11, నవంబర్ 2015, బుధవారం

నేను నేనుగా మిగలని కాలంలో...

అవును నేను నేనుగా మిగలలేని కాలంలో 
నన్ను నేను తెలుసుకోలేనంత సిన్నోడినేం కాదు
భావోద్వేగాలు, సిద్ధాంతోద్రేకాలతో ఉడుకెత్తిన 
వయస్సు దాటేశానన్న సత్యం ఇప్పుడే తెలుస్తోంది
శుద్ధ భాష, భావప్రకటనలకు పెద్దగా చోటులేనిచోట
రూప ప్రదర్శనకు మాత్రమే పెద్దపీట
నా మాటకు, చేతకు మధ్య వ్యత్యాసం 
ఘర్షణాఘర్షణలకు మధ్య మౌనం 
నడిసంద్రంలో ఒంటరి మనిషిలా... 

అవును నేను నేనుగా మిగలలేని కాలంలో 
బావురుపిచ్చోడిలా గెడ్డమేసుకోవాలా?
క్లీన్ షేవ్ చేసుకోవాలా? ఇది ప్రశ్నే కాదు 
పొడుగు జుబ్బాలుపోయి... రంగుల చొక్కాలు 
ఒంటిపైకెక్కాయా లేదా అన్నదీ సమస్య కాదు 
పనికి తోడు అవసరాలు మారుతూంటాయని 
అవసరాలకు తగ్గట్టుగా ఆహార్యం మారాలని 
వాటిని అందుకోవటానికి చేయి గట్టిపడాలని 
తెలియనంత పసోడిని నేను కాను...

అవును నేను నేనుగా మిగలలేని కాలంలో 
తలవంచటమంటే ఆత్మహత్యా సదృశ్యం 
బతకటమంటే నీవ్వు అచ్చం నువ్వులానే వుండటం
నమ్మకాన్ని వదిలి అపనమ్మకంతో మంచమెక్కాలి
ఇది జారుడు కాదని, బతకటమని నేర్వాలి 
సిద్ధాంత రాద్ధాంతాలుమాని శిలాసదృశ్యమవ్వాలి
అంతెందుకు నీవు మడిసిగా కాదు
మనీషిగా బతకటం మొదలెట్టాలి

10, నవంబర్ 2015, మంగళవారం

పర్లాకిమిడి టు లండన్...

గూటాల కృష్ణమూర్తి... పర్లాకిమిడిలో పుట్టి విజయనగరం, విశాఖలలో చదువుకుని లండన్ లో స్థిరపడిన సాహితీ పిపాసి. స్వయంగా ఆయన చేసిన రచనలు మనకు అందుబాటులో లేకపోయినా అటు ఇంగ్లీషు, ఇటు తెలుగు సాహితీ రంగాలకు ఆయన చేసిన సేవలు ఎనలేనివి. 1928 జూలై 10న పర్లాకిమిడిలో జన్మించిన జికె 95 సంవత్సరాల వయస్సులో కూడా చెదరని జ్ఞాపకాలతో వృద్ధ యవ్వనంతో గలగలా మాట్లాడుతున్నారు. కుసింత హాస్యం, తడబడని స్థిరాభిప్రాయం, తనను తాను సామాన్యుడిగా వుంచుకునే ప్రయత్నం చేస్తున్న నిగర్వితనం ఆయన స్వంతం. తెలుగులో మాట్లాడుతున్నా... తెలియకుండా ఆంగ్లభాషలోకి జారిపోతూ సాగిపోయే గూటాల కృష్ణమూర్తిని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తో కలిసి రెండు గంటలకుపైగా చేసిన ఇంటర్వ్యూ సారమిది...

