23, ఆగస్టు 2020, ఆదివారం

అంత ఎగతాళి ఎందుకో?

 

వారం ముందు నుంచే... ఆమాటకొస్తే... సుమారు 15 రోజుల ముందు నుంచే నా ప్రిపరేషన్ మొదలయింది. ఎందుకు, ఏమిటి వంటి సవాలక్ష ప్రశ్నలు వస్తాయని తెలుసుకానీ మరీ ఇంతగా నవ్వుకుంటారని తెలియలేదు. దాదాపు రెండేళ్ల తరువాత అమ్మ వాళ్ల ఇంటికి వెళ్తున్నాను. అడపాదడపా ఓ గంట ఉండడానికి కాదు. కనీసం వారం రోజులు ఉండాలని గట్టిగానే అనుకున్నా. అదీ అమ్మ కోసం. ఎప్పుడు వెళ్లినా అమ్మ అస్సలు రావడం లేదంటూ బెంగగా మాట్లాడుతోంది. ఎందుకో అలా అలవాటు పడిపోయింది. విశాఖలో ఉన్న పదేళ్లపాటు నన్ను భరించీ, భరించీ... మరీ దూరంగా ఉంటే అసలేమీ తోయదన్నంతగా అలవాటయిపోయినట్లుంది. అలాగని నాన్నేమి తక్కువ కాదు. కాకుంటే 76 ఏళ్ల వయస్సులోనూ ఆయనకున్న వ్యాపకాలు అస్సలు తీరకలేనట్లున్నాయి. అందుకే అడపాదడపా నేను గుర్తుకొచ్చినా ఫోనులో మాటలతో సరిపెట్టేసుకుంటాడాయన.

ఈరోజే వెళ్లాలి. నిన్ననే చెప్పాను ఇంట్లో. నేను రేపు మా పుట్టింటికి వెళ్తున్నాను. ఓ వారం రోజులు ఉంటాను అని. అప్పుడేమీ ప్రశ్నలు లేవు. హమ్మయ్య అనుకున్నా. ఒక్కోటీ సర్దుకోవడం మొదలుపెట్టా. కరోనా పుణ్యమా అని ఇంటి నుంచే కదా పనిమొత్తం. అందుకనే ముందుగానే నా డెస్క్ టాప్ సర్దుకున్నాను. ఇంటిలో నుంచి పెద్దగా బయటకు వెళ్లేదేమీ లేదుకదా అని ఓ జత దుస్తులు... పల్లెలో పచ్చటి పొలాలు చూస్తూ నడవచ్చునుకుంటూ అందుకు తగ్గట్లుగా జాగింగ్ ట్రాక్ లు రెండు సర్దుకున్నాను. యాభై ఏళ్లంటే మరీ చిన్నవయస్సేమీ కాదు. బీపీ బిళ్లలు, కరోనా పేరుతో రోజూ చప్పరిస్తున్న సీ విటమిన్ బిళ్లలు జాగ్రత్తగా సర్దుకున్నాను. అన్నీ సర్దుకున్నానో లేదో మరో సారి చెక్ చేసుకొని... మర్చిపోయిన దువ్వెనను కూడా సంచీలో వేసుకున్నా. అప్పటి వరకూ రాదనుకున్న ప్రశ్న రానే వచ్చింది. ‘‘ఎందుకు ఇప్పుడీ ప్రయాణం? నీకు ఇక్కడ  బాలేదా?’’ అంటూ. దాచుకోడానికేం ఉంది కనుక... అందుకే ఠక్కున చెప్పా.. ‘‘అబ్బే అదేం లేదు. అమ్మ మరీ బెంగగా ఉన్నట్లుంది. అందుకే వెళ్తున్నా’’ అని. పిల్లలూ ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఏంటి, మరి ఎప్పుడు రాక? నీవు లేకపోతే మాకు పెద్దగా తోయదు. వారం రోజులా?  నీజంగానేనా? ఎలా ఉంటావు?... అన్ని ప్రశ్నలకూ మౌనమే సమాధానం. మధ్య మధ్యలో చిన్న నవ్వుతో... ‘ఏం నేను లేకుంటే మీకు తోచదా? ఆడుకోవడానికి మీకు ఎవ్వరూ దొరకరా నేను లేకుంటే?’ అన్న ప్రశ్నకు పిల్లల నుంచి సమాధానం ఏమీ లేదు. కారులో పిల్లలిద్దరూ నన్ను మా ఇంటి దగ్గర దించారు. కొద్దిసేపు తాతమ్మ, తాతయ్యలతో గడిపి వెళ్లిపోయారు. 

