4, నవంబర్ 2016, శుక్రవారం

మరకలూ వుంటాయ్

కాల చక్రంతోపాటే పరిణామాలు కూడా వేగంగానే చోటుచేసుకుంటున్నాయి. నీతి, న్యాయం, పారదర్శకతలకే పెద్ద పీట అంటూ మైకొదలకుండా ఊదరకొడుతున్న నేత మాటలు చేతల్లో నీటిపాలవుతున్న ఘటన... యుద్ధంలో విజయమే లక్ష్యం, మార్గం కాదు ముఖ్యమంటూ పోలీసు లు తీర్చుకున్న బలిమెల ప్రతీకారం... ప్రేమించినందుకే ప్రాణం తీసే రాక్షసత్వం... వీటన్నింటి నడుమా నేతల వైఫల్యాలపై ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తులు. విశాఖ జీవన చిత్రంలో చకచకా సాగిపోయిన దృశ్యాల వెనుక తంతులపై కథనం.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ అధినేత పదేపదే పలు వేదికలపై మాట్లాడుతున్న మాట పారదర్శకత, అవినీతికి పాతర, నిజాయితీకే పట్టం. అన్నీ నిజమైతే ఎంత బాగుండు. నూరు శాతం సాధ్యమవుతుందన్న అత్యాశ ఎవ్వరికీ లేదు. కనీసం పాతిక శాతమైనా వుంటే బాగుం టుందని ఆశపడటం మానవ సహజం. ఆశ నిరాశై, నీరుగారి పోతోందనుకున్నప్పుడు నిస్పృహ ఆవరిస్తుంది. కాలగతిలో అదే ఆగ్రహ మవుతుంది. ప్రజల అవ్యక్తీకరణను మౌనార్ధాం గీకారం అనుకుంటే ఓటమితో కాలు కడుక్కోవ లసిందే. ఎవ్వరూ చెప్పరు. అధికారం తల కెక్కినప్పుడు చెప్పినా వినిపించుకుంటారన్న చిత్తభ్రమలు ఎవ్వరికీ లేవు. ఆశ్రిత పక్షపాతంతో, అపసవ్య దిశలో పనులు సాగుతున్నప్పుడు, ఓటేసిన ప్రతోడూ కార్యకర్తకాదన్న విజ్ఞతను మరిచిపోయినప్పుడు నమ్మకం కట్ట తెగుతుంది. అపనమ్మకం వరదై ఊరెక్కుతుంది. అప్పటికీ మేల్కోలేకపోతే ఓటమి శవమై వరిస్తుంది. ఇప్పుడు విశాఖ జిల్లాలో జరుగుతోందదే. గడచిన ఎన్నికల్లో ఖర్చుచేసిన కోట్లు కూడగట్టుకోవటంలో ఎవరికి వారే బిజిబిజీగా వున్నారు. రెండు చేతులూ చాలవంటూ అనుచరగణానికీ లైసెన్సులిచ్చేశారు. ఇదేమిటంటూ ప్రశ్నించిన ప్రతోడికీ ప్రతిపక్షమక్కస్సంటూ పచ్చబొట్టేయటం మొదలుపెట్టేశారు. తాము చెప్పిందే న్యాయమని, చెల్లుబాటు కాకపోతే భవిష్యత్తులో తమకు బతుకే లేదంటూ కూడటం మొదలుపెట్టారు. గెలిచిన ప్రతినిథులకు విలువేదంటూ రూములో రంకెలు వేశారు. ఇంకేముంది మీడియా గంట కట్టేసింది. నిజాయితీ ఎవరికి కావాలి? చెప్పిన పనిచేయనప్పుడు? డూడూ బసవన్నలా  మేం అడిగిన దానికల్లా తలలూపనప్పుడూ ఆ ముద్ర ఎందుకక్కరకొస్తుంది? మూకు మ్మడిగా పెద్దాయన దగ్గర మొరపెట్టుకున్నారు. 50ఏళ్ళ గెలుపు కోసం కలలు కనేటప్పుడు ఇవన్నీ తప్పదనుకున్నారో ఏమో... ఓ అధికారి బదిలీ అయ్యారు. యువకుడు నెమ్మదస్తుడే. నిబంధనల గీతకు ఓ అడుగు అటూ ఇటూ పడితే ఐఎఎస్ జీవితానికే మచ్చ అనుకునే కుర్రతనపు ఛాయలు ఇంకా తొలగని తనమేదో మిగిలే వుంది. నీతి, నిజాయతీలకు తోడు ఎవ్వరినీ ఖాతరు చేయని పెంకితనం కూడా ఆయన స్వంతం. అన్నీ కలసి అసమర్థుడంటూ ఆయనకో ముద్రనేశాయి. ఇంకేముంది గాలిలో దీపంలా ఆయన జీవితాన్ని వేలాడేశారు. 
విశాఖ మన్యం అందమైనదే కాదు. ఎన్నో అపురూపమైన ఖనిజాలకు కూడా నెలవు. ఎన్నో దశాబ్దాలుగా గిరిజనుల కోసమే అంటూన్న తుపాకులు ఓ వైపు. రాజ్యం ఒప్పుకోదంటూ అత్యాధునిక ఆయుధాలతో తిరిగే అధికార ఖాకీ మరో వైపు. మధ్య సాగుతున్న ఘర్షణలకు అడవి మౌన సాక్షిగా నిలిచేవుంది. ప్రాణాలెవ్వరివైనా విలువైనవే. యుద్ధమంటూ జరిగితే న్యాయాన్యాల ప్రసక్తే రాదు. శత్రువుపై దూసుకువచ్చే తూటాకు ప్రాణం విలువ తెలియనే తెలియదు. గెలుపే లక్ష్యం. పగ, ప్రతీకారాలతో ఎత్తుకు పై ఎత్తులు ఇక్కడ రాజ్యమేలుతూంటాయి. సమయమొస్తే సామూహిక హత్యాకాండలకు తెర తీస్తారు. ఎవరి న్యాయం వారిదే. ఉద్యమం జీవనదంటూ ఎర్ర తుపాకీ ఘర్జిస్తూంటుంది. వట్టి మాటలు కట్టిపెట్టండంటూ అధికారం పోలీస్ స్వరమై హూంకరిస్తూంటుంది. మధ్యలో బతకు ఛిద్రమవుతూన్న గిరిజీవితం వాస్తవావాస్తవాల మధ్య నిజనిర్ధారణలో నలిగిపోతోంది. తాజాగా రామగుహ కాల్పుల్లో ఇప్పటికి 32 మంది మృతి చెందారు. మరో 15 మంది ఆచూకీ లేకుండా పోయారు. మృతుల్లో 14మందిని అధికారికంగా గుర్తించిన వారే లేరు. చనిపోయినోడు మా బిడ్డే అంటూ కన్నీరెట్టలేని దైన్యం. అనాథ శవమై ఖననమవుతున్న మృతదేహాల మాటున మరుగుతున్న రక్తం మౌనవేదనై గడ్డకడుతోంది. అడవిలో ఏ చెట్టుచాటులో, బలిమెల రిజర్వాయ్ పరిథిలో ఏదో ఒక ఒడ్డున జనం తుపాకీ శవమై ప్రకటితమవుతూనే వుంటుంది మరికొద్దికాలం. ప్రతీకారేచ్ఛతో ప్రతిదాడులు అలక్ష్యంగా సాగుతాయన్న భయం మాటున రోజులు భారంగా గడుస్తున్నాయి. అడవి ఇప్పుడు నివురుగప్పిన నిప్పు.
శాస్త్రీయంగా మనిషీ జంతువే. మిగిలిన జంతువుల్లో కెల్లా మనిషి ఉత్తమోత్తముడు. అందుకనే అవసరాన్ని మించి అంతా తనకేనన్నట్లు ఆబగా, రాక్షసంగా కౌగలించుకుంటాడు. రక్తమంతా ఎరుపు కాదంటూ గోడలు కడుతూంటాడు. మనిషి ఆలోచన కలిగిన జంతువు. అందుకనే అందరూ  ఒకటి కాదన్న వాదనను బలంగా ముందుకు తోస్తాడు. రేపో మాపో చేతికందొస్తాడన్న బిడ్డ... హఠాత్తుగా లేడన్న వార్తను జీర్ణం చేసుకోవటం ఒకింత కష్టమే. మా అబ్బాయిని రక్షించండి అంటూ ప్రాధేయ పడ్డ ఓ తల్లి పేగు దగాపడింది. రాజకీయానికి, అధికార ఖాకీ అండగా నిలిచిం దంటూ ఆక్రోశం ఆగ్రహమై రోడ్డెక్కింది. ఇది నిజమేనంటూ అధికార, ప్రతిపక్షాలు ఎవరికివారే గెంతెత్తారు. మేం జనంపక్షమే నంటూ ఎవరికి వారే తెరమీద పండించారు. ఓ అమ్మాయి, అబ్బాయిల మధ్య స్త్రీపురుష ప్రేమ బంధం, పడక సంబంధం తప్ప మరేమీ వుండదన్న ప్రగాఢ విశ్వాసం చిక్కగా పరుచుకునే వుంది. అదేమీ లేదన్నా నమ్మలేనంత మూఢనమ్మకం మనలో కరుడుకట్టింది. మూఢత్వం ఉగ్రవాద ఛాయల్లో ఎప్పుడూ పదిలంగానే వుంటుంది. మనిషి మరుగుజ్జుగా మారిపోతాడు. తేలిగ్గా తలలు నరికేస్తూంటాడు. దేనినైనా ప్రేమించగలిగిన వాడు రాక్షసుడిగా ఎలా మారగలడన్న ప్రాథమిక ప్రశ్నకు సమాధానమే దొరకదు. ప్రేమ కలుషితమ య్యింది. చిక్కనైన స్నేహ బంధానికి అక్రమ ప్రేమ సంబంధం మరకంటింది. దీనితో ప్రదీప్ నిండు ప్రాణం చిత్రహింసలమాటున ఉరివేయబడింది. కల్తీ ప్రేమా వర్థిల్లుగాక. 
మనిషి ఎప్పుడు సంతృప్తాసంతృప్తుల మధ్య డోలాయమాన ప్రయాణం చేస్తూనే వుంటాడు. బాబు తప్ప మరెవ్వరూ రాష్ట్రానికి లేరన్న నమ్మకం మెల్లగా సన్నబడుతోంది. అది చంద్రునిపై వున్న అపనమ్మకం కాదు. నక్షత్రాల వన్నెపై వున్న అనుమానం మాత్రమే. ఇప్పుడు సరిచేసుకో వాలసింది నాయకుడే. కలుపుగోలుగా వుండాల్సిందే. అయినేం కాఠిన్యం లేకపోతే మనుగడే కష్టం కావచ్చు. ఇదీ ఇప్పుడు జనం మాట్లాడుకుంటోంది. మెరుపుల చాటున మరకలూ వుంటాయి. తస్మాత్ జాగ్రత్త. 

19, జులై 2016, మంగళవారం

మన్నించండి

ఓ నాలుగు ముక్కలు నా గురించి నేను మాట్లాడుకోవలసిన సందర్భమనిపించింది. ఓ పెద్దాయన నన్ను చాలా గౌరవంగా మొక్కలు నాటే కార్యక్రమానికి పిలిచారు. నేను చాలా నిజాయితీగా వున్నానని ఆయన నమ్మినట్లే కనిపించారు. నాపై ఆయన చూపించిన అభిమానానికి నేను తగనని గాఢంగా భావించాను. మరో సారి నాలోకి నేను తొంగి చూసుకోవాలనుకున్నాను. ఎరుపుతగ్గి నలుపెంత పెరిగిందో చూసుకుని గుండె దిటవు చేసుకుని బతికే వుండాలని ముందుగానే గాఢంగా వాంఛిస్తున్నా. నా కోసమే నేను బతకాలనుకుంటున్నా. మృత్యువును హత్తుకునేటంత ధైర్యం బలుపెక్కలేదింకా. 
హిపోక్రసీ గురించి నేను రాసుకున్న రాతలు ఇంకా గుర్తే వున్నాయి. నాకు తోచిందేదో చెయ్యటమే తప్ప... తప్పుప్పొలు లెక్కలు పెద్దగా వేయని రోజులు నాకింకా జ్ఞాపకమున్నాయి. తక్కువ చేస్తారని తెలిసీ అనుకున్నదేదో ముఖాన్నే ఉమ్మేసిన క్షణాలూ పదిలమే. వచ్చిన మార్కులకు నాన్న పేరుచెప్పుకోకుండా సీటురాదని నమ్మి చచ్చినా నాన్న కాలేజీలో చేరనని భీష్మించుకున్న నాటి పిచ్చిదినాలు ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే వున్నాయి. నడిరోడ్డుపై పులిహోర పొట్లాలను చూపించి బాంబులంటూ లాఠీ ఎత్తి అడ్డూఆపు లేకుండా గొడ్డును బాదినట్లు బాదుతూంటే చేతిలోని ఎర్రటి జెండా పడేయటమంటే మోకాళ్ళపై మోకరిల్లటమేనన్న పిచ్చి భ్రమతో తట్లు తేలిన ఒంటితో జైలుకెళ్ళిన అమాయకపు రోజులు ఎలా మరిచిపోతాను. 
ఇప్పుడు నేను అంత అమాయకంగా, పిచ్చిగా ఏమీ లేను. నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. కడుపు పదిలంగా వుండాలన్న కాంక్షతో చూసినవి వదిలేస్తూ, చూడనవి రాసేస్తూ నిబ్బరంగా వున్నానంటూ రంకెలేస్తుంటాను. దేశాన్ని నేనొక్కడినే ఉద్ధరిస్తున్నానంటూ పనుల కోసం కందకుండా వెళ్ళగలిగే సౌకర్యాల కోసం వెంపర్లాడుతూంటాను. నా కోసమో... కాకుంటే కుటుంబం కోసమో... ఏడాదికొక్కసారి ప్రకటనలు వేస్తే వచ్చే కమీషన్ల కోసం కక్కుర్తి పడుతూనే వుంటాను. వెయ్యనంటే ఉద్యోగం కూడా వుండదనే భయాన్ని ముందుకు నెడతాను. 
జీవితమంతా రెండే జతలతో గడిపేసిన మా మావయ్యలా నేనుండలేను. ఏడు పదుల వయస్సు దాటినా, శరీరం నడవటానికి కూడా సహకరించకపోయినా, మానస్సు పెడుతున్న పరుగును అందుకోవటానికి స్లీపర్ క్లాసులో దేశాన్ని ఇప్పటికీ చుడుతూనే వున్న నాన్నలా నేను సాగలేను. ఆరోగ్యం కోసం పైసా ఖర్చు చేయటానికి పదిసార్లు ఆలోచించే నాన్న తన పెన్షన్ లో సగంపైగా సొమ్మును నమ్మిన ఉద్యమావసరాలకే ఖర్చు చేస్తూ... తక్కువ చేస్తున్నానుకుంటూ నిత్యం పడే వేదన నా వల్ల కానే కాదు. అవసరమైతే మరో పది ఎక్కువ వస్తే బాగుండు అనే అనుకుంటాను. వీళ్ళివ్వరింతే అంటూ నిష్టూరమూ ఆడుతాను. సహచరులంతా ఏదో తేడాగున్నాడే అంటున్నా... మనం చేసే పనికి ఈ జీతమే ఎక్కువ అంటూ ఉలిపికట్టెలా నాన్న అన్న రోజులు మొన్నన్నే అన్నట్లే వున్నాయి. నేను అలా ఎలా వుండగలను. 
అందుకునే అంటున్నా. నేనేమీ నిజాయితీగా లేను. వుండాలనీ అనుకోవటం లేదు. వుండటం సాధ్యం అన్న భ్రమల్లోనూ బతకటం లేదు. అందుకే నేను మాట్లాడటం మానేశాను. మాట్లాడేటప్పుడు తరిచిచూసుకుంటున్నాను. మరోసారి చెపుతున్నా... మీ అభిమానానికి నేను పాత్రుడిని కాలేను. మన్నించండి. 

