5, డిసెంబర్ 2022, సోమవారం

నాన్న లేఖ


చాలా రోజుల నుంచి రాయాలనుకుంటున్నా. ఇదనే కాదు... అనేక విషయాలపై... మీతో మాట్లాడాలనుకుని మింగేసిన అనేక అంశాలను మీ ముందు ఉంచాలనే అనుకున్నా. మనసులో మాటలు వేగంగా దొర్లుతుంటాయి. వాటిని ముద్రించడానికి అనువైన సమయం మాత్రం అందుబాటులోకి రావడం లేదంటూ నన్ను నేను మభ్య పుచ్చుకుంటూ కాలాన్ని నెట్టేస్తూ వస్తున్నా. ఇది కూడా రాయాలని అనుకుని కనీసం వారం రోజులు అయినా అయ్యే ఉంటుంది. బయటకు కాలు పెడితే కాదన్న భయంతో వాయిదా వేసి రాస్తున్నా. ఇవన్నీ నా భయాలే. ఎవరికైనా అభిప్రాయాలు, భయాలు, ప్రేమలు... తదితర భావనలన్నీ ఆయా కాలమాన పరిస్థితులు, జీవితంలో నడుచుకుంటూ వచ్చిన మార్గాలను అనుసరించే ఏర్పడతాయి. అందుకనే ఈ రాసే అక్షరాన్నీ అచ్చంగా నా భయాలు, అభిప్రాయాలు కాకుంటే ప్రేమానుమానాలు... నిక్కచ్చిగా అంతే.

డబ్బులు అవసరమే. అవసరమంటే... అవును నిజమే అది నాకు ఒకరంగా, మా బుజ్జికి మరోలా మీకు మరింత భిన్నంగా... అవును ప్రతి ఒక్కరూ విభిన్నమే. కనీసం ఒక డిగ్రీ తేడా నుంచి 360 డిగ్రీల వరకూ ఆ తేడా ఉండొచ్చు. అయితే కనీస అవసరాలు, కనీస సౌకర్యాలకు సరిపడా డబ్బులు ఎప్పుడూ అవసరమే అనుకుంటాను. ఎవరి స్థాయిలో వారికి... వాటి కోసమే సంబంధాలు పుడుతుంటాయి, కొన్నిసార్లు గిడుతుంటాయి. మీ తాత అనేవాడు... ‘‘ఈ ఆర్థిక వ్యవస్థలో ఏ ఇద్దరి మధ్య సంబంధాలైనా ఆర్థిక సంబంధాలే. అయితే దానిని యాంత్రికంగా అన్వయించుకోవద్దు. స్థూలంగా దానిని మనసులు ఉంచుకొని అప్రమత్తంగా మసలుకుంటే చాలు’’ అని. ఆ మాత్రం దానిని కూడా నేను అంగీకరించలేదు. అప్పుడు తాత... ‘‘దానిని అర్థం చేసుకోవాలంటే మార్క్సియన్ ఫిలాసఫీ వెలుగులో రాసిన సౌందర్య శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. మరెవరూ ఇప్పటి వరకూ స్పృశించని అనేకానేక జీవన పార్శ్వాలను మార్క్స్ తడిమాడు. అందుకనే అది అత్యున్నత మానవీయ శాస్త్రం అయింది’’ అంటూ చెప్పినప్పుడు నేను ఈయన అన్నింటికీ ఒకటే మాత్రం చెపుతున్నాడంటూ కొట్టిపారేశాను. అయితో లోతుల్లోకి వెళ్లి చదవకపోయినా పైపైన తడిమే అలవాటుతో అబ్బిన జ్నానంతో అది నిజమేనేమో అన్న అనుమానం వచ్చేసింది. ఆ ఎరుకతోనే జీవితాన్ని చూడడం మొదలుపెట్టాను. జీవితంలో ఒక్కో మజిలీ దాటుతున్నప్పుడు ఒక్కో అనుభవం, అనుభూతిలా మనల్ని చుట్టేసుకుంటుంది. అదిచ్చే వాసనలతో మరింతగా మనం ప్రజ్వలిస్తాం. నేనూ అంతే.

నేను, మా తమ్ముడు పెద్దగా మాట్లాడుకోలేదు. కాని మా మధ్య ఎప్పుడూ ఒక నిశ్శబ్ధం అవసరమైన పదాలను దొరిస్తూ పారుతూంటుంది. సెలయేరు సప్పుడు సేయకుండా సాగడాన్ని ఊహించండి...

