టిన పోలీసులను నమ్మెదెట్లా అంటూ కళ్ళనీరు గుక్కుకున్నాడు. ఏ పాపమూ చేయని తన తండ్రిని చిత్ర హింసలు పాల్చేశారంటూ వాపోయాడు. ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని, ఆయనకు వైద్యం చేయిస్తున్నామనీ, ఎక్కడో పాడేరులో కాపురం చేసుకుంటున్న తనకు ఆయన కోసం ప్రతీవారం రావటం భారమేనని చెప్పాడు. కొట్టిన తరువాత మంచిగ మాటలు చెప్పినా ఫలిమేముంది అంటూ ప్రశ్నించాడు. ఇలాగైతే ఎలా నమ్మేది అన్న ప్రశ్న అతని మాటలో, జారని కన్నీటిలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించటానికి, దోపిడీదారుల ఆటకట్టించటానికీ మావోయిస్టులు వుండాల్సిందే... పార్టీని, మావోయిస్టు తుపాకీని వీడి, పోలీస్ తుపాకీ చేతపట్టిన ఓ మాజీ అభిప్రాయం ఇది. బహుశా కొండకోనల్లోని ఎన్నో పల్లెల్లోని గిరిజనుల అభిప్రాయమూ ఇదే. ఉద్యోగాలు, డబ్బులు, అప్యాయతానురాగాల ప్రదర్శనలూ ఇవన్నీ ఆ ప్రజల మనస్సులను గెలుచుకోవటానికి ఏ మేరకు ఉపయోగపడతాయన్నది ప్రస్తుతానికి సందిగ్ధ ప్రశ్నే. మావోయిస్టు అగ్రనేతలు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఆర్కేను పోలీసులు చుట్టుముట్టారు వంటి వార్తలు మీడియాలో ప్రముఖంగా రావటానికి ఎంతగానో సహకరించిన పోలీసులకు గత ఆరు నెలలకుపైగా కాలంలో మావోయిస్టుల మౌనం అర్థంకాకుండా వుంది. కదలికలు అంతుచిక్కకుండా వున్నాయి. అసలు వున్నారా? లేరా? వుంటే ఏమయ్యారు? ఎక్కడ వున్నారు? ఏం ప్రణాళికలను రచిస్తున్నారు? వంటి ప్రశ్నలకు నిఘా వర్గాలు తెల్లమొఖమేస్తున్నాయి. జరుగుతున్న సమావేశాలకు, సభలకు సంబంధించిన ఫోటోలుకాని, వీడియో ఫుటేజ్ కానీ లభ్యంకాని పరిస్థితి. అయితే ఏఓబి బాధ్యతలలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయని, పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని పోలీసులు చెపుతున్న దళాలను పునర్నిర్మించే కార్యక్రమంలో మావోలు నిమగ్నమై వున్నారని, మిలీషియాను మరింత బలోపేతం చేసుకుంటూ, సైద్దాంతికంగా వారిని బలపరుచుకునే దిశగా వారు సాగుతున్నారని కర్ణాకర్ణిగా వెలువడుతున్న వార్తలు పోలీసులను ఒకింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రశ్నార్ధకమైన భవిష్యత్తును పక్కన పెట్టి ఆశావహదృక్పథంలో సాగిస్తున్న సద్భావన యాత్ర వంటి కార్యక్రమాల ఫలితాలు ఏ విధంగా వుండబోతున్నాయన్నది కాలమే తేల్చాలి.
లోతట్టు అటవీప్రాంతంలోని దారాలబయలు గ్రామం