వైఎల్పీ: పర్లాకిమిడిలో పుట్టారు. లండన్ లో ఎందుకు స్థిరపడ్డారు?
జికెఎం: లండన్ లో స్థిరపడాలని పడలేదు. జరిగిపోయింది. పర్లాకిడిమిడిలో పుట్టడం యాధృచ్ఛికం. అది నా కోరికా కాదు. నా పుట్టిన ఊరు పర్లాకిమిడిగా చెప్పుకోవటానికి ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. పర్లాకిమిడి నా పుట్టినూరని, నా పేరు గూటాల కృష్ణమూర్తి అనే ఇప్పటికీ చెప్పుకుంటున్నాను.
వైఎల్పీ: లండన్ వెళ్ళటం...
జికెఎం: లండన్ వెళ్ళటం ముందుగా అనుకుని ప్లాన్ చేసుకుంది కాదు. యాధృచ్ఛికంగా జరిగిందని కూడా చెప్పలేను. అలా జరిగిపోయింది అంతే. పరిశోధన చేయటానికి లండన్ వెళ్ళాను. (అలవాటైన ఇంగ్లీషులో మాట్లాడటం మొదలు పెట్టారు. యార్లగడ్డ సూచనతో... తెలుగులోకి వచ్చేసేదా! అంటూ ఉత్తరాంధ్ర యాసలో అడిగి... మొదలుపెట్టారు.) చదువు ప్రారంభదశలో క్రికెట్ పై విపరీతమైన అభిమానం. ఆడటం, చూడటం కూడానూ. బరంపురంలో ఆడేవాడిని. ఎనిమిదేళ్ళ వయస్సులో క్రికెటర్ గా బరంపురంలో నా జీవితం ప్రారంభమయ్యింది. ఆ ఆటంటే ప్రేమే కాదు, గౌరవం కూడా. ఆ రీత్యా ఇంగ్లాండ్ ప్రభావం బలంగా వుండేది. ఆంగ్లేయ ఆటగాళ్ళా పేర్లు కంఠతా వచ్చేయి. కొంతమంది ఫేవరెట్ ఆటగాళ్ళూ వుండేవారు. ఇది ఒక కారణం మాత్రమే. (అలా ప్రారంభమైన ఆయన మాటల ప్రవాహం మెల్లగా బాల్యంలోకి జారిపోయింది)ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ... టైమ్స్ వాళ్ళ పత్రిక. అది ఇండియాలోనే ప్రింట్ అయ్యేది. అందుకనే దానిని ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అనేవారు. దానిలో క్రాస్ వార్డ్ పజిల్ పూర్తి చేయటం విడవకుండా చేసేవాడిని. ఖరీదు నాలుగు అణాలు. ఓ విద్యార్థికి అది పెద్ద భారమే. రైల్వే స్టేషన్ స్టాల్ అతనితో మిత్రత్వం నెరపి ఓ కాపీని నేను కొనుక్కునేవాడిని. విజయనగరం కేవలం నాలుగు పత్రికలు మాత్రమే వచ్చేవి. వాటిలో ఓ రెండు గ్రంథాలయాలకు వెళ్ళేవి. ఒకరో ఇద్దరు కొనుగోలు చేసేవారు. ఒక కాపీ మాత్రం నాకు రిజర్వ్ అయ్యేది. పేపరు వచ్చిననాడే నాలుగు అణాలూ చెల్లించి తెచ్చుకునేవాడిని.
వైఎల్పీ: ఇండియాలో, ఇంగ్లాండులో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా పనిచేసిన మీకు తెలుగుసాహిత్యం పట్ల మీకు రుచి ఎప్పుడు కలిగింది?
జికెఎం: తెలుగుసాహిత్యం పట్ల... కష్టం చెప్పటం. ఎప్పుడూ వుండేదేమో అనుకుంటున్నాను. విద్యార్థిగా... అటు పాఠశాలలో కానీ, ఇటు కళాశాలలో కానీ ఏనాడూ తెలుగు చదవలేదు (ఈ ముక్క ఆయన శ్రీమతి పక్కనుంచి అందించారు). సంస్కృతం చదివాను. తెలుగు సాహిత్యం పై ఇష్టం ఎంత కలిగిందో, ఎలా కలిగిందో చెప్పలేను. దానికోసం ప్రత్యేకంగా కృషి చేయలేదు. చేయలేదన్నది కూడా సరికాదు. ఏదో ఒకటి రాస్తూ వుండేవాడిని. బాలేదని చించేస్తూ వుండేవాడిని. ఏదైనా కథ మొదలు పెట్టి బాలేకపోతే... పక్కనపెట్టి మరలా రెండు రోజులు ఆగి, తరచి చూసుకుని, నాకు నేను విశ్లేషించుకుని, ఆలోచించుకుని తిరిగి రాసేవాడిని.
వైఎల్పీ: మీరు రాయటం అటుంచితే... మీకు తెలుగు సాహిత్యంపై ఇష్టం కలగటానికి భాగవత, భారత, రామాయణాలు ఎప్పుడు చదివారు? అసలు ఆసక్తి ఎలా కలిగింది.?
జికెఎం: భారత, రామాయణ, భాగవతాలు చదువు కోలేదు, ఆదిలో. దీనిని సాహిత్యమే అనుకుంటే... దీనిపై అభిమానం కలగటానికి విద్యార్థి దశలో నాకున్న కొంత మంది స్నేహితులే కారణం. కథలపట్ల నా చూపు ఎప్పు డూ విచక్షణాపూర్వకంగానే వుండేది. వారు రాస్తూ వుం డేవారు. అవి ముద్రణ అవుతూండేవి.
వైఎల్పీ: విద్యార్థిగా వుండే సమయంలో మీకు తెలిసిన తెలుగు సాహిత్యంలో వున్న పత్రికలు కానీ, అప్పుడు మీకు పరిచయం వున్న లబ్ధప్రతిష్ఠులైన రచయితలు కానీ ఎవరెవరు? కొంచెం చెప్పండి.
జికెఎం: విజయనగరంలో చిన్నవాళ్లే అయినా ఎంతో మంది అప్పటికే పేరు తెచ్చుకున్న రచయితలు వుండేవారు. చిత్రగుప్త, వినోదిని అనే పత్రికలు వుండేవి. చిత్రగుప్తలో... ఇది మీ వరకూ వచ్చిందా?! అనే శీర్షిక వుండేది. వాటిని ఆసక్తిగా చదువుతూ వుండేవాడిని. విశ్వనాథ, రాయప్రోలు వంటివారితో నాకు పరిచయం లేదు. భారతి స్థాయికి వెళ్ళటానికి ముందు చదివిన పుస్తకాలు ఇవి.
వైఎల్పీ: మీకు శ్రీశ్రీని పరిచయం చేసింది పురిపండా...
జికెఎం: కాదు.
వైఎల్పీ: మీకు పురిపండా, శ్రీశ్రీ, బాపూ... ఇలా ఎంతో మందితో పరిచయాలున్నాయి కదా! ఆ పరిచయాల గురించి చెపుతారా?.
