23, అక్టోబర్ 2013, బుధవారం

విజయనగరం అల్లర్లు... పరిశీలన

ఎవ్వరూ కలలో కూడా ఊహించని ఘటనలకు విజయనగరం వేదికయ్యింది. మండించే భాష్పవాయు గోళాల ప్రయోగాలనూ లెక్కచేయకుండా ఆందోళనాకారులు పోలీసులపైకి రాళ్ళవర్షం కురిపించారు. పిసిసి చీఫ్ సత్తిబాబు, కుటుంబం, అనుచరుల ఆస్తులే టార్గెట్ గా సమైక్య ఆందోళనకారులు విధ్వంసా లకు దిగారు. ఈ ఆకస్మిక విధ్వంసపూర్వక ఆందోళనకు కారణం కేవలం బొత్సపై వ్యతిరేకతేనా? కనిపించని జెండాలేమైనా తమ అజెండాల కోసం పనిచేస్తున్నాయా? పోలీసులు అనుమానిస్తున్నట్లు సమైక్య ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని అసాంఘిక శక్తులేమైనా చెలరేగాయా? బొత్సపై ఓట్లేసే జనాభిప్రా యమేమిటి?

బొత్స సత్యన్నారాయణ గడచిన పది సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా విజయనగరం జిల్లాను ఏలు తున్న కుటుంబ పెద్ద. కాంగ్రెస్ కార్యకర్తగా వున్న ఓ సాధారణ వ్యక్తిని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షునిగా చేసిన రాజకీయ గురువు పెనుమత్సనూ వంచిస్తూ అనతి కాలంలోనే ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, పిసిసి చీఫ్ గా ఎదిగిన ఘన చరిత్ర బొత్సది అంటూ ఆందోళనకారులు ఒకింత వ్యంగంగానే ఆయన గురించి మాటలు మొదలుపెడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కొట్టిమిట్టాడే దుస్థితి నుంచి ఆబగా అందినకాడికి ఆక్రమించుకున్న పెద్దాయన మా పక్కింటి సత్తిబాబు అంటూ కొంత కారంగానే సమాధానమిచ్చే గళాలన్నీ ఇప్పుడు విజయనగరంలో ఓ చోట కూడుతున్నాయి. బొత్సకు తిరుగులేని కోట విజయనగరం అని నిన్నటి వరకూ అనుకున్న వారి అంచనాలను తల కిందులు చేస్తూ వరుసగా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఉద్యమం ప్రారంభమైన తరువాత గడ చిన రెండునెలలకు పైగా కాలంలో ఒక్కసారి కూడా సత్తిబాబు, ఆయన కుటుంబ సభ్యులు తమ గడ్డ పైకాలు మోపలేకపోయారన్న ప్రచారం అతిశయోక్తి కాదు. ఇసుక మాఫియా డాన్, లిక్కర్ కింగ్ సత్తి బాబు అంతుచూస్తామనే వారి సంఖ్య గణనీయంగానే వుంది. ఇలా అరిచేవారిలో అత్యథికులు కాంగ్రెస్ శ్రేణికి చెందిన వారే అన్నదే ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆశక్తికరమైన విషయమని రాజకీయ పండితులే ముక్కుమీద వేలేసుకుంటున్నారు. 

సమైక్య ఉద్యమం ప్రారంభమైన 65రోజుల తరువాత విజయనగరంలో ఉద్యమం ఓ మలుపు తిరిగిందనే చెప్పుకోవాలి. ఈ మలుపు హఠాత్తుగా తిరిగిందేమీ కాదని, ముందుగా కనిపించిన సైన్ బోర్డులను చూడటంలో పోలీస్ ఇంటెలిజెన్స్ విఫలమైందన్న వాదనా వుంది. బొత్సకు వ్యతిరేకంగా వస్తున్న నినాదాలు, బొత్సనే టార్గెట్ చేస్తూ సాగిన  విద్యార్థుల ఆందోళనలు, తమను కొట్టిన బొత్సా వర్గానికి వ్యతిరేకంగా బలంగా సమీకృతమైన విద్యార్థి - యువజనులు ఒక ఎత్తైతే... ఎపిఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయ జెఎసీ, న్యాయవాద జెఎసీలు బొత్స సత్యన్నారాయణ ఇంటికి వెళ్ళే మార్గంలో మహాత్మాగాంధీ రోడ్డులోని అమ్మవారి గుడికి సమీపంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు... అదే సమయంలో బలహీన పోలీస్ బారికేడింగ్ వ్యవస్థను తోసుకుంటూ బొత్సా ఇంటి ముందు బైఠాయింపు... కలగలసి, గడ్డిపోచల కలనేత ఏకులై, పోలీస్ వ్యవస్థకు మేకులైన తీరే పోలీస్, నిఘా వర్గాల వైఫల్యానికి సజీవసాక్ష్యాలు. ఉద్యమానికి పిలుపునిచ్చి, ఉద్యమవీరులుగా మీడియాలో వినుతి కెక్కిన అధికారులు, ఆర్టీసీ కార్మికులు... తక్కువ జీతగాళ్ళు, పై ఆర్జనలు లేని చిరుద్యోగులు ఆర్థికం గా పడుతున్న బాధలు ప్రజలకు చేరుతున్న దశలో అనూహ్యంగా పరిస్థితి మారింది. 

