4, నవంబర్ 2016, శుక్రవారం

మరకలూ వుంటాయ్

కాల చక్రంతోపాటే పరిణామాలు కూడా వేగంగానే చోటుచేసుకుంటున్నాయి. నీతి, న్యాయం, పారదర్శకతలకే పెద్ద పీట అంటూ మైకొదలకుండా ఊదరకొడుతున్న నేత మాటలు చేతల్లో నీటిపాలవుతున్న ఘటన... యుద్ధంలో విజయమే లక్ష్యం, మార్గం కాదు ముఖ్యమంటూ పోలీసు లు తీర్చుకున్న బలిమెల ప్రతీకారం... ప్రేమించినందుకే ప్రాణం తీసే రాక్షసత్వం... వీటన్నింటి నడుమా నేతల వైఫల్యాలపై ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తులు. విశాఖ జీవన చిత్రంలో చకచకా సాగిపోయిన దృశ్యాల వెనుక తంతులపై కథనం.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ అధినేత పదేపదే పలు వేదికలపై మాట్లాడుతున్న మాట పారదర్శకత, అవినీతికి పాతర, నిజాయితీకే పట్టం. అన్నీ నిజమైతే ఎంత బాగుండు. నూరు శాతం సాధ్యమవుతుందన్న అత్యాశ ఎవ్వరికీ లేదు. కనీసం పాతిక శాతమైనా వుంటే బాగుం టుందని ఆశపడటం మానవ సహజం. ఆశ నిరాశై, నీరుగారి పోతోందనుకున్నప్పుడు నిస్పృహ ఆవరిస్తుంది. కాలగతిలో అదే ఆగ్రహ మవుతుంది. ప్రజల అవ్యక్తీకరణను మౌనార్ధాం గీకారం అనుకుంటే ఓటమితో కాలు కడుక్కోవ లసిందే. ఎవ్వరూ చెప్పరు. అధికారం తల కెక్కినప్పుడు చెప్పినా వినిపించుకుంటారన్న చిత్తభ్రమలు ఎవ్వరికీ లేవు. ఆశ్రిత పక్షపాతంతో, అపసవ్య దిశలో పనులు సాగుతున్నప్పుడు, ఓటేసిన ప్రతోడూ కార్యకర్తకాదన్న విజ్ఞతను మరిచిపోయినప్పుడు నమ్మకం కట్ట తెగుతుంది. అపనమ్మకం వరదై ఊరెక్కుతుంది. అప్పటికీ మేల్కోలేకపోతే ఓటమి శవమై వరిస్తుంది. ఇప్పుడు విశాఖ జిల్లాలో జరుగుతోందదే. గడచిన ఎన్నికల్లో ఖర్చుచేసిన కోట్లు కూడగట్టుకోవటంలో ఎవరికి వారే బిజిబిజీగా వున్నారు. రెండు చేతులూ చాలవంటూ అనుచరగణానికీ లైసెన్సులిచ్చేశారు. ఇదేమిటంటూ ప్రశ్నించిన ప్రతోడికీ ప్రతిపక్షమక్కస్సంటూ పచ్చబొట్టేయటం మొదలుపెట్టేశారు. తాము చెప్పిందే న్యాయమని, చెల్లుబాటు కాకపోతే భవిష్యత్తులో తమకు బతుకే లేదంటూ కూడటం మొదలుపెట్టారు. గెలిచిన ప్రతినిథులకు విలువేదంటూ రూములో రంకెలు వేశారు. ఇంకేముంది మీడియా గంట కట్టేసింది. నిజాయితీ ఎవరికి కావాలి? చెప్పిన పనిచేయనప్పుడు? డూడూ బసవన్నలా  మేం అడిగిన దానికల్లా తలలూపనప్పుడూ ఆ ముద్ర ఎందుకక్కరకొస్తుంది? మూకు మ్మడిగా పెద్దాయన దగ్గర మొరపెట్టుకున్నారు. 50ఏళ్ళ గెలుపు కోసం కలలు కనేటప్పుడు ఇవన్నీ తప్పదనుకున్నారో ఏమో... ఓ అధికారి బదిలీ అయ్యారు. యువకుడు నెమ్మదస్తుడే. నిబంధనల గీతకు ఓ అడుగు అటూ ఇటూ పడితే ఐఎఎస్ జీవితానికే మచ్చ అనుకునే కుర్రతనపు ఛాయలు ఇంకా తొలగని తనమేదో మిగిలే వుంది. నీతి, నిజాయతీలకు తోడు ఎవ్వరినీ ఖాతరు చేయని పెంకితనం కూడా ఆయన స్వంతం. అన్నీ కలసి అసమర్థుడంటూ ఆయనకో ముద్రనేశాయి. ఇంకేముంది గాలిలో దీపంలా ఆయన జీవితాన్ని వేలాడేశారు. 