జికెఎం: వారి పరిచయాలన్నీ తరువాత కలిగినవే. నాకు ఎవ్వరితోనూ వ్యక్తిగత పరిచయాలు లేవు. శ్రీశ్రీ, బాపూ తదితరులతో నాకు ఇక్కడ వుండగా పరిచయాలు లేవు. లండన్ కు వెళ్ళిన తరువాతే. అమ్మాయి జ్యోతి ఏడాది పిల్ల అప్పుడు (పక్కన ఆయన శ్రీమతి అందించారు)... 1962లో వెళ్ళాను.
వైఎల్పీ: ఇద్దరు పిల్లలు, భార్య... వారిని వదిలిపెట్టి లండన్ ఎందుకు వెళ్ళారు?
జికెఎం: విజయనగరంలో హైస్కూల్ చదువు అయిపోయిన తరువాత కాలేజీ చదువుకోసం విశాఖ వచ్చాను. ఫైనలియర్ లో ఓ ఆంగ్ల రచయిత పేరు విన్నాను. కొత్త పేరు, అప్పటికి ఆయన రచనలు ఏమీ చదవలేదు. ఆ సమయంలో ఇంగ్లీషు నాటకం రాస్తున్నాను. దాని పేరు డార్క్ రీ యూనియన్. అన్నీ సిద్ధంగా వున్నాయి. అది ఓ ఆర్టిస్టు గురించి. కొన్ని సాంకేతిక పదాలు తెలుసుకోవాల్సి వుంది. గార్డెన్ ఉడ్ రాఫ్ అనే ఇంగ్లీషు కంపెనీ వుంది. అందులో ఓ గ్రీకు ఆర్టిస్టు వున్నాడు. ఇంగ్లీషు లో మాట్లాడతాడు, చదువుతాడు. వైజాగ్ లైట్ హౌస్ వద్ద ఓ బంగళాలో వుండేవాడు. నా సమస్య చెప్పాను. డోంట్ వర్రీ నేను చేయగలిగిన సాయం చేస్తానన్నాడు. ఇదంతా ఒక్క రోజులో జరిగింది కాదు. కొన్ని విషయాలు తెలిశాయి. అది క్రిస్మస్ టైమ్ కావటంతో ఆయన తల్లిదండ్రులు వచ్చారు గ్రీస్ నుంచి. ఆమె నన్ను చూసి చాలా ఇంప్రస్ అయ్యింది.
వైఎల్పీ: మిమ్మల్ని చూశా... మీ నాటకం చూశా! (చిన్న నవ్వు)
జికెఎం: నన్ను చూసే. నా నాటకం అప్పటికి ఆమె చదవనేలేదు. ఫైనలియర్ అయిపోయిన తరువాత నీవేం చేయాలను కుంటున్నావు? అంటూ ఆవిడ ఓ రోజు అడిగారు. మరో యాంబిషన్ ఏమీలేదు, లెక్చరర్ గా ఉద్యోగంలో చేరిపోతాను అన్నాను. ఇప్పటి వరకూ చదివిందే చాలా కష్టం. ఇంకా కొనసాగించే ఆర్థిక స్థోమత లేదు అన్నాను. అప్పుడే ఉద్యోగ మా!? ఇంకా నీకా వయస్సు రాలేదు. కావలసింది ఆర్థిక స్థోమత కాదు. నిబద్ధత. ఏదైనా చేయాలన్న పట్టుదల. అం తే అన్నారు. ఈ కబర్లు కేమిలే చాలామంది చెపుతారు. సాయం చేసేవాళ్ళా ఏమైనానా అనుకుంటూ తేలిగ్గా తీసుకున్నా.
వైఎల్పీ: ఓ గ్రీసు మహిళ చెప్పినా మీరు పట్టించుకోలేదు...
జికెఎం: లేదు. అప్పుడే ఆవిడ, ఫ్రాన్సిస్ థాంమ్సన్ కవిత్వం పై పరిశోధన చేయచ్చు కదా? అంటూ ఆమె అడిగారు. ఫ్రాన్సిస్ థాంమ్సన్ ఎవరు? అని అడిగాను. హో.... షేమ్ ఆన్ యు... హావన్ట్ యు రెడ్ ఫ్రాన్సిస్ థాంమ్సన్? ది మాన్ హూ రోట్ ఆఫ్ ''ది హౌండ్ ఆఫ్ హెవెన్'' అన్నారు. ఈ చర్చ అయిన తరువాత ఫ్రాన్సిస్ థాంమ్సన్ గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో ఎయు లైబ్రేరియన్ అబ్బూరి రామకృష్ణారావుగారిని అడిగాను. ఆయనతో పరిచయం, చ నువు కూడా సాహితీ పరిచయమే. అబ్బూరి కూడా చాలా మంచి రచయిత. కొత్తగా రచనలు చేస్తున్నవారు ఎంతో మం ది ఆయన దగ్గర సలహాల కోసం వస్తూండేవారు. చర్చోపచర్చలు సాగేవి. అలా నేనూ కలవడం జరిగింది. ఆయనను నే ను అడిగాను ఎవరీ ఫ్రాన్సిస్ థాంప్సన్ అని అడిగాను. ఆయన చాలా పెద్ద రచయిత, ఆయన పుస్తకాలు కూడా మన లైబ్రరీలో వున్నాయని ఆయన చెప్పారు. ఆయన రాసినటువంటివి అట్టే లేవు. వాటిని చదివాను కానీ... నాకు నచ్చలేదు.
వైఎల్పీ: మీ మొదటి ప్రచురణ గుర్తుందా?
జికెఎం: తెలుగు, ఇంగ్లీషులలో రాసిన రచనలు యూనివర్శిటీ మ్యాగజైన్ లో ప్రచురుణ అయ్యేవి. నాకు గుర్తున్నంత వరకూ మొదటి ప్రచురణ 'చీడపురుగు'. అది ఓ యదార్థగాథ. రచయిత పేరు లేకుండానే పబ్లిష్ అయ్యింది. నేను అలా ఇవ్వలేదు. అలా జరిగింది అంతే. దీనిని అడ్వాంటేజ్ గా తీసుకుని ఒకరిద్దరు రచయితలు దానినే తిరిగి వేరే పత్రికలకు పంపించారు. ఇచ్ఛాపురపు జగన్నాథరావు. అప్పటికే చాలా పేరు తెచ్చుకున్నాడు. ఆనర్స్ స్టూడెంట్. అప్పటికే కథలు కొన్ని ప్రచురించాడు. బి వి కె రాఘవాచార్యులు... మాకు ఇంగ్లీషు టీచర్లలో ఒకరు. ఆయనకు నా రాతలను చదివి వినిపించే వాడిని. ఆయన ఒక రోజు నీ కథను ఎవరో కొట్టేశారయ్యా అంటూ చెప్పారు. 'చీకటి ప్రేమ' అన్న పేరుతో ఇచ్ఛాపురపు జగన్నాథరావు వేరో మ్యాగజైన్ లో ప్రచురించారు.
వైఎల్పీ: చదువు అయిన తరువాత లండన్ కు వెళ్ళారా?