15, జులై 2016, శుక్రవారం

ఎండమావులే ఒయాసిస్సులు

మనిషి ఎంత ఆశాజీవి. ఎడారిలో ఎండమావిని చూసీ ఒయాసిస్సు అన్న భ్రమతో పరుగులు పెడతాడు. ఆశ నిరాశ కాకూడదని వేయి దేవుళ్ళకు మొక్కుకుంటాడు. ఇప్పుడు విశాఖ వాసీ చేస్తున్నదదే. పోలీస్ యంత్రాంగం కూసాలను కుదుపుతున్న వరుస ఘటనలు నిజం కావాలని, స్మార్ట్ సిటీ నిజార్థంలో వెలుగొందాలనీ గాఢంగా ఆకాంక్షిస్తు న్నాడు. ఇది ఖాకీలకే పరిమితం కాకూడదనీ ఆశిస్తున్నాడు. 
అధికారులు వస్తూంటారు. పోతూంటారు. మొన్నామధ్య ఓ దళిత ప్రజాప్రతినిథి అన్నట్లు ''రాజకీయ నాయకుల విజన్ ను ఆధారం చేసుకుని, నిర్దేశించిన మార్గాన్ని అనుసరించి అధికారులు నడుచుకుంటారు.'' అవును వారు స్వయంప్రతిపత్తితో చేసేది పెద్దగా ఏమీ వుండకపోవచ్చు. తప్పొప్పులకు అధికారులనే పూర్తిగా బాధ్యులను చేయ లేము. వారిని నడిపించాల్సిన రాజకీయ నాయకత్వపు అసమర్థ ధోరణలను దునుమాడటమే మంచిదన్నదీ ఆయన అభిప్రాయం కాకపోవచ్చు. కాని జరగాల్సింది అదేనేమో. ఎంతో మంది పోలీస్, రెవిన్యూ బాస్ ల ఏలుబడిని విశాఖ చూసింది, భరించింది. పరిస్థితులకు అనుగుణంగా కర్రతిప్పుతూ, ప్రజల నమ్మకాన్ని ప్రోది చేసుకున్న అధికారులను మాత్రం ఇప్పుడూ స్మరిస్తూనే వుంది. అధికారం మారినప్పుడల్లా రాజకీయం తన స్వలాభాపేక్షకు అనుగుణంగా అధికారం నడుచుకోవాలనుకుంటుంది. అలా నడుచుకోకపోతే తన సార్వభౌమాధికార ప్రకటనకు భంగంవాటిల్లినట్లేనని భ్రమిస్తుంది. కట్టను తెగ్గొట్టుకున్న వరద గోదారిలా ఆగ్రహం ఏడమ కాలు విదుల్చుతుంది. ఏ అప్రాధ్యాన్య పోస్టుకో బదిలీ బహుమానంగా వస్తుంది. అర్థం కానంత అమాయకుడు అధికారెలా అవుతాడు! రాజకీయం, అధికారం... సమాంతరంగా సాగుతూనే సహకరించుకోవాల్సిన రెండు వ్యవస్థలు. స్వరం మారింది. అధికారంపై స్వారీ చేయటానికి రాజకీయం. అంగీకరించాల్సిందే మరి. అలవాటుపడిపోయాం. అందుకే కోటలు దాటే మాటలు, గడప దాటని చేతలు ఇక్కడ చెల్లుబాటు అవుతాయి. లెక్కల్లో తకరారు... వాస్తవాలను జిలుగుల మాటున కప్పేస్తుంది. నిజాన్ని చూడాలనుకునే పాలకులను తాత్కాలికంగానైనా మభ్యపెట్టేస్తుంది.
పోలీస్ బాస్ గా కొత్తాయన వస్తున్నాడన్న వార్త కొద్ది రోజుల క్రితం వెలుగులోకి వచ్చినప్పుడు ఎవరొస్తారో అనుకు న్నారు. యోగానంద్ అన్న ప్రకటన రాగానే ఖాకీల్లో కొందరు ఉలిక్కిపడ్డారు. మరికొందరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టు కోవాలని నిర్ణయించుకున్నారు. మరికొందరు ఇక్కడ నుంచి పారిపోతే బెటర్ అనుకుని అలవాటైన పైరవీలకు దిగారు. స్వానుభవంలోకి వచ్చే వరకూ జరుగుతున్నదేమిటో అర్థమయ్యిందని ప్రకటించటానికి అంగీకరించలేని జనం ఎప్పటిలా నిశ్శబ్ధంగానే వుండిపోయారు. పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకుని పూర్తిగా రెండు నెలలు కూడా కాలేదు. బాధ్యతారాహిత్యానికి అంతో ఇంతో శిక్షలు వుంటాయన్న సత్యాన్ని ఇప్పుడిప్పుడే విశాఖ పోలీసులు అర్థం చేసుకుంటున్నారు. కొందరు సస్పెన్షన్ తో ఇంటివైపు వెళితే... మరికొందరు విఆర్ పేరుతో బెంచ్ ఎక్కారు. ధ్వజస్థంభాల్లా పాతుకుపోయిన వారు, మాకు స్థాన చలనం వుండదని భ్రమిసిన వారూ ఇప్పుడు సరికొత్తగా అడవి దారులను వెతుక్కుంటున్నారు. సిపి ఇంకా దస్త్రాలను తిరగేస్తూనే వున్నారు. అస్త్రాలకు పదును పెడుతున్నారు. విశాఖ వాసుల ఆశలకు రెక్కలొచ్చాయి. ఆకాంక్షలు ప్రబలమవుతున్నాయి. నైరాశ్యంలోకి జారిపోకుండా వుండటం సాధ్యమేనా? అన్న అనుమానాలూ మరో పక్క తొంగిచూస్తూనే వున్నాయి. అర్థిక నేరగాళ్ళన్న ఆరోపణలు ఎదు ర్కొంటున్న వారితో అంటకాగుతున్న ఖాకీ నేత్రాలున్నాయి. ఏళ్ళ తరబడి పాతుకుపోయిన మినీ బాసులున్నారు. ఆకలేసినప్పుడల్లా తమ పిల్లల్ని తామే తినేసే పాములున్నాయి. ఇప్పుడు వాటిని పట్టుకుంటారా? పట్టుకుని బోనెక్కిస్తారా? ప్రక్షాళన సాధ్యమేనా? మార్పులన్నీ పైపై మెరుగులా? రాజకీయం రంగంటకుండా ఖాకీ దుస్తులను కాపాడుకోవటం సాధ్యమేనా? సవాలక్ష సందేహాలు తొలిచేస్తూంటాయి కుమ్మరి పురుగులా.
వాతావరణం మారుతోంది. వానలొస్తున్నాయి. నిన్నటి వరకూ చంపేసిన ఎండ కొద్దిరోజులు మబ్బుల మాటుకు సాగిపోతుంది. వెన్నంటే అడివిని మలేరియా కాటేస్తుంది. నగరాన్ని డయేరియా వంటి అంటు వ్యాధులో, వైరల్ జ్వరాలో వెన్నాడుతాయి. చక్రంలా ఇది తిరుగుతూనే వుంటుంది. అందరికీ అర్థమవుతుంది. కాపాడాల్సిన చేతులు బద్ధకంగా కదులుతుంటాయి. ముందస్తు చర్యలు కోసం వడివడిగా అడుగులేయాల్సిన పాదాలు కందిపోతాయే మోనన్న ఆలోచనతో అడుగెనక్కు వేస్తుంది. సమీక్షలతో ఏసీ గదులకే పరిమితమవుతుంది. మరణాలు అడవిని దాటి నగరం బాట పడతాయి. గుట్టల్లోని చావులు కొండదిగి కేకపెట్టేసరికి ఆలస్యమవుతుంది. సాంధ్రత తగ్గుతుంది. కదలాల్సిన వాళ్ళు అప్పటికైనా కదిలితేనా? ఈ సారి మృత్యువు నగరం శివారుల్లో నృత్యం చేస్తుంది. నాలుగురోజుల్లో నలుగురు మరణశయ్యపైకి చేరుకుంటారు. అత్యాధునిక చరవాణి చేతిలో వున్న తరువాత అమెరికాలో వున్నా, విశాఖలో వున్నా... తేడా వుండదు. మంత్రి వర్యులు స్పందిస్తారు. పాత్రికేయుల సెల్లుల్లోకి సంక్షిప్త సందేశాలు వెల్లువెత్తుతాయి. అవే పత్రికల్లో అక్షరాలై పేలుతాయి... టీవీల్లో స్క్రోలింగులై దొర్లుతాయి. అప్పటి వరకూ బయటకు రాకుండా దాచిపెట్టామని సంబరపడుతున్న అధికారం ఉలిక్కిపడుతుంది. ఈలోగా స్వయంగా వైద్యుడైన శాఖా మాత్యులు మరో సందేశమై కనిపిస్తారు. మళ్ళీ సమీక్ష కోసం శీతల యంత్రం శబ్ధం చేస్తుంది. బిళ్ళ బంట్రోతు అల్పాహారాన్ని సిద్ధం చేస్తాడు. యాక్షనేదంటూ ప్రతిపక్షాలూ, ప్రజాసంఘాలూ గొంతెత్తుతాయి. కౌంటరేయకపోతే ఎట్టా అనుకుంటుందో ఏమో అధికారపక్షం బురదేస్తున్నారంటూ దాడికి దిగుతుంది. బాధను పక్కనపెట్టి బాధితులు, బంధువర్గం అలవాటైనా తమాషాని విషాదంగా చూస్తూ వుండిపోతుంది. 
మరో వైపు ప్రభుత్వం ఎన్ని కంప్యూటర్లు పెట్టినా, సరికొత్త యాప్ లను సెల్ ఫోనుల్లోకి అదే యావతో ఎక్కించేస్తున్నా... మీట నొక్కాల్సిన మనిషి మాత్రం మారకుండా మిగిలే పోతాడు. ఒకరి భూమిపై మరొకరు హక్కు నాదంటూ పోట్లాటకు దిగుతాడు. అధికారం పెద్ద మనిషి పంచాయితీ చేస్తుంది. అందినకాడికి బొక్కేస్తుంది. అడగాలంటే భయం అడ్డుపడుతుంది. భవిష్యత్తులో గుమ్మం ఎక్కటానికి చోటు దొరకదేమోనని సంకోచిస్తుంది. సల్లగా చూస్తాడేమో అని చంద్రంవైపు సంద్రమంత ఆశగా చూస్తోంది వైశాఖి. అసౌకర్యాల లేమితో సాగే సౌఖ్య జీవనమే స్మార్ట్ లక్ష్యమన్న ప్రకటను నిజార్థంలో అనుభవంలోకి తీసుకువచ్చే మరో అధికారిని కూడా వేస్తారేమోనని కళ్ళు విప్పార్చుకుని చూస్తోంది. సముద్రపొడ్డున ఆశ చిరుజ్యోతిలా వెలుగుతోంది... లక్షలాది చేతుల రక్షణ మధ్య. 

సర్వ బ్రష్టత్వం

కొత్తగా బాధపడాల్సిందేమీ లేదు. ఎప్పటి నుంచో వున్నదే. రాజుల కాలం నుంచీ డబ్బాశ చేస్తున్న పాడు పని అంతా ఇంతా కాదు. హెచ్చు తగ్గులు సర్వసాధారణం. మరీ విశృంఖలమై పోయిందనప్పుడు ఒకింత బాధేస్తుంది. మళ్ళీ మామూలే. అవినీతి రహిత, పారదర్శక కమల పాలన గురించి మాట్లాడుకుంటున్న కాలంలో వున్నాం కాబట్టి ఇప్పుడు తాజాగా మాట్లాడవలసి వస్తోంది అంతే. 
చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పదువులు తీసుకున్న వారి నుంచి అంతో ఇంతో నిబద్ధతను, నిజాయితీని సమాజం ఆశిస్తూంటుంది. తాను కుళ్ళు కంపు కొడుతున్నా... వారు మాత్రం సెంటు వాసనేస్తూండాలని అనుకుంటూంటుంది. మా వాడు సిఐ అయ్యాడనో, ఐపిఎస్ అయ్యాడనో, ఏకంగా హై కోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయ్యాడనో సంబరాలు చేసుకునే విభజిత సామాజిక సమూహాలే ఐకాన్ లుగా చలామణీ అవుతున్న కాలంలో వున్నాం. పేదరికం ఎక్కడున్నా పోవాలంటూ చేసే నినాదం ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అయ్యింది. నా కులంలో పేదల గురించి పట్టించుకోండి, నా కులంలో అవినీతిని చూసీ చూడనట్లు వదిలేయండి అంటూ చేసే పోరాటాలు... స్కిన్ టైట్స్ లా లేటెస్ట్ ఫ్యాషన్. ఇంతా ఎందుకు... ఇప్పుడు ఏ కులానికి ఏమయ్యింది? ఎవరికి నొప్పి కలిగింది? అనేగా మీ ప్రశ్న. అక్కడే వచ్చేస్తున్నా. మొన్నటికి మొన్న విశాఖలో ఓ సిఐ... మైనారిటీకి చెందిన అధికారి, ఆదాయానికి మంచి ఆస్తులు కలిగి వున్నాడంటూ ఎసిబి గాండ్రించింది. కోట్లాది రూపాయలు కూడగట్టిన అతని తీరును చూసి నగరం ముక్కన వేలేసుకుందని అమాయకులు చాలా మందే అనుకున్నారు. పెద్ద వార్తేసి ఘనంగా బాధ్యతను నెరవేర్చే శామంటూ పాత్రికేయులు సంకలు గుద్దేసుకున్నారు. గురువింద గింజకు తన నలుపు ఎప్పటికి కనపడేనూ?. ఆ విషయం పాతపడక ముందే మరో సిఐ ఎసిబి ఖాతాలోకి చేరిపోయాడు. ఈ సారి ఓ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి. వీరిద్దరికీ ముందు అవినీతి తిమింగలం అంటూ చిక్కిన మరో అధికారి కూడా ఎస్సీనే కావటం యాధృచ్ఛికమే కావ చ్చు. అవినీతి తిమింగలాలు అన్నీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలలోనే వుంటున్నాయన్నట్లు చిత్రీకరిస్తున్నారంటూ ఆయా సామాజిక వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. వివిధ శాఖలలో స్వంత పనులు చూసుకుంటూ, కోట్లలో వ్యాపారాలు చేస్తూ గుడిగుడి గుంజం గుళ్ళో రాగంలా ఇక్కడిక్కడే తిరగుతున్న ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన అధికారులు ఎసిబికి ఆనకపోవటం విచిత్రంగా వుందంటూ చేస్తున్న వాదన నిండు సత్యమే. నగరంలో ఓ పోలీస్ అధికారి లూప్ లైనులో వుండగానే వ్యాపారాన్ని మొదలు పెట్టారు. మెయిన్ లైనులోకి వచ్చి అమాయకపు తొడుగేసుకుని స్పీడు పెంచారని ఎవ్వరినడిగా చెప్పకనే చెపుతారు. ఇక రెవెన్యూ, ఆ శాఖ, ఈ శాఖలల్లో అయితే పదుల సంఖ్యలో ఆ పేర్లను గడగడా చదివేయచ్చు. పోస్టింగ్ ల కోసం కోట్లు ఇస్తున్నారన్న వాదనలు సరేసరి. ఇది వితండమనే వారూ వున్నారు. మా కులం, మా మతం అంటూ రాగాలు తీసే వారికి... అవినీతికి కులం వుండదనీ, డబ్బు వచ్చి చేరిన తరువాత... వున్నాడు, లేనోడు అన్నది మాత్రమే నిజమనీ అర్థమయ్యేదెన్నడో?! అంటూ వాపోయే వారు ఓ ఉదాహరణను గట్టిగానే చెపుతున్నారు. ఆ మధ్య నగరానికే చెందిన ఓ పోలీస్ అధికారి పెద్ద పంచాయతీకి పెద్దమనిషిగా వ్యవహరించారు. ఓ పక్షం తీసుకుని యాక్షన్ లోకి దిగినందుకుగాను సదరు అధికారికి కోట్లలోనే ముట్టాయని ఆ శాఖతో పాటు, నగరంలోనూ బహిరంగం గానే మాట్లాడుకున్నారు. ఇప్పుడు చెప్పండి. 
రెండేళ్ళుగా పాత్రికేయుల చుట్టూ తిరుగుతున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఈ మధ్యనే హార్డ్ వేర్ అవతారమెత్తి కనిపిస్తే ఆశ్చర్యమనిపించింది. ఎందుకిలా అయ్యాడా అని చూస్తే బోలెడు కథ బయటకు వచ్చింది. అవన్నీ చెప్పేస్తే ఇంకే మైనా వుందా? నాకూ బోలెడన్ని ఆఫర్లు వచ్చేయవూ?!. అయినా, ఉడికిందో లేదో తెలియటానికి ఒక్క మెతుకు చాలదండీ అంటూ చెప్పే పాత చింతకాయ పచ్చడి లాంటి సామెతొకటి వుండనే వుందిగా. కథలోకి వస్తే... ఓ విదేశీ యుడు దర్జాగా ఎలాంటి అనుమతులూ లేకుండా యథేచ్ఛగా విశాఖలో వ్యాపారం చేసుకుంటూ కోట్లు పోగేసుకుని హద్దులు దాటించేస్తున్నాడు. పనిలోపనిగా మన సాఫ్ట్ వేర్ సుబ్రహ్మణ్యాన్ని కూడా ఓ ముప్పై లక్షలకు ముంచేశాడు. దీనితో గత్యంతరం లేక సదరు సాఫ్ట్ వేర్ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడు అమాయకంగా. స్టేషన్ నుంచి కమిషనర్ కార్యాలయం వరకూ పాపం సుబ్రహ్మణ్యం... కలవని అధికారి లేడు. ఈ లోగా కోర్టుల్లో కేసులు వేశాడు. అనుమతు లు లేకుండా దర్జాగా ఊళ్ళో ఊరేగుతున్న తెల్లతోలు గురించి ఐబికి సమాచారం ఇచ్చాడు. సిబిఐతో మాట్లాడాడు. ఇలా ఎక్కే గడపా, దిగేగడపా. ఇప్పటికీ ఫలితం శూన్యమే. అవసరమైన సమాచారాన్ని ఇవ్వటం లేదంటూ ఆర్టిఐ కమిషనర్ ఆశ్రయించాడు. సంబంధిత అధికారులకు అపారధ రుసుం చెల్లించాలంటూ తీర్పు వచ్చినా... బేఖాతర్. ఈలోగా తెల్లతోలుపై యాక్షన్ తీసుకోక తప్పని స్థితిలో పోలీసులు ఆయనను దేశరాజధానికి తీసుకువెళ్ళి విమాన మెక్కించి సాగనంపారు. అలా వెళ్ళి ఇలా వచ్చేసిన సదరు తెల్లదొర ఇప్పుడు రెండు పాసుపోర్టులతో, రెండు పాన్ కార్డులతో దేశంలో చలామణీ అవుతున్నారని వినికిడి. అయితేనేం... మూడో ఏడాది వస్తున్నా ఏ వ్యవస్థా స్పందించ ని తీరును చూసిన సదరు సాఫ్టవేర్ సుబ్రహ్మణ్యం... రాటుదేలిపోయాడు. ఎక్కడ ఏ కోర్టులో ఎవరి ముందు ఎలాంటి న్యాయం వస్తుందో తెలిసిపోయిందంటూ చెపుతూంటే నోరు తెరుచుకుని ఆ పాత సత్యాన్ని సరికొత్తగా వింటూం డిపోవాల్సిందే. ఇక్కడ నేరుగా ఎక్కడా నోట్లు కనిపించవు. ఎవరు ఎవరిని అజమాయిషీ చేస్తున్నారో అర్థం కాదు. అర్థమైన ఆ ఒక్క సత్యమూ ఏ చట్టం ముందూ నిలవదు. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ వుంటారు. దుమ్మెత్తి పోసుకుంటారు. ఒకరి అవినీతిని మరొకరు నిస్సిగ్గుగా బయటేసుకుంటూ వుంటారు. తినగ తినగ వేమ తియ్య నుండు. ఇన్నేళ్ళు విన్న తరువాత అంతోకొంతో మనకూ అబ్బకుండా ఎలా పోతుంది? మురుగు నదీ మురికి కూపంలో నగరం వుంది. ఎన్నిసెంట్లు కొట్టినా, తలుపులు బిడాయించి ఏసీలు వేసుకుని బతికేద్దామనుకన్నా... అసాధ్యం బ్రదర్. బతుకు ఒకింత దుర్భరమే. బతికేయ్, అవసరం నీదైతే సొమ్ములు పడేయ్... అదే అవసరం ఎదుటోడిదైతే నోట్లు నొక్కేయ్. యుగధర్మాన్ని పాటించాల్సిందే. పాలకులు చెప్పేదీ అదే మరి. 

మరణం... నోటు... రాజకీయం


ఓ ఆత్మహత్య అధికారుల్లో కలవరానికి, ఆత్మశోధనకు కారణమయ్యింది. ఓ ప్రమాదం అడవికి పాకిన మైదాన సంస్కృతిని ప్రతిబింబించింది. ఓ మాట రెండు రైలు పట్టాల మధ్య మిత్రత్వాన్ని చాటింది.