రాజకీయ పార్టీలకు తావులేదు. వేదికలపై స్థానంలేదు... అన్న బలమైన గొంతుక బలహీనపడింది. వై ఎస్ జగన్ జైలు నుంచి బయటకు వస్తూనే వినిపించిన సమైక్య మోహనరాగానికి పునఃసమీకృతమైన వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు బలంగానే ముందుకు దూకాయి. విశాఖ నుంచి విజయనగరం వెళ్ళే దారిలో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సుమారు 10కిపైగా అడ్డంకులలో జెండా పట్టని శ్రేణులే అధిక సంఖ్యలో కనిపించాయి. మూడవ తేదీ ఎపిఎన్జీవోలు పోలీస్ బారికేడ్లను, పోలీస్ దండును నెట్టుకుని బొత్సా ఇంటికి చేరుకున్నారు. సాయంత్రానికి విజయనగరం యథావిథిగా చల్లబడింది. గడచినదిన అనుభవాలతో మరుసటి రోజు పోలీసులు బొత్సా ఇంటికి మూడు వైపులా మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఉదయం పదిగంటలకు ఎంజీ రోడ్డులోని బొత్స ఇంటికి దారితీసే వీథి ఎదురుగా వివిధ జెఎసీలు చేపట్టిన ఆటపాట, వంటావార్పు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం వరకూ ఊపుగా సాగిన ఆ కార్యక్రమాలను విద్యార్థి, యువజనలు కొనసాగించారు. సాయంత్రం సుమారు ఆరుగంటల ప్రాంతంలో ఊరేగింపుగా వచ్చిన ఎన్జీవోలను, ఆర్టీసీ కార్మికులను కలుపుకోవటానికి వాళ్ళు తృణీకరించారు. పోలీసులపైకి ఆకతాయితనపు తోపులాటలు, నిర్భీతిగా బల గాల ముందే టైర్లు, తాటాకులను తగలబెట్టటాలు, జన సంస్కృతంలో బొత్సాను, కుటుంబ సభ్యులను తిట్టిన తిట్లు చూస్తున్న మీడియాకు ఏదో జరగబోతోందన్న అనుమానాలు బలపడసాగాయి. లంకా పట్నం, కొత్తపేట నీళ్ళట్యాంకు, దాసన్నపేట, పద్మావతీ నగర్, జొన్నగుడ్డి, పల్లె వీథి తదితర ప్రాంతా లకు చెందిన యువత బలంగా సమీకృతమవటం ప్రారంభమయ్యింది. అక్టోబర్ ఐదవ తేదీ అనుమా నాలను నిజంచేస్తూ ఉదయం సుమారు 10.30గంటల ప్రాంతంలో రాళ్ల యుద్ధం ప్రారంభమైంది. కోట, మూడు లాంతర్ల జంక్షన్ లకు మధ్య వున్న అర కిలోమీటరు నిడివి వున్న బజారు పోరాట ఆరం భవేదికయ్యింది. దానిని పోలీసులు మెల్లమెల్లగా కోట జంక్షన్ వరకూ నెట్టుకువచ్చారు. ఈ క్రమంలో పోలీసులు టియర్ గ్యాస్ గోళాలను ప్రయోగించారు. అయినా వెనక్కు తగ్గలేదు. సరికదా... మూడు లాంతర్ల జంక్షన్ కు పోలీసులను పరిమితం చేస్తూ ఇటు కోట జంక్షన్ నుంచి అటు అంబటి సత్రం నుంచి ఆందోళనకారులు రాళ్ళ దాడులుకు దిగారు. 