నాన్న నా గది నాకు ఇచ్చేశారు. ఫస్ట్ ఫ్లోర్ అది. నాకు చాలా ఇష్టమైన ఇల్లు. దానిని కట్టేటప్పుడు ఎంత కష్టపడ్డానో. నా చేతులు మీదుగానే నిర్మాణం మొత్తం సాగింది. ఆ ఇంటితో నాకు ఎన్నో చేదు తీపి జ్ఞాపకాలు. వర్షాలు పడుతున్నాయేమో ఓ రాత్రి వణుకొచ్చింది. మొదటి రోజు కప్పుకోడానికి దుప్పటి లేదు. ఓ వైపు చలి, మరోవైపు దోమలు. పెద్దగా నిద్రపట్టలేదు. అదీ కాకుండా చాలా రోజులయింది కదూ. ఏదో మైమరుపుతో కూడిన కొత్తదనమూ నన్ను ఇబ్బంది పెట్టింది. ఎంతైనా నా ఇల్లు కదా. ఒక్కరోజులోనే సర్దుకున్నా. వారం రోజులు ఎలా గడిచిపోయాయో తెలియదు. ఈలోగా ఫోనులు చేసిన మిత్రులందరికీ పుట్టింట్లో ఉన్నానని చెపితే ఎంత పగలబడి నవ్వారో. ఎందుకు నవ్వుతున్నారో అర్థమయ్యేది కాదు. నేను పుట్టింటికి వెళ్లానంటే అంత నవ్వు ఎందుకు వచ్చిందో. శనివారం రానే వచ్చింది. పిల్లలకు ఫోన్ చేశా. అరే ఏమైనా వచ్చి తీసుకువెళ్తారా? అని. పెద్దోడి సందేహం... ఏంటీ అప్పుడే వచ్చేస్తావా? అని. అక్కడితో ఆగితే బానే ఉండేది. వెంటనే వాడు... ‘మరో వారం రోజులు ఉండాలనుకుంటే ఉండు’ అన్నాడు. ఏంటి వీళ్లు నన్ను తేలిగ్గానే మరిపోయినట్లున్నారే అన్న చిన్న బెంగ, సందేహం ఒక్కసారిగా దాడి చేశాయి. వెంటనే... అరే వచ్చి తీసుకెళ్లండిరా అని గట్టిగా చెప్పేశాను. ఇంట్లో అమ్మ, నాన్నకు కూడా చెప్పాను. ఈరోజు నేను మా ఇంటికి వెళ్తున్నాను అని. బెంగ తీరిపోయినట్లుంది, అమ్మ సరేనంది. నాన్న సరేనంటూ ఆయన బిజీలో ఆయన పడిపోయారు. వస్తూ వస్తూ నాన్నకి చిన్నపాటి పని, ఇంటిలో కొద్దో గొప్పో పట్టించుకోవాల్సిన విషయాలను గబగబా చేసేశా. ఏదో గుబులు. చిన్న అలజడి. పిల్లలు వచ్చారు. ఓ గంటసేపు కూర్చున్నారు. పిల్లలకు ఇష్టమని అమ్మ చేసిన పులిహోర కనీసం వాసన కూడాచూపించకుండా ఇద్దరూ నాకేశారు. వెనక్కి తిరిగి చూడకుండా కారెక్కాశాను. ఓ 20 నిమిషాల్లో ఇంటికి వచ్చేశాం. ఇంటిలోకి రాగానే ఓ మిత్రుడు ఫోను చేస్తే... ‘ఇప్పుడే పుట్టింటి నుంచి వచ్చా. వారమయింది వెళ్లి’ అని చాలా కాజువల్ గా అన్నా. అంతే వెంటనే  పకపకా నవ్వులు. ఎందుకండీ అంత నవ్వు అంటూ అనగానే... పక్కనే వాళ్ల ఆవిడ ‘సారె’ పట్టుకొచ్చావా? అంటూ నవ్వుతోంది. మా ఆవిడ మాత్రం పెద్దగా మాట్లాడలేదు. వారం రోజులు లేను కదా. మళ్లీ కథ మొదలయింది. ఇంతకీ నేను పుట్టింటికి వెళ్లడంలో తప్పేంటో మీకైనా అర్థమయిందా? తెలిస్తే చెప్పరూ... ప్లీజ్....

19, ఆగస్టు 2020, బుధవారం

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

          

 ఒక్కటే చిత్రం... అయితేనేం కంట నీరు తెప్పిస్తుంది... భావోద్వేగాలను రగిలిస్తుంది... గుండెల్లో కోపాగ్నిని మండిస్తుంది... మస్తిష్కంలో ఎన్నో ఆలోచనలను రేపుతుంది... వేల ప్రశ్నలకు కారణమవుతుంది... సంచలనాలకు వేదికవుతుంది... మార్పుకు నాంది పలుకుతుంది... 

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటో జర్నలిస్టు మిత్రులకు మనఃపూర్వక శుభాకాంక్షలు. అత్యంత సంక్లిష్ట సమయంలో మీ వృత్తి ప్రయాణం సాఫీగా సాగాలని... మీరు, మీ కుటుంబ సభ్యులు ఈ కష్ట సమయాన్ని అధిగమించాలని ఆకాంక్షిస్తూ...

(చిత్ర సహకారం మిత్రుడు రామకృష్ణ)