జికెఎం: లేదు. ఫైనలియర్ అయిన తరువాత ఉద్యోగంలో చేరాను. నా మొదటి ఉద్యోగం అమలాపురం ఎస్ కె బి వి ఎన్ కాలేజిలో... అస్తి గోదావరీ తీరే... నా బెంగాలీ మిత్రుడు ఒకరు రాసిన కవిత నాకు వినిపించాడు. 1955 నుంచి 1958 వరకూ అక్కడే పనిచేశాను. అక్కడ పనిచేస్తుంగానే... 1957లో వివాహమయ్యింది. అక్కడ నుంచి మధ్యప్రదేశ్ బిలాస్ పూర్ కు వెళ్ళాను.
వైఎల్పీ: అమలాపురం నుంచి బిలాస్ పూర్ ఎందుకు వెళ్ళారు? ఇక్కడా ఉపాధ్యాయ వృత్తే... అక్కడా అదే కదా?!
జికెఎం: దరిద్రమేమిటంటే అనుకోకుండా నాకు అమలాపురం లో మంచి పేరు వచ్చింది. అప్పటికే అక్కడ ప్రిన్సిపల్ తో సహా ఆరుగురు ఆంగ్ల అధ్యాపకులు వున్నారు. అంతమంది వున్నా... నా పాపులారీటీ పెరిగింది. ప్రారంభంలో ప్రిన్సిపల్ నన్ను నెత్తిన పెట్టుకున్నారు. నన్ను అక్కడ జికెఎం అనే వారు. తరగతిలో 120మంది విద్యార్థులు వుండేవారు. నాకు ఆయన కొన్ని విలువైన సూచనలు చేశారు. పాటించాను. స్టాఫ్ రూంలో కొందరు... పాఠం చెప్పేటప్పుడు విద్యార్థుల మధ్య అటూ ఇటూ నడవద్దు... ఇంకు జల్లుతారని చెప్పారు. అయితే దానిని నేను వినలేదు. ఆ మూడు ఏళ్ళలో వరుసగా జరిగిన అనేక పరిణామాలతో నన్ను తీసేశారు.
జికెఎం: ఇక్కడో విషయం చెప్పాలి. సందర్భమవునో కాదో తెలియదు. అక్కడ వుండగానే ఫ్రాన్సిస్ థాంమ్సన్ శతజయంతి సంవత్సరం వచ్చింది. నేను రాసిన వ్యాసం హిందూలో ప్రచురితమయ్యింది. నా మొట్టమొదటి ఆర్టికల్ హిందూలో. ముంబయి ఆలిండియా రేడియో నుంచి నాకు ఓ లేఖ వచ్చింది. ఆర్టికల్ ఏమైనా పంపించమని. నేను ''పాత్రికేయుడిగా ఫ్రాన్సిస్ థాంమ్సన్'' అనే ఆర్టికల్ పంపించాను. దానిని ప్రసారం చేసి, వాళ్ళ మ్యాగజైన్ ఆకాశవాణిలో హైలెట్ చేశారు. దేశవ్యాపితంగా ప్రాచుర్యం వచ్చింది. అలా ప్రారంభమైన థాంమ్సన్ పై ఇష్టం మెల్లగా పెరిగింది. అది బిలాస్ పూర్ వెళ్ళిన తరువాత కూడా కొనసాగింది. ఆయన పుస్తకాల కోసం బోలెడు డబ్బు వేచ్చించేవాడిని. ఇంగ్లాండ్ నుంచి తెప్పించుకునే వాడిని. అయితే ఇంకా చదవాల్సిన పుస్తకాలు బోలెడన్ని. ఇలా కాదు, లండన్ వెళ్ళి అక్కడే ఏదో చిన్న ఉద్యోగం చూసుకుని పరిశోధన కనొసాగిస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చాను. అప్పుడు నేను పుస్తకాలు కొనే టైమ్స్ బుక్ షాపు మేనేజర్ కు ఉత్తరం రాశాను. నా కోర్కెను చెప్పాను. ఆ మేనేజర్ ఎడ్జ్ లే. ''గొప్ప ఆలోచన. అయితే నేను తగిన సాయం చేయలేనేమోనని భయపడుతున్నాను'' అంటూనే, వారానికి తొమ్మది పౌండ్లు ఇస్తానని వ్రాశాడు. అది సరిపోతుందో లేదో తెలియదు. అదే వ్రాశాను. నా శరీరాన్ని, మనస్సును కలిపి వుంచేందుకు సరిపోతుందా? అన్న నా ప్రశ్నకు అది నీ జీవనశైలిపై ఆధారపడి వుంటుందని చెప్పాడు. ఆ వాక్యాల మధ్య అర్ధాన్ని చదువుకున్నాను. లండన్ వెళ్ళగానే టైమ్స్ రియర్ బుక్ షాపులో ఉద్యోగం. కొద్ది కాలానికే టైమ్స్ పత్రికకు బదిలీ చేశారు. అక్కడ సండే పత్రికకు రివ్యూల కోసం నాకిచ్చిన జాబితాలో నుంచి పేర్లను ఎంపిక చేసుకుని, వారి నుంచి సమీక్షలు తెప్పించుకోవాలి. అక్కడ రెండేళ్ళు పనిచేశాను. అక్కడ నుంచి టీచింగ్ లోకి వెళ్ళాను. ఇంగ్లాండ్ ఎడ్యుకేషనల్ సర్వీసులో చేరాను. లండన్ లో మెట్రిక్ స్థాయిలో ఆంగ్లాన్ని బోధించే అవకాశం దొరికిన మొట్టమొదటి భారతీయుడిని నేను.
వైఎల్పీ: మిమ్మల్ని పిల్లలు ఎలా రిసీవ్ చేసుకున్నారు?
జికెఎం: ఇబ్బందులు వున్నాయి. ఎంత చదువుకున్నా... ఉచ్ఛారణ తేడా వుంటుంది. ఉదాహరణకు మనం సైప్రస్ అంటాం. అదే అంటే వాళ్ళు నవ్వారు. అది సైప్రస్ కాదు... సిప్రస్ అని చెప్పారు. ఇలాంటివే. అక్కడ ఉపాధ్యాయులు నాకు ఎంతగానో సహకరించారు.
వైఎల్పీ: మీ పరిశోధన ఎప్పుడు పూర్తయ్యింది?
జికెఎం: సాగర్ యూనివర్శిటీలో పరిశోధన మొదలుపెట్టాను. ఇంగ్లాండ్ 1962లో వెళ్ళాను. 1964లో నా పరిశోధన పూర్తయ్యింది. లండన్ లో సెటిల్ అవటానికి కారణం... భారతదేశంలో తగిన అవకాశాలు లేవని భావించాను. ఆ క్రమంలోనే ఇక్కడే కొనసాగాలని నిర్ణయించుకున్నాను. 1964లో వైవాకి వెళ్ళాలి.''థీసిస్ ను ఆమోదించాం, వైవాకి రావాలి'' అని పిలిచారు. సమాధానంగా ''మీరు పిలిచినందుకు ధన్యవాదాలు. అయితే నాకు ఇండియాకు రావటానికి ప్రయణఖర్చులు చాలా అవుతాయి. అప్పటికే తగిన అనుభవం వున్న వారిని వైవానుంచి మినహాయించవచ్చన్న నిబంధన మీకు వుంది కదా? అయినా, మీరు ఖర్చులు ఇస్తే వస్తాను అంటూ రాశాను.
వైఎల్పీ: మీకు మీథోపరమైన అహకారం మొదటి నుంచీ వుంది...
జికెఎం: చిరు దరహాసం...

