2, మార్చి 2018, శుక్రవారం

వికాస్ క నారా...

రాష్ట్రం పారిశ్రామికంగా సర్వోన్నత స్థానానికి ఎగబాకాలి. పెట్టుబడి పెట్టే వారందరికీ రెడ్ కార్పెట్ వెయ్యాలి. సామాజిక అంతరాలు పెరగకుండా... ఐ రిపీట్ పెరగకుండా చూసుకోవాలి. ఇవన్నీ జరగాలంటే క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న మూడు రోజుల ముచ్చటైన పండుగ జరిగే తీరాలి. అంతా అనుకున్నట్టే జరిగింది. అయినా ఎందుకనో చప్పగానే కనిపించింది. ఎందుకని? వినిపించిన వార్తలను మించిన కనిపించని కథనాలేంటి?

ఆరంభం నుంచీ అధికారులు, మంత్రులు హింట్ ఇస్తూనే వున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టడానికీ, మరింత ఆచరణాత్మకంగా అడుగులు వేయటానికీ కొన్ని నెలులుగా శ్రమిస్తున్నామనీ, డిపిఆర్ లు ముందుగానే తీసుకుని, పెట్టుబడులు పెట్టాలనుకున్న వారితో ముందుగానే చర్చలు సాగించి సామర్థ్య పరిశీలన జరిగిన తరువాతే ఒప్పందాల స్థాయికి తీసుకువచ్చామనీ మంత్రి సూచనా ప్రాయంగా చెప్పారు. అయినా గ్రహించలేని మందమతులుంటే ఏం చేస్తాం మేం అంటూ అధికారపక్షం నిస్సూరంటోంది. ఇంత చేసినా చివరికి ఎల్ఓఐ ఇచ్చేనాటికి కొన్ని జారిపోయే అవకాశాలను కొట్టిపారేయలేమని లోపాయికారిగా చెపుతూ వస్తునే వున్నారు. ఏమో గుర్రం కుంటావచ్చు. సంరంభం ఆరంభమయ్యింది. పసుపు వర్ణంతో నిండిన ఆవరణ అతిథులకు స్వాగతం పలికింది. ఏలినవారిని ప్రసన్నం చేసుకోవాటినికి మరీ ఇంతలా చేయాలా? అంటూ ఏష్టపోయిన పోయిన వారి భావతీవ్రత బాబుగారికి తెలిసిపోయింది. కనిపించీ కనిపించకుండా నవ్వే నారా లోకేష్ ను గమనించి కట్టడి చేయగలిగిన శక్తి, యింటిలో జరుగుతున్న వ్యవహారాలనీ ప్రైవసీ లేకుండా కనిపెట్టగలిగే స్థాయిలో టెక్నాలజీని వాడుకోగల సామర్థ్యం బాబు స్వంతమని సాక్షాత్తూ రాష్ట్ర ప్రథమ పౌరుడే కితాబిచ్చాడు మరి. ఎంతో డబ్బులు ఖర్చుపెట్టినా ప్రాంగణం ఆకర్షణీయంగా లేదని బాబుగారు అసంతృప్తి వ్యక్తం చేశారని రహస్య వర్గాల భోగట్టా.

స్వకార్యం, స్వామికార్యం కలిసి రావటం అంటే ఇదేనేమో. తిరిగే కాలు వాగే నోరు ఊరకుండటం కష్టమేమరి. రెండు రాత్రులు ఇంటిలో హాయిగా నిద్రపోయిన దేశ ద్వితీయ పౌరుడు... ఆరంభ సదస్సులో మాట్లాడకూడదంటూనే కేంద్ర ప్రభుత్వం గురించి ఘనంగా అనర్ఘళంగా మాట్లాడేశారు. చివరిలో నాలుగు పూలు రాష్ట్రంపై కూడా చల్లారనుకోండి. సగౌరవంగా ఇంటి నుంచి తోడ్కొని విమానాశ్రయం వరకూ సాగనంపిన బాబుగోరి చెవిని పెద్దాయన కొరికేశారని, కుసింత తగ్గితే మంచిది, నేనున్నాగా అంటూ హితబోధ చేశారనీ మీడియా కోడై కూసేసింది. గోడలకే కాదు, బుల్లెట్ ప్రూఫ్ కార్లకూ చెవులుంటాయి. మీడియాకు ఈ టెక్నాలజీ కొత్తదేమీ కాదు మరి.

