26, మార్చి 2017, ఆదివారం

నీ ఎదుట సాగిలపడుతూనే వుంటాను

వెలుగు సవ్వడి జాడల వెంబడి
బతుకుబాట బండి సాగదా నేస్తం?
జ్ఞాపకాల 'ఛీ'కటి గాలింపులను
మనస్సును దేవేస్తున్న చేదు అనుభూతులను
నరాలను నుజ్జునుజ్జు చేసి
మరుగుజ్జులను చేసి ఆడిస్తున్న అనుభవాలను
సముద్రపుటలల తెరలమాటున వదిలి
వెలుగు సవ్వడి జాడల వెంబడి
బతుకు బాట బండి సాగదా నేస్తం?

అసత్యారోపణా?!
వ్యర్థ క్షణికావేశ నిందాప్రేలాపనా?!
ఏదేమైనా రెప్పమాటు కాలాన
పెదవిదాటిన మాట తెచ్చిన చేటు
బంధం బీటలు వారింది
మంటలార్పాల్సిన కాలం మాటల
తూటాలతో శవాలనూ ఛిద్రంచేసింది
అంతా అయిపోయింది
నమ్మకాన్ని అపనమ్మకం మింగేసింది
విశ్వాసాన్ని అవిశ్వాసం నమిలేసింది
ఇప్పుడు నేను బేలనో? ధీరనో?
ఒకానొక శూన్యావృత స్వయంసృష్టి
కాలుష్యకోరల్లో చిక్కుకున్న కాలం
యాంత్రిక జనజీవనయాగంలోకి
నిన్నూ, నన్నూ నెట్టేస్తోంది

ఆశ... ఎక్కడో మిణుగురులా...
అందుకే ఇంకా జీవచ్ఛవాల్లా
అయినా, జీవించేస్తూనే వున్నాం
ఎంతటి అగ్నిపర్వతమైనా 
సుక్షేత్రమై పచ్చబారాల్సిందే
సునామీలైనా, సుడిగుండాలైనా
వినాశక విధ్వంసాల తరువాత 
చిరుఘోషల సాయం సంధ్యలతో
ప్రశాంతతలను పంచాల్సిందే
నిద్రలేని రాత్రులను, నిద్రలేమి కళ్ళనూ
పనిమాటున దాచేస్తూ
చూస్తేనే వుంటాను, అందాకా
కుళ్లూ, కుత్సితాలు లేని
ఒట్టిపోయిన మనస్సుతో సాగిపోతూంటాను..
నీ ఎదుట సాగిలపడుతూనే వుంటాను.
26/04/2012

ఇంకెంత కాలం?

