28, అక్టోబర్ 2021, గురువారం

స్నాప్ చాట్

 ఇక్కడ దృశ్యం ఘనీభవించదు... 

అల విరుచుకుపడినట్టో, 

క్యుమిలోనింబస్ మేఘం కుమ్మరించినట్లో... 

అంతా రెప్పమాటునే... 

దుఃఖానందాలిక్కడ అవిభాజ్యం... 

క్షణాన్ని పొదివి పట్టుకోవడమే తప్ప 

పదిలపరుచుకోవడం ఇక్కడ నిషేధం...

8, సెప్టెంబర్ 2021, బుధవారం

మీ ఆత్మీయతను మరువలేను

 1971 ఏప్రిల్ 12న పెళ్లి జరిగింది. సంప్రదాయాలకు భిన్నంగా కూరగాయల దండలతో పెళ్లి చేసుకొన్న ఆ కుర్రాడికి 19 ఏళ్లు ఉంటాయి. ఆ అమ్మాయికి 17 ఉంటాయేమో. అమ్మాయి బాబాయి చార్వాక రామకృష్ణ. ఆయన ప్రభావమే అనుకుంటా. కొండవీటి వెంకటకవి నాటి పెళ్లి పెద్ద. ఆ రోజుల్లో ఆ అబ్బాయి దానిని అంగీకరించడం గొప్ప విషయం. 1992లో నా పెళ్లి అయిన తరువాత నాటి ఆ దంపతులు నాకు అన్నయ్య, వదిన అయ్యారు. ఆ ఇద్దరి కన్నా నేను గణనీయంగా చిన్నవాడినే. ఎందుకనో తెలియదు... ఆయన్ను నాగేశ్వరరావు గారూ అని పిలవడమే అలవాటయింది. పెళ్లైన కొత్తలో ఒంగోలు వాళ్ల ఇంటికి వెళ్లాం. అక్కడ నుంచే బైకు మీద నాగులుప్పలపాడు వెళ్లిన గుర్తు. నాటి ఆత్మీయ ఆతిథ్యం ఇప్పటికీ గుర్తే... అదే ఇప్పుడూ కొనసాగుతూ ఉంది. బహుశా ఎప్పటికీ అనుకుంటా. ఎక్కువ సార్లేమీ వెళ్లలేదు. కాని మనసుకు ఎప్పుడూ దగ్గరగా ఉండేవారు. ఫోను పలకరింపులూ నాతో కన్నా అరుణతోనే ఎక్కువే. నేను విన్న కొద్ది సందర్భాలలోనూ ఆయన వదినను ‘ఏవమ్మా...’ అంటే వదిన అన్నయ్యను ‘ఏందయ్యా...’ అనేది. ఇది ప్రకాశంలో సాధారణమేనేమో తెలియదు. మంచి స్నేహితుల్లా వాళ్లు ఎలా ఉండగలుగుతున్నారో నాకు అర్థమయ్యేది కాదు. ఆ తరువాత ఓ సందర్భంలో అన్నయ్య... ‘మా ఇద్దరికీ ఒక్క ఏడాదే తేడా. అందుకనే మంచి స్నేహితుల్లా మారిపోయాం’ అని అరుణ వాళ్లతో అంటే... ‘అది ఎలా సాధ్యమైంది?’ అని అన్నయ్యను అడుగుదామనుకున్న ప్రశ్న, సమయానికి అడగలేదు. ఇక అడగలేను ఎప్పటికీ. వదినేమైనా చెపుతుందోమో చూడాలి. వాళ్ల ఇంటిలో నాకు ఎప్పుడూ పూజలు, పునస్కారాలు కనిపించేవి కావు. దేవుడి పటాలనో, పూజ గదినో చూసిన గుర్తు లేదు. ఇద్దరు ఆడపిల్లల, ఓ అబ్బాయి. వాళ్లు పెద్దయిన తరువాత రాజీ అవసరమైందేమో... ముగ్గురు పెళ్లిళ్లూ సంప్రదాయ పద్ధతుల్లోనే జరిపించారు. విశాఖకు ఏబీఎన్ కోసం వెళ్ళిన తరువాత ఫోను తప్పితే అసలు కలవ లేదు. అంటే దాదాపు పదేళ్లు. తిరిగి విజయవాడ వచ్చిన తరువాత ఓసారి ఒంగోలు