27, జులై 2019, శనివారం

అప్పుడే ఏమైంది...

నిశ్చలంగా ఉందామనుకుంటానా...
బెడ్డ మాటున అలల సవ్వడి   
అరుణమై  సురుక్కు మందామనుకుంటానా...   
చీకటి మాటున వెన్నెల కిరణ స్పర్శ   
కారు రుతుమేఘమై వర్షిద్దామనుకుంటానా...   
ధృవ క్షేత్ర ఘనీఉత్పాతమై చుట్టేస్తావు 
అలౌకిక స్పర్శ... అంటిపెట్టుకొనే ఉందనుకుంటానా....   
అధిభౌతికమంటూ గోడకట్టేస్తావు   
ఉన్నదని చూపించలేని మనస్సుకీ 
లబ్బుడబ్బుంటూ ఉనికిని చాటే హృదయానికీ 
 లంకె వేయాలనుకున్న ప్రతిసారీ...   
ఈతరాకున్నా వరదగోదారి దాటే యత్నమే   
అప్పుడే ఏమైంది... పుట్టింది ఇప్పుడేగా...
హృదయ నేస్తానికి... చెలికి...
జన్మదిన శుభాకాంక్షలు
- సత్యారుణ
27.07.2019

22, జులై 2019, సోమవారం

అర్ధ శతాబ్దం

నిన్నటి రోజు చాలా వేగంగా గడిచిపోయింది.

జీవితంలో 50 ఏళ్ల ప్రస్థానం... చిన్న విషయమేమీ కాదు.

నాన్నని అడిగిన కోరిక... ‘మీలా మంచి తండ్రిగా ఎదిగేలా చేస్తున్న ప్రయత్నం సఫలం కావాలని కోరుకోండి’ అని. అమ్మకి చెప్పిన క్షమాపణలు... ‘నీ లక్షణాలు చాలా నాకు వచ్చాయి. వాటిలో 90 శాతం మంచివే. కాని వాటివల్ల నష్టం కూడా ఎక్కువే. అందుకే నీవంటే అప్పుడప్పుడూ కోపం వస్తుందమ్మ’ అని. నా జీవిత భాగస్వామికి చెప్పని మాట... ‘నీవంటే అమితమైన ప్రేమ. నాకే ఇబ్బందికరం... అన్నంతగా నీపై ఆధారపడి పోతున్నా’ అని.

తమ్ముడి ప్రేమపూర్వక పలకరింపు... నేను ప్రత్యేకం అంటూ పంపిన అపురూప సందేశం, పిల్లలు అసి, అభి, హేము, సాత్వి, మేనల్లుడు మేఘాయ్ ల శుభాకాంక్షలు... చిరునవ్వుతో వయోలా అక్క పలకరింపు, చెల్లిగానే చాలా మందికి తెలిసిన పద్మ, బావ శివల ఫోన్ కాల్, స్నేహసుధల అభినందలు, మిత్రుల సాన్నిహిత్యం, మావయ్యా అంటూ నోరార పిలుచుకునే నవ్య, రాంవీల సందడి, అత్తయ్య దగ్గరకు ప్రయాణం... మంగళగిరి వీధుల్లో 20 ఏళ్ల వెనుకటి జ్ఞాపకాల తడి... మొత్తానికి రాత్రి 9 గంటలకు ముగిసింది.

ఎంతో మంది సన్నిహితులు, ప్రాణ స్నేహితులు, మిత్రులు, సహచరులు నన్ను ఎంతగానో అభిమానించారు. ప్రేమించారు. భరించారు. వారందరి తోడ్పాటే నా ఈ ప్రయాణం. అసంతృప్తి లేకపోతే ముందడుగే లేదు. సంతృప్తి లేదని చెపితే జీవితమే ఉండదు.

బాలుడు... అని పిలుచుకునే కృష్ణ గారు, పొన్నెకల్లు వెళ్లినప్పుడల్లా గారాలు పోడానికి అవకాశమిచ్చిన అన్నయ్య కేపీగారు, నేను రాసే ప్రతి అక్షరానికీ దాదాపుగా మొదటి చదువరిగా మారిన అనిల్... విశాఖలో పనిచేసిన కాలంలో నాలో భాగమైపోయిన సతీష్, నాయుడు తదితరులు, మీకేం తక్కువ సార్ అంటూ నన్నో కుటుంబ పెద్దగా చూస్తూ వచ్చిన శివ, అన్నయ్య చెపితే ఓకే అనే శ్రీను... రాజుగారు, తమ్ముడు కోటి, సత్యనారాయణగారు, చిరంజీవిగారు, బావా అనిపిలుచుకొనే సూర్య, నాని రాసుకుంటూ పోతే జాబితా చిన్నదేమీ కాదు. ఈ పేరుల్లో మా పేరు లేదుగా అని వెంటనే అలుగుతారేమో... మా కెమెరామెన్లు విజయ్, సంతోష్, నాయుడు, రాజశేఖర్... ఏజెన్సీలో వృత్తిని పక్కన పెట్టి అక్కున చేర్చుకున్న నాగరాజు, శ్రీను, దయా... అన్నా అని ఎంతో ప్రేమగా పిలుచుకునే యాకూబ్, ఉదయ్, నేను భరించలేనంత ప్రేమని ఇప్పటికీ పంచుతూనే వున్న ప్రణీత్.... కళ్లు మసకబారుతున్నాయి. ప్రేమాస్పదుల పేర్లను తలుచుకుంటూంటే జాబితా పెరుగుతోంది.