పురుటి నొప్పుల ప్రసవ వేదన... బిడ్డకు జన్మనిచ్చిన తరువాత అమ్మగా మారిన అమ్మాయికి అది పునర్జన్మ. అమ్మకు సాటి అమ్మేనంటూ భాష, జాతి, కులమతాలకు అతీతంగా అంగీకరించే సత్యం. ఇప్పుడు అది పొలకమారుతోంది. నవమాసాలూ మోసి, కన్నపేగును తెంచుకుని పుట్టిన పసికందుని అలౌకికానందంతో హత్తుకునే మాతృత్వపు చిత్రాలు... అవి మసకబారుతున్నాయి. లింగ బేధాల సరిహద్దులను చెరిపేస్తూ ఆకాశంలో సగం, సమం అంటూ నినదించి పట్టుమని పదిరోజులైనా కాలేదు. అప్రమేయంగానే... అయితేనేం అమ్మాయిలుగా పుట్టిన పాపానికి ముగ్గురు పసిగుడ్డులు నడిరోడ్డుపై గుక్కపట్టారు. కేవలం వారం రోజుల వ్యవథిలో ఎదుగుతున్న నగరం విశాఖలో జరిగిన సంఘటనలతో సభ్య సమాజం ఉలిక్కిపడింది. 
విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఓ సాధారణ కుటుంబం. భార్యాభర్తలిద్దరిదీ అనోన్యకాపురం. మొదటిబిడ్డ ఈ లోకంలోకి రాగానే నేను వుండలేనంటూ వెళ్ళిపోయింది. రెండో సారి ఆ తల్లి గర్భం దాల్చింది. ఈ సారి పుట్టబోయే బిడ్డ అనేకలోపాలతో పుడుతుందని వైద్యులు ముందుగానే హెచ్చరించారు. ఏం చేయాలో తేల్చుకునేలోగా నవమాసాలూ నిండాయి. ఆ తల్లి ఆడబిడ్డను ప్రసవించింది. తల్లి పరిస్థితి ఒకింత ఆందోళనగా వుండటంతో వైద్యులు ఐసియులో వుంచారు. అనారోగ్యంతో పుట్టిన ఆడబిడ్డను సాకలేమని భావించిన ఆ తండ్రి, తన భార్యకు తెలివిరాకముందే వదిలించుకోవాలని అనుకున్నాడు. బిడ్డను శ్మశానంలో పూడ్చిపెట్టమని సెక్యూరిటీ గార్డుకు అందించాడు. అదే సమయంలో అక్కడే వున్న కొందరు బిడ్డకదులుతూండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వున్నదంతా ఊడ్చేస్తాం, సాయమార్ధించైనా బతికించుకుంటామంటూ తాపత్రయపడుతున్న తల్లిదండ్రులున్న లోకంలో సాకలేమన్న భయంతో పాపను వదిలించుకోవటానికి ప్రయత్నించాడో సామాన్యుడు. ఓ పక్క అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న భార్య, మరో వైపు అనారోగ్యంతో అప్పుడే పుట్టిన ఆడ శిశువు. ఆదుకునే లోకముంటుందన్న నమ్మకాన్నే కోల్పోయాడో లేక సాయమర్థించటానికి ఇబ్బందే పడ్డాడో... మొత్తానికి లోకం కళ్ళల్లో మానవత్వం లేని ఓ తండ్రిగా మిగిలిపోయాడు.
మార్చి 14న జరిగిన ఈ ఘటన జరిగిన రెండు రోజులకే అంటే మార్చి 16న మరో ఘటన చోటుచేసుకుంది. ఆడపిల్లే. పుట్టి రెండు రోజులయ్యుంటుందేమో. ఏ తల్లి కన్నబిడ్డో. చూడచక్కని చిట్టితల్లి. ఆ తల్లికి మనసెట్టా ఒప్పిందో. సూర్యుడు పడమటికి జారి చీకటి దట్టంగా కమ్ముకుందని నిర్ధారించుకుని బిడ్డను నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి వరకూ వెచ్చగా వున్న అమ్మ ఒడి ఒక్కసారిగా మాయమవ్వటంతో ఆ పసిపాప గుక్కపట్టింది. చుట్టూ వున్న ఇళ్ళు ఉలిక్కిపడ్డాయి. గక్కతిప్పుకోకుండా ఏడుస్తున్న చిన్నారిని వెతికి పట్టుకున్నాయి. చిన్నచిన్న గాయాలతో వున్న ఆ చిన్నారిని హత్తుకున్న ఓ అమ్మ ఆసుపత్రికి తరలించింది. రక్తసంబంధమే అవసరం లేదు, అమ్మయితే చాలు నంటూ రాత్రంతా సాకింది. పాపకు భయమేమీలేదంటూ వైద్యులు భరోసా ఇచ్చినా కదలలేనంటూ కన్నీరు పెట్టుకుంది. చిదిమి దీపం పెట్టుకోవచ్చంటూ నరదిష్టి తగలకుండా బుగ్గన చెక్కపెట్టింది. అల్లారుముద్దుగా పెంచుకుంటాను ఇవ్వమంటూ అధికారులను బతిమలాడింది. అనుభవిస్తే తప్ప అర్థం కాని నొప్పుల బాధను, అవి తెచ్చిన అమ్మతనాన్నీ వద్దనుకోవటానికి కారణాలేమిటో తెలియదు కానీ రొమ్ముపాల ప్రేమను ఇక్కడ కోల్పోయిందీ ఓ ఆడబిడ్డే కావటం విషాదమే. 
నాలుగు దినాలే గడిచాయి. మార్చి 16 వెళ్ళి 20 వచ్చింది. ఈ సారి స్థలం మారింది. తేడా ఏమీ లేదు. మరలా మరో ఆడ శిశువు. నవమాసాలూ మోసి, కష్టపడి ఇష్టంగా కన్న కన్నపేగును గోషా ఆసుపత్రిలోనే ఒదిలేసి వెళ్ళిపోయిందో తల్లి. ఎవరు? ఏమిటి? తెలియదు. బంగారు తల్లి. ఎంత ముద్దొస్తుందో. చూడగానే ఒడిలోకి తీసుకుని లాలించకుండా వుండలేని బలహీనతేదో ఎవ్వరినైనా కమ్మేస్తుంది మాయతెరలా. ఆరోగ్యంగా వుంది. అమ్మ ఇక్కడే ఎక్కడో వుండి వుంటుందిలే అన్న భరోసా ఇంకా వున్నట్లుంది. హాయిగా నిద్దరోతోంది. బద్ధకంగా ఒళ్ళిరుచుకుని తిరిగి ఒత్తిగిల్లింది. ఇక్కడ పాత్రల పేర్లు అనవసరమేమో. ఈ తల్లుల నిర్ధయ నిష్క్రియాపరత్వం వెనుక ఓ పురుషుడుండే వుంటాడన్న సిద్ధాంత వాదనా రాద్ధాంతాలూ అవసరం లేదిక్కడ. పక్షికి, పశువుకీ... ఈ ప్రకృతిలోని సర్వప్రాణకోటికీ వున్న ప్రేమ తత్వాన్ని ఈ తెలివైన జంతు సమాజం ఎందుకు కోల్పోతోంది? ప్రకృతికి ఎందుకు దూరమవుతోంది? ఎదగని మస్తిష్కాలు, ఎదిగిన మనుషులను అందిస్తున్న సమాజం, వ్యవస్థ ఇంకా ఎంతకాలం? తప్పెవరిది? అమ్మ మాయమయితే, అమ్మ అయ్యే అమ్మాయే లేకుండా పోతే, నీతో నడిచే, నీకు తోడై నిలిచే సగమే లేకపోతే... ఈ ఆలోచన మనిషిమెదళ్ళల్లో నిండేదెన్నడో.