ఈ క్రమంలో ఆందోళనకారుల ఆగ్రహం మీడియాపైకి కూడా మళ్ళింది. పుకార్లు ఎలా షికారు చేస్తాయ న్న విషయం అందరికీ బోధపడిన సందర్భం. జెఎసీ ఛైర్మన్ అశోక్ బాబు విజయనగరం వస్తున్నారన్న వార్త క్షణాలలో పాకిపోయింది. దాని వెంబడే సుమారు పది నిమిషాల తేడాతో తిరిగి ఆయన రావటం లేదన్న వార్త... వెనువెంటనే ఆగ్రహంతో ఊగిపోతున్న ఆందోళనకారులు కోట జంక్షన్లో వున్న వివిధ జెఎసీల టెంట్లను పీకి పాకాన పెట్టారు. అక్కడితో వారి ఆగ్రహం చల్లారినట్లు లేదు. కొద్దిమంది గురజాడ వీథిలోని సత్యా కాలేజీపైకి రాళ్ళు రువ్వారు. ఆఫీస్ ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. వాహనాలను దగ్ధం చేశారు. కార్యాలయంలో పెట్రోలు పోసి అగ్గిరాజేశారు. మరికొంతమంది గంట స్థంభంకు సమీపంలోని సత్యావిజన్ ను ముట్టడించారు. దీనికి ముందుగానే ఆ ప్రాంతాన్ని చీకటి చేశారు. కదం తొక్కారు. వస్తువలను చితక్కొట్టారు. పెట్రోలుతో దొరికిన వస్తువలనన్నింటినీ తగలపెట్టారు. అదే తెగువతో కార్యాలయానికీ నిప్పు పెట్టారు. మంటలను ఆర్పటానికి వచ్చిన ఫైర్ సిబ్బందిపై చేయి చేసుకుని గెంటివేశారు. దృశ్యీకరిస్తున్న మీడియాను లైట్లు వేయకుండా షూట్ చేయాలంటూ పరుషపదజాలంతో హెచ్చరించారు. ఈ రెండు ఘటనలు చల్లబడకముందే తోటపాలెంలో నివాసముంటున్న బొత్సమేనల్లుడు చిన్న శ్రీను ఇంటిపైకి విద్యార్థుల, యువజనుల దండు కదిలింది. అక్కడ అప్పటికే సిద్ధంగా వున్న చిన్న శ్రీను అనుచరులు ఎదురుతిరిగారు. ఈలోగా పోలీసులు అక్కడకు చేరుకుని లాఠీలు ఝుళిపించారు. ఆ క్రమంలో చినశ్రీను నియమించిన ప్రైవేటు గూండాలు... సిక్కులు నలుగు రిపై కారంతో దాడి చేసి కొట్టారని వార్తలు వచ్చాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వుందని, ఒకరు చనిపోయారన్న వార్త దావానలంలా వ్యాపించింది. ఆ మరుసటి రోజుకు అంటే ఆరవ తేదీకి ఆ వార్త రాష్ట్రమంతా పాకిపోయింది. అయితే చనిపోయింది ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వారన్న విషయం ఆ ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఎవ్వరికీ తెలియకపోవటమే అసలు సిత్రం. ఆ తరువాత చంపేయబడ్డారన్న సంఖ్య రెండుకు చేరుకుంది. అది ఫేస్ బుక్ లకు, ఈ మెయిళ్ళకు పాకింది. దీనితో ఉత్తర కోస్తా ఐజీ ద్వారకాతిరుమలరావు, మరో ఐజీ గోవింద్ సింగ్, డిఐజి ఉమాపతిలతో కలసి మీడియా సమావేశం నిర్వహించి అవన్నీ ఉఠ్ఠి పుకార్లే నంటూ ఖండించారు. ఏలూరు రేంజ్ డిఐజీ విక్రమ్ సింగ్ మాన్ స్వయంగా రోజంతా కోట జంక్షన్ వద్ద నిలబడ్డారు. పరిస్థితిని అంచనా వేస్తూ కనిపించారు. ప్రణాళికాబద్ధంగా చేస్తున్న దాడిలో భావోద్రేకాలతో, ఉద్వేగాలతో ఆందోళన చేస్తున్న ఉద్యమకారుల ముందు కొన్ని ప్రేరేపిత శక్తులు చేరాయన్న అంచనాకు ఆయన వచ్చారు. అప్పటికే విజయనగరానికి అడిషనల్ డిజి పూర్ణచంద్రరావుతో పాటు మరో ఇద్దరు ఐజీలు, పలువురు డిఐజీలు, ఎస్పీలు చేరుకున్నారు. డిఎస్పీలు, సిఐల సంఖ్య భారీగానే వుంది. ఐదవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకూ సాగిన రాళ్ళ దాడులు, టియర్ గ్యాస్ ప్రయోగాలు సాయంత్రాంనికి మరింత ఉధృతమయ్యాయి. బొత్సాకు రాజకీయ పునాది రాయి అయిన కేంద్ర సహకార బ్యాంకు కార్యాలయం ఆందోళనకారుల దాడిలో దగ్ధమయ్యింది. దానికి సమీపంలోని వైన్ షాపు లూఠీ అయ్యింది. బొత్సాకు సన్నిహితులుగా భావించే మరో రెండు మూసివున్న షాపులపై రాళ్ళదాడి చేశారు. నైపుణ్యంతో వీథి లైట్లను కొట్టుకుంటూ పోలీస్ బారికేడ్లను పెద్ద శబ్ధంతో రహదారిపై తోసుకుంటూ సాగిన ఆందోళనకారులు పోలీసు బలగాలను సమర్ధవంతంగా ఎంజీరోడ్డులోకి నెట్టవేశారు. పోలీసులు నిస్సహా యంగాచూస్తుండగానే వారి జీపును తగలపెట్టారు. ఆర్ అండ్ బి కార్యాలయంలో మూడు జీపులకు నిప్పుపెట్టారు. కలెక్టర్ కార్యాలయంపైకి రాళ్లు రువ్వారు. చినశ్రీను ఇంటి వద్ద విద్యార్థులపైదాడి చేసిన పాత నేరగాళ్ళైన సిక్కులను పట్టుకోవటానికి కె ఎల్ పురంలోని వారి నివాసాలపైకి దాడి చేశారు. గురు ద్వారపైకి రాళ్ళు రువ్వి అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన పోలీస్ అధికారులు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. 

కర్ఫ్యూ మొదటి రోజు... అక్టోబర్ ఆరవ తేదీ ఉదయం ఆందోళనలు కొనగాయి భాష్పవాయుగోళాల ప్రయోగం కొనసాగింది. రబ్బరు బుల్లెట్లూ ప్రయోగించాల్సి వచ్చింది. గాజులరేగలోని సీతమ్ ఇంజనీ రింగ్ కళాశాలపైనా పెద్ద ఎత్తున దాడి, విధ్వంసకాండ సాగింది. అన్నీ బొత్సా, ఆయన బంధువుల, అనుచరుల ఆస్తులు ఇళ్ళే లక్ష్యంగా సాగిన దాడులు. దాడులు చేసిన వారు నిర్ధిష్టసంఖ్యలోనే వుండ వచ్చుగాక. అయితే వాటిని చూసి ఆనందించిన వారు మాత్రం వేలల్లోనే కనిపించారు. ఎవరిని కదిలిం చినా మరో భావనకు తావులేని మాటే. వాళ్ళ ఆగడాలు భరించిన వారికే  అర్థమవుతాయి. ఆస్థులు పోగేసుకోవటానికి విజయనగరం ప్రజలను నిర్ధాక్షిణ్యంగా తొక్కేసారంటూ పట్టరాని ఆగ్రహం. ఆస్థులను పెంచుకోవటంలో వున్న శ్రద్ధలోని ఆవగింజంతైనా ఇక్కడి ప్రజలపైనా, పట్టణంపైనా లేదన్న ఆవేదన. పోలీసులు కూడా దీనికి మినహాయింపు కాకపోవటం ఈ సందర్భంగా ప్రస్థావనార్హం. బొత్సా కుటుంబం ఆస్థుల విధ్వంసకాండను చూస్తూ ఆనందించని వర్గాలు బహు అరుదుగా కనిపించాయి. అందుకే నేమో కర్ఫ్యూ పెట్టించింది, ఆ సందర్భంగా కరెంటు తీయించింది బొత్సానే అని అంటూ వచ్చిన వదం తులూ నిజమేనన్నంతగా నమ్మకాన్ని పెంచాయి. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేశార ని, బొత్సా ముఖ్యమంత్రి పీఠం ఎక్కారంటూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాకిన పుకార్లతో మీడియాకు ఊపిరా డలేదు. 