నెలల పిల్లాడి నుంచి ఆడిస్తూ వచ్చిన మధు, స్వాతిల బుడ్డోడు... కారు ఎక్కిస్తానంటేనే ముద్దు పెట్టే అల్లరోడు... బెదిరించి ముద్దులు పెట్టించుకున్న మేనకోడలు త్రిష...

పద్మగారు, మాధవిగారు, స్నేహలత... రోజూ నా రాత్రి భోజన వేళను ఆనందంగా మార్చే మిత్రులు ఉదయ్, సతీష్, నాగభూషణం... ఎన్నో విషయాలను మౌనంగా నేర్చుకొనే అవకాశాన్ని ఇస్తూ వస్తున్న సాయిగారు... రహస్యంగా శుభాకాంక్షలు చెప్పిన సుధాకర్ గారు... నన్ను భరిస్తున్న ఎంతో మందికి నేను రుణపడిపోయాను. తీర్చలేని బాకీ ఇది.

అతి తక్కువ కాలంలో మనసుకు బాగా దగ్గర అయ్యి, ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం కల్పించిన రైతు, వైద్యులు, పరిశోధకులు, నిత్య తపనశీలి రామేశ్ గారు... తాతా అని పిలిచే ఏకైక మనవరాలు... మీకు అదే ఎక్కువ అంటూ నాపై అలిగే మంచి వైద్యురాలు చిన్ని... అనుమానంతోనే మొదలైనా దగ్గరగా చూసిన తరువాత అభిమానించడం మొదలు పెట్టిన హరిగారు... ఇంక రాయనులే... రెండు వాక్యాలు... అంతే.. నేను ఏం చేసినా, చాలా విషయాలలో మూర్ఖంగా ఉన్నా ముద్దుగా తిడుతూ, అభిమానిస్తూ, నా గురించి అవసరం లేకపోయినా పదిమందికి మంచి మనిషిగా చెపుతూ వచ్చిన పెద్దాయనకు....

జయ, భాస్కర్...

వాట్సాప్ పుణ్యమా అని దగ్గరైన 10వ తరగతి మిత్రులు, బాల్యాన్ని ఆనందంగా ఉంచిన నగరం హితులు, ఏవీఎన్ సహ పాఠకులు....

 నా జీవితంలో క్షణ కాలమైనా సరే మెరిసి మాయమైన మరెందరో.... అందరికీ అందరికీ రుణపడిపోయాను. తీర్చుకునే ప్రయత్నం చేస్తానని చెప్పుడం నన్ను నేను మోసం చేసుకోవడమే.

14, జులై 2019, ఆదివారం

చూసుకో

జీవితాన్ని నగ్నంగా చూడాలి
మెహర్బానీలపై మోహ ప్రేమ
చిక్కటి అడివిలో అంతుచిక్కని
వెలుగు చీకట్లపై భయం ముసుగునేస్తుంది
అలవాటులేని స్వచ్ఛమైన ఆక్సిజన్
కార్బన్ డై ఆక్సైడై ఊపిరి సలపనివ్వదు
ఇప్పుడు ఎవరెస్టు ఎక్కడంలో
ఏముందిరా ఆనందం
నిన్ను నువ్వు చూసుకో
తెరలను పొరలు పొరలు గా తీసి
కనుగొన్న రోజు హృదయాంతరాల్లో
ఘోష పెనుకేకై నిను ముంచేస్తుంది
విజేతగా నిలబెడుతుంది.

8, జనవరి 2019, మంగళవారం

ఇది చాలుగా...

బ్రహ్మ పదార్థమే అది
అయినా ఐస్ క్రీం అంత ఇష్టం
విశ్వమంత పాతదే అది
అయితేనేం నిత్యనూతనమే
నిలువనీరు కాదు సుమా
నిత్యపరిమళమైన గంధమది...

వ్యక్తీకరించేదే భావమా?
అవ్యాక్తానుభవమయ్యేదీ..!
బరువుల్లోనూ, బాధ్యతల్లోనూ
నిత్యం నీడలా వుండేదీ?
అక్షరానుభూతులతో వివరించలేను
కుసుమ రేకలను రాల్చలేను
రూపమిదే అని నిర్ధారించను
రంగూ రుచి చెప్పలేను

నేను అనుభూతిస్తున్నా...
చెప్పటానికి ఏదో ఓ రోజు
సంస్కృతీ... వాదాల్లోకి కాదుగాని
మనసు విప్పి చెపుతున్నా
నేను ఇప్పటికీ 20లోనేనని
ఎప్పటికీ అంతేనని
మనసంతా నువ్వేనని...
- సత్య
14.02.02