తమిళనాడులో ఓ రైతు కుంటుంబంలో జన్మించాడు. కష్టనష్టాలు ఎరిగిన కుటుంబమే. అందకనేనేమో ఇష్టపడి చదువుకున్నాడు. ప్రఖ్యాత అన్నా విశ్వవిద్యాలయంలో ఇంజ నీరింగ్ చదివిన శశికుమార్ ఐపిఎస్ కు 2012లో ఎంపికయ్యారు. క్షణం కూడా ఊపిరాడని, కఠిన పరీక్షలతో కూడిన శిక్షణను పూర్తి చేసుకుని ఆయన రాటుదేలారు. గ్రేహౌండ్స్ లోనూ, ఆళ్ళగడ్డలోనూ పనిచేసి సమర్థుడైన అధికారిగా పేరుతెచ్చుకున్నారు. ఆరు నెలల క్రితం విశాఖ ఏజెన్సీకి బదిలీపై ఎఎస్పీగా వచ్చారు. చేయటానికి నేరుగా కనిపించని పని. మనిషి రాటుదేలినా, మనసింకా సుతిమెత్తగానే వుంది. అధివాస్తవిక ప్రపంచంలో గూడు కట్టుకున్నాడు. అందుకేనేమో అతి తక్కువగానే మాట్లాడతాడు. ప్రతీదీ నిబంధనల ప్రకారమే జరగాలంటూ మౌనంగానే గందరగోళపడతాడు. ఎవ్వరికి ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ హామీని ఇచ్చే సున్నిత మనస్తత్వం. అందుకేనేమో పలచబడ్డాడు. తన ఖాకీలు చేస్తున్న తప్పులకు సామాన్యులు బలికావటాన్ని సహించలేని మంచితనం. అది చేతకానితనమని చిత్రించే అధికారయంత్రంగం అణువణువునా వున్న ప్రపంచం ఇది. ఇక్కడ తన స్థానమేమిటో తెలుసుకునే ప్రయత్నంలో ఎంత సంఘర్షణ. మూడు నెలల ప్రసవవేదన. రివాల్వర్ గొట్టాన్ని కణతలకు అనించుకుని దూసుకుపోయే తూటా ఏం చేస్తుందో తెలిసే... ట్రిగ్గర్ నొక్కటానికి ఎంత ధైర్యం కావాలి! దానిలో పాతిక శాతం ధైర్యం సరిపోదా బతకటానికి? సమాజంలో చట్టవ్యతిరేకుల పట్ల కఠినంగా వ్యవహరించటం ఎట్లాగో తెలిసిన మడిసతడు. చట్టరక్షకులే భక్షకులైతే ఏం చేయాలో తోచక తికమకపడ్డాడు. ఇక్కడ ఇమడ లేక, ఇమడలేని తనాన్ని ప్రపంచానికి చాటలేక, మంచితనానికి ఖాకీవనంలో చోటు లేదంటూ మరో ప్రపంచానికి వలసెళ్ళిపోయాడు. 
మానవత్వం గుభాళించే మంచి అధికారులు అవస రమైన సంక్షిష్ట సమయంలో ఇలా కోల్పోవటం నిజంగా బాధాకరం అంటూ ఓ సీనియర్ అధికారి ఒకింత నిజా యీతీగానే తడికళ్ళతో వ్యాఖ్యానించారు. విలువల వలు వలు విడిచి నిస్సిగ్గుగా నిలబడిన వ్యవస్థను చూడ టాని కి మనసులకు అసితకేశకంబళ్ళ ముసుగేయాలి. లేద నేగా చంపేశారు. వ్యవస్థ చేసిన హత్య ఇది అని ఒప్పు కునే ధైర్యం లేనందుకేకా ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఓ వీరుడిపై పిరికి ముద్రవేశారు. వీరమరణాల నుంచి పాఠాలు నేర్చుకునే సంస్కారాన్ని మీరు తృణీకరిస్తే... ఎప్పుడోకప్పుడు ఈ సమాజమే మిమ్మల్ని త్యజిస్తుంది.
నిత్యం ఎంతో మంది అడవిబాట పడతారు. కొందరు జీవనం కోసం, మరికొందరు కాంక్రీటు వనంలో కోల్పోయి న జీవితాన్ని వెతుక్కుంటూ. కొండమీద వుండే వాడు ఎప్పుడన్నా కిందకు దిగినా, అరక్షణం కూడా ఇమడలేని తనంతో నిలబడని కాళ్లేసుకుని వెనక్కి పరుగులెడ తాడు. ఏమీ తెలియని పసోళ్ళకు కూడా అన్నీ నేర్పించే బుల్లి రంగు పెట్టెలు ప్రపంచమంతా ఒత్తుగా పరిచేసు కుంటున్నాయి. 
కొండెక్కుతాయి, చెట్టుక్కుతాయి. గడపగడపకూ నేను న్నానంటూ రేయింబవళ్ళూ అరిచి గోలెడుతుంటాయి. మనకు తెలియని, అవసరం లేని సరికొత్త విషాలను మన ప్రమేయమే లేకుండా చొప్పించేస్తుంటాయి. తెలుసుకునే సరికి మనం మనంగా మిగలం. అమాయకత్వం అన్న మాటకు అర్థం మారిపోతుంది. వెనకబాటుతనంపై యుద్ధం, హక్కుల కోసం పోరాటం మాటున అరాచకీయం సంఘ టితమవుతుంది. చేయి చేయి కలపాలంటూ పాఠాలు చెప్పిన జెండాల మాటకు విలువే లేకుండా పోతుంది. అసలు జెండా అవసరమే లేని రోజుల్లోకి ప్రయాణం సాగుతుంది. రోడ్డుపై రెండు వాహనాలు యుద్ధం చేస్తాయి. రెప్పపాటులో జరిగే విధ్వంసంతో నిత్యం ఎన్నో కుటుంబాల్లోకి విషాదం కాపురానికొస్తుంది. ఎవ్వరూ ఆర్చలేరు, తీర్చలేరు. తోడులేని తనాన్ని పూడ్చనూలేరు. నిన్నటి కథ ఇది. ఇప్పుడు ప్రతీ దానికీ రేటుంది. దెబ్బ సైజును బట్టి రేటు ఫిక్సవుతుంది. వేలు నుంచి లక్షల్లో బేరం సాగుతుంది. ఖాకీల సాక్షిగా గాంధీగారు చేతులు మారతారు. తప్పె వరిదన్న మాటకు ఇక్కడ ఆస్కారమేలేదు. సెక్షన్లు వేసే శిక్షల ప్రశ్నే రాదు. కాదన్నారా మీకు కొండపై బతుకే లేకుం డా చేస్తా మంటూ చుట్టేస్తారు. ఖాకీ అయినా, కలమైనా కన్నెత్తకుండా, పెదవి కదపకుండా ఎటెన్షన్ పొజిషన్ లో శిలలవ్వాల్సిందే. కదిలారా... కొండపైనోళ్ళతో పెట్టుకుంటే మసిచేసేస్తాం అంటూ హూంకరిస్తారు. ఇప్పుడే ఆలోచి స్తున్నారు. కొండెందుకెక్కాలి? కష్టాలెందుకు కొనితెచ్చుకోవాలి? కాపాడటానికి ఖాకీలున్నా లేనట్లే సాగేచోట అడు గెందుకెట్టాలి? ఇలాగే సాగితే రాకడలకోసం అరకు అల్లార్చుకుపోతుందన్న భయం ఇప్పుడు వాగవుతోంది. 


 అస్సలు సంబంధమేలేదు. ఇసుమంత పోలికైనా కనిపించదు. అయితేనేం చిక్కనైన అధికారాన్ని చి క్కించుకోవటానికి మిత్రబంధంతో ముడేసుకున్నారు. కలవని మనస్సులతో కలతల సంసారం. నిత్యం సాగు తూనే వుంది. స్టేజీ ఎక్కిన ప్రతీసారీ రంగేసుకునే కనిపిస్తారు. ఇదే నిజం అన్నంత సహజంగా జీవించేస్తారు. ఒకరు ఎక్కువా కాదు, మరొకరు తక్కువా కాదన్నట్లు ప్రదర్శన సాగుతుంది. రాతలకు పాతబడి, మాటలకు అవకాశమే లేకుండా పోయిందని తట్టినప్పుడల్లా ముసుగులోంచి తొంగిచూస్తారు. మనస్సులో మాటలు, కపటంలేనట్లే కనిపిస్తా యి. సమాజమే దేవాలయం, దేవుడి సేవలో తరించటానికి మంచి మనుషులు కావాలి. ఎత్తుకెదగాలన్నా, ప్రపం చంలో మనకంటూ ఓ గుర్తింపు వుండాలన్నా... మీది కాని భాషలో మీరు పండితులై ఉండాలి. అద్దెకు తెచ్చుకున్న దుస్తులతో పరాయి సంస్కృతిని నెత్తినెట్టుకోవాలి. మనకంటే ముందున్న జపానోడు, చైనావోడు, జర్మనోడు... చెప్పుకుంటూ పోతే చాలా మందే వున్నారు. ఆళ్ళవ్వరికీ అవసరమేలేని పరాయీకరణ. అవసరం కోసం మన కాడకొచ్చిన వాళ్ళని మెప్పించాలనుకునేటంత బానిసత్వం. అలాంటి వారికే మేయర్ పదవి కట్టబెట్టడానికి వెతు కున్నామంటూ ఘనత వహించిన విద్యాశాఖ మంత్రిగారు ప్రకటిస్తారు. ప్రజలతో సంబంధమేలేని, మమేకం కావటం అంటే అర్థమే తెలియని, ప్రజావసరాల రుచి తెలియని, రాజకీయం రంగే చూడని, డూడూ బసవన్నలే ఇప్పుడు కావాలన్న నిగూడార్థంలో వెలువడిన ప్రకటన ఓ ప్రకంపనే. దీనితో కమలం ఖంగుతిన్నది. ఇప్పటికే ఉప్పు, నిప్పుగా సాగుతున్న సంసారం మరోసారి వీథికెక్కింది. హుటాహుటిన సమావేశమయ్యింది. ఎలాంటి సంప్రదింపులు లేకుం డా ఏకపక్షంగా ఇలా ఎలా ప్రకటించేస్తారంటూ మండిపడింది. మిత్రధర్మానికి తూట్లు పొడుస్తున్నారంటూ కోప దుఃఖాన్ని దిగమింగుకున్నారు. ప్రపంచమంతా మోదీ మంత్రాన్ని జపిస్తూ యోగాసనాలు వేస్తే, విశాఖలో మాత్రం ప్రధాని చిత్రానికి చోటే దక్కలేదని ఇప్పటికే కమలం కళ్ళెర్ర చేస్తోంది. ఫిర్యాదు చేయటానకి వెళితే కలెక్టర్ కూడా ఆ ఏముందిలే అన్నట్లు తేలికగా మాట్లాడటాన్ని కషాయధారులు జీర్ణం చేసుకోలేక పోతున్నారు. నాటకం రక్తికడు తోంది. ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేగుతోంది. కార్పొరేషన్ ఎన్నికల నాటకం చివరంకంలో చివరిక్షణం వరకూ నరాలు తెగే సస్పెన్స్ థ్రిల్లర్ కొనసా గుతుంది. తెలిసిందే కదా... చివరాఖరికి శుభం కార్డేసి... టీ కప్పులో తుఫానంటూ తుప్పుపట్టిన డైలాగొకటి వాడేసి తెరదించేస్తారు. విన్నవాళ్ళూ, చూసినవాళ్ళంతా మరోసారి అనవసరంగా నెత్తురుడికించు కున్నామనుకుంటూ నిట్టూరుస్తారు. పెజాస్వామ్యంలో ఇలాంటివి వుంటేనేగా రాజకీయం రంజుగాసాగేది. 

8, జూన్ 2016, బుధవారం

అంతా మనీ మహిమే

నదులు ఎండిపోతున్నాయి. కుంటలు పూడిపోతున్నాయి. పాపాలను కడిగేసుకోవటానికి దేవుడి దగ్గర పెట్టిన హుం డీలు నిండిపోతున్నాయి. కుబేర సంపదలా ఎంత తీసినా తరగనంటున్నాయి. డబ్బు కోసం ప్రమాదం హత్య అవు తుంది. అదే నోటు ఓ శవానికి తండ్రిని పుట్టిస్తుంది. తెలిసి కొంత, తెలియక మరికొంత, వృత్తి అనైతిక పోటీ ఇంకొంత కలగలసి రాతగాళ్ళనీ, మాట గాళ్ళనీ బ్రోకర్లను చేసేస్తుంది. అర్థం కాలేదు కదూ. కొంచెం లోపలకి వెళ్ళండి.

అన్నీ నిజాల్లానే కనిపిస్తాయి. అంతలోనే మాయ కమ్మేస్తుంది... నీడకు, నిజానికీ తేడా లేకుండా. తేల్చుకోవటానికి చేసే ప్రతీ ప్రయత్నం ఆ క్షణానికి వృథా. నిజం మాట్లాడుకుందాం. నిర్దేశించుకున్న గీటు రాళ్ళకు తూగితే చాలు. అబద్ధాన్ని వెతికిపట్టుకోవాలన్న కోరిక, పట్టుకునేటంత ఓపిక ఎవ్వరికి వున్నాయి బ్రదర్. ఓ ప్రమాదం జరిగింది. కారుతో గుద్ది చంపేసిన వాడు మానవత్వాన్నే మరిచిపోయాడో లేక చావు భయంతో పారిపోయాడో తెలియదు కానీ చట్టం కళ్ళు కప్పి తప్పించుకోవాలనుకుంటూనే తప్పుమీద తప్పు చేసుకుంటూ చీకట్లోకి జారుకున్నాడు. తల్లిని కోల్పోయామన్న దిగులుతో కన్నీరు మున్నీరుగా ఏడ్వాలని కూడా తెలియని చిన్నారులను సాకుగా చూపిస్తూ సన్నకారు ప్రజాప్రతినిథులు చెలరేగిపోయారు. ప్రమాదం కాదది... ఓ పోకిరీ, మదమెక్కిన మనీషి వెంటాడి, వేధించి చంపిన ఘటన అంటూ గెంతెత్తి చాటారు. బాధిత బంధువులూ జతకలిశారు. భలే మేత దొరికిందంటూ మీడియా చెలరేగిపోయింది. మీడియాలో కథనాలను చూసి మరింతగా భయపడినట్లు నటించిన ముద్దాయి అడ్డగోలుగా కలి సొచ్చిన సొమ్మును ఎరవేశాడు. తాగిన మత్తులో చంపేసి ఘనంగా చలామణి అవుతున్న బడాబాబులను ఆదర్శం గా తీసుకున్నట్లున్నాడు. ప్రజాప్రతినిథులను ఆశ్రయించాడు. రాజీ చేయమని అర్థించాడు. రోగి కోరిందే వైద్యుడు ఇచ్చాడు. పంచాయతీ జరిగింది. లక్షలాది రూపాయలు చేతులు మారాయి. హత్య చేశారంటూ అరిచిన గొంతులన్నీ మూగవోయాయి. మాట్లాడటం కూడా కష్టమేనంటూ మొరాయించాయి. అరిచిన గొంతులకు వత్తాసు పలికిన వారిలో కొందరి చేతులు బరువెక్కాయి. సామాజిక మాధ్యమాలలో మృతురాలికి మద్దతుగా మాటలు కత్తులై యుద్ధం చేశాయి. 

రాజకీయం హంతకులకు వత్తాసు పలుకుతోందంటూ లోకం కోడై కూసింది. పోలీసులు అమ్ముడుబోయారంటూ వా ట్స్ యాప్ లో సందేశాలు హోరెత్తాయి. ఘటన జరిగిన వారం తరువాత పోలీస్ బాస్ మీడియా ముందకు వచ్చారు. హత్య కాదనీ, ప్రమాదంలోనే వివాహిత మహిళ చనిపోయిందనీ సవివరంగా వివరించారు. సందేహాలకు సమా ధానాలిచ్చారు. వెంటాడి వేధించి చంపారంటూ బాధితులు ఎందుకు ఆరోపించారన్న ప్రశ్నకు సమాధానం వారినే అడగాలంటూ తేల్చేశారు. సమాజాన్ని తప్పుదారి పట్టించిన వారికి శిక్ష వేస్తారో వెయ్యరో తేల్చకుండానే సమావేశాన్ని ముగించారు. ఓ ఘటనను తప్పు దారి పట్టించిన ప్రజాప్రతినిథులను, డబ్బు పంచాయతీ చేసిన ప్రజాప్రతినిథులను కూడా వదిలేది లేదంటూ గంభీరంగానే ప్రకటించారు. అప్పటికే ఆమెది హత్యేనంటూ ఫిక్స్ అయిన మెదళ్ళకు పోలీస్ నిజం రుచించలేదు. నిజం మరేదో వుందని గాఢంగా నమ్మిన వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో పోగువడ్డారు. ఏదో ఒకటి చేయాలంటూ తపన పడ్డారు. బాధితులే అమ్ముడు పోతే ఏం చేయగలమంటూ దిగులుపడ్డారు. సముద్ర ఘోష. కెరటాల సవ్వడి. ఉదయం నుంచే ప్రారంభమయ్యే స్పందనలు, అర్థారాత్రి దాటే వరకూ కొనసాగుతూనే వున్నాయి. సందేహాలకు తావే లేని నిజాల ప్రకటన ఇప్పుడు కావాలి. ప్రమాదాన్ని హత్యగా మలిచినవాళ్ళనో, కాకుం టే హత్యను ప్రమాదంగా చాటిన వాళ్ళనో ఉతికి ఆరేయాలి. చాకలి బండపై వేసి చితక్కొట్టాలి. నోటు కన్నా జీవితం పెద్దదని నమ్మేవాళ్ళకు ఊపిరిపోయాలి. 