వెళ్లి వెంటనే వచ్చేశాం. ఆ తరువాత అసిత్ పెళ్లికి అందరం కలసి దాదాపుగా మూడు రోజులు గడిపాం. ‘రజని - శ్రీనివాస్’ పెళ్లి పనుల్లో భాగమయ్యారు. జమైకా నుంచి రవి రాలేకపోయిన కొరత అందరి మదిలోనూ ఉండిపోయింది. అయితేనేం మామూలు సందడి కాదు. పిల్లలు... వాళ్ల పిల్లలు... హాయిగా గడిచిపోయాయి. అవన్నీ తాజాగానే ఉన్నాయి. హఠాత్తుగా మొన్న ఆదివారం (5.9.2021) ఉదయాన్నే నిద్రలేచే సమయానికి అరుణ ఫోనులో మాట్లాడుతోంది. గొంతులో విషాదం. ఏమైందని అడిగితే... ‘‘బావ చనిపోయారు. తెల్లవారుఝామున జరిగిందంట. ఫోన్ వచ్చింది. నేను బయలుదేరి వెళతాను’’ అంది. తను వెళ్లిపోయింది. నాకు మైండ్ బ్లాంక్. ఎందుకు జరిగిందన్నది అర్థం కాలేదు. కొద్ది నెలల క్రితమే చిన్నపాటి అనారోగ్యమొస్తే... అన్ని పరీక్షలూ చేయించారు. డాక్టర్లు ఇబ్బందేమీ లేదన్నారు. మరి ఇదేంటి హఠాత్తుగా... ఇప్పటికీ ఎందుకో దిగులుగానే ఉంది. ముందు వెనుక... సహజమే కాని... ఇలా జరగడం... జీర్ణం కావడం లేదు. వదిన ఎలా తట్టుకుంటుందో? అనుకున్నా. కాని అరుణ ఫోన్ చేస్తే అర్థమయింది. వదిన చాలా దృఢంగా ఉన్నారని. అన్నయ్య అభీష్టం మేరకు భౌతిక కాయాన్ని వైద్య కళాశాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంలో వదిన పాత్ర కీలకం. పిల్లలూ అమ్మ ఇష్టమే మా ఇష్టమని తేల్చేశారు. కర్మకాండలకు మేం పూర్తిగా దూరం అంటూ వదిన చుట్టాలందరికీ విస్పష్టంగా చెప్పిందని తెలిసి మరింత ఆశ్చర్య పోయాను. కమ్యూనిస్టులమని, నాస్తికులమని చెప్పుకునే వారిలో చాలా మంది అన్నీ చేసేస్తుంటే... వదిన, అంత దుఃఖంలోనూ అన్నయ్య, తాను సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలకు, తమదైన భావాలకు కట్టుబడి ఉండడం... ఇప్పుడు రామకృష్ణ గారు ఉంటే ఎంతో సంతోషించే వారో అనిపించింది. ఆచరణ గురించి ఆయన ఎంతో తపనపడేవారు. ఇదంతా సరే... అసలు మనవళ్లు వాళ్ల తాత గురించి ఏమనుకుంటున్నారో అనిపించింది. ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న వాళ్ల పెద్ద మనవడు చిచ్చుని (గుణ సత్యార్థ్తాత గురించి నీదైన మాటల్లో రాయరా అనడిగాను. డెడ్ లైన్ కూడా పెట్టా. తప్పకుండా ‘తాత’ అన్నాడు. డెడ్ లైన్ అయిపోయింది. వాడు రాయలా. మరలా మూడు గంటలు పొడిగించి నేను విజయవాడ బయలుదేరా. ఈసారి గడువుకు రెండు గంటల ముందే వాడు కాగితం మీద రాసి, ఫోటో తీసి పంపించాడు...