విజయనగరం... ఎక్కడ వుంది అంటూ వెతుక్కునే ఢిల్లీ పెద్దలకు, జాతీయ మీడియాకు స్పష్టంగా దాని రూపురేఖలు అర్ధమయ్యాయి. అయితే వారికి కానీ, రాష్ట్రంలోని పోలీస్ పెద్దలకు కానీ, తలలు బద్దలు కొట్టుకునే అనేక మందికి కానీ అర్ధంకాని దల్లా ఒక్కటే. ప్రశాంతతకు మారుపేరైన విజయనగరం, ఒక చెంప కొడితే మరోచెంప చూపించే ప్రజలు ఒక్కసారిగా ఇంతటి ప్రణాళికాబద్ధ హింసాత్మక తిరుగుబాటుకు ఎలా దిగారు? భరింపశక్యం కానంత విద్వేషపూరిత వ్యతిరేకత వున్న మాట నిజమేకాని అది ఈ స్థాయి విధ్వంసాలకు దారితీయటం మా సర్వీసులే చూడలేదే? దీని వెనుక ఎవరో వున్నారు? అన్న బలమైన అనుమానంతో పోలీసులు తమ విచారణను సాగించారు. పదుల సంఖ్యలో యువకులను, వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వయంగా ఐజీ స్థాయి అధికారి వారిని విచారిస్తూ సాగారు. ఈ సంఖ్యను అధికారికంగా ప్రకటించటానికి అధికారులు నిరాకరించారు. రెండు రోజులపాటు సడలింపే లేని కర్ఫ్యూతో ప్రజలకు ఉక్కపోతకు గురయ్యారు. రాజకీయ పార్టీలు తమ స్వార్థప్రయోజనాల కోసం వున్నాయన్న రాజకీయ పరిశీలకుల అభిప్రాయాలనూ దర్యాప్తు అధికారలు పరిగణలోకి తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

ఎంతో మంది మహానుభావులకు ఆలవాలమైన విజయనగరం మసిబారింది. వికటించిన ఉద్యమ స్ఫూర్తి సరికొత్త ముద్రను విడిచిపెట్టింది. సమైక్య ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని లూటీలు తప్ప ఏ ప్రయోజనమూ ఆశించని అల్లరి మూకలు చెలరేగాయా? లేక రాజకీయపరిశీలకులు భావిస్తున్నట్లు రాజకీయ పార్టీలు అధిపత్య పోరులో భాగంగా అల్లరిమూకలను ఉద్యమంపేర విధ్వంసానికి ఉసిగొల్పాయా? తేల్చాల్సిన దర్యాప్తు బృందాలు పనిలోనిమగ్నమయ్యాయి. బహుశా శ్రీకృష్ణ కమిటీ నివేదికలా అది ఎప్పటికీ వెలుగుచూడకపోవచ్చు. వైఫల్య ఫలితానికి జిల్లా ఎస్పీ బదిలీ కావచ్చు. ఎపి ఎన్జీవోలు, ఇతర జెఎసీలు ఉద్యమ విధ్వంసంతో మాకు సంబంధం లేదని శ్రీకాకుళంలో ప్రకటించనూవచ్చు. బొత్స సత్తిబాబు వర్గం తమ స్వీయతప్పిదమేమైనా వుందా? అంటూ ఆత్మ విమర్శకు పాల్పడకపోవచ్చు. కానీ, విజయనగర చరిత్రపుటలకు అంటిన ఎర్రటి మసి మరక తొలిగే అవకాశాలు లేశమాత్రమే.

పండు వెన్నెల నలుపెక్కింది

నీవడిగే ఏ ప్రశ్నకూ సమాధానం రాదు
లేకకాదు...  మరో ప్రశ్నకు తావివ్వరాదని
ప్రకోపించిన ప్రేమ పైత్యానికి సహజ వైద్యమేది?!
కష్టసుఖాలు జీవితంలో వెన్నంటే...
కర్మానుసారమే... పాలేదెక్కువన్నది...
మనఃకాంత చెంతకు చేరలేని ఏకాంతం
దూరంగా నెట్టబడే ప్రతీ అడుగూ
ముప్పేటసాగే సుమధుర కలియికకేనన్న
నిన్నటి ఆశకు నిరాశ రెక్కలొచ్చిన వేళ...
సూరీడు మసకేశాడు 
పండువెన్నెల నలుపెక్కింది
మోహప్రేమబంధం వీడుతోంది...
ఒడ్డెక్కిన అల కడలికౌగిలి చేరేతీరు...