మరిచిపోక ముందే మరో దెబ్బ పడింది. తాగిన మైకంలో కారు ఊగింది. రోడ్డుపై ఇష్టానుసారం డాన్సాడింది. ఫుట్ పాత్ పై వున్న ఓ ప్రాణిని నీ అవసరం లేదంటూ గాలిలోకి విసిరేసింది. చివరికి అలసిపోయి నడిరోడ్డుపై ఆగిపోయింది. పోయిన ప్రాణానికి నేనే తండ్రినంటూ వచ్చిన వ్యక్తి మృతదేహాన్ని మోసుకెళ్ళాడు. అనాథ శవాలను ఖననం చేసే ప్రే మ సమాజానికి అప్పగించి పారిపోయాడు. రెండు గొయ్యల్లో ఐదు శవాలను పాతేసి తమ సామాజిక బాధ్యతను ఘనంగా నిర్వర్తించిన సమాజం చేతులు దులుపుకుంది. పోలీసులు ఎపి05బిఎన్266 కారుపై కేసు నమోదు చేశారు. ఇది జరిగిన రెండో రోజులకే శ్రీకాకుళం జిల్లా నుంచి ఓ పల్లె... విశాఖకు వచ్చింది. పోయినోడు మా కొడు కేనంటూ నెత్తీనోరు బాదుకుంటూ ఏడ్చింది. మృతదేహాన్ని ఇప్పించాలంటూ దీనంగా వేడుకుంది. రెండు రోజుల పాటు నిద్రాహారాలు మాని పోలీస్ స్టేషన్ ఎదుటే కాపురం చేసింది. తహశిల్దార్ లేడంటూ కాసేపు, వైద్యులు రాలేదని మరికాసేపు చెప్పిన ఖాకీలు ''అంత గుడ్డిగా ఎవరికో మృతదేహాన్ని ఎట్లా అప్పగించామబ్బా?'' అన్న ప్రశ్నకు తావే ఇవ్వలేదు. మూడో రోజు మధ్యాహ్నానికి కొడుకు శవాన్ని చూసిన ఆ తల్లిపేగు నెమ్మదించింది. అలిగి ఇల్లు వదిలి వెళ్ళిన ప్రతీసారీ ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వస్తాడన్న నిన్నటి ఆశ అడుగంటింది. నీరెండిన గాజుకళ్ళతో ఆ తల్లి దండ్రులు పల్లెవెలుగు బస్సెక్కారు. ఇక్కడా పచ్చనోట్ల పెరపెరలు వాస్తవాలకు నల్లగుడ్డ కట్టాయని విస్తృతంగా ప్రచా రం సాగుతోంది. 

వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. ఇప్పుడు ఈ హరులు నోటునే సర్వరోగ నివారణిగా చీటీలు రాస్తున్నారు. మింగిన రోగులు నోటుకు అలవాటుపడ్డారు. తప్పే జరిగిందో లేక తలరాతే తిరగబడిందో... మొత్తం మీద రోగి చనిపో తాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగుతారు. ఎక్కడ మేత దొరుకుతుందా? అని గోతికాడి నక్కల్లా ఎదురుచూస్తుండే గొట్టాలకు సమాచారం అందిస్తారు. కాకులు వాలతాయి. ఈ లోగా సకల మర్యా దలతో ఆందోళనకారులకు పిలుపు అందుతుంది. లోపల అంగీకారాలు కుదురుతాయి. బరువు చేతులు మారతుం ది. బయటకు వచ్చిన మృతరోగి బంధువర్గం... గొట్టాలెవ్వరో తెలియనట్లే తల తిప్పుకుంటూ సాగిపోతుంది. ఎర్రోళ్ళారా అంటూ ఆసుపత్రి ఓ వంకరనవ్వు నవ్వుతుంది. 

కలికాలం. ధర్మం ఒంటి కాలిపై కుంటుతుంది. డబ్బు సర్వాంతర్యామి అవుతుంది. సర్వం తానే ఐ నర్తిస్తుంది. మంచి కి చోటుండదు. మనసుకు, మమతకు తావుండదు. అంతా బ్రహ్మంగారు చెప్పినట్లే నడుస్తోంది. అబద్ధం నిజమైన వేళ భిన్నంగా వుంటానంటూ వచ్చిన పోలీసు బాసు ఏం చేస్తారో? రక్తమోడుతున్న నిజాన్ని ఐసియుకి తరలించి బతికిస్తా రా? కరాళనృత్యం చేస్తున్న అబద్ధాన్ని కట్టడి చేస్తారా? నా పరిథి కాదని నిమ్మకుంటారా? సవాలక్ష సందేహాలకు సమాధానాలను విశాఖ వెండితెరపై చూడాల్సిందే.

8, మార్చి 2016, మంగళవారం

మసి మరక తొలిగేనా


ఎవ్వరూ కలలో కూడా ఊహించని ఘటనలకు విజయనగరం వేదికయ్యింది. మండించే భాష్పవాయుగోళాల ప్రయోగాలనూ లెక్కచేయకుండా ఆందోళనాకారులు పోలీసులపైకి రాళ్ళవర్షం కురిపించారు. పిసిసి చీఫ్ సత్తిబాబు, కుటుంబం, అనుచరుల ఆస్తులే టార్గెట్ గా సమైక్య ఆందోళనకారులు విధ్వంసాలకు దిగారు. ఈ ఆకస్మిక విధ్వంసపూర్వక ఆందోళనకు కారణం కేవలం బొత్సపై వ్యతిరేకతేనా? కనిపించని జెండాలేమైనా తమ అజెండాల కోసం పనిచేస్తున్నాయా? పోలీసులు అనుమానిస్తున్నట్లు సమైక్య ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని అసాంఘిక శక్తులేమైనా చెలరేగాయా? బొత్సపై ఓట్లేసే జనాభిప్రాయమేమిటి? 

బొత్స సత్యన్నారాయణ గడచిన పది సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా విజయనగరం జిల్లాను ఏలుతున్న కుటుంబ పెద్ద. కాంగ్రెస్ కార్యకర్తగా వున్న ఓ సాధారణ వ్యక్తిని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షునిగా చేసిన రాజకీయ గురువు పెనుమత్సనూ వంచిస్తూ అనతి కాలంలోనే ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, పిసిసి చీఫ్ గా ఎదిగిన ఘన చరిత్ర బొత్సది అంటూ ఆందోళనకారులు ఒకింత వ్యంగంగానే ఆయన గురించి మాటలు మొదలుపెడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కొట్టిమిట్టాడే దుస్థితి నుంచి ఆబగా అందినకాడికి ఆక్రమించుకున్న పెద్దాయన మా పక్కింటి సత్తిబాబు అంటూ కొంత కారంగానే సమాధానమిచ్చే గళాలన్నీ ఇప్పుడు విజయనగరంలో ఓ చోట కూడుతున్నాయి. బొత్సకు తిరుగులేని కోట విజయనగరం అని నిన్నటి వరకూ అనుకున్న వారి అంచనాలను తలకిందులు చేస్తూ వరుసగా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఉద్యమం ప్రారంభమైన తరువాత గడచిన రెండునెలలకు పైగా కాలంలో ఒక్కసారి కూడా సత్తిబాబు, ఆయన కుటుంబ సభ్యులు తమ గడ్డపైకాలు మోపలేకపోయారన్న ప్రచారం అతిశయోక్తి కాదు. ఇసుక మాఫియా డాన్, లిక్కర్ కింగ్ సత్తిబాబు అంతుచూస్తామనే వారి సంఖ్య గణనీయంగానే వుంది. ఇలా అరిచేవారిలో అత్యథికులు కాంగ్రెస్ శ్రేణికి చెందిన వారే అన్నదే ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆశక్తికరమైన విషయమని రాజకీయ పండితులే ముక్కుమీద వేలేసుకుంటున్నారు. 
 సమైక్య ఉద్యమం ప్రారంభమైన 65రోజుల తరువాత విజయనగరంలో ఉద్యమం ఓ మలుపు తిరిగిందనే చెప్పుకోవాలి. ఈ మలుపు హఠాత్తుగా తిరిగిందేమీ కాదని, ముందుగా కనిపించిన సైన్ బోర్డులను చూడటంలో పోలీస్ ఇంటెలిజెన్స్ విఫలమైందన్న వాదనా వుంది. బొత్సకు వ్యతిరేకంగా వస్తున్న నినాదాలు, బొత్సనే టార్గెట్ చేస్తూ సాగిన  విద్యార్థుల ఆందోళనలు, తమను కొట్టిన బొత్సా వర్గానికి వ్యతిరేకంగా బలంగా సమీకృతమైన విద్యార్థి - యువజనులు ఒక ఎత్తైతే... ఎపిఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయ జెఎసీ, న్యాయవాద జెఎసీలు బొత్స సత్యన్నారాయణ ఇంటికి వెళ్ళే మార్గంలో మహాత్మాగాంధీ రోడ్డులోని అమ్మవారి గుడికి సమీపంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు... అదే సమయంలో బలహీన పోలీస్ బారికేడింగ్ వ్యవస్థను తోసుకుంటూ బొత్సా ఇంటి ముందు బైఠాయింపు... కలగలసి, గడ్డిపోచల కలనేత ఏకులై, పోలీస్ వ్యవస్థకు మేకులైన తీరే పోలీస్, నిఘా వర్గాల వైఫల్యానికి సజీవసాక్ష్యాలు. ఉద్యమానికి పిలుపునిచ్చి, ఉద్యమవీరులుగా మీడియాలో వినుతికెక్కిన అధికారులు, ఆర్టీసీ కార్మికులు... తక్కువ జీతగాళ్ళు, పై ఆర్జనలు లేని చిరుద్యోగులు ఆర్థికంగా పడుతున్న బాధలు ప్రజలకు చేరుతున్న దశలో అనూహ్యంగా పరిస్థితి మారింది. 

రాజకీయ పార్టీలకు తావులేదు. వేదికలపై స్థానంలేదు... అన్న బలమైన గొంతుక బలహీనపడింది. వై ఎస్ జగన్ జైలు నుంచి బయటకు వస్తూనే వినిపించిన సమైక్య మోహనరాగానికి పునఃసమీకృతమైన వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు బలంగానే ముందుకు దూకాయి. విశాఖ నుంచి విజయనగరం వెళ్ళే దారిలో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సుమారు 10కిపైగా అడ్డంకులలో జెండా పట్టని శ్రేణులే అధిక సంఖ్యలో కనిపించాయి. మూడవ తేదీ ఎపిఎన్జీవోలు పోలీస్ బారికేడ్లను, పోలీస్ దండును నెట్టుకుని బొత్సా ఇంటికి చేరుకున్నారు. సాయంత్రానికి విజయనగరం యథావిథిగా చల్లబడింది. గడచినదిన అనుభవాలతో మరుసటి రోజు పోలీసులు బొత్సా ఇంటికి మూడు వైపులా మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఉదయం పదిగంటలకు ఎంజీ రోడ్డులోని బొత్స ఇంటికి దారితీసే వీథి ఎదురుగా వివిధ జెఎసీలు చేపట్టిన ఆటపాట, వంటావార్పు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం వరకూ ఊపుగా సాగిన ఆ కార్యక్రమాలను విద్యార్థి, యువజనలు కొనసాగించారు. సాయంత్రం సుమారు ఆరుగంటల ప్రాంతంలో ఊరేగింపుగా వచ్చిన ఎన్జీవోలను, ఆర్టీసీ కార్మికులను కలుపుకోవటానికి వాళ్ళు తృణీకరించారు. పోలీసులపైకి ఆకతాయితనపు తోపులాటలు, నిర్భీతిగా బలగాల ముందే టైర్లు, తాటాకులను తగలబెట్టటాలు, జన సంస్కృతంలో బొత్సాను, కుటుంబ సభ్యులను తిట్టిన తిట్లు చూస్తున్న మీడియాకు ఏదో జరగబోతోందన్న అనుమానాలు బలపడసాగాయి. లంకాపట్నం, కొత్తపేట నీళ్ళట్యాంకు, దాసన్నపేట, పద్మావతీ నగర్, జొన్నగుడ్డి, పల్లె వీథి తదితర ప్రాంతాలకు చెందిన యువత బలంగా సమీకృతమవటం ప్రారంభమయ్యింది. అక్టోబర్ ఐదవ తేదీ అనుమానాలను నిజంచేస్తూ ఉదయం సుమారు 10.30గంటల ప్రాంతంలో రాళ్ల యుద్ధం ప్రారంభమైంది. కోట, మూడు లాంతర్ల జంక్షన్ లకు మధ్య వున్న అర కిలోమీటరు నిడివి వున్న బజారు పోరాట ఆరంభవేదికయ్యింది. దానిని పోలీసులు మెల్లమెల్లగా కోట జంక్షన్ వరకూ నెట్టుకువచ్చారు. ఈ క్రమంలో పోలీసులు టియర్ గ్యాస్ గోళాలను ప్రయోగించారు. అయినా వెనక్కు తగ్గలేదు. సరికదా... మూడు లాంతర్ల జంక్షన్ కు పోలీసులను పరిమితం చేస్తూ ఇటు కోట జంక్షన్ నుంచి అటు అంబటి సత్రం నుంచి ఆందోళనకారులు రాళ్ళ దాడులుకు దిగారు. 
ఈ క్రమంలో ఆందోళనకారుల ఆగ్రహం మీడియాపైకి కూడా మళ్ళింది. పుకార్లు ఎలా షికారు చేస్తాయన్న విషయం అందరికీ బోధపడిన సందర్భం. జెఎసీ ఛైర్మన్ అశోక్ బాబు విజయనగరం వస్తున్నారన్న వార్త క్షణాలలో పాకిపోయింది. దాని వెంబడే సుమారు పది నిమిషాల తేడాతో తిరిగి ఆయన రావటం లేదన్న వార్త... వెనువెంటనే ఆగ్రహంతో ఊగిపోతున్న ఆందోళనకారులు కోట జంక్షన్లో వున్న వివిధ జెఎసీల టెంట్లను పీకి పాకాన పెట్టారు. అక్కడితో వారి ఆగ్రహం చల్లారినట్లు లేదు. కొద్దిమంది గురజాడ వీథిలోని సత్యా కాలేజీపైకి రాళ్ళు రువ్వారు. ఆఫీస్ ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. వాహనాలను దగ్ధం చేశారు. కార్యాలయంలో పెట్రోలు పోసి అగ్గిరాజేశారు. మరికొంతమంది గంట స్థంభంకు సమీపంలోని సత్యావిజన్ ను ముట్టడించారు. దీనికి ముందుగానే ఆ ప్రాంతాన్ని చీకటి చేశారు. కదం తొక్కారు. వస్తువలను చితక్కొట్టారు. పెట్రోలుతో దొరికిన వస్తువలనన్నింటినీ తగలపెట్టారు. అదే తెగువతో కార్యాలయానికీ నిప్పు పెట్టారు. మంటలను ఆర్పటానికి వచ్చిన ఫైర్ సిబ్బందిపై చేయి చేసుకుని గెంటివేశారు. దృశ్యీకరిస్తున్న మీడియాను లైట్లు వేయకుండా షూట్ చేయాలంటూ పరుషపదజాలంతో హెచ్చరించారు. ఈ రెండు ఘటనలు చల్లబడకముందే తోటపాలెంలో నివాసముంటున్న బొత్సమేనల్లుడు చిన్న శ్రీను ఇంటిపైకి విద్యార్థుల, యువజనుల దండు కదిలింది. అక్కడ అప్పటికే సిద్ధంగా వున్న చిన్న శ్రీను అనుచరులు ఎదురుతిరిగారు. ఈలోగా పోలీసులు అక్కడకు చేరుకుని లాఠీలు ఝుళిపించారు. ఆ క్రమంలో చిన శ్రీను నియమించిన ప్రైవేటు గూండాలు... సిక్కులు నలుగురిపై కారంతో దాడి చేసి కొట్టారని వార్తలు వచ్చాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వుందని, ఒకరు చనిపోయారన్న వార్త దావానలంలా వ్యాపించింది. ఆ మరుసటి రోజుకు అంటే ఆరవ తేదీకి ఆ వార్త రాష్ట్రమంతా పాకిపోయింది. అయితే చనిపోయింది ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వారన్న విషయం ఆ ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఎవ్వరికీ తెలియకపోవటమే అసలు సిత్రం. ఆ తరువాత చంపేయబడ్డారన్న సంఖ్య రెండుకు చేరుకుంది. అది ఫేస్ బుక్ లకు, ఈ మెయిళ్ళకు పాకింది. దీనితో ఉత్తర కోస్తా ఐజీ ద్వారకాతిరుమలరావు, మరో ఐజీ గోవింద్ సింగ్, డిఐజి ఉమాపతిలతో కలసి మీడియా సమావేశం నిర్వహించి అవన్నీ ఉఠ్ఠి పుకార్లే నంటూ ఖండించారు. ఏలూరు రేంజ్ డిఐజీ విక్రమ్ సింగ్ మాన్ స్వయంగా రోజంతా కోట జంక్షన్ వద్ద నిలబడ్డారు. పరిస్థితిని అంచనా వేస్తూ కనిపించారు. 