వైఎల్పీ: తరువాత....
జికెఎం: వైవా నుంచి యూనివర్శిటీ మినహాయింపు ఇచ్చింది. అలా 1964లో డాక్టరేట్ వచ్చింది.

వైఎల్పీ: అప్పటి వరకూ జికెఎంగా వున్న మీరు డాక్టర్ జికెఎం అయ్యారు!
జికెఎం: యస్... అవును...
వైఎల్పీ: భార్య, పిల్లలను వదిలేసి మీరు ఇంగ్లాండలో...
జికెఎం: 'నీవు చెప్పు రమణా' అంటూ తన సహచరి వైపు చూశారు...
రమణ(జికెఎం జీవిత సహచరి): నేనూ వెళ్ళాను, అక్కడ కెమిస్ట్రీలో పిహెచ్ డి చేద్దామని. అక్కడ బెడ్ ఫర్డ్ విమెన్స్ కాలేజీలో చేరాను. అయితే అక్కడ దుస్తులు సమస్యగా మారాయి. నాకు బిపి, షుగర్ ప్రారంభమయ్యాయి. వైద్యులు మీకు ఇక్కడ వాతావరణం పడలేదు. ముందు ఇండియా వెళ్ళిపోండి. అక్కడకు వెళ్లిన తరువాత ట్రీట్ మెంట్ గురించి ఆలోచిద్దామన్నారు. అలా ఓ ఏడాది తరువాత తిరిగి వచ్చేశాను. ఆ తరువాత సంవత్సరానికే ఈయన అమెరికా వెళ్ళారు. బోస్టన్లో వాతావరణ బాగుంది, ఇక్కడ పిహెచ్ డి చేద్దువుగాని, రమ్మని అని అంటే మరలా వెళ్లాను. పిహెచ్ డి కోసమే వెళ్ళాను. ఈయన కోసం కాదు (సన్నని నవ్వు). అక్కడే చిన్నాడు కడుపులో పడ్డాడు. నాకు విపరీతమైన మార్నింగ్ సిక్ నెస్... చదువుకు దణ్ణంపెట్టేశాను. చిన్నాడు అక్కడే పుట్టాడు. ఆ తరువాత ఏడాదికి ఆయన ఇంగ్లాడు వెళ్లిపోయారు. నేను ఇండియా వచ్చేశాను.
వైఎల్పీ: మీరు బోస్టన్ లో ఏం చేశారు?
జికెఎం: అక్కడ కాలేజీలో ఇంగ్లీష్ టీచ్ చేశాను. అక్కడ అనేక భాషల్లో పీహెచ్ డిలు చేస్తున్నారు. అక్కడ నేను ఓ కొత్త సబ్జక్ట్ ను ఇంట్రడ్యూస్ చేశాను నా టీచింగ్ ప్రోగ్రామ్ లో. ఎయులో నా ఉపాధ్యాయులు కె శ్రీనివాస అయ్యంగారిని స్ఫూర్తిగా తీసుకుని బ్రిడ్జివాటర్ స్టెయిట్ కాలేజీలో ఇండో ఆంగ్లియన్ లిటరేచర్ ను ఇంట్రడ్యూస్ చేశాను. అప్పుడే శాంకుతలను వారికి పరిచయం చేశాను. ఆ క్రమంలోనే కర్రీ కాన్ఫరెన్సెస్ పేరుతో ప్రారంభించిన కొత్త కార్యక్రమంలో భారతీయ సాహిత్యంలో నిర్థిష్ట అంశాలపై నిష్ఠాతులను ఆహ్వానించి ఉపన్యాసాలు ఇప్పించాను. మూడేళ్లు బ్రిడ్జివాటర్ లో వున్నాను. నాకు ఇమిగ్రేషన్ దొరక్కపోవటంతో తిరిగి ఇంగ్లాండ్ వచ్చేశాను. అమెరికాలో వున్నప్పుడే రెండుదేశాలలోని యూనివర్శిటీల మధ్య పరిశోధనలలో సహకారం అందించుకోవటానికి ఒప్పందాలు కుదర్చటానికి ప్రయత్నించాను. అయితే మన విశ్వవిద్యాలయాల నుంచి స్పందన లేకపోయింది.
వైఎల్పీ: శ్రీశ్రీని, పురిపండాను ఇంగ్లాండ్ తీసుకువెళ్ళాలని మీకు ఎందుకు అనిపించింది? విన్నూత్నంగా ఆయన చేవ్రాతతో, ఆయన వాయిస్ తో మహాప్రస్థానాన్ని విడుదల చేయాలని ఎందకు అనుకున్నారు?
జికెఎం: ఇట్స్ వెరీ సింపుల్... బట్ ఇట్స్ డిఫికల్ట్ టు ఎక్స్ ప్లెయిన్. చేస్తాను. విదేశాంధ్ర పబ్లికేషన్స్ ను ప్రారంభించాను. పురిపండా పులిపంజాను ప్రచురించానికి పూర్వమే 15ఏళ్లుగా నేనాయన్ను ఎరుగుదును. అతను చాలా పుస్తకాలు రాశాడు. వాటిలో ఎక్కువ భాగం క్లాసిక్స్ యొక్క గద్యభాగాలే. ఎంతో పేరు వచ్చింది. ఆయన మంచి కవికూడా. అయితే వాటిని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఓ సారి విశాఖలో కలిసినప్పుడు మాటల సందర్భంలో నా కవిత్వాన్ని ఎవరైనా ప్రచురిస్తే మహదానందంగా వుంటుందన్నాడు. పబ్లిషరే చేయాలా? ఎవరు చేసినా ఫర్వాలేదా? అని అడిగాను. ఎవరు చేసినా ఫర్వాలేదన్నారు. అనుకోకుండా... నేను వెంటనే అయితే మనమే చేశాద్దామన్నాను. అన్నాను కాబట్టి పబ్లికేషన్స్ కోసం ఓ పేరును ఆలోచించాల్సి వచ్చింది. ఆ క్రమంలో వచ్చిందే... విదేశాంధ్ర పబ్లికేషన్స్. దాని మొట్టమొదటి ప్రచురణ పురిపండా రచన పులిపంజా.
వైఎల్పీ: మరి శ్రీశ్రీ పుస్తకం వేయాలని ఎందుకు అనిపించింది?
జికెఎం: 1953లో నేను ఇంకా స్టూడెంట్ ను. థాంప్సన్ ఫ్రాన్సిస్ ది హౌండ్ ఆఫ్ హెవెన్ కవితను తెలుగులోకి ఎవరన్నా అనువాదం చేస్తే బాగుటుంది అనిపించింది. దీనిని చేయదలిస్తే... శ్రీశ్రీ ఒక్కరే చేయగలరని అనిపించింది. ఆయన ఒక సారి ఆంధ్ర యూనివర్శిటీకి వచ్చారు. అప్పటి వరకూ ఆయనను నేను కలవలేదు. ఆ రోజు ఆయనను కలవాలని కోరికపుట్టింది. ధైర్యం చాలలేదు. అప్పటికే ఆయన చాలా పెద్దవాడు. ఆయన ఎక్కుతున్న బండికి స్టేషన్ కు వెళ్ళాను. అది విశాఖ నుంచే బయలుదేరుతుంది. ఈ రోజుల్లో గోదావరి లాంటి రైలు. అతను ఇంటర్ క్లాస్ టిక్కెట్ కొనుకున్నారు. అటూ ఇటూ పచార్లు చేస్తున్నాను. చివరికి ధైర్యం చేసి వెళ్ళాను. పరిచయం చేసుకున్నాను. ''మీ ఉపన్యాసం బాగుందని చెప్పటానికి నేనేపాటి. ఇంతటి ప్రతిభ వున్న మీ నుంచి ఇంకా ఏదో మంచి కవిత్వ రావాలని వుందండీ... ఏం రాద్దామనుకుంటున్నారు?'' అన్నాను. అతను చటుక్కున ''ఏం నేను రాసినవేవీ నచ్చలేదా?'' అని అడిగారు. అటువంటి ఉద్దేశ్యం నాకేమీ లేదండి అన్నాను. అంటే...నేను రాసిన వాటికంటే ఇంకేమైనా మంచిది రాయాలని మీ కోరికా?! అన్నాడు. అవునండీ, అయితే ఏమి రాయాలన్నది నాకు తెలియదు అన్నాను. దానికి ఆయన ఓ పీలర్ వదిలిపెట్టాడు. అటువంటిదేమైనా మీకు జ్ఞాపకం వస్తే చెప్పండి... చూద్దాం అన్నాడు. అదే మూలం. అంతే, ఆ తరువాత ఆయనతో కాంటాక్ట్ లేదు. 
ఆ తరువాత లండన్ నుంచి ఓ సారి విశాఖకు వచ్చినప్పుడు మద్రాసు వెళ్ళి పబ్లిషర్ ఎం ఎన్ రావును కాలవాలని అనుకున్నాను. అప్పటికే బాపూ తదితరులుతో పరిచయం ఏర్పడింది. ఎటూ అక్కడి వరకూ వెళుతున్నాను కదా, శ్రీశ్రీని కూడా కలిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. అప్పుడు పురిపండాను అడిగాను. ఆయన తప్పకుండా వస్తాను, అయితే ఆయన ఏం జవాబిస్తాడో? ఎం చెపుతాడో? తెలియదు, నా ప్రయత్నం నేను చేస్తానన్నాడు. ఎం ఎన్ రావు స్టేషన్ కు వచ్చి మమ్మల్నిద్దరినీ తీసుకుని వెళ్ళారు. నేరుగా వారి ఇంటికి తీసుకుని వెళ్ళారు. అక్కడ నుంచి శ్రీశ్రీ ఇంటికి వెళ్ళాం. ఆ రోజు అక్కడే భోజనం. శ్రీశ్రీ భార్య పెరుగు వడ, పులిహోర చేశారు. మాటల్లో నేను మీరు చేయవలసిన ఓ గొప్ప పని ఒకటి వుంది, అది అనువాదం అన్నాను. ఫ్రాన్సిస్ థాంమ్సన్ అని నేను అనగానే... 'ది హౌండ్ ఆఫ్ హెవెనా?' అంటూ ఆయన అడిగారు. అవునండీ... అది మీరు తప్పించి ఎవ్వరూ చేయలేరని గొప్ప నమ్మకమని అన్నాను. దానికి ఆయన అది ఎంత కష్టమో మీకు తెలుసుకదండీ అన్నాడు. నేను, బాగా తెలుసండీ అన్నాను. ప్రత్యేకించి చివరి వాక్యం అన్నాను. మా ఇద్దరి మధ్యా సాగిన ఆ సంభాషణే ఆయన ఆమోదం. 
వైఎల్పీ: శ్రీశ్రీని అప్పుడు ఇంగ్లాండ్ పిలిచారా?
జికెఎం: నేను పిలవలేదు. మీరు రాసి ఇస్తే... దానిని ప్రచురిస్తాను. మీ రాయల్టీ ఎంతో చెపితే నేను పే చేస్తాను అన్నాను. దానికి ఆయన, చాలా మంది రచనలు ప్రచురించి రాయల్టీ ఇస్తామని చెప్పినవారే... కాని ఎవ్వరూ ఇవ్వలేదు. నేను ఎదగటానికి ఆంగ్ల సాహిత్య అధ్యయనం ఎంతగానో దోహదపడింది. అంతగా ఉపకరించిన ఆ సాహిత్య జన్మస్థానమైన ఆ దేశాన్ని ఒక్కసారి చూడాలని వుందని అన్నారు. తప్పకుండా... నేను ప్రయత్నం చేస్తాను. అయినప్పుడు అవుతుంది. ఎప్పుడు అనేది నేను ఖచ్చితంగా చెప్పలేనని అన్నాను.
వైఎల్పీ: శ్రీశ్రీ ఇంగ్లాండు ప్రయాణానికి అలా బీజం పడిందన్నమాట.
జికెఎం: మా మధ్య ఉత్తరాలు నడుస్తున్నాయి. ఓసారి శ్రీశ్రీ ఉత్తరం రాశాడు. అందులో... ఈ వయస్సులో నా చేతికర్ర నా భార్యే. ఆమె లేకుండా నేను రాలేనని వ్రాశారు. ఆలోచించాను. డబ్బులు ఎక్కువై, కొవ్వెక్కువై తీసుకుని రమ్మనలేదు. శ్రీశ్రీని, పురిపండాని తీసుకువచ్చినప్పుడు వారికి వండిపెట్టేదెవరూ?.. నేను వారిద్దరికీ వండిపెడుతూ, ఊరూరు చూపిస్తూ, నా లిటరరీ ఉద్యోగం చేసుకోవటం... చేయగలనా నేను?. చేయలేను. అంచేత ఎస్ అనటమే మంచదని అనుకున్నాను. అందుకు తగ్గట్టుగానే ఆవిడ ఏ లోపమూ చేయకుండా చేయవలసిన పనంతా చేసింది. అందులో ఎక్కువ డిమాండ్ చేసింది పురిపండావే. శ్రీశ్రీకి డిమాండ్లు ఏమీ లేవు.