మీ ఇద్దరూ అలా కాదు. మీ బంధం ఓ హోరు జలపాతం. మీ సమీపంలో ఎవరు ఉన్నా తడిచి ముద్దవడమే. అంతేనా...  ఆ జలపాతానికి అడ్డు వచ్చే దుంగలు, మట్టి కట్టలు కొట్టుకుపోవాల్సిందే. చివరికి ఆ నీరు మహోధృతంగా నురగలు కక్కుతూ, జనాకర్షణగా నిలవాల్సిందే.

రెండూ రెండు భిన్న ధృవ, దృఢ బంధాలు. వేటికవే విశిష్టమైనవేమో.

నిశ్శబ్ధం శబ్ధిస్తూనే ఉండాలి... జలపాతం హోరెత్తుతూనే సాగాలి.

మధ్యలో పిల్లకాలువలు వస్తుంటాయి. ఉప నదులు మమేకమవుతుంటాయి. మనదైన రూపాన్ని మార్చనంత కాలం, చెదిరిపోనివ్వనంత కాలం... ఇముడ్చుకుంటూ సాగిపోవడమే.

ఒడిదుడుకులు లేని జీవితం ఉప్పలేని కూరలా చప్పగా ఉంటుదని చెపుతుంటే నిజమేననుకున్నా. అయితే మరీ కుదుపులు ఎక్కువైనప్పుడు అవసరమైనదే ఆసరా. పడిపోకుండా, నడుములు విరక్కుండా చూసే ఓ భరోసా ఎప్పడూ అవసరమే. నన్ను చాలా సార్లు ఆ భావన బలంగానే నిలబెట్టింది. మీ బాబాయా, మీ తాతా లేకుంటే మీ అమ్మ... ఒక్కొక్కరు ఒక్కో సమయంలో... అంతే. అందుకనే ప్రతి సంబంధమూ పవిత్రమైనదే, ప్రేమపూర్వకమే.

‘‘ఇదంతా ఎందుకు చెప్పావు నాన్నా? ఒక్క ముక్క అర్థం కాలేదు. అసలు ఇంతకీ ఏం చెప్పాలనుకున్నావు? మా ఇద్దరి సంబంధాలు సజీవంగా ఉండాలని, వాటిని భౌతిక అవసరాలు అధిగమించకూడదనేనా?’’ అని అడుగుతారేమో మీరు.

అవునంటే... మా మీద అనుమానమా? అని కోపగించుకుంటారేమో?

కాదు... అనంటే మరెందుకు ఇప్పుడు ఇదంతా వ్యర్థం కాకుంటే... అని తిట్టిపోసుకుంటారేమో?

ఏం చేసినా మీరు పిల్లలేగా... నాకు వరకు నాకు ఇష్టమైన కష్టంగానే ఉంటుంది. మా నాన్న నేర్పించారు దీనిని.

x

1, అక్టోబర్ 2022, శనివారం

చోటివ్వవూ...

 గతంలో ఎన్నడూలేని ఓ కొత్త దుఃఖం మనస్సుని ముంచేసింది. బయటపడడానికి చేయని ప్రయత్నం లేదు. ఉన్న కొద్దిపాటి తీరికనూ ఏదో ఒక పనిలో పెట్టినా కొలిక్కి రాకుండా కొలిమి రాజుకుంటూనే ఉంది. చివరికి వాడు వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. అప్పటి వరకూ లోపొరలకే పరిమితమైన కన్నీరు రెప్ప గడప దాటింది. అమ్మని చూడడానికి వెళ్దామంటే భయం... ఎక్కడ పెదవి దాటుతుందో అని. చిన్నప్పుడు నేనుపడ్డ కష్టం వాడు పడకూడదనుకుంటూనే వాడిని ఎంత హింసించాను.. నాకిప్పటికీ ఆ రెండు సన్నివేశాలూ గుర్తే. వెంటాడుతుండే నా నల్లని నీడలవి. మరిచిపోవా కన్నా వాటిని.. అంటే నిర్దయగా కష్టం అంటూ సత్యాన్ని ఎంత నిక్కచ్చిగా చెప్పాడు. లవ్ యూ రా తండ్రీ. ఎలా తట్టుకున్నావు రా? నీవు నిజంగా అదృష్టవంతుడవే. విలువైన స్నేహితులురా వాళ్లంతా. నీకు తెలియకుండా. నేను నా నాన్నతో పంచుకున్నప్పుడు నాకో ఓదార్పు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ని చదవాల్సిన అవసరాన్ని మరలా తాత గుర్తు చేశాడు. మొన్నటి భావావేశం నేడు లేదు. నిన్నటి వరకూ వెన్నంటిన పదాలు నేడు నెమ్మదించాయి. బహుశా నీవూ అంతే. త్వరగా కోలుకో. మరింత సమున్నతంగా, మహోన్నతుడివై వెలగాలి. సంతోషం నీ చిరునామా కావాలి. మనిద్దరి మధ్యా మాటను నడవనీయని అడ్డంకిని తొక్కేస్తా. నీదైన వ్యక్తిత్వాన్ని, వ్యక్తీకరణలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా. నీ స్నేహ సౌధంలో నాకో స్థానమివ్వవూ..?