ప్రణాళికాబద్ధంగా చేస్తున్న దాడిలో భావోద్రేకాలతో, ఉద్వేగాలతో ఆందోళన చేస్తున్న ఉద్యమకారుల ముందు కొన్ని ప్రేరేపిత శక్తులు చేరాయన్న అంచనాకు ఆయన వచ్చారు. అప్పటికే విజయనగరానికి అడిషనల్ డిజి పూర్ణచంద్రరావుతో పాటు మరో ఇద్దరు ఐజీలు, పలువురు డిఐజీలు, ఎస్పీలు చేరుకున్నారు. డిఎస్పీలు, సిఐల సంఖ్య భారీగానే వుంది. ఐదవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకూ సాగిన రాళ్ళ దాడులు, టియర్ గ్యాస్ ప్రయోగాలు సాయంత్రాంనికి మరింత ఉధృతమయ్యాయి. 
బొత్సాకు రాజకీయ పునాది రాయి అయిన కేంద్ర సహకార బ్యాంకు కార్యాలయం ఆందోళనకారుల దాడిలో దగ్ధమయ్యింది. దానికి సమీపంలోని వైన్ షాపు లూఠీ అయ్యింది. బొత్సాకు సన్నిహితులుగా భావించే మరో రెండు మూసివున్న షాపులపై రాళ్ళదాడి చేశారు. నైపుణ్యంతో వీథి లైట్లను కొట్టుకుంటూ పోలీస్ బారికేడ్లను పెద్ద శబ్ధంతో రహదారిపై తోసుకుంటూ సాగిన ఆందోళనకారులు పోలీసు బలగాలను సమర్ధవంతంగా ఎంజీరోడ్డులోకి నెట్టవేశారు. పోలీసులు నిస్సహాయంగాచూస్తుండగానే వారి జీపును తగలపెట్టారు. ఆర్ అండ్ బి కార్యాలయంలో మూడు జీపులకు నిప్పుపెట్టారు. కలెక్టర్ కార్యాలయంపైకి రాళ్లు రువ్వారు. చినశ్రీను ఇంటి వద్ద విద్యార్థులపైదాడి చేసిన పాత నేరగాళ్ళైన సిక్కులను పట్టుకోవటానికి కె ఎల్ పురంలోని వారి నివాసాలపైకి దాడి చేశారు. గురుద్వారపైకి రాళ్ళు రువ్వి అద్దా లను ధ్వంసం చేశారు. పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన పోలీస్ అధికారులు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. 
కర్ఫ్యూ మొదటి రోజు... అక్టోబర్ ఆరవ తేదీ ఉదయం ఆందోళనలు కొనగాయి భాష్పవాయుగోళాల ప్రయోగం కొనసాగింది. రబ్బరు బుల్లెట్లూ ప్రయోగించాల్సి వచ్చింది. గాజులరేగలోని సీతమ్ ఇంజనీరింగ్ కళాశాలపైనా పెద్ద ఎత్తున దాడి, విధ్వంసకాండ సాగింది. అన్నీ బొత్సా, ఆయన బంధువుల, అనుచరుల ఆస్తులు ఇళ్ళే లక్ష్యంగా సాగిన దాడులు. దాడులు చేసిన వారు నిర్ధిష్టసంఖ్యలోనే వుండవచ్చుగాక. అయితే వాటిని చూసి ఆనందించిన వారు మాత్రం వేలల్లోనే కనిపించారు. ఎవరిని కదిలించినా మరో భావనకు తావులేని మాటే. వాళ్ళ ఆగడాలు భరించిన వారికే  అర్థమవుతాయి. ఆస్థులు పోగేసుకోవటానికి విజయనగరం ప్రజలను నిర్ధాక్షిణ్యంగా తొక్కేసారంటూ పట్టరాని ఆగ్రహం. ఆస్థులను పెంచుకోవటంలో వున్న శ్రద్ధలోని ఆవగింజంతైనా ఇక్కడి ప్రజలపైనా, పట్టణంపైనా లేదన్న ఆవేదన. పోలీసులు కూడా దీనికి మినహాయింపు కాకపోవటం ఈ సందర్భంగా ప్రస్థావనార్హం. బొత్సా కుటుంబం ఆస్థుల విధ్వంసకాండను చూస్తూ ఆనందించని వర్గాలు బహు అరుదుగా కనిపించాయి. అందుకేనేమో కర్ఫ్యూ పెట్టించింది, ఆ సందర్భంగా కరెంటు తీయించింది బొత్సానే అని అంటూ వచ్చిన వదంతులూ నిజమేనన్నంతగా నమ్మకాన్ని పెంచాయి. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేశారని, బొత్సా ముఖ్యమంత్రి పీఠం ఎక్కారంటూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాకిన పుకార్లతో మీడియాకు ఊపిరాడలేదు. 

విజయనగరం... ఎక్కడ వుంది అంటూ వెతుక్కునే ఢిల్లీ పెద్దలకు, జాతీయ మీడియాకు స్పష్టంగా దాని రూపురేఖలు అర్ధమయ్యాయి. అయితే వారికి కానీ, రాష్ట్రంలోని పోలీస్ పెద్దలకు కానీ, తలలు బద్దలు కొట్టుకునే అనేక మందికి కానీ అర్ధంకాని దల్లా ఒక్కటే. ప్రశాంతతకు మారుపేరైన విజయనగరం, ఒక చెంప కొడితే మరోచెంప చూపించే ప్రజలు ఒక్కసారిగా ఇంతటి ప్రణాళికాబద్ధ హింసాత్మక తిరుగుబాటుకు ఎలా దిగారు? భరింపశక్యం కానంత విద్వేషపూరిత వ్యతిరేకత వున్న మాట నిజమేకాని అది ఈ స్థాయి విధ్వంసాలకు దారితీయటం మా సర్వీసులే చూడలేదే? దీని వెనుక ఎవరో వున్నారు? అన్న బలమైన అనుమానంతో పోలీసులు తమ విచారణను సాగించారు. పదుల సంఖ్యలో యువకులను, వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వయంగా ఐజీ స్థాయి అధికారి వారిని విచారిస్తూ సాగారు. ఈ సంఖ్యను అధికారికంగా ప్రకటించటానికి అధికారులు నిరాకరించారు. రెండు రోజులపాటు సడలింపే లేని కర్ఫ్యూతో ప్రజలకు ఉక్కపోతకు గురయ్యారు. రాజకీయ పార్టీలు తమ స్వార్థప్రయోజనాల కోసం వున్నాయన్న రాజకీయ పరిశీలకుల అభిప్రాయాలనూ దర్యాప్తు అధికారలు పరిగణలోకి తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

ఎంతో మంది మహానుభావులకు ఆలవాలమైన విజయనగరం మసిబారింది. వికటించిన ఉద్యమ స్ఫూర్తి సరికొత్త ముద్రను విడిచిపెట్టింది. సమైక్య ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని లూటీలు తప్ప ఏ ప్రయోజనమూ ఆశించని అల్లరి మూకలు చెలరేగాయా? లేక రాజకీయపరిశీలకులు భావిస్తున్నట్లు రాజకీయ పార్టీలు అధిపత్య పోరులో భాగంగా అల్లరిమూకలను ఉద్యమంపేర విధ్వంసానికి ఉసిగొల్పాయా? తేల్చాల్సిన దర్యాప్తు బృందాలు పనిలోనిమగ్నమయ్యాయి. బహుశా శ్రీకృష్ణ కమిటీ నివేదికలా అది ఎప్పటికీ వెలుగుచూడకపోవచ్చు. వైఫల్య ఫలితానికి జిల్లా ఎస్పీ బదిలీ కావచ్చు. ఎపి ఎన్జీవోలు, ఇతర జెఎసీలు ఉద్యమ విధ్వంసంతో మాకు సంబంధం లేదని శ్రీకాకుళంలో ప్రకటించనూవచ్చు. బొత్స సత్తిబాబు వర్గం తమ స్వీయతప్పిదమేమైనా వుందా? అంటూ ఆత్మ విమర్శకు పాల్పడకపోవచ్చు. కానీ, విజయనగర చరిత్రపుటలకు అంటిన ఎర్రటి మసి మరక తొలిగే అవకాశాలు లేశమాత్రమే.

మృత్యుంజయుడు - ఓ మంచి సినిమా

సినిమాకు వెళ్ళాలంటూ అనిల్ రెండు రోజుల నుంచి గొడవ చేస్తుంటే పని ఒత్తిడితో కలిగే అయిష్టతతోనే రాత్రి 9.50కి వరుణ్ ఐనాక్స్ కి బయలుదేరా. థియేటర్ లోకి వెళ్ళి సినిమా ప్రారంభం అయిన తరువాత కొద్ది సేపటికే అర్థమై పోయింది. అనిల్ గట్టిగా కోరి వుండకపోతే ఓ మంచి సినిమా చూడకుండానే వెళ్ళిపోయేదని. ధన్యవాదాలు అనిల్. 

రెండు గంటల 26నిమిషాల అరుదైన ఆంగ్ల సినిమా. 135మిలియన్ డాలర్లు ఖర్చుతో తయారై 430మిలియన్ డాలర్లుకు పైగా వసూలు చేసిన, చేస్తూన్న సినిమా ది రెవెనెన్ట్. కంప్యూటర్ గ్రాఫిక్ మాయాజాలానికి దూరంగా, సహజత్వానికి దగ్గరగా అత్యంత వ్యయప్రయాసలకు ఓర్చి తీసిన సినిమా. కెనెడా, అమెరికా, అర్జెంటీనాలలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. జపాన్ కు చెందన సంగీత దర్శకుడు సకమొటొ, జర్మనీకి చెందిన అల్వ నొటొ అందించిన సంగీతం ఆద్యంతం అద్భుతం. దర్శకుడు అలెజాండ్రొ జి ఇనారిటు అభినందనీయుడు. 

ఫ్రెంచ్, కెనడాలకు చెందిన జంతు చర్మాల వ్యాపారస్తులు అమెరికా మూలవాసుల జీవితాలను అల్లకల్లోలం చేసిన తీరును, ప్రళయ ప్రకృతిని తట్టుకుని నిలబడగలిగే మానవుని ఆత్మస్థైర్యాన్ని, మనిషిలోని పశుకోణాన్ని దర్శకుడు చెప్పిన తీరు మనల్ని లీనం చేస్తుంది. పగ - ప్రతీకారాలు, వ్యష్టి జీవేచ్ఛ తీసుకువచ్చే స్వార్థ చింతన, అది మనిషిని పతనావస్థలోకి నెట్టే తీరు అంతర్లీనంగా సాగుతూంటుంది. సంగీతం, దృశ్యం, మాట... మనపై ముప్పేట దాడి చేస్తాయి. రెప్ప వేయనీయకుండా కట్టి పడేస్తాయి. 

ఇదో అద్భుత దశ్య కావ్యం. వర్ణనకు అందని అమలిన చిత్రీకరణ ప్రాంతాల అందాలను తెరపై నిశ్శబ్ధంగా చూస్తూ ఆనందించాల్సిందే. కొన్నింటిని చాటటానికి పదాలు తడబడతాయి. 

అనిల్ మరిన్ని మంచి సినిమాలను చూపించే బాధ్యత నీదే సుమా. 

23, ఫిబ్రవరి 2016, మంగళవారం

చంద్రుడుకి ఎందుకు కోపం వచ్చింది?

మత్తు వదలలేదు. పక్క గదిలో లైటు వేసిన అనుభూతి. రెప్పలేవకుండానే మెలుకువ వచ్చిన ఫీలింగ్. అమ్మ ఎప్పుడూ ఇంతే. బంగారం లాంట నిద్ర చెడగొట్టాలా? మస్తిష్కంలో అన్నీ నమోదవుతూనే వున్నాయి. లేవాలన్న ప్రయత్నం విఫలమవుతున్న విషయమూ అర్థమవుతోంది. ఈ లోగా అలవాటు చొప్పున సొల్లు యంత్రం తన పని తాను చేసుకుపోయింది. పండుకుంది చాలు... లే అంటూ మోగటం మొదలుపెట్టింది. తప్పనిసరై ఒకింత విసుగుతోనే లేచిన గుర్తు. చప్పుళ్ళు వినిపిస్తున్న వంటగదిలోకి అడుగులేశాను. ఏంటమ్మా ఇది అంటూ విసుగ్గా రాబోయిన మాటలు పెదాల మాటునే ఆగిపోయాయి. నాన్న... బ్రెష్షు నోట్లో పెట్టుకుని కాఫీ కలుపుతున్నాడు. 
ఏంటండీ నిద్ర పట్టలేదా? అంటూ పదాలు అప్రయత్నంగానే దొర్లాయి. 
ఇప్పుడే లేచారా, అంటూ సమాధానం. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నా... నా ప్రశ్నలో ధ్వనించిన చికాకును నాన్న గ్రహించలేదన్న తేలికపాటి భావన. 
చకచకా తయారై తోలూడిన బూటేసుకుని వాకింగ్ కి బయలుదేరాను. నేను నడకకు పోకపోతే పొద్దు పొడవ దేమోనన్న ఫీలింగ్ బలంగా వుంటుంది. వెధవది, ఆ మాత్రం లేకపోతే ఠంఛనుగా మెలుకువ రాదని నా గట్టి నమ్మకం. ఇదే చాదస్తం అంటే, అని అప్పుడప్పుడూ మా ఆవిడ విసుక్కోవటమూ గుర్తుకు వచ్చింది. 
రోడ్డు దాటుతూంటే, ఎర్రటి చంద్రుడు పడమటకి జారిపోతున్నాడు. గుండ్రంగా ఎర్రగా కనిపించిన చంద్రుడుని చూడగానే ఎందుకంత కోపం అనిపించింది. నిజమే చంద్రుడికి ఎందుకో కోపం వచ్చింది. ఎర్రబడ్డాడు. మెల్లగా చెరువుగట్టుపై నడుస్తూన్నా... కోపబింబం వెంటాడుతూనే వుంది. లాభం లేదనుకుంటూ దానిని సెల్ ఫోన్ లో బంధించాలని చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. 
సందేహం తీరకుండా నడక సాగదనిపించింది. వెంటనే శ్రీమతికి ఫోన్ చేశా. మరో ఐదు నిమిషాలలో ఎటూ తను నిద్ర లేస్తుంది. ఫర్వాలేదులే అన్న ధీమా. 
హలో... నిద్ర మత్తులో శ్రీమతి గొంతు. 
బాగుంది, హస్కీగా. నాకు చాలా ఇష్టం ఆ ధ్వని. 
మురిపాన్ని పక్కనపెట్టి, చంద్రుడికి కోపం వచ్చిందోయ్. ఎందుకో అర్థం కావటం లేదు. బాగా ఎర్రబడ్డాడు. ఎందుకంట? అంటూ ఉగ్గపట్టుకున్న ప్రశ్నను అడిగేశాను. 
అవునా...? మత్తు వీడని మూడ్. 
అవును, ఎంత ఎర్రగా వున్నాడో అంటూ నా గొంతులో అదో రకమైన ఉద్వేగం. 
చాలా కూల్ గా... అడగలేకపోయావా... పెదాల చివర్న చిన్న నవ్వు వచ్చినట్లు కనిపించే సరికి, చిన్న సంతృప్తి. అంతలోనే అసంతృప్తి కమ్మేసింది. అర్థం కాలేదు. ఏం ఆశించాను? 
అసంకల్పితంగానే మరో ఫోన్.
హలో యంగ్ మాన్ గుడ్ మార్నింగ్ అంటూ పలకరింపు. 
గుడ్ మార్నింగ్, చంద్రుడికి కోపం వచ్చింది. ఎంత ఎర్రగా వున్నాడో, చూశావా? అంటూ గబగబా అడిగాను. 
అవునా, చూస్తాను ఆగు అనేలోగా చంద్రుడు జారుకున్నాడు. 
కనిపించడులే నీకు అంటూ ముక్తాయించాను. ఏదో మాటలు సాగుతూనే వున్నాయి. అన్యమనస్కంగానే వున్నా. ఇంతకీ చంద్రుడుకి ఎందుకు కోపం వచ్చింది? సమాధానం దొరకనేలేదు. వచ్చిన సమాధానం ఈ చెవి నుంచి ఆ చెవిగుండా జారిపోయింది. చిన్న వెలితి... రోజంతా కొనసాగుతూనే వుంది. అసలు ఏం కావాలి?...

22, ఫిబ్రవరి 2016, సోమవారం

లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక...