4, మే 2013, శనివారం

నేను కొంచెం తేడా


ప్రతీసారీ సరికొత్తగా ముసుగు వేసుకుంటూనే వున్నాను. గుర్తించిన ప్రతీ సందర్భం నన్ను దహించి వేస్తూనే వుంది. బహుశా అందుకేనేమో ఎదుటి వ్యక్తులలో కనపడినప్పుడు మరింతగా అసహనం అప్రయత్నంగా ప్రకటిమవుతోంది. భాషకీ, ఆలోచనకీ మధ్య మౌన నిర్వేదన పెట్టనిగోడలా నిలిచే సందర్భాలే ఎక్కువగా తారసపడుతున్న కాలంలో బతుకీడుస్తున్నా. అజీవిగా జీవించటానికి బతికే వున్నానన్న బలమైన భావన ఎండని జలపాతమై నన్ను తడిపేస్తూనే వుంది. చేతలకూ, మాటలకూ మధ్య శాంతసమన్వయం నీకే కాదూ... నాకూ లేదని రోజూ గమనిస్తూనేవున్నా. అందుకే నీవైపు వేలు చూడటం మానేసింది. తనలో నలుపు కూడా వుందని గురివింద గింజకూ అర్థమైంది. ఎందుకలా విర్రవీగుతావు... అంగీకారం నిన్ను గొప్పవాడినేం చేయదు. నీ అనంగీకారంతో కూడా పనిలేదు. తాపత్రయం దేనికో అర్థమైతే ఏ చెట్టుకిందో కూర్చుంటా కదా?! ఎండమావిలా అంతా తెలిసినట్టే వుంటుంది. అజ్ఞానం బయటపడే సమయానికి ఉష్ణాయాసం మాత్రమే మిగులుతోంది. ఇదో నిత్య ప్రహసనం. ప్రతీ ఘడియకూ సరికొత్తగా మొదలవుతుంది. ప్రతీ ముగింపూ నూతనమే. భావోద్వేగాల భావప్రాప్తి... ఓ భౌతికావసరం... అకు, పూవు, చెట్టు... గడియారం, కంప్యూటర్, సెల్ ఫోన్... నేను... తేడా ఏమీ లేదు. నేను వాటిని వాడుకుంటున్నాను. అవీ నన్ను వాడుకుంటూనే వున్నాయి. అందుకే ఇప్పుడు మరోసారి సరికొత్తగా ప్రకటిస్తున్నా... నేను కొంచెం తేడా... నేను అందరిలాంటి వాడినికాదు...

24, ఫిబ్రవరి 2013, ఆదివారం

మావోలపై పోలీసుల అనుబంధాల వల

కొండ దిగుతూ...
 ఆంధ్ర ఒడిష్షా సరిహద్దులలో, విశాఖ మన్యంలో మావోయిస్టులను పూర్తిగా కట్టడి చేయటానికి పోలీసులు త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారా? ఎన్ని ప్రచారాలు సాగుతున్నా మావోయిస్టులు తమ ఉనికిని వీసమెత్తు కూడా బయటపెట్టకుండా చాపకింద నీరులా సాగిపోతున్నారా? అంతుపట్టని నిశ్శబ్ధం వెనుక సాగుతున్నదేమిటి? పోలీసులు అమలు చేస్తున్న వ్యూహాలు నిజంగానే ఉద్యమ ప్రభావాన్ని తగ్గించేస్తాయా? వీటికి సమాధానం వెతికే క్రమమే ఈ కథనం.

నిషేధిత మావోయిస్టు పార్టీ ఆంధ్రా ఒడిష్షా సరిహద్దు ప్రాంతంలో ఉత్తరాంధ్రలోని విస్తారమైన అటవీప్రాంతంలో పట్టును కలిగి వుంది. తమ ప్రాబల్యాన్ని చాటుకోవటానికి గత కొన్నేళ్ళుగా మావోలు అనేక ఘటనలకు పాల్పడుతూ వస్తున్నారు. ప్రభుత్వాస్థుల విధ్వంసం, రాజకీయ నాయకులను, అధికారులను ఖతం చేయటం, ఇన్ ఫార్మర్లను హత్య చేయటం వంటి అనేక సంఘటనలు కలకలం సృష్టించాయి. బలిమెల ఘటనలో పదుల సంఖ్యలో బలగాలు దుర్మరణం పాలవటాన్ని ప్రభుత్వం, సాయుధ పోలీస్ బలగాలు సీరియస్ గానే పరిగణలోకి తీసుకున్నాయి. రెండో వైపు మావోలను కట్టడి చేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ అదే స్థాయిలో సాయుధ బలగాలతో మావోలపై విరుచుకుపడ్డాయి. హక్కుల సంఘాలు బూటకపు ఎన్ కౌంటర్లని ఆరోపిస్తున్న ఘటనలలో ఎంతో మంది మావోయిస్టు పార్టీ కీలక నేతలు, ఎర్ర సైనికులు చనిపోయారు. ఇరువైపులా సాగుతున్న ఈ ఆధిపత్య పోరులో గిరిజన పల్లెలు తల్లడిల్లి పోయాయి. అన్నల రాకతో అంతోఇంతో ప్రశ్నించే తత్వాన్ని, జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నామని అనుకున్న తరాన్ని వెనక్కు నెడుతూ మరో తరం గిరిజన తండాలలో నడయాడుతోంది. కేవలం ఆయుధంతో మాత్రమే మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయటం సాధ్యం కాదని, గ్రామాల్లో మావోయిస్టుల ఏరివేత పేరుతో సాగుతున్న 'ఆపరేషన్స్' తో గిరిజనంలో తమ పట్ల వ్యతిరేకత ప్రబలుతోందని, ఆ ద్వేషం మావోయిస్టుల పట్ల ప్రేమగా మారుతోందని కాలక్రమంలో ప్రభుత్వం గుర్తించింది. దీనితో తన తంత్రానికి పదునుపెట్టింది.  గ్రేహౌండ్స్, సిఆర్ పిఎఫ్, బిఎస్ఎఫ్, సాయుధ పోలీస్ దళాలు ఓ పక్క గ్రామాలను జల్లెడ పడుతున్నాయి. అడివిలోని ప్రతీ ఆకునీ అనుమానిస్తూ సాగుతున్నాయి. ప్రభుత్వం వందల కోట్లను గిరిజనుల అభివృద్ధి నిమిత్తం ఖర్చు చేస్తున్నట్లు ప్రకటనలు గుప్పిస్తోంది. రహదారులు, పాఠశాలలు, వసతి గృహాలు, తాగునీరు, వైద్యం వంటి మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా ప్రయత్నం సాగిస్తోంది. మరో వైపు అన్నింటికీ మూలమైన డబ్బును ఎరగా చూపిస్తూ లొంగిపోయిన వారికి లక్షలాది రూపాయలు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తోంది. పై ప్రయత్నాలకు సమాంతరంగా విశాఖ జిల్లాలో పోలీసులు సరికొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టారు. మావోయిస్టుల పెట్టని కోటలుగా చెలామణీ అవుతున్న లోతట్టు గ్రామాలలోకి ఎన్నడూ అడుగుపెట్టని పోలీస్ ఉన్నతాధికారులు సద్భావనా యాత్ర పేరుతో మందీ మార్భలంతో సాగుతున్నారు. విశాఖ జిల్లా రూరల్ ఎస్పీ జి శ్రీనివాస్ నేతృత్వంలో మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా వున్న పలువురి స్వగ్రామాలకు, ఇళ్ళకు పోలీసులు సాగుతున్నారు... ఆత్మీయానురాగాలు ఒలికిస్తున్నారు. వారితో మాట, పాట కలుపుతున్నారు. మేం మీ స్నేహితులమంటూ నమ్మబలుకుతున్నారు. 
 