10, మార్చి 2022, గురువారం

నేటి భావం

 ఆయా రాష్ట్రాల తాజా ఎన్నికల ఫలితాలపై విడివిడిగా విశ్లేషణలకు వెళ్లడం లేదు. ఎందుకంటే ఇప్పటికే పాపులర్ మీడియాలో ఆమేరకు వివిధ అభిప్రాయాలు వెల్లడయ్యాయి. గత కొద్ది వారాలుగా ఈ ఎన్నికలపై వివిధ సామాజిక మాధ్యమాల్లో కమ్యూనిస్టు, దళిత, ముస్లీం మేధావులు వరుసగా తమ తమ అభిప్రాయాలను వెలువరిస్తూ ఉన్నారు. వారంతా ఏదో ఒక దశలో హిందూత్వ శక్తుల పతనం ఆరంభమయిందన్న భావనలను వెలిబుచ్చిన వారే. మినహాయింపులు గమనికలోనే ఉన్నాయి.


వారు ఊహించినట్లుగా దేశాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదిపిన సుదీర్ఘ రైతు ఆందోళన కానీ, పదేపదే మాట్లాడుతూ వస్తున్న బీజేపీ సంఘ్ పరివార్ హిందూత్వ రాజకీయాలు కానీ, కొవిడ్ మహమ్మారి సమయంలో కేంద్రం వైఫల్యాలు కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థల అమ్మకాలు కానీయండి... ఈ ఎన్నికల్లో ఎందుకని ఆయా శక్తులకు వ్యతిరేకంగా పనిచేయలేదు? లౌకికవాద శక్తులుగా పేర్కొంటున్న పార్టీల మధ్య ఎందుకు సారూప్యత లేకుండా పోయింది? అసలు ఈ దేశ యువత, మధ్య తరగతి జీవి, ఓటు కోసం  నిలబడే బడుగు, బలహీనులు ఏం ఆలోచిస్తున్నారు? ఏం ఆశిస్తున్నారు? ఈ దిశగా ఇప్పుడు విశ్లేషణ కొనసాగాల్సి ఉందేమో?


వాస్తవానికి ఆరేడు దశాబ్దాల క్రితం నుంచే హిందూత్వ శక్తులు తమ సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఆయా శక్తులు తమకు కావల్సిందేమిటన్నదానిపై అత్యంత స్పష్టతను కలిగి ఉన్నాయి. తమతో కలిసి వచ్చే శక్తులేవి, మిత్రపూరిత శత్రువు ఎవరు? రాజీలేని పోరాటం చేయాల్సిన శత్రువు ఎవరు? అన్న విషయాలపై లోతైన ఆలోచన కలిగి ఉన్నాయి. రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి రాజీలేని సాంస్కృతిక యుద్ధాన్ని నిశ్శబ్ధంగా చేస్తూ వచ్చాయి. అందులో భాగంగానే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను స్థాపించుకుంటూ పోయాయి. వాటిని అత్యుత్తమ విద్యా సంస్థలుగా ఉంచడానికి ప్రయత్నించాయి. అంతర్లీనంగా తమ పనిని తాము చేసుకుంటూ పోయాయి. 


కమ్యూనిస్టులు, లౌకికవాద శక్తులుగా తమను తాము పేర్కొంటున్న ఇతర రాజకీయ పార్టీలు ఆ దూరదృష్టిని పూర్తిగా కోల్పోయాయి. గతితార్కిక భౌతికవాదం వెలుగులో దీనిపై మరింత స్పష్టత కలిగి ఉండి, స్థానిక సాంస్కృతి, సామాజిక అంశాలపై పట్టును కలిగి ఉండాల్సిన కమ్యూనిస్టు పార్టీలు విచిత్రంగా తమ వెలుగుదివ్వెలను కోల్పోయాయి.. యాంత్రికంగా పనిచేసుకుంటూ పోయాయి. మనిషి భావోద్వేగాల సమాహారమని, వాటిని నియంత్రిత వేగంలో, సక్రమమైన దిశలోకి మళ్లించాల్సిన బాధ్యత చైతన్యవంతమైన రాజకీయ నాయకత్వానిదేనన్న విషయాన్ని వారు పూర్తిగా విస్మరించారు. 


