23, జులై 2020, గురువారం

ధైర్యం కన్నీరైన వేళ...

జీవితం బుడగలా మారిన క్షణంలోనే తెలుసు.. చిన్నపాటి సూది గుచ్చుకున్నా పగిలిపోతుందని. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా పన్నెండేళ్ళు... తనంటే ఇష్టపడి, అయిన వారందరినీ వదిలిపెట్టి చేయిపట్టుకున్నందుకు... ఆమెకు, ఆయన ప్రాణవాయువయ్యాడు. ఎన్నడూ కన్నీరెట్టని ధీరునిగా అభిమానులెందరి గుండెల్లోనో కొలువుదీరిన నేత... ఆప్తుల ముందు మున్నీరయ్యాడు. నిగ్గపట్టుకున్న ధైర్యం ఒక్కసారిగా ఇక నావల్ల కాదు ఈ నటనంటూ జారిపోయింది. నిన్నటి వరకూ నీవున్నావన్న భరోసా... ఇప్పుడు మరి లేదంటే ఎలా? అంటూ మౌనంగా రోదిస్తున్న మనస్సుకు... వేయాలనుకున్న ముసుగు మరి ఉండనంది. 

‘‘ఇష్టం, అయిష్టం, ప్రేమ, మోహం, అభిమానం, కోపం, పట్టుదల... అన్నీ... నా  ఇష్టాయిష్టాలన్నీ తనకే తెలుసు, నాకేం కావాలో నాకు తెలియదని తెలుసుకోవటానికి ఇంత కాలం పట్టింది...’’ ఈ మాట చెప్పేటప్పుడు వణికే ఆ కంఠం వెనుక తరగని ప్రేమ గురించి ఏమి చెప్పినా తక్కువే. 

నగరంలో విలక్షణ నేత. పార్టీలకతీతంగా అభిమానులను సంపాదించుకున్న నేత. తాను నమ్మినదానిని ముక్కుసూటిగా ప్రకటించగలిగిన మనిషి. తాను చేయదలచుకున్న దానిని కుండబద్దలు కొట్టగలిగే రాజకీయుడు సబ్బం హరి. ఏడేళ్ళ ప్రేమ గాఢమై వైవాహిక బంధంతో పెనవేసుకున్న తన సహచరి లక్ష్మిని కోల్పోయిన ఆయన, తన ఆప్తులతో మాట్లాడుతూ... ‘‘నిన్నటి వరకూ తను మంచపైనే వున్నా... ఓ పలకరింపుంది. ఇంటిలో మనిషి వుంది. తాళం అవసరమే లేదన్న ధీమా వుంది. ఇప్పుడు అది లేదు’’ అంటూ జారటానికి సిద్ధంగా వున్న కన్నీటిని చే రుమాలు చాటున దాచేశారు. 

సబ్బం హరి కాంగ్రెస్ తో రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీకి ఎదురుగాలి వీస్తున్నప్పుడు మేయర్ గా డైరెక్ట్ ఎలక్షన్లలో గెలుపొందిన నేత హరి. ఆ తరువాత అనకాపల్లి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీ ఫాం ఇస్తే... డబ్బులు జల్లకుండా అభిమానుల అండతో పార్లమెంటు మెట్లు ఎక్కిన నేత ఆయన. సమైఖ్యాంధ్ర ఉద్యమంలో కాంగ్రెస్ కుత్సితత్వాన్ని నిర్ద్వందంగా ఖండించిన నేత. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టుపై గెలిచి నియమాలకు వ్యతిరేకంగా వుండలేనటూ విలువలకు కట్టుబడిన మనిషి. వైఎస్ కుమారుడిగా జగన్ ను అభిమానించిన హరి.. ఆ తరువాత ఆయనతో వచ్చిన విభేదాల నేపథ్యంలో అంతే దూకుడుగా బయటకు వచ్చేశారు. ఇవన్నీ ఎలాంటి ఆలోచనా లేకుండా చేసుకుంటూ పోవటానికి ఆయనకున్న బలం సహచరి లక్ష్మి. 

జీవనరేఖ లక్ష్మి 12 ఏళ్ళ క్రితం అనారోగ్యం పాలైనప్పుడు... ఇక మంచానికే పరిమితవ్వాలని తెలిసినప్పుడు... తొలిసారిగా ఆయనకు అర్థమయ్యింది. ఏ దిగులూ లేకుండా నిరంతరం ప్రజలతో వుండే అవకాశం కేవలం తన జీవిత సహచరి వల్లే కలిగిందనీ... ఆమె సహచర్యం, సహకారం లేకపోతే ఇంతటి ఉజ్వల ప్రజాజీవితం, వెలకట్టలేని ప్రజాభిమానం సంపాదించటం సాధ్యమయ్యేదేకాదని. గర్తించిన విషయాన్ని అయినవాళ్ళని భావించిన వారితో పంచుకోవటానికి ఆయన ఏనాడూ ఇబ్బందిపడలేదు. 

తన ఇంటి లక్ష్మిని, దీపాన్ని ఆరిపోకుండా కాపాడుకోవటానికి ఆయన పడుతున్న తాపత్రయాన్ని చూసి అబ్బురపడిన కలమో, కెమేరానో ఆయన్ని చిన్నగా అడుగుతాయి. మీదైన ప్రేమైక జీవితాన్ని పదిమందికీ పంచటానికి అనుమతి ఇవ్వండంటూ. సున్నితంగా తిరస్కరించిన సందర్భాలెన్నో. ‘‘మా ఇద్దిరికే సంబంధించిన ప్రేమైక జీవితం. చూసి నేర్చుకుంటే అభ్యతరం లేదుకానీ, చాటుకోవటం ఇష్టం లేదు’’ అంటూ కొంచెం కష్టపడినా మెత్తటికరుకుదనంతో చెప్పేస్తారు. ‘మనిషి సంతోషంగా వున్నప్పుడు చాలా మంది వస్తారు. కష్టాల్లో వున్నవారి వెంటే మనం వుండాలి’ అన్న మాటను నమ్మి త్రికరణ శుద్ధిగా ఆచరించిన హరి ఇప్పుడు నీరవుతున్న గుండెను చిక్కబట్టుకుంటున్నారు. గడచిన మూడేళ్ళుగా తన భార్య లక్ష్మిని చూసుకోవటంలో చేదోడు వాదోడుగా నిలిచిన తన కొడుకును అంత దుఃఖంలోనూ అబ్బురంగా చూసుకుంటూ ఈ కాలంలోనూ పిల్లలు ఇలా విలువలతో పెరిగారంటే లక్ష్మి వల్లేనంటూ మౌనంగానే చెప్పకనే చెప్తారు.

ఆ ఇంటిలో తలుపులున్న ఏ గదికీ తాళం వుండదు. తాళమున్న ఏ ఆరకైనా చెవి తలుపుకే తగిలించి వుంటుంది. స్వేచ్ఛతో వచ్చిన నమ్మకం. ఆ నమ్మకమనే ఇంటికి ప్రేమే పునాది. బీటలే వారని ఆ ప్రేమ బంధం చెక్కు చెదరదు. భౌతికంగా మనుషులు అశాశ్వతమైనా... ఆ మనస్సుల్లోని మమతలు మాత్రం శాశ్వతం.

రాత: 23 మే 2017