విశాఖ మన్యం అందమైనదే కాదు. ఎన్నో అపురూపమైన ఖనిజాలకు కూడా నెలవు. ఎన్నో దశాబ్దాలుగా గిరిజనుల కోసమే అంటూన్న తుపాకులు ఓ వైపు. రాజ్యం ఒప్పుకోదంటూ అత్యాధునిక ఆయుధాలతో తిరిగే అధికార ఖాకీ మరో వైపు. మధ్య సాగుతున్న ఘర్షణలకు అడవి మౌన సాక్షిగా నిలిచేవుంది. ప్రాణాలెవ్వరివైనా విలువైనవే. యుద్ధమంటూ జరిగితే న్యాయాన్యాల ప్రసక్తే రాదు. శత్రువుపై దూసుకువచ్చే తూటాకు ప్రాణం విలువ తెలియనే తెలియదు. గెలుపే లక్ష్యం. పగ, ప్రతీకారాలతో ఎత్తుకు పై ఎత్తులు ఇక్కడ రాజ్యమేలుతూంటాయి. సమయమొస్తే సామూహిక హత్యాకాండలకు తెర తీస్తారు. ఎవరి న్యాయం వారిదే. ఉద్యమం జీవనదంటూ ఎర్ర తుపాకీ ఘర్జిస్తూంటుంది. వట్టి మాటలు కట్టిపెట్టండంటూ అధికారం పోలీస్ స్వరమై హూంకరిస్తూంటుంది. మధ్యలో బతకు ఛిద్రమవుతూన్న గిరిజీవితం వాస్తవావాస్తవాల మధ్య నిజనిర్ధారణలో నలిగిపోతోంది. తాజాగా రామగుహ కాల్పుల్లో ఇప్పటికి 32 మంది మృతి చెందారు. మరో 15 మంది ఆచూకీ లేకుండా పోయారు. మృతుల్లో 14మందిని అధికారికంగా గుర్తించిన వారే లేరు. చనిపోయినోడు మా బిడ్డే అంటూ కన్నీరెట్టలేని దైన్యం. అనాథ శవమై ఖననమవుతున్న మృతదేహాల మాటున మరుగుతున్న రక్తం మౌనవేదనై గడ్డకడుతోంది. అడవిలో ఏ చెట్టుచాటులో, బలిమెల రిజర్వాయ్ పరిథిలో ఏదో ఒక ఒడ్డున జనం తుపాకీ శవమై ప్రకటితమవుతూనే వుంటుంది మరికొద్దికాలం. ప్రతీకారేచ్ఛతో ప్రతిదాడులు అలక్ష్యంగా సాగుతాయన్న భయం మాటున రోజులు భారంగా గడుస్తున్నాయి. అడవి ఇప్పుడు నివురుగప్పిన నిప్పు.
శాస్త్రీయంగా మనిషీ జంతువే. మిగిలిన జంతువుల్లో కెల్లా మనిషి ఉత్తమోత్తముడు. అందుకనే అవసరాన్ని మించి అంతా తనకేనన్నట్లు ఆబగా, రాక్షసంగా కౌగలించుకుంటాడు. రక్తమంతా ఎరుపు కాదంటూ గోడలు కడుతూంటాడు. మనిషి ఆలోచన కలిగిన జంతువు. అందుకనే అందరూ  ఒకటి కాదన్న వాదనను బలంగా ముందుకు తోస్తాడు. రేపో మాపో చేతికందొస్తాడన్న బిడ్డ... హఠాత్తుగా లేడన్న వార్తను జీర్ణం చేసుకోవటం ఒకింత కష్టమే. మా అబ్బాయిని రక్షించండి అంటూ ప్రాధేయ పడ్డ ఓ తల్లి పేగు దగాపడింది. రాజకీయానికి, అధికార ఖాకీ అండగా నిలిచిం దంటూ ఆక్రోశం ఆగ్రహమై రోడ్డెక్కింది. ఇది నిజమేనంటూ అధికార, ప్రతిపక్షాలు ఎవరికివారే గెంతెత్తారు. మేం జనంపక్షమే నంటూ ఎవరికి వారే తెరమీద పండించారు. ఓ అమ్మాయి, అబ్బాయిల మధ్య స్త్రీపురుష ప్రేమ బంధం, పడక సంబంధం తప్ప మరేమీ వుండదన్న ప్రగాఢ విశ్వాసం చిక్కగా పరుచుకునే వుంది. అదేమీ లేదన్నా నమ్మలేనంత మూఢనమ్మకం మనలో కరుడుకట్టింది. మూఢత్వం ఉగ్రవాద ఛాయల్లో ఎప్పుడూ పదిలంగానే వుంటుంది. మనిషి మరుగుజ్జుగా మారిపోతాడు. తేలిగ్గా తలలు నరికేస్తూంటాడు. దేనినైనా ప్రేమించగలిగిన వాడు రాక్షసుడిగా ఎలా మారగలడన్న ప్రాథమిక ప్రశ్నకు సమాధానమే దొరకదు. ప్రేమ కలుషితమ య్యింది. చిక్కనైన స్నేహ బంధానికి అక్రమ ప్రేమ సంబంధం మరకంటింది. దీనితో ప్రదీప్ నిండు ప్రాణం చిత్రహింసలమాటున ఉరివేయబడింది. కల్తీ ప్రేమా వర్థిల్లుగాక. 
మనిషి ఎప్పుడు సంతృప్తాసంతృప్తుల మధ్య డోలాయమాన ప్రయాణం చేస్తూనే వుంటాడు. బాబు తప్ప మరెవ్వరూ రాష్ట్రానికి లేరన్న నమ్మకం మెల్లగా సన్నబడుతోంది. అది చంద్రునిపై వున్న అపనమ్మకం కాదు. నక్షత్రాల వన్నెపై వున్న అనుమానం మాత్రమే. ఇప్పుడు సరిచేసుకో వాలసింది నాయకుడే. కలుపుగోలుగా వుండాల్సిందే. అయినేం కాఠిన్యం లేకపోతే మనుగడే కష్టం కావచ్చు. ఇదీ ఇప్పుడు జనం మాట్లాడుకుంటోంది. మెరుపుల చాటున మరకలూ వుంటాయి. తస్మాత్ జాగ్రత్త.