ఆర్భాట ప్రకటనలు... హంగు, పొంగులతో స్థలాల పరిశీలనా పర్యటనలు... మూడు నెలలుగా మన మంత్రులు, 
ఎమ్మెల్యేల తీరిది. అత్యుత్తమ ప్రకటన అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు 
నుంచి జిల్లాలో జూనియర్ మంత్రి గంటా శ్రీనివాసరావు వరకూ ప్రకటించని వారే లేరు. సందట్లో సడేమియా... తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా బిజెపి ఎమ్మెల్యే నేతృత్వంలో సమావేశం కావటం, ఆయన ఆధ్వర్యంలో ఐటి కంపెనీలను తనిఖీ చేసి మీ చేతకాని తనాన్ని చూస్తూవూరుకోం అంటూ రంకెలేయటం..ఇప్పుడు జిల్లాలో ఇవి హాట్ టాపిక్స్. అసలు వీటి వెనుక మర్మమేమిటో? జనాలను వేధిస్తోన్న సందిగ్ధ సందేహం. తరచి, తొలిచి చూస్తే వచ్చే ఆసక్తికరమైన అంశాలే నేటి ఎబిఎన్ కథనం...
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జనాలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే ఏ పని అయ్యింది? అంటే, ఠకామని చెప్పటం ఒకింత కష్టమే. కానీ, విశాఖపట్టణం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను తీసుకురావటానికి, 24గంటలూ 
లోహపురెక్కల జడిసప్పుడు నగరం నెత్తిన రొదపెట్టటానికి అవసరమైన అనుమతుల సాధనకు నాటి ప్రజాప్రతినిథులు పాపం ఎంతగానో కష్టపడ్డారన్న విషయాన్ని విస్మరించటం ఎంతమాత్రమూ సముచితం కాదని విజ్ఞులైన పెద్దల అభిప్రాయం. ఇప్పుడు ప్రశ్న అల్లా ఆ విజ్ఞులైన పెద్దల్లో నేటి పాలకులున్నారా? అన్నదే. చమటోడ్చి సాధించిన అంతర్జాతీయ హోదాను ఏమీ కాదన్నట్లు తీసేస్తారేమిటి? సరికొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకువస్తానంటారేమిటి? కాంగ్రెస్సోళ్ళను వేధిస్తోన్న ప్రశ్న. విశాఖలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును నిర్మిస్తాం అంటూ చంద్రబాబు... ఆ కట్టే పచ్చటి విమానాశ్రయాన్ని అచ్యుతాపురంలో కడతామని ఒక సారి, కేంద్ర బృందం స్థలపరిశీలన తరువాత నిర్ణయిస్తామని మరో సారి జిల్లాలో జూనియర్ మంత్రి గంటా శ్రీనివాసరావు పలుమార్లు ప్రకటించారు. దీనికితోడు పక్కజిల్లాల మంత్రులూ అబ్బే ఆ జిల్లాలో కాదంటూ ఇచ్చిన ప్రకటనలను విశాఖ జనం అస్సలు ఖాతరు చేయటం లేదులేండి. అందరూ అయిపోయారు, నేను మాట్లాడకపోతో బాగోదనుకున్నారో, లేక నిజంగా మాట్లాడాలనిపించే మాట్లాడారో తెలియదు కానీ... ''అబ్బే అక్కడా ఇక్కడా దేనికీ... దేశంలోనే రెండో మునిసిపాలిటీగా, డచ్ వారి పోర్టుగా వెలుగొంది చారిత్రిక ప్రాధాన్యం కలిగిన భీమునిపట్నం ఆనవాలును చెరిపేస్తూ 
మహావిశాఖలో ముంచేస్తున్నాం కాబట్టి... అక్కడే విమానాశ్రయాన్ని కట్టేస్తాం'' అంటూ జిల్లా సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలంగాణ రాజధాని హైదరాబాదులో మీడియా ముందు ప్రకటించేశారు. అంతే సముద్రంలో విమానాలు దిగుతాయంటూ నమ్మినబంటుల్లాంటి మీడియా గట్టిగా ఊదేసింది. అద్సరే... అసలు ఇంతకీ ఎయిర్ పోర్టు ఎక్కడొస్తుందహే? ఎందుకండీ అంత అసహనం... ఓపికపట్టండి సెపుతాంగా..!
సామాన్యులకు తెలిసిన ఓ నిజం చెప్పేస్తున్నా.అజాగ్రత్తగా సెవులురెండూ ఒగ్గేయకండే... ఇప్పుడున్న విమానాశ్రయంలో అన్ని హంగులూ వున్నాయి. దేశవిదేశాల నుంచి పారొచ్చేసి రాత్రిళ్లు దిగేయటానికి ఎంచగ్గా మిణుగురు దీపాలూ వున్నాయి. ఇమానం దిగేప్పుడు, ఎగిరేప్పుడూ పెట్టే పరుగుకు మరింత పెద్ద సిమెంటు రోడ్డు కావాలన్నా వేసుకోవటానికి తగినంత స్థలమూ వుంది. సామాన్యుడు పనికోసం పరుగెత్తిపోయే దుబాయికి, మననాయుడోరు నిత్యం పలవరించే సింగపూర్ కి ఎప్పటి నుంచో ఈ పెద్దపెద్ద ఇమానాలు ఎల్లొచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ కావలసిందాల్లా మరిన్ని ఇమానాలు ఎడాపెడా వచ్చేయటం. ఎక్కేవోడు లేక పల్లెవెలుగు ఎత్తేస్తున్నారు. ఎందుకంటారు..! ఆల్లంతా మరి ఇమానాలెక్కేసి దిగిపోయొచ్చేస్తారు మరి. అందుకే ఇమానాలూ ఇమానాలూ మా ఊరికి రండోచ్ అంటూ బొట్టూ, చీరెట్టి పిలుపులిచ్చేయటం మానేసి కొత్తవిమానాశ్రయం ఎందుకండీ? అంటూ ఉత్తరాంధ్ర అమాయకులు పాపం జవాబు రాదని తెలిసినా అడిగేస్తూనే వుంటారు. ఆ మద్దెన నావికాదళంలో పెద్దాయన మీడియాపెద్దోళ్ళతో పిచ్చాపాటీ మాట్లాడారు. విశాఖవిమానాశ్రయాన్ని అభివృద్ధి చేసుకోవటానికి మేం 
అడ్డంకికానేకాదు. అయితే దీనిని విడిచిపెట్టి మేం వెళ్ళటం వ్యూహాత్మకంగా కుదరదు. అంతేనా, అచ్యుతాపురం, రాంబిల్లి ప్రాంతాలలో విమానాశ్రయం ఏర్పాటును అంగీకరించబోమంటూ చాలా తెలివిగా గొట్టాలకేమీ సాక్ష్యమివ్వకుండా చెప్పారు. ఇకపోతే విజయనగరం జిల్లాలో వున్న బాడంగి ఎయిర్ స్ట్రిప్. అక్కడ వున్న 2500 ఎకరాల సుమారు వెయ్యి ఎకరాలకుపైగా రైతుల ఆక్రమణలలో వుండగా, మిగిలినది నావికాదళం అధీనంలోనే వుంది. దేశ రక్షణ అవసరాల రీత్యా దానిని ఒదులుకోవటానికి సిద్ధంగా లేమని సూచనాప్రాయంగా ఇప్పటికే భారతనావికాదళం చెప్పినట్లు సమాచారం. చివరిగా భీమిలిలో విమానాశ్రయం పెట్టేంత స్థలం లేదు, ప్రతిపాదన అంతకంటే లేదు అంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ యువరాజ్ ఓ కాలు కారులోనూ, ఓ కాలు రోడ్డుమీదా పెట్టి ఆమాటా ఈ మాటా మధ్యలో విలేఖరులతో అనేశారు. ఆనోటా ఈనోటా వచ్చిన ప్రతీఊరిలో రియల్టర్లు కార్లేసుకుని వాలిపోయారు. పండొలిచి నోట్లో ఎట్టినంత వివరంగా సెప్పానా... ఇంకా అంటే ఎట్టబ్బా..?!
విమానాలు వాటి ఆశ్రయాల సంగతి అటుంచితే... ఇప్పుడు జిల్లాలో తెలుగుతమ్ముళ్ళకు ఓ కొత్త బెంగపట్టుకుంది. కాలం గడిచేకొద్దీ అసలు పార్టీ వుంటుందా? లేక అంతా జాతీయ పార్టీనే మేలంటూ అటే వెళ్ళిపోతారా? ఇంతకీ తమ్ముళ్ళకు అంతసందేహం ఎందుకు వచ్చిందనేగా? ఇది విన్నతరువాత కూడా మీకు రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఆ మధ్య జిల్లాలో ఎన్నికైన తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా కలిసి ఓ హోటల్ లో గూణుపుఠానీ చేశారు. అంత వరకూ పెద్ద తప్పేమీ లేదు కానీ... దానికి నేతృత్వం వహించింది మాత్రం మొన్నటి కాంట్రాక్టర్లు కమ్ క్రికెట్ ప్రేమి, నిన్నటి ఐటీ కంపెనీ ఓనరు, ఇప్పటి బిజెపి ఎమ్మెల్యే అయిన విష్ణుకుమార రాజు కావటమే అసలు తంటా. దానికి సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు, రెండో సారి ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహిస్తున్న వెలగపూడి, రాజు తదితరులతోపాటు పలువురు హాజరు అయ్యారు. అక్కడితో ఆగకుండా మరోసారి నగరం నడిబొడ్డున వున్న ఐటీ కంపెనీలు విప్రో, టెక్ మహేంద్రలలో తనిఖీల పేరిట హడావిడి చేశారు. ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, విప్రో అధినేత ప్రేమ్ జీకి రాచమర్యాదలు చేసి ఇంకా స్థలం ఇస్తామంటూ హామీతో పాటు, ఇస్తున్నట్లు ప్రతాన్ని కూడా చేతిలో పెడితే... ఎమ్మెల్యేలు విప్రోకు  వెళ్ళి ఇవ్వాల్సిన ప్రకారం ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి నీ స్థలం లాక్కుంటామంటూ మీడియాముందు హూంకరించటం... ఎట్టెట్టా అంటూ ఉత్తరాంధ్ర జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఓ సీనియర్ రాజకీయనాయకుడు మాట్లాడుతూ, మాజీ మంత్రులు కూడా ఆలోచనారాహిత్యంతో, ఆవివేకంగా ప్రవరిస్తుంటే ఖర్మ అనిసరిపెట్టుకోవటం తప్ప ఏం చేస్తామండీ అంటూ నిట్టూర్చారు. ఇది ఇలాగే సాగితే రానున్నకాలంలో బిజెపి మరింత స్వతంత్రంగా వ్యవహరించటానికి చూస్తుందంటూ ఆయన జోస్యం కూడా చెప్పారు. ఇదే భయం ఇప్పుడు తమ్ముళ్ళనందరినీ వేధిస్తోంది మరి. వాయిస్ ఓవర్: గడచిన మూడు నెలల కాలంలో అది చేస్తాం, ఇది చేస్తాం... అక్కడ కడతాం, ఇక్కడ కడతాం... అంటూ చెప్పిన ఇంకా చెపుతున్న మాటలు తప్ప మరేమీ కనిపించని పరిస్థితులను ప్రజలు జాగ్రత్తగానే కనిపెడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఉత్తగొడ్డుకు అరుపులెక్కువ అనుకునే ప్రమాదం వుంది. అసలు రాష్ట్రంలో... ఉత్తరాంధ్రలో... మరీ ముఖ్యంగా ఇసాకపట్నంలో ఏం జరుగుతోంది? ఏమో లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక....

People decide leader’s fallows

సమైఖ్య రాష్ట్ర నినాదం అనూహ్యంగా వాడవాడలా ఎగబాకుతోంది. కార్చిచ్చులా వ్యాపిస్తున్న ఈ భావోద్వేగ ప్రదర్శనలపై పట్టుకోసం వివిధ రాజకీయ పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. 12రోజులు గడుస్తున్నా ముగింపుపై స్పష్టత లేకుండా ఏకనినాదంతో సాగుతున్న ఆందోళనలు నాయకులను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. బేధం లేకుండా నాయకులునందరినీ అనుమానపు చూపులతో, అవమానకరమైన మాటలతో ప్రజలు చూస్తుండటంతో నాయకులు ఖిన్నులవుతున్నారు. తమతమ నియోజకవర్గాలకు దూరంగా మసలుతున్నారు. 
విశాఖ జిల్లాలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఒక రాజ్య సభ సభ్యుడితో పాటు మరో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వున్నారు. వీరికితోడు నాలుగురు టిడిపి ఎమ్మెల్యేలు, ఒక వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే జిల్లాలో వివిధ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు సమైఖ్య నినాదంతో చాలా కాలంగా ఉద్యమకారులతో మమేకమవుతూ తన విధానాన్ని విస్పష్టంగా ప్రకటిస్తూ వస్తున్నారు. అడపాదడపా అని ప్రజలు అంటున్నా... ఆయన మాత్రం, నేను వీలున్నప్పుడల్లా జిల్లాలో సమైఖ్య ప్రదర్శనలలో పాల్గొంటున్నాను అనే చెపుతూ వస్తున్నారు. వివిధ జెఏసీల వద్దకు వెళ్ళి మద్దతు ప్రకటిస్తూ రావటం, రాజకీయేతర జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో పలువురిని తన ఏలుబడిలో ఓ వేదికపైకి తీసుకువచ్చిన గంటా, ప్రతిపక్షాల నుంచి ఘాటైన విమర్శలనే ఎదుర్కొన్నారు. స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమబాటను పునాది చేసుకోవాలని చూస్తున్నారంటూ గంటాపై విమర్శలు వెల్లువెత్తాయి. సమావేశం తరువాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎన్జీవో హోంనే తన స్వంత కార్యాలయంగా ప్రకటించటం తప్ప మరే కార్యక్రమంలోనూ ఈ జెఎసీ చురుకుగా పాల్గొనకపోవటం, కార్యాచరణ కోసం మంత్రివైపు చూస్తోందన్న మాట... నేపథ్యంలో నాన్ పొలిటికల్ జెఎసీ నామమాత్రంమైంది. ఢిల్లీ, హైదరాబాదు, విశాఖల మధ్య ఎప్పుడు ఎక్కడ వుంటారో తెలియకుండా ఎగురుతున్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఉద్యమాన్ని ఉధృతం చేయటానికి పావులు ఎలా కదుపుతారన్న ప్రశ్న ఉద్యమాభిమానులను వేధిస్తూనే వుంది. మరో మంత్రి పసుపులేటి బాలరాజు సమైఖ్యతకే కట్టుబడి వున్నానని చెపుతూనే... రాజీనామా చేయననీ, అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న తరువాత పెద్ద చేయగలిగేది ఏమీ లేదని బహిరంగంగానే చెపుతూ వస్తున్నారు. ఆ మాట అన్నందుకు నర్సీపట్నంలో ఆయన సమైఖ్యవాదుల నిరసనను ఎదుర్కొన్నారు. నిరసనకారుల పట్ల సాహానుభూతిని ప్రదర్శించాల్సిన మంత్రి సంయమనం కోల్పోయి వారిని పోలీసులకు అప్పచెప్పటంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. నిన్నటి వరకూ విశాఖలోనో కాకుంటే ఏజెన్సీలో ప్రజలకు అందుబాటులో వుండే మంత్రి బాలరాజు చాలా కాలంగా హైదరాబాదుకే పరిమితమై పోయారు. ప్రజల భావోద్వేగాలను సొమ్ముచేసుకునే రాజకీయ నాయకుల వరుసలో వుండటానికి ఇష్టపడకే దూరంగా వుంటున్నానని సన్నిహితులకు చెపుతున్నట్లు సమాచారం.  ఈ వ్యవహారశైలితో బాలరాజు రాజకీయ భవిష్యత్తు ఇబ్బందులలో పడిందన్న సన్నిహితుల ఆందోళనను ఆయన పరిగణలోకి తీసుకున్నట్లు లేరు. 
 ఉద్యమంలో కనిపించకపోతే రాజకీయంగా వెనుకబడిపోతామనుకున్న టిడిపి నేతలు కొద్దిగా ఆలస్యంగానైనా రాజీనామాల బాటపట్టారు. ఆ తరువాత అడపాదడపా ఉద్యమం పేరుతో చిన్నచిన్న ప్రదర్శనలకు పరిమితమయ్యారే తప్ప ఉద్యమకారులకు సంఘీభావంగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన దాఖలాలు లేవు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వటానికి మేం వ్యతిరేకంగా కాదు... ఇచ్చిన పద్ధతికే అన్న తమ పార్టీ వివరణతో ప్రజలలోకి సమర్ధవంతంగా వెళ్ళలేని పరిస్థితులలో నాయకులు పడ్డారు. దీనితో వీరిపని కుడితిలోపడ్డ ఎలుకల్లా తయారయ్యింది. పూర్తిగా సమైఖ్య ఉద్యమంలోకి వెళ్ళలేక, వెళ్ళకుండా వుండలేక అన్యమనస్కంగా టిడిపి ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రదర్శనలను ప్రజలు గమనిస్తూనే వున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఇంతకు భిన్నంగా ఏమీలేదు. రాజీనామాలు చేసినట్లు ప్రకటించిన వారు, ప్రకటించని వారూ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన దాఖలాలు లేవు. మంత్రి గంటా విమానం దిగగానే ఆయనను నీడలా వెంబడించి సాగే అవంతి శ్రీనివాసరావు, చింతలపూడి వెంకట్రామయ్యలు... మంత్రి విమానం ఎక్కగానే మాయమవుతున్న తీరును ఆయా నియోజకవర్గాలలో ప్రజలు నిగ్గదీస్తూనే వున్నారు. మరో ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తపడితే... మళ్ళ విజయప్రసాద్ అటు కప్పకీ, ఇటు పాముకీ కోపం రాకుండా అన్నచందాన వ్యవహరిస్తున్నారు. అందరికంటే ముందుగా రాజీనామా ప్రకటన చేసిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చేస్తున్న ఉద్యమాలు ఏమిటా అని ఆ నియోజకవర్గ ప్రజలు తేరిపారా చూస్తున్నారు. ఆయా నియోజకవర్గాలలో ఉద్యమబాటపడుతున్న ప్రజలకు, ఉద్యమాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు పలుకుతున్న ప్రజలకు ఇప్పుడు ఎమ్మెల్యేలు  ఎక్కడున్నారో చూసే తీరికే లేదు. అవసరం అంతకన్నా లేదు. అందుకే ఉద్యమాలు ఇప్పుడు ఏదో ఒక కేంద్రానికే పరిమితం కాలేదు. ఒక సమయానికి లోబడి సాగటంలేదు. పదిమంది ఎప్పుడు కలిస్తే అప్పుడు, ఎక్కడ కలిస్తే అక్కడ జై సమైఖ్య ఆంధ్రప్రదేశ్ నినాదం మారుమ్రోగుతోంది. అదిగో ఆ తీరే ఇప్పుడు నాయకులను గంగవెర్రిలెత్తిస్తోంది. 
అధిష్ఠానానికి సన్నిహితంగా వుంటారని అనుయాయీలు ఘనంగా చెప్పుకునే కేంద్ర మంత్రి పురంధేశ్వరి జూలై మాసాంతం నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా నియోజకవర్గంకు వచ్చిన దాఖలా లేదు. సమైఖ్యరాష్ట్రం కోసం పాటుపడుతున్నానంటూ ఢిల్లీ మీడియాకే పరిమితమవుతున్న కేంద్ర మంత్రి అంతకు నెలరోజుల ముందే తమ అధినేత్రికి ఓ లేఖ ఇచ్చారని ఆయా వర్గాలలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. రాష్ట్ర విభజన అంటూ జరిగితే ఏం చేయాలో సూచిస్తూ, సమైఖ్య భావనను తేలిక చేస్తూ ఇచ్చినట్లు చెపుతున్న ఆ లేఖ విషయాంశాల ప్రచారంతో ఆమె సరిపడినంత అపకీర్తినే మూటగట్టుకున్నారు. తమ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి విలువనివ్వాలో, తన నియోజకవర్గ ప్రజల మనోభీష్ఠాన్ని గౌరవించి మంత్రి పదవిని తృణప్రాయంగా భావించి ఎడమకాలితో తన్ని ఉద్యమంలోకి కుడికాలు పెట్టాలో తేల్చుకోలేని సంక్లిష్టావస్థలో పురంధేశ్వరి కొట్టుమిట్టాడుతున్నారు. నిన్నటి వరకూ అవిశ్రాంతంగా విశాఖ పార్లమెంటు నాకేనంటూ ఎలుగెత్తి చాటిన మరో ఎంపీ తిక్కవరపు సుబ్బరామిరెడ్డి పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీలేదు. వారానికో సంఘాన్ని ఫ్లోట్ చేసి ఆ సంఘాల ద్వారా ఆయా సామాజిక వర్గాలకు దగ్గరై విశాఖ ఎంపీసీటును సాధించుకోవాలనుకున్న తిక్కవరపు ఆశలను సమైఖ్య ఉద్యమం ఉప్పెనై ముంచేసింది. సోనియమ్మను కాదని ఆయన ఉద్యమంలోకి రాగలిగిన పరిస్థితిలేదు. అలాగని జై సమైఖ్యాంధ్ర అని అనకుండానూ వుండలేరు. అందుకే ఆయన ఇతరులను నొప్పించక, తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న చిన్ననాటి నీతి పద్యాన్ని గట్టిగానే గుర్తుచేసుకుంటున్నారు. 
నిన్నటి వరకూ తెలంగాణ ఇచ్చేస్తే ఏమిలే అనుకున్న వారంతా ఇప్పుడు హైదరాబాదు ఇచ్చేస్తే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. హైదరాబాదు తెలంగాణ వారిదే అంటే ఊరుకోం అంటూ మొదలైన మాట ఇప్పుడు అసలు రాష్ట్ర విభజనే కుదరదు అంటూ హోరెత్తుతోంది. ఈ ఉద్యమహోరులో పోరుబాట పట్టని నాయకులను ఓటరు చరిత్రహీనులను చేస్తారంటూ ఉద్యమకారులు చేస్తున్న హెచ్చరికలు నాయకులకు నిద్రను దూరం చేస్తున్నాయి. అందుకే తడబడుతూనైనా నాయకుల అడుగులు ప్రజాఉద్యమ బాటపడుతున్నాయి. రాజకీయనిరుద్యోగిగా మిగలకుండా వుండటానికి ఉద్యమం ముసుగు తొడుక్కుని ఫోజులు కొడుతున్నారు. ఏళ్ళ తరబడి సాగుతున్న వివాదానికి శాశ్వత పరిష్కారం విభజనే అన్నదానిలో నాయకులకూ, మెజారిటీ ప్రజలకు పెద్దగా బేధాభిప్రాయం లేకపోవచ్చు. పీకపట్టుకుంటుంది మాత్రం హైదరాబాదే. హైదరాబాదుని కేంద్రానికి ఇచ్చి ఇద్దరూ చెరో రాజధాని వెతుక్కుంటే సమస్య పరిష్కారమైనట్లే. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానానికి కావల్సిందీ అదే. అందుకేనేమో నాయకులూ నలుగురితో నారాయణ అంటున్నారు. Leaders decide people fallows అన్న నినాదాన్ని మార్చి People decide leader’s fallows అంటూ సరికొత్త పల్లవిని అందిపుచ్చుకున్నారు. సర్వకాల సర్వావస్తలందూ నాయకులారా... వర్ధిల్లండి.

