21, మే 2009, గురువారం

మాట ఆగిన క్షణం

అన్నయ్యా... చాలా మారిపోయావు
నిన్నటిలా ఆత్మీయంగా పలుకు లేదు
గలగలా సాగే మాటా లేదూ...
మౌనంగానే సమాధానం చెప్పా..
కలల సౌధం చెదిరిన చోట
ఊహలు కూలిన పేక మేడలో
శవజీవనం సాగుతున్నప్పుడు
నవ్వు అందని కోహినూర్ వజ్రమే
ఓ మాట... నలుగురిలో చిరునవ్వు
నిషిద్ధమైన ప్రాంగణంలో
ఉయదమూ, సాయం సమయమూ
కానరాని నిశాచర జీవితాన
మిగిలిన ఓ టీ కప్పునూ నీ
నుంచి లాగేసుకున్నప్పుడు, అవును
మాట పడిపోతుంది... గలగలా సాగే
ఆత్మీయ సెలయేరు ఎండిపోతుంది
కేవలం చచ్చిన కళేబరాలు నడుస్తుంటాయి
రాస్తుంటాయి, మాట్లాడుతూంటాయి, పాడతాయి...
అంతా, అచ్చం శ్మశానంలో సాగినట్టే...

20, ఏప్రిల్ 2009, సోమవారం

ఎన్నటికీ తీరదు


వాస్తవావాస్తవాలకి మధ్య
కన్నెపొర సిరిగిపోయింది మరోమారు
హ్రుదయం మెలితిరుగుతోంది
ఆలోచనలతో కిక్కిరిసిన
బుర్ర ఖాళీ తారుడబ్బాలా
పొద్దు ఎటో తెలియని ఆలోచన
సగం ఎండి పండిన ఆకులా
ఎంతకాలం ఇలా..?
చిన్న ముల్లూ, చిన్నముల్లూ..
గబగబా పరుగెత్తిపోవా
ముందుకో, వెనక్కో... చివరిదాకా
కుదుటపడుతుందోమే మరి?
ఈ ఆకు వణుకు ఆగుతుందేమో?

17, ఏప్రిల్ 2009, శుక్రవారం

ఇంతకన్నా ఎలా..?


సలక్షణ జీవితాన్ని వద్దనుకున్న వ్యక్తి

సుఖ:మయ సంసారాన్ని తోసిరాజన్న మనీషి

దేశీయ మూలాలను పట్టుకున్న మేథావి

పెదవి దాటిన మాటకూ, జీవనానికీ మధ్య గీత చెరిపేసిన రుషి

సామాన్యుని రాజ్య సాధనలో ‘బడి’ స్థానం తెలిసిన పంతులు

సామాన్యునిలా బతికిన అసమాన్యుడు

గోడలు వద్దంటూ, ఎల్లలే లేని ఆకాశమే హద్దంటూ

నిరంతరం ఆశయ సాధన ధ్యేయమే ఆలోనగా సాగిన

శంబూక రథయాత్ర సారథి

నువ్వు, నేను - పిల్లలతో, చుట్టాలతో

పండుగలా గడపటం అవసరమంటూ

మనకంటూ ఓ ‘మేళా’ను ఇచ్చిన భవిష్యదర్శిని

అనారోగ్యంలోనూ విలువల వలువలను వదలని స్ఫటికం

నేడు...

చీలికల, పేలికల గుడ్డముక్కలకు గుర్తుకురాని

ఓ వాడిన పుష్పం

ఎవ్వరికీ కాని ఓ మామూలు మనిషి

ఇనుప గోడల మధ్య బందీలైన సంకుచిత

సిద్ధాంతల నడుమ కానరాని నిశ్శబ్ద తపనాకాంక్ష ఆయన

ఆయన... రామక్రిష్ట... చార్వాక రామక్రిష్ణ

సగర్వంగా మా మావయ్య రామక్రిష్ణ


చార్వాక రామక్రిష్ణ గారి ద్వితీయ వర్ధంతి ఏప్రిల్ ౧౮... ఆ సందర్భంగా...