అనుకున్న దానికన్నా పెట్టుబడులు ఎక్కువగానే వచ్చాయి. వికాస్ కా నారా... ఆంధ్రప్రదేశ్ హమారా అంటూ నాయుడోరి 40ఏళ్ళ రాజకీయ జీవితాన్ని నరశింహుడెత్తేస్తూంటే హాలు చెవులొగ్గి నోరు తెరుచుకుండిపోయింది. సప్పట్లు కొట్టాలనీ మరిసిపోయింది. గత రెండేళ్ళలో వచ్చిన హామీలలో 48శాతం అమలులోకి వచ్చాయంటూ ఊదరగొట్టే నేతలు, బాబు గారి డాష్ బోర్డు వివరణను వినివుంటే ముక్కున వేలేసుకునేవారు. అసలు విషయాన్ని ఎవరో పెద్దగా పనిలేని ఓ ఇంగ్లీషు పత్రికాయన రాశాడు కాని, బిజీబిజీగా వున్న మిగిలిన మీడియా పట్టించుకోనేలేదు. కేవలం 18శాతం మాత్రమే పనిలోకి దిగాయనీ, వందలకొద్దీ డిపిఆర్ స్థాయిలోనే ఆగిపోయాయనీ, మరికొన్ని వందలు వివిధ స్టేజీలలో పెండింగ్ వుండిపోయాయనీ బాబు గారు నిజాలే చెప్పారప్పుడు. అంతా పారదర్శకంగా, రియల్ టైమ్ లో చేస్తున్నామని చేసే ప్రకటనల మధ్య దాగుడుమూతలు ఎలా సాధ్యం? బాబుగారు ఇలాగే చేస్తే మళ్ళీ పీఠమెక్కాస్తారనే భయంతో నిత్యం బతికేసే కార్మిక, హక్కుల, పౌర సంఘాలు మూడు రోజుల పాటు ప్రత్యామ్నాయ సదస్సును నిర్వహించాయి. రంగులేసి, లైట్లు పెట్టి ఆర్భాటం చేయకుండా, పత్రికలకు, టివిలకు ప్రకటనలు ఇవ్వకుండా ఓ చిన్న హాలులో పెట్టేశారు. భిన్న అంశాలపై నిష్ణాతులమనుకునే అసంతృప్త వాదులు, వచ్చినోళ్ళంతా భలే అనుకునేలా మాట్లాడేశారు. కార్ల కంపెనీ కోసం పేదల భూమిని లాక్కున్న ప్రభుత్వం డబ్బులు బానే ఇచ్చిందని అంటూనే పక్కనే వున్న ఓ మంత్రిగారి భూమిలో మాత్రం సెంటుకూడా పోని వైనాన్ని, ఆ భూముల ధర ఇప్పుడు చుక్కల్లోకి ఎగబాకిన తీరును సక్కంగా వివరించారుట. అది తెలిసిన ఓ మీడియా మిత్రుడు రాజధానిలోనూ, భోగాపురంలో నిర్మించే ఆకుపచ్చ విమానాశ్రయం పక్కనా జరిగిందీ, జరుగుతోందీ ఇదేగా అంటూ కొత్త విషయమేమీ కాదనీ తేల్చిపారేశాడు. ప్రజల పక్షమని చెప్పుకునే ప్రతిపక్ష మీడియా పక్కనే వుండి బాబు గారు చెప్పే అంతరాలు తగ్గించటం అంటే ఇదేనంటూ ఠక్కున నోరేసుకుంది.