''మీ బిడ్డలను చూసుకునే అవకాశం లేక ఈ వయస్సులో మీరు ఎంతలా కుమిలిపోతున్నారో మాకు తెలుసు. పార్టీని వీడి రమ్మని వారికి చెప్పండి. లొంగిపోయిన వారికి ఎలాంటి హానీ వుండదు. మాది హామీ. వారిని మా సోదరుల్లా చూసుకుంటాం. మీకు ఏ సాయం కావల్సి వచ్చినా మేం వున్నాం. మేమూ మీ బిడ్డల వంటి వారిమే'' వంటి మాటలతో వారి మనస్సులను గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మావోయిస్టు సీఆర్సీసికి చెందిన మొదటి కంపెనీకి నాయకత్వం వహిస్తున్న కుడుముల వెంకట్రావు అలియాస్ రవి స్వగ్రామం, చింతపల్లి మండలంలోని కొమ్మంగికి జి శ్రీనివాస్ చేరుకున్నారు. రహదారి, ప్రాంతమూ రాత్రివేళ ప్రమాదకరమని తెలిసినా మావోయిస్టు నేత తల్లిదండ్రులతో, గ్రామస్తులతో ఆయన తన బృందంతో సుమారు నాలుగు గంటలకు పైగా గడిపారు. చలిమంటల నడుమ వారి కష్టసుఖాలను పంచుకున్నారు. గ్రామ సమస్యలను పరిష్కరించటానికి హామీలను, గుడి నిర్మాణానికి సాయం చేస్తామన్న మాటను వారికి ఇచ్చారు. మావోయిస్టు నేత తల్లిదండ్రులకు సంప్రదాయబద్ధంగా పండ్లు, స్వీట్లతో పాటు నూతన వస్త్రాలనూ అందించారు. మావోయిస్టులు లొంగిపోయి స్వేచ్ఛా జీవితాన్ని కొనసాగించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మావోయిస్టు నేతల ఫోటోలు, వారి తలలకు కట్టిన వెలతో కూడిన క్యాలెండర్లను అదే సమయంలో పోలీసులు గ్రామస్తులకు విస్తారంగా పంచిపెట్టారు. కుడుముల రవి అలియాస్ వెంకట్రావు తల్లిదండ్రులు ఆరుపదులు దాటిన వయస్సు. ఎస్పీ శ్రీనివాస్, ఓఎస్డీ దామోదర్ తదితరులు తన ఇంటికి రావటం, తనకు నూతన వస్త్రాలను అందించి, పండ్లు పలహారాలు చేతిలో పెట్టడంతో కళ్ళనీళ్ళు తిరిగాయి. ఎప్పుడో 1997లో దళాలలోకి వెళ్ళిపోయిన కొడుకు ఆరోగ్యం సక్రమంగా లేదని తెలిసిన ఆ తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. కనిపించీ కనిపించకుండా వున్న ఈ వయస్సులో కొడుకు వచ్చేస్తే బాగుంటుందని ఆ తండ్రి ఆశిస్తున్నాడు. ఇంటిల్లపాదీ వెంకట్రావు ఇంటికి రావాలనే కోరుకుంటున్నారు. రవికి నమ్మకం కలిగించి తీసుకురావటానికే ప్రయత్నిస్తామని కుటుంబం చెపుతోంది. తల్లి మాత్రం కళ్ళావేళ్ళాపట్టుకుని బతిమలాడుదామనుకుంటే కంటికి కనిపించటమే కరవయ్యిందని వాపోయింది. పోలీసులు మీకు డబ్బులేమైనా ఇచ్చారా? అన్న ప్రశ్నకు రవి తండ్రి శ్రీరామమూర్తి కోపగించుకున్నారు. కష్టార్జితంతో కట్టుకున్నామని, పోలీసుల నుంచి పైసా కూడా ఆశించలేదని స్పష్టం చేశాడు. సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరం... లోయ అంచునే సాగే కాలిబాటలో ప్రయాణం. తుపాకికీ, తుపాకికీ నడుమ గెరిల్లాయుద్ధతంత్రంలో పాటించే వెడం. శత్రువు పొదలమాటు నుంచి దాడిచేసినా భారీ నష్టం కలగకుండా ముందస్తు వ్యూహం ప్రకారం సాగిన ప్రయాణం. ఈ ప్రయాణానికి రక్షణగా మొదటి కాంటూర్ పై రక్షణగా సాగుతున్న కూబింగ్ దళాలు... ప్రతీ అడుగూ అప్రమత్తంగా, గంటకుపైగా సాగిన నడక... శిఖరాగ్రాన వున్న ఆరు ఇళ్ళు... అదే జీ కే వీథి మండలంలోని దారాలబయలు గ్రామం. మావోయిస్టు సాయుధ మిలీషియా కీలకనేత జన్ను మోహనరావు స్వగ్రామం అది. పోలీసుల చేతిలో చావు దెబ్బలు తిని అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి రాజును పలకరించటానికి నాలుగు రోజుల క్రితమే ఆయన ఆ గ్రామానికి వచ్చి వెళ్ళారు. నాలుగు ల్యాండ్ మైన్లను తనకు రక్షణకవచంగా వుంచుకుని తల్లిదండ్రులతో యోగక్షేమాలను కలబోసుకున్నాడు. ఇప్పుడు అదే గ్రామానికి, ఆయన ఇంటికే నర్సీపట్నం ఓఎస్ డి దామోదర్, సిఐలు వెంకట్రావు, రామకృష్ణలు తమ బృందంతో చేరుకున్నారు. సీన్ రిపీట్. ఆ గిరిజన పల్లె