 వైఎల్పీ: అక్కడ ఆయనతో మీ అనుభవాలు చెపుతారా?
జికెఎం: నాన్నగారు ఇంటికి వచ్చేటప్పటికి కొడుకు తాను చేసిన హోం వర్కు ను చూపించినట్లుగా... నా ఉద్యోగానికి నేను వెళ్ళి వచ్చేసరికి ఆ రోజు చేసిన అనువాదాలను నాకు చూపించేవాడు శ్రీశ్రీ. నేను అంతటి వాడిని ఇంతటి వాడినని ఎవరు ఏమనుకున్నా... ఫ్రాన్సిస్ థాంమ్సన్ కు సంబంధించినంత వరకూ ఎ టు జడ్ మీరేకదండీ అంటూండేవాడు. చూపిస్తూండేవాడు. అప్పుడప్పుడూ కొన్ని మార్పులు చూపిస్తూండేవాడిని. ఓ చోట ఆయన షిప్రంగా అని వాడారు. చాలా బాగుందండీ, అయితే ఇది ఎంతమందికి అర్థమవుతుంది అన్నాను. రాత్రికి దానిని మార్చాను 'వున్నాపాటుగా' అని. మర్నాడు చదివి వినిపించాను. భుజం మీద చేయి వేసి బ్రిలియంట్... బ్రిలియంట్ అన్నాడు. 
వైఎల్పీ: మహాప్రస్థానాన్ని ఆయన చేత రాయించాలని, ఆయన గొంతుతో వినిపించాలని ఎట్లా అనిపించింది? ఎప్పుడు కోరిక కలిగింది?
జికెంఎ: మనకు కాళిదాసు వున్నాడు... మరొకరు, మరొకరు వున్నారు. ఎవరి గొంతుక ఎలా వుంటుందో తెలియదు. ఎవడి చే వ్రాత ఎలా వుంటుందో ఎవడికీ తెలియదు. ఎన్ని భాషల్లో ఎంతో మంది రచయితలు వున్నారు. షేక్స్ పియర్, మిల్టన్, షెల్లీ, కీన్స్... ఎవో ఉదాహరణలు వున్నాయి కానీ, రచనలు లేవు. బ్రిలియంట్ అనుకున్నాను. ఇది చేస్తే దానికో ప్రత్యేకత వస్తుందని అనుకున్నాను.
వైఎల్పీ: ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ప్రపంచ సాహిత్య చరిత్రలో ఒక రచయిత తన స్వదూస్తూరితో కవిత రాసి ప్రచురించటం, తన స్వంత గొంతుకతో ఆలపించటం... మొట్టమొదటి ప్రయోగం. అది శ్రీశ్రీకి దక్కింది. ఆ గౌరవాన్ని కల్పించింది గూటాల కృష్ణమూర్తి.
జికెఎం: అలా అనుకుంటే అనుకోవచ్చు. ఓ విమర్శకుడు... ఇది మొదటిది అనటం సరికాదు. డెల్లన్ థామస్ వున్నాడు కదా అంటూ రాశాడు. అయితే డెల్లన్ థామస్ గొంతును ఓ సమావేశంలో రికార్డు చేసి విడుదల చేసింది. రాసేటప్పుడు రికార్డు చేసింది కాదు.
వైఎల్పీ: మరి పురిపండా నాది కూడా చేయాలని అడగలేదా?!
జికెంఎ: అది వేరే సందర్భం. అతని కవితలు ప్రచురణ కానప్పుడు ప్రచురించింది. విదేశాంధ్ర పబ్లికేషన్స్ పేరుతో ప్రచురించాం. శ్రీశ్రీ పుస్తకానికి ఏ మాత్రం తక్కువ కాకూదని చేసింది. ప్రత్యేకంగా ఓ వంద కాపీలను ఆయన స్వదస్తూరీతో, ఆయన సంతకంతో విడుదల చేశాము. ఓ వంద కాపీలను ఆయన గొంతుకతో విడుదల చేశాను. it is not an improvement over sri sri.
వైఎల్పీ: సూర్యకుమారిగారి మీద పుస్తకం వేయాలని ఎందుకు అనిపించింది మీకు.?
జికెఎం: దానికి ప్రత్యేక కారణమేమీ లేదు. సూర్యకుమారి పుస్తకం వేయటానికి చాలా కష్టపడ్డాను. జీవితం అంతాకూడా ఆవిడ త్యాగం చేసింది. కష్టపడింది. ఆవిడ ఫేమస్ కావటానికి ముందు ఎంత పెద్ద ఆర్టిస్టో అందరికీ తెలుసు. అంతటి స్థితిలో కూడా సర్వస్వాన్నీ త్యాగం చేసి పనిచేయటం ప్రారంభించింది. అందుకనే ఆ పుస్తకం వేశాను.
వైఎల్పీ: గాంధీ చదువుకున్న కాలేజీ ఫీజు రశీరు సాలార్ జంగ్ మ్యూజియంకు ఇచ్చారని తెలిసింది. అది మీకు ఎలా వచ్చింది?
జికెఎం: అదీ... ప్యూర్ ఛాన్స్. నేను ఏదన్నా రీసెర్చ్ చేస్తే సమగ్రంగా చేసేవాడిని. నేను ఏదో రిసెర్చ్ చేస్తున్నప్పుడు గాంధీ అన్న పేరు కనపడింది. దానిని మరింత లోతుగా శోధిస్తే.. ఎం కె గాంధీ అని వుంది. చిరునామా... వెజిటేరియన్ సొసైటీ అని వుంది. రెగ్యులర్ స్టూడెంట్ కాదు. దేనిలో వీక్ గా వున్నారో దానినే చదువుకునే అవకాశం వుంది. గాంధీ ఇంగ్లీషులో వీక్ గా వుండేవాడు. ఆయన ఆ సబ్జెక్ట్ లో యూనివర్శిటీ కాలేజిలో చదువుకున్నారు. అలా దొరికింది. సాలార్ జంగ్ మ్యూజియంకు నేను స్వయంగా ఇవ్వలేదు. ఓ మారు విశాఖ వెళ్లినప్పుడు... ఆంధ్రభూమి ప్రతినిథి సన్నిధానం (పూర్తి పేరు కోసం ప్రయత్నించి విఫలమయ్యారు) ఆఫీసుకు వెళ్ళి అతనికి ఇచ్చాను.
వైఎల్పీ: మీ రచన జుబ్బాలేని అబ్బాయి... పూర్తయ్యిందా?
జికెఎం: అయిపోయింది. చక్కటి నవల. అయితే ఎందుకు ప్రచురించలేదంటే... అదృష్టం కలిసి రాలేదు.
వైఎల్పీ: ఆంగ్ల రచయితలకు వచ్చిన పేరు ప్రతిష్ఠలు మన వాళ్ళకు ఎందుకు రావటం లేదు. సామర్థ్యం లేకా? లేక పట్టించుకోక?
జికెఎం: ఆ దిశగా మనవాళ్ళు దృష్టి పెట్టకపోవటమే.
వైఎల్పీ: రవీంద్రుని తరువాత ఎవ్వరికీ నోబెల్ రాకపోవటానికి కారణం స్థాయి లేకపోవటమా? ప్రయత్నం చేయకపోవటమా?
జికెంఎ: వుంటే అది దాగదు. అదే బయటకు వస్తుంది.
వైఎల్పీ: 1890లోని ఆంగ్ల రచయితల గురించి మీరు విస్తృతంగా అధ్యయనం చేశారు. ప్రచారం చేశారు. ఆ బాధ్యతను మీరు ఎందుకు తీసుకున్నారు?
జికెఎం: గతంలో వచ్చిన సాహిత్యానికి పూర్తి భిన్న మైన సరికొత్త ఆలోచనలతో వచ్చిన సాహిత్యం అది. భాషలో కూడా కొత్తపుంతలు తొక్కింది. మరే దశకంలో అంత కొత్తదనాన్ని ఆంగ్ల సాహిత్యం స్పృశించిన సందర్భం లేదు. అలాగే ప్రపంచంలోని వివిధ భాషల్లోని సాహిత్యం ఆ దశకంలో ఆంగ్లంలోకి అనువాదమైనంతగా గతంలో ఎన్నడూ కాకపోవటం మరో ప్రత్యేకత.
రాత: సతీష్ బాబు చిగురుపాటి
బొమ్మలు: వై రామకృష్ణ