వివిధ కమ్యూనిస్టు ఆచరణా స్రవంతుల నుంచి బయటకు వచ్చిన 50సంవత్సరాలకు పైబడిన వారే అత్యధికంగా సామాజిక మాధ్యమాల్లోని తమ తమ  ఖాతాల్లో విస్తృతమైన చర్చోపచర్చలు చేస్తూ వస్తున్నారు. అవి అవసరమా కాదా అన్న చర్చ కోసం నేను దీనిని ప్రస్తావించలేదు. పైన పేర్కొన్న వయస్సుకు దిగువన ఉన్నవారు అతి తక్కువమంది మాత్రమే ఈ చర్చల ధారలో తడిసిముద్దవుతున్నారన్న గమనికను ముందుంచడమే నా ఉద్దేశం. అత్యధికులు వీరికి వెలుపలే ఉన్నారన్న విషయాన్ని విస్పష్టంగా ఎత్తి చూపడమే లక్ష్యం. దీనికి కారణం అంతర్జాతీయమా? జాతీయమా? అన్న చర్చల్లోకి వెళ్లకుండా ... ఎందుకని ప్రగతిశీల శక్తులు మెజారిటీ ప్రజల వద్దకు వెళ్లలేకపోతున్నాయి? అన్న దిశగా ఆలోచన చేయడం అవసరమేమో? లాల్ నీల్ మైత్రి అంటూ నినాదాలిస్తారా... కమ్యూనిస్టు పార్టీల పునరేకీకరణ అవసరమని ఎలుగెత్తుతారా?... ఇంకేమైనా కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతారా? అన్న విషయాలపై మాట్లాడే అర్హత నాకు లేదు. కానీ, ఇప్పటికైనా మేల్కొనకపోతే ఈ దేశంలో రాజ్యాధికారాన్ని మెల్లమెల్లగానైనా హిందూత్వ మత శక్తులు తమ గుప్పెట్లోకి సంపూర్ణంగా తెచ్చుకుంటాయనే వాస్తవం నన్ను భయకంపితుడిని చేస్తోందన్న విషయాన్ని మాత్రం మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. 


రాజకీయ ఆలోచనలు, ఆచరణలకు తోడు సాహితీ సాంస్కృతికోద్యమం కూడా మహోధృతంగా  బాటెక్కాల్సి ఉంది. దీనికితోడు విద్యా వ్యవస్థలో తమదైన ప్రభావాన్ని వేయడానికి  పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసుకుంటూ సాగాలి. ఇది మరో సుదీర్ఘ ప్రయాణమే అవుతుంది. అయినా మనలోని ఆశను ఇది మాత్రమే సజీవంగా ఉంచుతుందని నా నమ్మకం.

23, జనవరి 2022, ఆదివారం

సుడిగాడి కోసం...

 కాల గీతికలో 

మాట కన్నీరయ్యింది

చూపు ఎడారయింది

సూరీడు రాకపోకలన్నీ 

రసోద్వేగాలకు అతీతమై

యాంత్రికాలయ్యాయి

నిన్నటి దేహ ఛాయలెన్నో

కట్టె మంటల్లో శివాత్మికమయ్యాయి

నీరెండలో నీరసపడిన రేపన్న ఆశ

యమపాశపు ఉచ్చులో గింజుకుంటోంది

కనిపించని పురుగే కాదు...

ఆ తల్లి కనిపెంచిన ‘బిడ్డ’

వికటట్టహాసమూ వీధుల్లో 

డీజే సౌండై భయపెడుతోంది

కొన ఊపిరిలూదుతున్న 

పోరాట బహుముఖిప్పుడు

‘వర్ణ’ శోభిత వికృత కాంతిలో

ఎండిన కృష్ణ వర్ణ ప్రవాహమై

సంద్రాన్ని చేరింది ప్రయాసపడుతూ...

గాజు కంటిలో జీవం కొట్టిమిట్టాడుతోంది

శిథిలమవ్వని దేహవృక్షం 

సుడిగాడి కోసం చూస్తోంది...