ఎన్నడూ చూడని, ఖరీదైన స్వీట్లు, బిస్కెట్లు ఆ పది మంది గ్రామస్తులకూ పంచారు. దళసభ్యుడు మోహనరావు తల్లిదండ్రులతో అనునయంగా మాట్లాడారు. వారికి నూతన దుస్తులను అందించారు. అందిస్తున్న ఆర్థిక సాయాన్ని ఆ దళసభ్యుని కుటుంబం సున్నితంగానే తిరస్కరించింది. పిల్లాపాపలతో కలిసి ఓఎస్డీ కిందనే కూర్చున్నారు. పదాలమార్పు... అంతే, భావం మాత్రం అదే. లొంగిపోతే అంతా మంచే జరుగుతుంది అంటూ సాగిన మాటలు. కాకపోతే నిన్న ఎస్పీ శ్రీనివాస్... నేడు ఓఎస్ స్డీ దామోదర్. చీపురుగొంది గ్రామంలో షెల్టర్ తీసుకున్న దళసభ్యులను చుట్టుముట్టిన సాయుధ పోలీస్ బలగాలు ఎలాంటి కాల్పులకు పాల్పడకుండా గంటలు తరబడి సహనంతో వేచిచూసి ఆరుగురిని అదుపులోకి తీసుకుని క్షేమంగా కోర్టులో హాజరుపరిచిన ఘటనను ఈ సందర్భంగా ఓఎస్డీ దామోదర్ ప్రస్థావించారు.
పోలీసులు మంచిగనే చెపుతున్నారు. మేం కూడా సరెండర్ అవ్వమనే చెపుతున్నాం. లొంగిపోతే మావోయిస్టుల చేతిలో చావు తప్పదన్న భయం మా వాడిని వెన్నాడుతోందంటూ మోహన్రావు తండ్రి జన్ను చిన్నారావు మెల్లగా చెప్పాడు. మోహనరావు తమ్ముడు రాజు మాత్రం భయాన్ని దిగమింగుకుని తన తండ్రిని దారుణంగా కొట్టిన పోలీసులను నమ్మెదెట్లా అంటూ కళ్ళనీరు గుక్కుకున్నాడు. ఏ పాపమూ చేయని తన తండ్రిని చిత్ర హింసలు పాల్చేశారంటూ వాపోయాడు. ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని, ఆయనకు వైద్యం చేయిస్తున్నామనీ, ఎక్కడో పాడేరులో కాపురం చేసుకుంటున్న తనకు ఆయన కోసం ప్రతీవారం రావటం భారమేనని చెప్పాడు. కొట్టిన తరువాత మంచిగ మాటలు చెప్పినా ఫలిమేముంది అంటూ ప్రశ్నించాడు. ఇలాగైతే ఎలా నమ్మేది అన్న ప్రశ్న అతని మాటలో, జారని కన్నీటిలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించటానికి, దోపిడీదారుల ఆటకట్టించటానికీ మావోయిస్టులు వుండాల్సిందే... పార్టీని, మావోయిస్టు తుపాకీని వీడి, పోలీస్ తుపాకీ చేతపట్టిన ఓ మాజీ అభిప్రాయం ఇది. బహుశా కొండకోనల్లోని ఎన్నో పల్లెల్లోని గిరిజనుల అభిప్రాయమూ ఇదే. ఉద్యోగాలు, డబ్బులు, అప్యాయతానురాగాల ప్రదర్శనలూ ఇవన్నీ ఆ ప్రజల మనస్సులను గెలుచుకోవటానికి ఏ మేరకు ఉపయోగపడతాయన్నది ప్రస్తుతానికి సందిగ్ధ ప్రశ్నే. మావోయిస్టు అగ్రనేతలు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఆర్కేను పోలీసులు చుట్టుముట్టారు వంటి వార్తలు మీడియాలో ప్రముఖంగా రావటానికి ఎంతగానో సహకరించిన పోలీసులకు గత ఆరు నెలలకుపైగా కాలంలో మావోయిస్టుల మౌనం అర్థంకాకుండా వుంది. కదలికలు అంతుచిక్కకుండా వున్నాయి. అసలు వున్నారా? లేరా? వుంటే ఏమయ్యారు? ఎక్కడ వున్నారు? ఏం ప్రణాళికలను రచిస్తున్నారు? వంటి ప్రశ్నలకు నిఘా వర్గాలు తెల్లమొఖమేస్తున్నాయి. జరుగుతున్న సమావేశాలకు, సభలకు సంబంధించిన ఫోటోలుకాని, వీడియో ఫుటేజ్ కానీ లభ్యంకాని పరిస్థితి. అయితే ఏఓబి బాధ్యతలలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయని, పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని పోలీసులు చెపుతున్న దళాలను పునర్నిర్మించే కార్యక్రమంలో మావోలు నిమగ్నమై వున్నారని, మిలీషియాను మరింత బలోపేతం చేసుకుంటూ, సైద్దాంతికంగా వారిని బలపరుచుకునే దిశగా వారు సాగుతున్నారని కర్ణాకర్ణిగా వెలువడుతున్న వార్తలు పోలీసులను ఒకింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రశ్నార్ధకమైన భవిష్యత్తును పక్కన పెట్టి ఆశావహదృక్పథంలో సాగిస్తున్న సద్భావన యాత్ర వంటి కార్యక్రమాల ఫలితాలు ఏ విధంగా వుండబోతున్నాయన్నది కాలమే తేల్చాలి.
లోతట్టు అటవీప్రాంతంలోని దారాలబయలు గ్రామం