21, మార్చి 2015, శనివారం

మావోయిస్టు కోటను దత్తత తీసుకున్న పోలీస్

విశాఖ ఏజెన్సీ బలపం పంచాయతీ మావోయిస్టులకు పెట్టని కోట. నిత్యం మావోయిస్టుల రాకపోకలు సాగే ఈ ప్రాంతంలో పోలీసులు, పారామిలటరీ బలగాలు కాలుపెట్టడం ప్రయాసతో కూడిన వ్యవహారం. అలాంటి ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్ దత్తత తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మొట్టమొదటి సారిగా ఓ జిల్లా ఎస్పీ రోడ్డు మార్గంలో బలపం పంచాయతీ, కోరుకొండ గ్రామానికి వెళ్ళారు. మావోయిస్టులను ఎదుర్కోవటానికి పోలీసులు తీసుకున్న సరికొత్త పంథాపై కథనం...

విశాఖ జిల్లా ఏజెన్సీలోని చింతపల్లి మండలంలో బలపం పంచాయతీ మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతం. పంచాయతీలోని 32 గ్రామాలలో అత్యధిక గ్రామాలలో మావోయిస్టు మిలీషియా చురుకుగా పనిచేస్తోంది. మావోయిస్టు గ్రామ కమిటీలు పనిచేస్తున్నాయన్న విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులూ అన్యాపదేశంగా అంగీకరిస్తున్న అంశం. ఈ మధ్య కాలంలో గెమ్మెల సంజీవరావును మావోయిస్టులు చంపటం... మావోయిస్టుల చర్యతో తక్షణాగ్రహానికి గురైన వీరవరం గ్రామస్తులు తిరగబడి మావోయిస్టు నేత శరత్, గణపతిలను చంపేసిన ఘటన చోటు చేసుకున్నదీ ఈ పంచాయతీలోని కోరుకొండ గ్రామంలోనే. 32 గ్రామాల ప్రజలూ ప్రతీ ఆదివారం నిత్యావసర వస్తువుల కొనుగోళ్ళ కోసం వచ్చే సంతబయలు వున్నదీ ఈ కోరుకొండ గ్రామంలోనే. ఇప్పుడు ఈ ప్రాంతంలో పాగా వేయటానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నగరాలలోని వార్డులను, గ్రామాలను దత్తత తీసుకోవటానికి అందరూ ముందుకు రావాలని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ దిశగా ఓ అడుగు ముందుకు వేసి అరకు వ్యాలీని దత్తత తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అదే బాటన సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవ్వరూ వెళ్ళటానికి కూడా సాహసించని బలపం పంచాయతీలోని 32 గ్రామాలను దత్తత తీసుకోవాలని జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ నిర్ణయించుకున్నారు. ఏజెన్సీలోని ప్రజలకు దగ్గర కావటానికి సద్భావన యాత్రల పేరుతో గతంలో ప్రారంభించిన కార్యక్రమానికి కొనసాగింపుగా జిల్లా పోలీసులు సహపంక్తి భోజనాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. ఆయా గ్రామాలలో యువకులుకు వాలీబాల్స్, నెట్ లను అందించటం, మహిళలకు చీరలను ఉచితంగా పంచటం, వైద్య శిబిరాల నిర్వహణ వంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు జిల్లా ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్ సహపంక్తి భోజనాల పేరిట అత్యంత సాహసోపేతంగా రోడ్డు మార్గంలో బలపం పంచాయతీలోని కోరుకొండకు చేరుకున్నారు.

చింతపల్లి మండలంలోని లోతుగెడ్డ జంక్షన్ నుంచి పాడేరు రహదారిలో సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో లోతుగెడ్డ వంతెన వుంది. అక్కడ నుంచి లోపలికి 19కి.మీ. అత్యంత దుర్భరంగా వుండే రహదారాలో ప్రయాణిస్తే జిల్లా ఎస్పీ ప్రవీణ్ దత్తత తీసుకున్న బలపం పంచాయతీకి చేరుకుంటాం. అలాంటి ఈ గ్రామానికి ఇప్పుడు లోతుగెడ్డ జంక్షన్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని మూలకొత్తూరుకు రహదారి నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నాయి. పోలీసుల పహరా నడుమ ఈ రోడ్డు పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే గ్రావెల్ రోడ్డు పూర్తయ్యింది. ఏప్రిల్ నాటికి తారురోడ్డు పూర్తయ్యే అవకాశం వుందని అధికారులు చెపుతున్నారు. మూలకొత్తూరు నుంచి కొండవాలుల్లో సాగే ఘాట్ రోడ్డుపై మరో 11కి.మీ. ప్రయాణం చేయాలి. గ్రామ పంచాయతీ కేంద్రమైన బలపంకు వెళ్లే మార్గంలోని మావోయిస్టు స్థూపం వద్దనే గత ఏడాది డిసెంబర్ లో గమ్మెల సంజీవరావును మావోయిస్టుల చంపేశారు. ఎస్పీ ప్రవీణ్ అక్కడ ఆగి సంజీవరావుకు నివాళులర్పించారు. రెండునిమిషాలు మౌనం పాటించారు. అక్కడ నుంచి ఎస్పీ నేరుగా కోరుకొండ సంతబయలు వద్దకు చేరుకున్నారు. సంతబయలులో ఆయన ఎబిఎన్ తో మాట్లాడుతూ, బలపం పంచాయతీ ఒకటి వుందన్న విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావటం, అభివృద్ధికి ఆమడదూరాన వున్న ఈ గ్రామాలలోని ప్రజలకు రహదారి, మంచినీరు, వైద్యం, విద్యా సౌకర్యాలను అందించాలన్న లక్ష్యంతో దత్తత తీసుకున్నానని వివరించారు.