24, మార్చి 2009, మంగళవారం

పయనం

నీరు లేని నేల
ప్రాణం లేని కట్టె
తోడు లేని ప్రయాణం

నిదుర కోసం...

ఎక్కడికి వెళితే అక్కడకు
దారంతా వెంటపడుతూనే
వీడిజిమ్మడిపోను
వళ్ళంతా మండిస్తూ, ప్రాణం తీస్తూ...

‘కవిత’ చదువుతూ...

రేయి ముగియకుండానే 
పరుగు తెరుచుకున్న రెప్ప మరి పడదు 
తొలి సూరీడు, చిన్న చిన్న పాకలు 
నువ్వూ, నేనూ ఇబ్బంది పడే 
నల్లనీటి పిల్ల కాలువలు 
నా మనసులానే... 
తెలిమంచు వీడని శూన్యం 
భానుడు ప్రకాశుడై అందంగా పైకి, పైపైకి మెల్లగా
మెలమెల్లగా అంతా ‘నల్లద్దాల’ నడుమ 
చలువ పెట్టెలో కూర్చుని కదులుతూ... ‘కవిత’ చదువుతూ...

8, మార్చి 2009, ఆదివారం

విస్ఫోటనానికే


నిన్నటి వరకూ ఆరడుగులున్న నేను
ఇప్పుడు నాన్న చంకెక్కుతున్నాను
అక్కడే ఆగాలని లేదు
అమ్మ ఒడిలోకి చేరి
కాళ్లు ముడుచుకుని ఒద్దిగ్గా
నిదురోవాలని ఉంది
కాదు... కాదు...
అమ్మపొత్తిళ్లలోకి జారాలని ఉంది
అభద్రతల భద్రత నుంచి
బయటకు దూకాలని ఉంది
ఊహూ... ఇంకా...
అమ్మ కడుపులోకి
పిండాన్నై చేరాలని చూస్తున్నా
కళ్లు తెరవని ఆలంబన లేకుండా
బతకలేని పసిగుడ్డునవ్వాలని కాంక్షిస్తున్నా
అయినా... ఏది శాంతి
అమ్మ వింటున్నవీ, చూస్తున్నవీ, చేస్తున్నవీ
అన్నీ అనుభూతమవుతున్నాయే...
ఎలా...
మిగిలింది ఒక్కటే
నాన్న శుక్ర కణాల్లోని వై క్రోమోజోముగా
జారిపోతే... అలా వెనక్కి... వెనక్కి...
ఇదంతా... మరో విస్ఫోఠనానికే...
మరింతగా విస్ఫోటించడానికే...

20, జనవరి 2009, మంగళవారం

ఇది చాలుగా...

బ్రహ్మ పదార్థమే అది
అయినా ఐస్ క్రీమ్ అంత ఇష్టం
విశ్వమంత పాతదే అది
అయితేనేం... నిత్యనూతనమే
నిలువ నీరు కాదుసుమా
నిత్యపరిమళభరిత గంధమది
వ్యక్తీకరించేదే భావమా?
అవ్యక్తానుభవయ్యేదీ..?
బరువుల్లోనూ, బాధ్యతలలోనూ
నిత్యం నీడలా ఉండేదీ?
అక్షరానుభూతులతో వివరించలేను
కుసుమ రేకలను రాల్చలేను
రూపమిదే అని నిర్ధారించలేను
రుంగూ, రుచీ చెప్పలేను
నేను అనుభూతిస్తున్నా...
చెప్పటానికి ఏదో ఓ రోజు
సంస్కృతీ... వాదాల్లోకి కాదుగాని
మనసు విప్పి చెపుతున్నా
నేను ఇప్పటికీ 20లోనేనని
ఎప్పటికీ అంతేననీ
మనసంతా నువ్వేననీ...

- ౧౪.౦౨.౨౦౦౨