15, జనవరి 2013, మంగళవారం

స్వగతావేదన

చిన్ననాటి నవల పదే పదే గుర్తుకు వస్తూన్న సందర్భం... అవే సంఘటనలు పునరావృతమవుతూనే వున్నాయి. ఓల్గా వ్రాసిన నవల చతురలో ప్రచురితమైంది. ఆ నవల మొత్తం గుర్తు లేదు కానీ... దానిలో ఓ భాగంలో అప్పటి వరకూ అంతా ఒకే కుటుంబంలా మెలిగిన ఓ విప్లవ కమ్యూనిస్టు కూటమికి చెందిన వారు విభేదాలు రాగానే ఎంత విద్వేషపూరితంగా మారిపోతారో అంటూ కన్నీళ్ళు పెట్టిన విషయం... ఇది చదివి సుమారుగా 25సంవత్సరాలు పైబడే వుంటుంది. అప్పటి ఆ ప్రశ్న ఆ తరువాత కొండపల్లి కోటేశ్వరమ్మ తన జ్ఞాపకాలను పరిచినప్పుడూ ప్రశ్నించారు. శివసాగర్ మరణించినప్పుడు ఆమెతో మాట్లాడుతూంటే కళ్లలో నిలిచిన కన్నీటి చుక్కలను జారనీయకుండా పొదివిపట్టుకుని ఆమె వేసిన ప్రశ్న పచ్చిగా నాలో నిలిచిపోయిన నాటి ఆ కథా జ్ఞాపకాన్ని తట్టిలేపింది. లోలోతుల్లో నాకు తెలియకుండానే ఎంతగానో అభిమానించిన రామకృష్ణ గారు... చార్వాక రామకృష్ణగారు...నా మామగారు... ఆయన జీవన శైలి, ఆయన నిబద్దత, డబ్బుల పట్ల ఆయన అవసరవిముఖత నాలో తెలియకుండానే బలమైన ముద్రవేశాయి. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పోరాటాలు ఏకకాలంలో సాగాలంటూ ఆయన తుదిశ్వాస వరకూ చెప్పిన మాట బలంగా ముందుకు వస్తున్న నేపథ్యం ఆయనను మరిచిపోనీయకుండా చేస్తున్నాయి. కులం పట్టుగురించి ఆయనతో పంచుకున్న కొద్ది విషయాలే ఇప్పటికీ వెన్నాడుతూ వున్నాయి. అన్ని గ్రూపుల వారినీ ఆహ్వానిస్తూ ఎవరికీ స్వంతంకాకుండా అందరిదీ అయిన ఉద్యమంగా భావవిప్లవోద్యమాన్ని నడపాలని ఆయన తాపత్రయపడిన తీరు... ఆ క్రమంలో ఆయన ఎవ్వరికీ కాకుండా మిగిలిన దుస్థితి పదేపదే ప్రశ్నించుకున్న సందర్భాలు ఎన్నో. ఆయన మరణం తరువాత దగ్గరయిన కొద్దిమందీ రమకృష్ణగారి ఉద్యమశైలిపై వున్న అభిమానంతో కాక దానిని స్వంతం చేసుకోవాలని అని తెలిసినప్పుడు పూర్తిగా నిరాశలో కూరుకుపోయిన సందర్భం... ఓ ఉదయాన్నో గాఢ నిద్రలో వున్న నన్ను హఠాత్తుగా తట్టిలేపుతూనే వుంది. ఇప్పుడు మరోసారి... నాన్న అనుభవం... మరింత గాయం చేస్తూ నన్ను సలుపుతోంది. పదే పదే నాడు ఓల్గా వేసిన ప్రశ్నకు సమాధానం ఏమిటంటూ ప్రశ్నిస్తూనే వుంది. ప్రశ్నించటాన్ని భరించలేని కేంద్రీకృత ప్రజాస్వామ్యం... నియంతృత్వపోకడలతో వ్యక్తి నాయకత్వ వ్యామోహంతో సాగే విప్లవోద్యమాలు... ఓ వ్యక్తిని భావజాలదేముడిగా చేసి విగ్రహాలు పాతి పూజించే ఫక్తు భారతీయ సంస్కృతీ ప్రభావ బీజాలు... ప్రశ్నించిన ప్రతీగొంతుకా నొక్కబడుతూనే వుంది. వెలివేయబడుతూనే వుంది. ప్రశ్న ప్రతి కదలికా అనుమానాస్పదమే. ప్రతీ కలియకా ఓ విషపూరిత ప్రచారానికి వేదికే. నన్నంటుకోకు నా మాలకాకి అంటూ సాగే ఇనుపకచ్చడాల మధ్యసాగే గుంపు జీవితం... మందను కాపాడుకునే గొర్రెల కాపరిలా... అనుక్షణం అనుమానంతో కూడిన అప్రమత్తత. ఐక్యతకోసం అంటూనే అనైక్యతదిశగా సాగే లక్షణాలను మరింత బలోపేతం చేసుకుంటూ సాగే క్షణాలు... ఇదంతా ఓ అంతర్వేదన...ఆ కుటుంబాలలో పుట్టి రక్తసంబంధీకులకు, నా కులపోళ్ళకూ ఇవ్వని ప్రాధాన్యం భావసంబంధీకులకు ఇచ్చి నష్టపోయానే అన్న భావన కలిగిన క్షణాన వచ్చిన ఆవేదనా ప్రవాహం... ఇది నా స్వగతం... నాదైన స్వగతం...నాకు మాత్రమే స్వంతమైన ప్రకటితా పత్రం.