A man esteemed for his compassion and kind-heartedness, Avvaru Nageswara Rao was always selfless, placing others before himself. A great father, husband, grandfather and father-in-law, he was ever-loving towards his family and fellow human beings. He instilled good values in everyone and raised everyone around him to be responsible individuals. He was quite zealous in his duties and aspired to do everything flawlessly. An exemplary man, he was and will be a constant Inspiration in our lives.

పింకీ (డాక్టర్ రన్విత)... నాగేశ్వరరావుగారి తమ్ముడు రమేశ్, వదిన చెల్లెలు జ్యోతి కూతురు. అది కూడా అన్నయ్య, వదినలను అమ్మా, నాన్న అనే పిలుస్తుంది. డాక్టరమ్మా నీవేం రాస్తావు? అని అడిగా. అది రెండు ముక్కలు రాసింది.

pedanaana (avvaru nageswara rao) was always loved and respected for his constant support for every one. I always admire his thoughts on life. his memories will be cherished forever.

ఇవి చదివిన తరువాత అనిపించింది... మా అన్నయ్య, వదినలు ధన్యజీవులు అని. పెంపకం అంటే చెప్పడం కాదు... ఆచరించి చూపించడం, నేర్చుకొనే స్వేచ్ఛనివ్వడం... అది వాళ్ల జీవితంలో ఓ భాగమయింది. అందుకనే రజని, రవి, రజిత... ఇంచుమించూ ఒకేలా ఉంటారు స్వభావ రీత్యా. వాళ్ల పిలుపుల్లో ఆత్మీయత.. అవసరానికి మేం ఉన్నామనే భరోసా ఎప్పుడూ ధ్వనిస్తూనే ఉంటాయి. అదే వాళ్ల పిల్లలకూ వచ్చేసింది. ఆ పిల్లలకు అల్లుళ్లు శ్రీనివాస్ స్క్వేర్ లు సహకరించడం మరీ గొప్ప విషయం. వాళ్లని అల్లుళ్లు అనడం కన్నా కొడుకులనే అనాలేమో? అందుకనే రజనీశ్రీనివాసుడు నన్ను మావయ్య అని కాకుండా బాబాయ్ అనే పిలుస్తాడు. (నాకూ అదే ఇష్టమనుకోండి.) నాగేశ్వరరావుగారు లేరన్న విషాదంలోనూ ఆనందకరమైనది... పిల్లలు, పిల్లల పిల్లలూ... ఆయన నమ్మిన విలువలను తమదైన రీతిలో ఆచరిస్తున్నారు. వర్థిల్లండి.

ముక్తాయింపు... చివరిగా ఈ రెండు వాక్యాలు రాయకపోతే ఇది పరిపూర్ణం కాదు. ఇంటికి వచ్చిన చుట్టాలు కర్మకాండలు చేయకపోతే ఎలా? అని ప్రశ్నిస్తే మా వదిన చెప్పిన సమాధానం... ‘‘మనిషి ఉన్నప్పుడు ప్రాణానికి, లేనప్పుడు వారి ఆలోచనలకు విలువనివ్వాలి. ప్రాణం లేని దేహం గురించి ఎందుకు ఆలోచన? ఒక వేళ ఇవన్నీ చేస్తే ఆయన తిరిగి వస్తారంటే చేయడానికి సిద్ధం’’.


17, ఆగస్టు 2021, మంగళవారం

నా గురించి నేను... నీ కోసం...

ప్రియతమా,

నీ తాజా ఆరోపణకు సమాధానం చెప్పాలనే అనుకుంటున్నా. ‘మనసా వాచ కర్మణా నమ్ముతున్నానని’ నీవు భావిస్తున్న సిద్ధాంతం పట్ల నాకు నమ్మకం లేదని నీవు మిత్రుల వద్ద చేసిన ఆరోపణపై చర్చకు సిద్ధంగా లేను, కానీ... నాకు నేను శోధన చేసుకుని, తర్కించుకుని సమాధానం చెప్పుకునే తీరాలి. ఆ సమాధానం నా జ్ఞానాజ్ఞానాల పరిధికి లోబడి మాత్రమే ఉంటుందన్న పరిమితిని ముందుగానే నాకు నేను గుర్తు చేసుకుంటున్నా. 