సుమారు రెండు క్రితం నుంచే దాదాపుగా 700 మంది పోలీస్, పారామిలటరీ బలగాలు ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. శనివారం నాటికే ఒఎస్డీ విశాల్ గున్ని, చింతపల్లి డిఎస్పీ రాఘవేంద్రరావు తదితర పోలీస్ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మావోయిస్టుల చేతిలో చనిపోయిన గెమ్మెల సంజీవరావు గ్రామమైన వీరవరంతో సహా పలు గ్రామాలలో ఆ అధికారులు సుడిగాలి పర్యటన చేశారు. గ్రామస్తులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారు. ఆయా గ్రామాలలో ఎంతమంది వుంటున్నారు? యువకులు ఎంతమంది వున్నారు వంటి సమాచారాన్ని సేకరించారు. ఇంత గ్రౌండ్ వర్క్ చేసుకున్న ఎస్పీ కోయ ప్రవీణ్ ఆదివారం నాడు జరిగిన సంతలో ప్రజలతో మమేకమవ్వటానికి ప్రయత్నించారు. వారితో మాట్లాడారు. సంతలో కలియతిరిగారు. గ్రామస్తులను వారి వారి సమస్యలను చెప్పమని అడిగారు. పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ, తమకు తాగటానికి మంచినీటి వసతిని కల్పించాలని డిమాండ్ చేశారు. పది కుటుంబాలు మాత్రమే వున్న గ్రామాలకు మంచినీరు ఇవ్వమని రెవెన్యూ అధికారులు చెపుతున్న తీరును ఎస్పీకి వివరించారు. మరికొందరు మాట్లాడుతూ, హుద్ హుద్ తుఫాను నష్టపరిహారం ఇప్పటికీ అందని వైనం గురించి చెప్పుకున్నారు.

బలపం పంచాయతీలోని పలుగ్రామాల ప్రజలు చెపుతున్న సమస్యలను ఎస్పీ కోయ ప్రవీణ్ ఓపికగా విన్నారు. మంచినీటి సమస్యను తీర్చాలంటే బోర్లు వేయాలని, అవి వేయాలంటే బోరు కోసే యంత్రాలు కావాలని, అవి రావాలంటే రహదారి నిర్మాణం సాగాలని ఆయన వారికి వివరించే ప్రయత్నం చేశారు. అయితే రోడ్లు వేయకుండా కొందరు ముసుగు మనుషులు అడ్డుకుంటున్నారని, రోడ్డు వేసే యంత్రాలను తగలపెడుతున్నారని, వారికి సహకరించవద్దని ఆయన గిరిజనులను కోరారు. ఈ క్రమంలోనే ఆయన పలుమార్లు మాకు రోడ్డు కావాలి అంటూ గిరిజనుల చేత పలికించారు. అదే సమయంలో మీరు కోరుకుంటే పోలీస్ స్టేషన్ కూడా మీ చెంతకు కోరుకొండ వస్తుందని ఆయన అంటూ, మీకు పోలీస్ స్టేషన్ కావాలా? అంటూ వారిని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు గిరిజనులు ఒక్కరు కూడా స్పందించలేదు. పదే పదే ఎస్పీ అడుగుతున్న వారిలో ఎలాంటి స్పందనా కనిపించలేదు. దానిని అర్థం చేసుకున్న ఎస్పీ తిరిగి రహదారి నిర్మాణం గురించి మాట్లాడి ముగించారు. ఈ సందర్భంలో ఓ గిరిజనుడు ఎబిఎన్ తో మాట్లాడుతూ, పోలీసులు పిలిచినా రావాలి... అన్నలు పిలిచినా రావాలి... లేకపోతే కష్టం సారూ... అన్న మాటలు అక్కడ కొనసాగుతున్న అప్రకటిత యుద్ధవాతావరణాన్ని మనకు పట్టిస్తుంది.

అత్యంత క్లిష్టమైన ఆ ప్రాంతానికి మూడు నెలలకొకసారైనా వస్తానని జిల్లా ఎస్పీ ప్రవీణ్ చెప్పారు. ఏజెన్సీలో గిరిజన యువతీ, యువకులకు సుమారు 1500 మందికి పారామిలటరీ బలగాలలో చేరటానికి శిక్షణ ఇస్తున్నామని, మెగా రిక్రూట్ మెంట్ క్యాంప్ పాడేరులో నిర్వహిస్తామని ఆయన చెప్పారు. మావోయిస్టుల చేస్తున్న గెరిల్లా పోరాటానికి ధీటుగా సమాధానం చెప్పటానికి కేవలం ఆయుధం మాత్రమే సరిపోదని, స్థానిక ప్రజల మనస్సుల్లో కూడా స్థానం సంపాదించుకోవాలని పోలీసులు గట్టిగానే నమ్ముతున్నట్లున్నారు. ఎస్పీ ఎంతో ధైర్యంగా బలపం పంచాయతీని దత్తత తీసుకోవటం వెనుక యుద్ధతంత్రమూ అంతర్లీనంగా వుండే వుంటుందన్న మాటల్లో చెప్పలేని ఓ మూగ అనుమానం ఆ ప్రాంత ప్రజలను వెన్నాడుతున్న ఛాయలు కనిపించాయి. సహపంక్తి భోజనాలకు రండి అంటూ పోలీసులు పిలస్తున్నా వినిపించుకోకుండా తిన్నవాళ్ళ ఫోటోలు తీస్తున్నారహే... రండి రండి అంటూ ఓ మహిళ తనవారిని తీసుకుని దూరంగా సాగిపోయింది. తుపాకులతో సహవాసం ప్రమాదమన్నది వారి జీవితం నేర్పిన అనుభవమా? ఎప్పుడో ఒక్కసారి వచ్చే పోలీసుల కోసం అన్నలకు కోపం తెప్పించటం ఎందుకన్న లోకజ్ఞానమా? ఏదైతేనేం... పోలీసులు ఓ కార్యక్రమం ముగించామనుకుంటూ ఇళ్ళదారిపడితే... అక్కడ వున్న గిరిజనం... రేపు అన్నలతో ఏం తంటా వస్తుందోనన్న భయాలోచనలతో కాలిబాటపట్టారు. ఏ మందు పాతరా పేలనందుకు, ఏ తూటా మోగనందుకు ఆనందిస్తూ మీడియా కథనాల కోసం కొండదిగి పరుగులు పెట్టింది.