సిలికాన్ వ్యాలీని మించిన ఇన్నోవేషన్ వ్యాలీగా నవ్యాంధ్రప్రదేశ్ ఎదగాలంటే అమెరికా కలల వెంట పరిగెట్టడం మాని, మా దేశంలో చదువులను పరిశీలించండనీ, డాక్టర్లు ఇంజనీర్ల కన్నా ఉపాధ్యాయుడికే విలువెక్కువనీ క్లుప్తంగానే అయిన సూటిగా చెప్పిన ఫిన్లాండ్ టెక్నోక్రాట్, సెడిస్సీ ఇన్నోవేషన్స్ వ్యవస్థాపక ముఖ్య కార్యనిర్వాహకుడు రాబ్ లెస్లే మాటలు ఎంతమందకి తలకెక్కాయో తెలియదు. కానీ, ఆయనను చంద్రబాబు నాయుడు చదువు చెప్పటానికి మా దేశం రండి అంటూ ఆహ్వానించారు. బాబుగోరి మంచితనాన్ని వీళ్ళెప్పటికీ అర్థం చేసుకోరు. పైపెచ్చు వాళ్ళూ వీళ్ళూ అవసరమే లేదు, డబ్బులు పిండి రేయింబవళ్లూ గదుల్లోనే కుక్కేస్తున్న వాళ్ళను మూసేసి, గవర్నెమెంటోరి బడులకు ప్రాధాన్యమిస్తే చాలంటూ నిత్యం గొడవెట్టుకునే సంఘాలు మళ్ళీ దొరికింది ఛాన్సంటూ చంకలు గుద్దేసుకున్నాయి. అన్నట్టు ఇప్పటి వరకూ ఎవ్వరికీ తెలియకుండా, బయటకు అస్సలు పొక్కకుండా చినబాబు సాధించిన ఘనత మరుగున పడిపోకుండా తెరపైకి తీసుకువచ్చిన సమర్థ పాత్రికేయం వర్ధిల్లాల్సిందే. అనీల్ అంబానీ వచ్చి చేతులెత్తేశాడు. ముకేష్ అంబానీ అలాకాదనీ, ఇప్పటికే అనేక సార్లు వారి సాంకేతిక బృందం వచ్చి వెళ్ళిందనీ, తప్పకుండా వచ్చేస్తుందనీ సాక్షాత్తు సిఎం చెప్పిన మాట వినకుండా కేసులమీద కేసులతో సతమతమవుతున్న ఏ పక్షమో తెలియని నేత చెపితే వింటానంటే మీ ఇష్టం. ఇహ చేసేదేముంది.

సామాజిక అంతరాలు తగ్గితేనే సంతోషాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది... సంపద వస్తేనే చాలదు, అది అవసరమున్న వారికి కూడా చేరాలి... బడా పారిశ్రామిక సంస్థలు చట్టప్రకారం ఖర్చు చేసే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిథిని స్వచ్ఛందంగా రెట్టింపు చేయాలి... ఇవి కమ్యూనిస్టులు ఇస్తున్న నినాదాలే కానవసరం లేదు. ఆశ్చర్యం అస్సలు అవసరమే లేదు. ఎవరో అర్థం కావాలంటే ఇదిగో ఈ మాటలు కూడా వినేయండి... సంక్షేమ పథకాలను పెంచేస్తూ, నిక్కచ్చి అమలు కోసం సాంకేతికతను వాడుకుంటున్నాం. ప్రజల సంతృప్తతను ఎప్పటికప్పుడు కొలిచేస్తున్నాం... మీ ఊహ నిజమే. 2029 నాటికి దేశంలోనే మిన్నగా, 2050నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమైన రాష్ట్రంగా చేయాలని బాబు కంటున్న కలలని అవహేళన చేసే వారు, అబ్దుల్ కలాం కలలు కనండి వాటిని సాకారం చేసుకోవటానికి శ్రమించండి అంటూ చెప్పిన మాటలను మాత్రం పఠిస్తూంటారు. ఈ తేడా ఏమిటో అర్థం కాని యువత బాబుగారితో సెల్ఫీల కోసం పోటీ పడింది. సదస్సు మూడు రోజులూ పసుపుతాడు మెడలో వేసుకుని శ్రమించింది.