సమైక్యం కొత్తపోకడలు ఏ దారికి?


 భావోద్వేగాల సందిట రాగద్వేషాలు రెచ్చగొట్టబడుతున్న సందర్భంలో రాష్ర్టంలోని దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలు చిక్కువడివున్నారు. దీనికి ఉత్తరాంధ్ర ప్రజలు మినహాయింపేమీ కాదు. అందుకేనేమో కొద్దిపాటి వివేచన వున్నట్లు కనిపించే నేతలు, మేథావులు ఛీత్కారాలకు గురవుతున్నారు. నోరువిప్పటానికి భయపడుతున్నారు. ఏ రోటికాడ ఆ పాట పడగలిగే సామర్థ్యం వున్న నేతలు మాత్రం దర్జాగా సాగిపోతున్నారు. ఇంతటి భావోద్వేగాలు నడుమా కులాధిపత్య ధోరణులు పచ్చగాసాగుతూ వుండటాన్ని అర్ధం చేసుకోవటం సాధ్యంకాని సామాన్యుడు తనరోజు కూలీలో అధికభాగం రవాణాకే ఖర్చు చేయాల్సి వస్తున్న విషాద సందర్భం మరింకెంత కాలమోనంటూ నిట్టూరుస్తున్నాడు.  


నేటి కాలపు రాజకీయాలకు బొత్తిగా పనికిరాని పెద్దింటి మేథావి దగ్గుపాటి పురంధేశ్వరి. సమైక్య ఉద్యమ నేపథ్యంలో ఏదోటి మాట్లాడి అటు సమైక్యవాదులకో, ఇటు పార్టీ అధిష్ఠానానికో దగ్గరవాళ్ళమనిపించుకుంటున్నామన్న సంతృప్తి తో చాలామంది నేతలు బతికేస్తూంటే ఆవిడ మాత్రం వాటి న్నింటికీ తాను దూరమన్నట్లు ప్రవర్తిస్తున్నారు. సున్నితమైన విషయాలపై బహిరంగంగా వ్యాఖ్యానించటమంటే అగ్నికి ఆజ్యాన్ని తోడివ్వటమేనన్నది చిన్నమ్మ భావిస్తున్నారని ఆమె వర్గీయులు అడిగిన వారికి, అడగని వారికి సర్దిచెప్పుకుంటున్నా... లోపల మాత్రం వెనుకబడిపోతున్నామన్న దిగులు వారిని వేధిస్తోంది. విశాఖ రానంతసేపూ ఏదోలా సర్దిచెప్పేశాం. విదేశీ పర్యటనలలోనో, అధిష్టానాన్ని ఒప్పించే యత్నాలలోనో మేడం బిజీ అంటూ బిల్డప్పులిచ్చాం. విశాఖ నుంచి మరెక్కడికో ఎగిరిపోవటానికి అవసరమైన విమానం గురించి చర్చించటానికి స్టార్ హోటల్ మీటింగ్ కు హఠాత్తుగా నగరానికి రావటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి చెప్మా అంటూ వీరవిథేయులు మల్లగుల్లాలుపడుతున్నారు. ఒచ్చారేపో... ఒక్క మాట కూడా సమైక్యవాదులకు మద్దతుగా మాట్లాడకుండా పోవటమేమిటా అంటూ చేతులు పిసుక్కుంటున్నారు. స్టార్ హోటల్ సమావేశానికి మీడియాకు ఆహ్వానం పంపిన నిర్వాహకులు ఆ తరువాత ఏమనుకున్నారో ఏమో కాని, అనుమతి లేదంటూ మీడియాను బయటకు గెంటేశారు. పాత్రికేయుల నుంచి వచ్చే ప్రశ్నలను తప్పించుకోవటానికి కేంద్రమంత్రే మీడియాను బయటకు నెట్టించారని సహజంగానే వాళ్ళూ వీళ్ళూ చెవులుకొరుకుతున్నారు. ఈ వ్యవహారంతో పురంధేశ్వరి వర్గం మరింత డిఫెన్స్ లో పడిపోయింది. సమైక్యాంధ్ర కోసం ఢిల్లీలో చాలా చేస్తున్నానని చెపుతున్న చిన్నమ్మ ఇక్కడ ఏదో ఒక శిబిరం వద్దకు వెళ్ళి మద్దతు పలికితే బాగుండేది కదా అంటూ నిత్యం ఆమె కోసం కారుల్లో బారులు తీరే వారే బాధపడుతూంటే, ప్రతిపక్షాలు తమ సహజ దుమ్మెత్తిపోత తత్వాన్ని వీడి మౌనముద్ర వహించారు.
రాజ్య సభ సభ్యుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి సమైక్యాంధ్రకు జై అన్నా రాజీనామా చేయనందుకు గో బ్యాక్ నినాదాల మధ్య చిక్కుబడిపోయారు. తానొవ్వక, ఇతరులను నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న పద్యం మాకూ తెలుసు, మీ పప్పులేమీ ఉడకవంటూ ఉద్యమకారులు ఎదురుతిరిగారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకు మాత్రం ఉద్యమకారులు మినహాయింపునిచ్చారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తూ సీఎంకు లేఖనిచ్చానని చెప్పి ఉద్యమాకారుల వెంట జెండా పట్టుకుని సాగిపోవటం ఆయనకు మాత్రమే చెల్లుబాటయ్యింది. రాజీనామా చేసి ఎలాంటి కార్యకలాపాలు చేపట్టటం లేదంటూ చెపుతున్న సదరు మంత్రిగారి వెంట ప్రభుత్వం కేటాయించిన పిఏ యథావిథిగా సాగుతూనే వున్నారు. అధికారులు వచ్చి దండాలు పెడుతూనే వుంటారు. ఏది ఎప్పుడు ప్రారంభించాలో ఆయనే నిర్ణయిస్తారు. ఉద్యమాభిమానిగా వెలుగొందటానికి అధికారాన్ని ఆయన ఉపయోగపెట్టుకున్నంతగా మరెవ్వరూ ఉపయోగించుకోలేదంటే అతిశయోక్తిమీలేదు. ఎలాంటి అనుమతులూ లేకపోయినా జాతీయ రహదారిపక్కనే రాత్రికి రాత్రే ప్లై ఉడ్ బేస్ మెంట్ తో తెలుగుతల్లి విగ్రహాన్ని కార్పొరేషన్ అధికారుల చేత పెట్టించి ప్రారంభించిన ఘనత ఆయనకే చెల్లింది. నాన్ పొలిటికల్ జెఎసీ పేరుతో తన తురుఫు ముక్కలను రంగం మీదకు ప్రవేశపెట్టి పార్టీలకతీతంగా ఉద్యమాకాంక్ష వున్న నేతగా మీడియాకెక్కారు. గవర్నర్ ను కలిసి రాజీనామాను ఆమోదింపచేసుకుని ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని విశాఖలో ప్రకటించిన కొద్దిగంటలకే,  హైదరాబాదులో... సీఎం కిరణ్ రాజీనామా వద్దని బుజ్జగిస్తారు. అంతే మాట తిరగబడుతుంది. సీఎం ప్రేమ ముందు పార్టీకన్నా ప్రజలే మిన్న అన్న మాట వెనకబడుతుంది. గంటా గారి మేనేజ్ మెంట్ టెక్నిక్ తెలియక పాపం తిక్కవరపు గోబ్యాక్ నినాదాల మధ్య చిక్కుబడిపోయారు. 
ఆత్మస్తుతి, పరపార్టీ దూషణ, నిన్నటి వరకూ కనిపించిన రాజకీయ చిత్రం. కొంత ఆత్మనింద, మరింత పరనింద నేటి రాజకీయ సిత్రం. నాయకుల తీరేమేకాని... గతంలో ఎన్నడూ లేనంతాగా ఫ్లెక్సీలు వికృతరూపం దాల్చుతున్నాయి. చూ పులు కలిసిన శుభవేళ అంటూ షర్మిల, చంద్రబాబుల ఫోటోలు... సోనియా - కెసిఆర్ లకు పెళ్ళంటూ బ్యానర్లు... రాజకీయ అసమర్థత తెచ్చిన ఉద్యమక్రీడ మరిన్ని కొత్తపోకడలు పోతోంది. కలిసి వుండాలన్న డిమాండ్ కు, విడిపోవాల్సిందే అన్న పోరుకేకకు మధ్య సంధి ఎప్పుడు కుదురుతుందో తెలియని సామాన్యుడు నిత్యజీవన పోరాటం లో సాగిపోతూనే వున్నాడు. 

ఆణిముత్యాలు దొరికేనా!?

రాజకీయ ఆకాంక్షలు, సమైక్యాంధ్ర ఉద్యమాభిలాషల జమిలి నాయకత్వం విశాఖలో ప్రజలను ఉద్యమబాట పట్టిస్తోంది. సీమాంధ్రలలోని మిగిలిన 12 జిల్లాలతో పోలిస్తే విశాఖ ఉద్యమవేడి ప్రదర్శనలో ఒకింత వెనుకబడే వుందన్న భావన నలుగురిలోనూ వుంది. ఆయా జిల్లాలలో మరెక్కడా లేని ప్రత్యేకమైన భౌగోళిక స్వరూపం భౌతికవాస్తవమైతే... ఏకతాటిపై నడిపించగలిగే నాయకత్వలేమి లోపంతో జిల్లాలో ఉద్యమం కొట్టిమిట్టాడుతోంది. ఉన్నంతలో ఉద్యమాన్ని ఓ ఊపు ఊపాలని భావిస్తున్న నాయకులు పలువురు సరికొత్తగా ఉద్యమనేపథ్యంలో తెరమీదకు వచ్చారు. జిల్లాలో పలు రాజకీయ పార్టీలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకత్వ శూన్యతను పూరించే సమర్థలు ఎవ్వరైనా ఆయాకొత్తముఖాలలో కనిపిస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. 
ప్రశాంతతకు నిలయంగా ఘనంగా ప్రకటించుకుంటున్న విశాఖ నగరానికి ఉద్యమ చరిత్రలు కూడా వున్నాయండోయ్. నగరవీథులలో ప్రైవేటు బస్సులు ఇష్టారాజ్యంగా తిరుగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూంటే ఉవ్వెత్తున ఎగిసిపడిన విద్యార్థుల ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చింది. నగరవీథులలో ఆర్టీసీ రథచక్రాలకు మార్గం వేసిన ఆందోళన అది. ఎర్ర జెండాను ఎదకు హత్తుకుని ఆదివాసీల జీవితాలలో వెలుగులు నింపటానికంటూ సాగిన నక్సల్స్ ఉద్యమానికి నీడనిచ్చింది విశాఖ ఏజెన్సీనే. అనేకానేక చారిత్రాత్మక కార్మిక పోరాటాల చారిత్రిక నేపథ్యం విశాఖ స్వంతం. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు నినాదంతో దద్ధరిల్లిన ఈ గడపకు ఉద్యమస్ఫూర్తిని నేర్పాల్సిన అవసరం వుందా?!. నిరంతరాయంగా ఉపాథి కోసమో, నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసమో సాగే చిన్నాచితకా పోరాటాలు వుండనే వున్నాయి. తోడుగా సరికొత్తగా ఎగసిపడుతున్న సమైక్య ఉద్యమాలు. సకలజనులను ఉద్యమబాటలోకి ఇముడ్చుకుంటూ సాగుతున్న పోరుహోరు. విద్యార్థులు, ఉద్యోగులు, భిన్న సామాజిక వర్గాల ప్రజలు... ఒక్కొక్కరూ ఒక్కోనాయకత్వపు నీడన... నగరంలో, జిల్లాలోనూ నిత్యం ఏదో ఒక మూల... మీడియాల రాకతో సంబంధమే లేదన్నట్లుగా  ఉద్యమ ప్రవాహ ఉధృతి సాగిపోతూనే వుంది. రాష్ట్ర విభజనపై  అప్పుడు ఇప్పుడు  మొదటిగా  స్పందించింది విశాఖ నగరమే.  ఉద్యమానికి ఆజ్యం పోసేది ఆంధ్రయూనివర్శిటీయే.. 2009 నుంచి ఇప్పటి వరకూ సమైక్యరాగం ఆలపించిన నగరం విశాఖే అంటే అతిశయోక్తేమీ కాదు.
సమైక్యాంధ్ర ఉద్యమంతో 2009 నుంచి నిరంతరాయంగా కనిపిస్తూ వచ్చిన వారిలో ఆడారి కిషోర్ కుమార్ ఒకరు. సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసీ నేతగా మొన్నటి వరకూ రాష్ట్రాన్ని చుట్టిన కిషోర్ అనకాపల్లి వాస్తవ్యుడు. సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థి నేతగా, తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన చరిత్ర వుంది. విశ్రాంత విద్యార్థివంటూ పలువురు గుర్తు చేయటంతో యువజన జెఎసీ పేరుతో సమైక్య ఉద్యమరంగంలో కొనసాగుతున్నాడు. గడచిన ఎమ్మెల్సీ ఎన్నికలలో  'దేశం' రెబల్ గా పోటిచేసే ప్రయత్నం చేశాడు. అందరితో సత్ సంబంధాలను కొనసాగిస్తూ, ఆయా సంఘాల బలాన్ని తన బలంగా ఊహించుకుంటూ వుంటాడు. పిలవని పేరాంటాలకు సైతం వెళ్లీ పోటోలకు ఫోజులిస్తుంటాడని గిట్టనివాళ్లంటారు.   కుసింత పిక్కలు వెనకేసుకున్న ఆడారి అనకాపల్లి భోగీ ఎక్కి పసుపుకండువాతో అసెంబ్లీ గడపతొక్కాలని ఆశపడుతున్నాడు. తానుపుట్టిన గవరకులం తనకు వెన్నంటి వుంటుందన్న కొండంత నమ్మకంకు సమైక్య ఉద్యమపాపులారిటీ, నాలుగుమాటలు ఉద్దేశ్యపూర్వక ఆవేశంతో మాట్లాడగలిగే లాఘవం అక్కరకొస్తాయన్నది మావాడి ఆలోచనంటూ అయినవారు చెపుతూంటారు.
కిషోర్ కు పోటీగా విద్యార్థి జెఎసీ పెట్టి ఇప్పటికీ విద్యార్థులమే కాబట్టి మేమే అసలు సమైక్య విద్యార్థి ఉద్యమకారులమంటూ ముందుకు వచ్చిన ముగ్గురిలో ఆరేటి మహేష్ ఒకరు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ చైర్మన్ గా ప్రకటించుకున్న ఈయన మాట్లాడినప్పుడల్లా 14 యూనివర్శిటీల విద్యార్థులమంటూ చెపుతూంటే సహచరులే నోరు తెరిచి మనోడు భలే మాటకారే అంటూ ఎటకారమాడుతూంటారు. 2009 డిసెంబర్ లో రాష్ట్ర విభజన ప్రకటన రాగానే ఏయూలో విద్యార్థులను కదిలించింది మావోడు కాదేటి అంటూ మరికొందరు వెనకేసుకొస్తూంటారు. అప్పటి నుంచి ఇప్పటికి కాలందేకేటప్పటికి మనోడు ఒంటరయ్యాడు. నమ్మకం స్థానాన్ని అపనమ్మకం మింగేసింది. రాజకీయాలపట్ల ఆసక్తి వున్నా ముందుకు వెళ్ళే శక్తిలేక ఇలా తీర్చుకుంటున్నాడని వారువీరూ అనేమాట. మరో విద్యార్థి జేఏసీ నేత లగుడు గోవింద్. గతంలో పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీగా పోటీచేసి చేతులుకాల్చుకున్నాడు. రాజకీయాలంటే ఉత్సుకత వున్నా అందుకు అవసరమైన ప్రణాళికాబద్ధ కృషి, నిబద్ధతా పూర్తిగా లేవని వెనకనుంచే నిజాలను రాళ్ళలా విసిరేస్తున్నారు. మరో విద్యార్థి నేత కాంతరావు. వైసిపి విద్యార్థి విభాగంలో వుంటున్నానని చెప్పుకుంటాడు. జగనిజాన్ని తలకెక్కించుకున్న కాంతారావు భవిష్యత్తుపట్ల కుసింత బెంగగానే వున్నట్లు కనిపిస్తాడు. వీరు ముగ్గురూ కలిశారంటే ఓ ప్రెస్ మీట్, కాకుంటే పోస్టర్ రిలీజ్. తప్పనిసరిగా కనీసం 10మందినైనా వుంచుకోండయ్యా అంటూ మీడియావాళ్ళు చేసే గొడవ భరించలేక నానాతిప్పలూ పడుతున్నారు. 
ఏపిఎన్జీవోల జెఎసీ, ఆర్టీసీ కార్మికుల జెఎసీ, విద్యుత్ ఉద్యోగుల జెఎసీ, జీవియంసీ కార్మికుల ఉద్యోగుల జెఎసీ, రెవెన్యూ ఉద్యోగుల జెఎసీ, వాణిజ్యపన్నులశాఖ ఇలా పోతే శాఖకొక జెఎసీ ఏర్పాటయ్యింది. ఎవరికివారే శక్తి వంచన లేకుండా కృషి చేస్తూనే వున్నారు. ఏపిఏన్జీవోల జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈశ్వరరావు  కెజిహెచ్ లో సినియర్ ఆస్టెంట్ గా పనిచేస్తున్నారు. గతంలో రాజకీయపార్టీలతో పెద్దగా సంబంధాలు లేవు. ఆయన పిలుపునందుకుని ఎపిఎన్జీవోల వరకూ కదిలే పరిస్థితి.  రెవెన్యూ అసోసియేషన్ నాయకుడైన నాగేశ్వరరెడ్డి నాయకత్వపటిమ కలవారే. ఎపీ ఎన్జీవోల సంఘంలో వున్నప్పుడు పలు పదవులను అలంకరించిన ఈయన ప్రస్తుతానికి జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షునిగా, రాష్ట్ర కమిటీలో కీలకబాధ్యతలలోనూ వున్నారు. కలెక్టరాఫీసులో పాలనాధికారిగా పనిచేస్తున్నారు. ముక్కుసూటిగా వెళ్ళే మా రెడ్డికి రాజకీయాలు నప్పవు, అసలాయనకు అలాంటి ఆలోచనకూడా లేదంటూ సహచరులే కొట్టిపారేస్తూంటారు. సమైక్యాంధ్ర సాగర లక్షగళ గర్జనలో ఆవేశంగా ఉరిమిన  ఆర్డీవో  వెంకటేశ్వరరావు  స్టేట్  డిప్యూటి కలెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా  పనిచేస్తున్నారు. రాజకీయాలంటే తనకు బొత్తిగా పడదనీ, మనిషిగా పుట్టిన తరువాత పరోపకారార్థం వెధవ శరీరం అన్ననానుడిని నమ్మాలి కదా అంటూంటారు. 
విద్యుత్ ఉద్యోగుల సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పోలాకి శ్రీనివాస రావు తరుచూ ఉద్యమవార్తల్లో కనిపిస్తున్న వ్యక్తి. ఈపిడిసియల్ విశాఖవాణిజ్యవిభాగంలో ఎడిఇగా పనిచేస్తున్నారు. విద్యుత్ ఇంజనీర్ల సంఘం ప్రతినిధిగా, విద్యుత్ ఉద్యోగులు బీసి సంఘం  అధ్యక్షునిగా ఇలా పలు పదవులను నిర్వహించిన వాడు. రాజకీయాలపట్ల ఆసక్తి. ప్రజారాజ్యం పెట్టిన కొత్తల్లో చేరిపోదామనుకుని గుమ్మందాకా వెళ్ళి వెనక్కి వచ్చాడు మా పోలాకి అంటూ అనుచరులు పరాచకాలాడతూంటారు. ఉద్యమ నేపథ్యాన్ని ఉపయోగించుకుని రాజకీయాలలోకి వెళితే అన్న ఆలోచన లేశమాత్రంగా వున్నా లక్కు కలిసిరావాల్లే అంటూ వేదాంతం చెప్పే హితులూ వున్నారు. జీవీఎంసీ కార్మికుల సంఘం నేత ఆనందరావును ముందుకు నెట్టి ఘనంగా సమైక్య శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించి ఆటలవీరుడు శ్రీనివాస్ అవకాశం కోసం చూస్తున్నాడు. కులం, ధనం కలిసి తనను ఏదో ఒక పదవిలో కూర్చోబెడతాయని ఆయన నమ్మకం. అందరితో కలిసిపోయి తలలో నాలుకలా మెలిగే శ్రీనుకేం తక్కువ అంటూ సమర్థించే వారూ ఎక్కువే. మొదటి నుంచి సమైక్య ఉద్యమ నినాదంతో బస్సు యాత్రలనీ, విలేఖరుల సమావేశాలనీ హడావిడి చేసిన నగర స్థాయి కాంగ్రెస్ నాయకుడు జీ.ఏ.నారాయణరావు. గ్రాండ్ గా గంటా ప్రవేశాన్ని ప్రకటించి ఉద్యమం నుంచి హఠాత్తుగా మాయమైపోయాడు. ఇక నాన్ పొలిటికల్ జెఎసీ ఛైర్మన్ బాలమోహన్ దాసు. మంత్రి గంటా వేసిన రూట్ మాప్ ని అనుసరించటం తప్ప పెద్దగా నాయకత్వపు లక్షణాలేలేని వివాదరహిత వ్యక్తి అన్నది జనాభిప్రాయం. నా రూటే సెపరేటు అన్న స్టైల్ లో  ఎవరున్న లేకున్నా.  ఎవరు వచ్చినా రాకున్నా .. ఏక్ నిరంజన్  ఉద్యమాలకు ఫ్యామస్.. సమైఖ్యాంధ్ర పోలిటికల్ జేఏసీ నేత జెటి రామారావు. ఢీఫరెంట్ ప్రెజెంటేషన్స్ చేస్తూ మీడియా ఏటెంక్షన్ ను తెప్పించుకొగలుగుతున్నాడే గానీ, నాయకుడు అనడానికి కూడా ఛాన్సే లేదంటారు సాగరతీరవాసులు.
పైన కరిమబ్బు కరుగుతూంటే నేలపై వాగులూ వంకలూ బుసబుసా పొంగిపొరులుతూంటాయి. ఆకాశం తేటబారిన మరుక్షణం ఆనవాళ్ళు మాత్రమే మిగిల్చి కనిపించకుండా పోతాయి. ఎవరు కర్త? ఎవరు కర్మ? ఇదో భావావేశం. భావోద్వేగం. అందుకనే పదండిముందుకు పదండి తోసుకు అంటూ వడివడిగా సాగుతున్నారు. కదిలివస్తున్నోళ్ళను అక్కడికక్కడ కూడేసే మెరుపులు తాత్కాలికమే. శాశ్వతమైన ఆణిముత్యాలు దొరుకుతాయా లేదా అన్నది కాలమే తేల్చాలి.