నిజంగా... నేనేమీ సైద్ధాంతికి పుస్తకాలను అధ్యయనం చేయలేదు. సాహిత్య అధ్యయనం, సిద్ధాంత ఆచరణలో ప్రాణాలొదిలిన కొద్దిమంది జీవితాలు, నీతోపాటు, విడిగా పాల్గొన్న కొన్ని రాజకీయ తరగతులు, చిన్నప్పటి నుంచీ ఇంటిలో జరుగుతున్న చర్చలు, నాన్న ఆచరణ, పెళ్లైన తరువాత నా మామగారి ఆచరణ, పద్ధతులు... ఇవి తప్ప నాకు నిజంగానే సైద్ధాంతిక అవగాహన ఏమీ లేదు. కాకుంటే నేను నమ్మిన దానిని నిజాయితీ ఆచరించాలని, ఆచరించేదానిని మాత్రమే పైకి చెప్పాలని భావిస్తూ దానికోసం నిరంతారాయంగా ఘర్షణ పడుతూండడం మాత్రం నా అంతఃకరణాలకు అవగతమవుతూనే ఉంది. 

నిజమే... నేనేమీ వ్యక్తులను ఆరాధించలేను. వారివారి పుస్తకాలు, సాహిత్యం ఆధారంగా నేనేమీ పూజించలేను. వాటిని పుక్కిట పట్టి వల్లెవేయలేను. నాకు ఇష్టమైన పుస్తకాలను చదవడానికి ప్రయత్నిస్తా. వాటిలో ఉన్న మంచిని ఆచరించడానికి ప్రయత్నిస్తా. పదిమందికి చెప్పడానికి ప్రయత్నిస్తా. శ్రీశ్రీ నాకు ఇప్పటికీ అర్థం కాడు. అర్థవంతమైన పదాలతో శ్రామికుల పక్షాన నిలబడ్డాడని చిన్నప్పటి నుంచీ చెపితే విని పెంచుకున్న ఇష్టం తప్ప నాకేమీ పెద్దగా ఆసక్తిని కలిగించలేకపోయాడాయన. నా కౌమారంలో ఆయన జీవన శైలి నాపై వేసిన ప్రభావమూ వ్యతిరేకతకు కారణమైంది. శ్రామికుల గురించి, వారికోసమే రాసిన ఆయన కవిత్వం వారికి అర్థంకాకపోవడం, ఆ భాష మాట్లాడే వారిలో చాలా మంది ఆయన కవిత్వాన్ని విస్తృతంగా అర్థం చేసుకోలేకపోవడం... ఈ పరిమితి ఆయన్ను దూరం చేసింది. అర్థం కానిది ఎంత బాగున్నా ఆహ్వానించ లేని నా బలహీనతను చెప్పుకోవడానికి నేనేమీ సిగ్గుపడడం లేదు. 

నిజమే... నేను ఏ పార్టీలోనూ ఉండలేను. సిద్ధాంతం పేరుతో మనుషుల మధ్య గోడలు కట్టే పార్టీల్లో నేను ఇమడలేను. గిరిగీసి నిలబడమన్న చోట నిలబడడం నాకు సాధ్యం కాదు. అత్తమామలకు, అమ్మానాన్నలకు వ్యత్యాసాన్ని పెద్దగా నేను పాటించలేను. అవసరం కోసమే వ్యక్తులు... నాకు సాధ్యం కాదు. అడిగిన ప్రశ్నకు అవునా? కాదా? వంటి జవాబులు... నేనివ్వలేను. సిద్ధాంతాలు, పార్టీలకు వెలుపల మనుషులు చాలా మంది ఉన్నారని, తోటి వారికి సహాయం చేసేవారు, ఆదుకునే వారు, కుటుంబ సంబంధాల్లో ఎంతో బాధ్యతగా ఉంటున్న వారు, సమాజంలోని అసమానతలను చూసి ఇబ్బంది పడుతూ, తమదైన శైలిలో వాటిని పరిష్కరించాలని తపనపడుతున్నవారూ... ఇలాంటి వారందరినీ నేను ప్రేమిస్తాను. వారందరికీ దగ్గరగా ఉండాలని తాపత్రయపడతాను. అందుకనే చాలాసార్లు నేను శక్తికిమించి సాయం చేయాలని ప్రయత్నిస్తూ భంగపడుతూంటాను.

నీవు నమ్మిన సిద్ధాంత మూలపురుషుని జీవిత చరిత్రను అత్యంత శ్రద్ధతో చదివిన వాడిని. దానిలోని ప్రేమనురాగాలను, బాధ్యతను నా జీవితంలోనూ ఉండాలనుకుని మనఃపూర్వకంగా స్వీకరించిన వాడిని... అక్కడితోనే ఆగిపోయా. ఆయన సిద్ధాంత పుస్తకాలను అధ్యయనం చేసి ఆకళింపు చేసుకోగలిగిన సత్తా లేదని విస్పష్టంగానే నిర్ధారించుకున్నా. పెద్దగా ఊహ తెలియకముందే, ‘నా తండ్రి పేరు కారణంగా నాకు వస్తున్న నాయకత్వ బాధ్యతలు’ వద్దని తిరస్కరించిన వాడిని. వాటిని అడ్డంపెట్టుకుని నాకున్న అవగాహన పరిమితులను దాటాలనుకునే కాంక్షలేని వాడిని. 

మావయ్య ఆశయాలు నెరవేర్చడమంటే ఆచరణ మాత్రమేననీ, ఏడాదికోసారి సంస్మరణలో, ఆయన వదిలేసి వెళ్లిన జాతరలను ప్రతీ సంవత్సరం మొక్కుబడిగా నిర్వహించడమో కాదని త్రికరణ శుద్ధిగా నమ్మిన వాడిని. ఆయన నడిచిన నేలను యథాశక్తి ఉంచడానికి చేసిన ప్రయత్నం ఆస్తిమీద మమకారంతో కాదని ఎవరికైనా అర్థమైతే బావుండు. ‘మా తరం వరకూ దాని పవిత్రను కాపాడతాం’ అని నేను చేసిన వాగ్దానం నాలికపై నుంచి వచ్చినది కాదని నీకు అర్థమైందా నేస్తం? నిజమే నేను చాలా సార్లు హృదయంతోనే మాట్లాడతాను. అందు వల్ల వచ్చే చిక్కులను ఎదుర్కోవడానికి పడిలేస్తూనే ఉంటాను.

ఏం చేద్దాం... నాకున్న మరోపరిమితి ఇది.  


నోట్: 2019 జనవరి 28న రాసింది... దేనికోసమో వెతుకుతుంటే దొరికింది.

31, మే 2021, సోమవారం

జ్ఞాపకం మెలిపెడుతోంది


గుండె లోతుల్లోని తడిని తడమగలిగినవాడు

కను రెప్పల మాటున 

దాగిన చెమ్మను చూడగలిగినవాడు

హితుల దుఃఖాన్ని 

దోసిటపట్టగలిగినవాడు

బాధల్లో బాధ్యతగా

భుజం కాసేవాడు

నచ్చిన దానినే నిక్కచ్చిగా

ఆచరించగలిగిన ముసుగు లేని మనిషి

సైద్ధాంతిక, భావ వైరుధ్యాలే తప్ప

వ్యక్తిగత విద్వేషాలకు తావివ్వనోడు

నాకేకాదు... ఎంతోమందికి ఆప్తుడు

హితుడు, స్నేహితుడు, విలక్షణ నేత, ప్రేమైక జీవి సబ్బం హరి... 

మరి లేరన్న కఠిన సత్యం ఇమడడానికి చాలా సమయమే పడుతుంది. మొన్నటికి మొన్న అమ్మని కోల్పోయిన పిల్లలకి అన్నీ తానే అయిన ఆయన నేడు వాళ్ళనీ ఒంటరి చేశాడు. 

నిన్నటి స్నేహం నేడు జ్ఞాపకమై మనస్సును మెలిపెడుతూనే ఉంటుంది.