22, జనవరి 2016, శుక్రవారం

మౌనం దారెటు?!

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ విశాఖ జిల్లాలో వివిధ ప్రధాన రాజకీయ పార్టీలలో వేడి రాజుకుంటోంది. జనం మాట ఎట్టా వున్నా గెలుపోటముల లెక్కలు, టిక్కెట్ల కోసం సిగపట్లు, ఆధిపత్య కుమ్ములాటలు రానురాను ఎక్కువయ్యాయి. ఏమీపట్టనట్టు పైకి కనిపించే జనం మాట ఎట్టావున్నా ఆయా పార్టీల అధినాయకత్వం మాత్రం తలలు పట్టుకుంటోంది. అధికార బలంతో మదించి వున్న కాంగ్రెస్ పార్టీతో పాటు జీవితం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్న టిడిపి, రేపటి అధికారం మాదేనని విర్రవీగుతున్న వైకాపలతో సహా ఎవ్వరూ ఈ విపరీతాలకు మినహాయింపుకాకపోవటమే ఇక్కడి విషాదం.
 విశాఖ జిల్లాలకు ఇద్దరు మంత్రులు. సీనియర్ మంత్రిగా పసుపులేటి బాలరాజు గిరిజన సంక్షేమ శాఖకు ప్రాతినిథ్యం వహిస్తుంటే, చిరంజీవి అండతో మంత్రి పదవిని అందుకున్న గంటా శ్రీనివాసరావు రాష్ట్ర మౌలిక వసతులు, పోర్టుల శాఖను నిర్వహిస్తున్నారు. విపరీతమైన చొరవ, ఏ పనినైనా తనకు సానుకూలంగా మార్చుకోగలిగిన చాతుర్యం కలిగిన గంటా శ్రీనివాసరావు మంత్రి పదివిని చేపట్టిన తొలినాళ్ళ నుంచే తనదైన వేగంతో ముందుకు సాగిపోయారు. ఈ క్రమంలో తనదైన కోటరీని బలంగానే తయారు చేసుకున్నారు. తన కులపోళ్ళే అధికప్రాధాన్యమిస్తున్నారన్న అపకీర్తినీ ఆయన మూటగట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన పిసిసి అధ్యక్షుడు, సీనియర్ మంత్రి అయిన బొత్స సత్యన్నారాయణకు దూరమయ్యారు. వీరి మధ్య విభేదాలకు కారణమేమిటన్నదానిపై ఇప్పటికీ బయటకు ఓ స్పష్టత రాకపోయినప్పటికీ ఏదో తెలియని ఎడం వారిద్దరి మధ్యా వుందన్న విషయాన్ని దాచుకోవటానికి వారిద్దరూ ప్రయత్నించటంలేదు. వాల్మీకి తెగనుంచి వచ్చి విద్యార్థి ఉద్యమం నాటినుంచే కాంగ్రెస్ రాజకీయాలలో ఢక్కామొక్కీలు తిని నేడు మంత్రిగా వున్న పసుపులేటి బాలరాజు వ్యక్తిత్వంలో మంత్రి గంటాకు పూర్తి భిన్నంగా వుంటారు. లోపిరికితో, అంతో ఇంతో ఆత్మనూన్యతాభావనతో బాలరాజు నిత్యం పోరాటం చేస్తూనే వుంటారు. బహుశా అందుకేనేమో అధికారులు తనకు సరైన గౌరవం ఇవ్వటం లేదంటూ రోజూ ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ వారిని దూరం చేసుకుంటూ వుంటారు. సహజంగా భిన్నధృవాలు ఆకర్షించుకోవాలి. ఎంతైనా అరాచకీయం కదా. ఈ భిన్నధృవాలు రెండు వికర్షించుకుంటున్నాయి. ఆ వికర్షణ ఎంత బలంగా వుందంటే దగ్గరకు చేరితే ఫెటేల్మని పేలేటంత. ఈ నేపథ్యంలోనే డిసిసిబి ఎన్నికలు రావటం, యలమంచలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు నేరుగా బాలరాజును ఛీకొట్టడం జరిగింది. కన్నబాబురాజుపై ఎన్ని అవినీతిమరకలు వున్నా నిస్సిగ్గుగా వెనకేసుకు వచ్చిన మంత్రి గంటాకు ఏం లాభం ఒనగూడిందన్నది బయటపడేందుకు ఎక్కువ కాలమేమీ పట్టదు. అయితే అరాచకీయ క్రీడలో  పైచేయి సాధించిన గంటా, కన్నబాబు ద్వయంపై మంత్రి బాలరాజు కారాలూ మిరియాలూ నూరుతూనే వున్నారు. ఇప్పుడు ఆయనకు వాటిని వారిచేత తాగించటం ఎట్టానో తెలియాలి అంతే. వీరిద్దరి మధ్యా తగవులో జిల్లా ప్రజాప్రతినిథులు నిట్టనిలువునా చీలిపోయారు. బహుశా ఆ కోవలోకి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ధర్మాన కూడా చేరినట్లే కనిపిస్తోంది. బొత్సను దూరం చేసుకున్న గంటా వర్గం వ్యూహాత్మకంగానే మంత్రి ధర్మానతో అంటకాగుతోందని కాంగ్రెస్ రాజకీయాలను అవపోసన పట్టిన సీనియర్లు గుసగుసలాడుతున్నారు. ఎట్టాగూ రేపటి ఎన్నికలలో గెలిచేనా చచ్చేనా అనుకుంటున్న తటస్థులు మాత్రం వినోదం చూస్తూ కూర్చున్నారు. 
ఇక తెలుగుదేశం పార్టీ. గత వైభవాన్ని తిరిగి సాధించుకోవటానికి అధినేత పడుతున్న పాట్లను సర్కస్ ఫీట్లు అనుకున్నారో ఏమో కానీ ఈ జిల్లాలో ఆ పార్టీ నేతలు ఏనాడూ సీరియస్ గా ప్రజా సమస్యలపై స్పందిచి ఆందోళనలు చేసిన పాపానపోలేదు. పార్టీ అనేక సార్లు ఇచ్చిన రాష్ట్ర వ్యాపిత పిలుపులకు మొక్కుబడి స్పందనతో మమ అనిపించటమే వీరికి తెలిసింది. చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యన్నారాయణ మూర్తి ... ఒకరు ఉప్పైతే మరొకరు నిప్పు. ఒకరు వచ్చిన ఉద్యమంలో మరొకరు కనిపించరు. అయ్యన్నను నమ్మకున్న నాయకులు, కార్యకర్తలు బండారు జోలికే పోరు. వీరిమధ్య అంతటి శత్రుత్వం నెలకొనటానికి కారణలేమిటన్నది ఆ పార్టీ కేడర్ కే ఇప్పటి వరకూ అర్థంకాలేదు. ఇక బయటవాళ్ళకెందుకు చెప్పండి. ప్రతీ చిన్నదానికీ రాజీనామా చేస్తానంటూ బెదిరించే అయ్యన్నపాత్రుడు మరోసారి రాజీనామా అస్త్రాన్ని సంధించారు. బండారు సత్యన్నారయణ మూర్తిని అవమానించారంటూ సస్పెండ్ చేసిన పీలా శ్రీనివాస్ కు మద్దతుగా ఆయన తనదైన శైలిలో చకచకా పావులు కదిపారు. జిల్లాలోని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆయన కోటరీలోకి చేరిపోయారు. కోటరీలకు దూరంగా వుండే విశాఖ తూర్పు ఎమ్మెల్యే కూడా కోటరీలో చేరి గ్రూపులు కట్టడం ఆపార్టీలో కొత్తగా ఊపిరిలూదుకుంటున్న కాంగ్రెస్ సంస్కృతికి నిదర్శనం. దీనికితోడు డిసిసిబి ఎన్నికలలో పార్టీ విప్ ను ధిక్కరించి కోట్లాదిరూపాయలకు ఎమ్మెల్యేతో సహా వివిధ సహకార సంఘాల అధ్యక్షులు అమ్ముడుపోవటంతో పరిస్థితి మరింత వికటించింది. అయితే దీనిని రాద్ధాంత స్థాయికి తీసుకువెళ్ళటంలో ఎందుకనో ఒకింత వివేచనాపూరిత సహనాన్ని ప్రదర్శించారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్. జరిగిన విషయాన్ని అధిష్టానానికి నివేదించి తనకుకానీ, తన తండ్రి దాడి వీరభద్రరావుకు కానీ అయ్యన్న వర్గంపై ఎలాంటి వ్యక్తిగత ద్వేషభావమూ లేదని చెప్పకనేచెప్పటానికి ప్రయత్నించారు. ఇన్ని పరిణామాల మధ్య ఏ కోటరీకీ చెందని వ్యక్తిగా, తనకంటూ ఓ శైలి వుందని నిరూపించుకోవటానికి నిరంతరం తాపత్రయపడుతున్న నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ ను అయ్యన్నవర్గం అనుచితరీతిలో దూరంగా పెట్టింది. ఒకటి రెండు సార్లు కలుపుకుపోవటానికి ప్రయత్నించిన వాసుపల్లి తన అహాన్ని చంపుకోవటానికి ఏమాత్రం సిద్ధపడకపోవటంతో సమస్య మరింత జఠిలమయ్యింది. దీనితో జిల్లా, నగర టిడిపి ప్రజాప్రతినిథి శ్రేణులు దాదాపుగా నిర్వీర్యమైపోయాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే పోయే వాళ్ళు పొండి అంటూ అధినేత ప్రకటిస్తారన్న వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యే వెలగపూడి రంగంలోకి దిగారు. అయ్యన్నను, మిగిలిన ఎమ్మెల్యేలను చంద్రబాబు వద్దకు నడిపించారు. చివరికి అయ్యన్న చేత పార్టీలోనే కొనసాగుతానని, త్రిసభ్య కమిటీ నిర్ణయానికి కట్టుబడి వుంటానని ప్రకటన ఇప్పించారు. దీనితో అంతా సద్దుమణిగినట్టే కనిపిస్తున్నా రెండు వర్గాలనూ కలుపుతూ వేసిన అతుకు ఏ క్షణమైనా ఊడిపోయి మరింత దూరమయ్యే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ గొడవలతో జిల్లాలో పార్టీ కార్యకర్తలు పూర్తిగా నిరాశానిస్పృలకు గురయ్యారు. 
ఇకపోతే వైఎస్సార్ సిపి. ఆది నుంచీ ఈ జిల్లాలో కొణతాల రామకృష్ణ, సబ్బం హరి వర్గాలుగా పార్టీ చీలిపోయే వుంది. నగరంతోపాటు జిల్లాలో పలు ప్రాంతాలలో పట్టుకోసం అటు కొణతాల, ఇటు సబ్బం వర్గాలు హోరాహోరీ ప్రయత్నాలు చేస్తూనే వున్నాయి. ఆయా నియోజకవర్గాలలో ఆధిపత్యం కోసం కుస్తీపట్లు పడుతూ నే టిక్కెట్లు తెచ్చుకోవటానికీ తంటాలు పడుతూనే వున్నారు. అయితే ఇప్పటికే ఆయా నియోజకవర్గాలలో సీట్లను ఎవరికి ఇవ్వాలన్న విషయంపై ఆ పార్టీ అధినాయ కుడు ఒక స్పష్టతకు వచ్చినట్లు చెపుతున్నారు. జిల్లాలో ఒక్క పశ్చిమ నియోజకవర్గం తప్ప మరేసీటూ ఖాళీలేదని ఆ పార్టీ వర్గాలే చెపుతున్నాయి. విశాఖ ఎంపీగా పార్టీ అధినాయక కుటుంబం నుంచి ఒకరిని నిలబెట్టాలని భావిస్తోందని వస్తున్న వార్తలపై ఆ పార్టీ ముభావంగానే వుంటోంది. ఆశావహులు మాత్రం ''అన్నీ పార్టీల తీరూ ఒక్కటే... బయటివాళ్ళనే అందలం ఎక్కిస్తారు'' అంటూ ఒకింత నిస్సహాయాగ్రంతో నిట్టూరుస్తున్నారు. ఎవరికి ఏ సీటన్న విషయాన్ని పక్కనపెడితే పార్టీ పరిశీలకులుగా నగరంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి సుజయ రంగరావు, ప్రసాదరాజులకు పెద్ద షాకిచ్చారు ఈ జిల్లా నేతలు. పనిచేసే వాడు ఎవ్వడో తెలుసుకుని పదవులు ఇవ్వండంటూ గండి బాబ్జీ తెగేసి చెప్పారు. నగర అధ్యక్షుడికి ప్రాధాన్యమివ్వకపోవటంపై ఒక వర్గం ఫిర్యాదు చేస్తే మరో వర్గం అసలు గుర్తించాల్సిన అవసరమే లేదంటూ తెంపరితనంతో తెగేసి చెప్పింది. అక్కడితో ఆగకుండా సమావేశాన్ని బాయ్ కాట్ చేసింది. దీనితో ఆధిపత్య పోరు ఈ పార్టీలోమరో సారి బహిర్గతమయ్యింది. ఎవరెంత జట్లు ముడేసుకున్నా జనం జగన్ వెంటేనంటూ డప్పుకొట్టిన వీరికి సహకార ఎన్నికలు ఎంతో కొంత నష్టం చేశాయి. కాదని బుకాయిస్తున్న ఆ పార్టీ నేతలు స్థానిక ఎన్నికలలో సత్తాచూపించటానికి సిద్ధమవుతున్నారు. 

ఏ పార్టీ అయినా ఒక్కటే. నాయకులంతా మూసలే. ఎవరు వచ్చినా ఒరగబెట్టేది, జీవితాలను మార్చేది ఏముంది అనుకుంటున్న మధ్యతరగతి జీవి మాత్రం జరుగుతున్న పరిణామాలను మౌనంగా చూస్తున్నాడు. ఈ మౌనం విస్ఫోటించి ఎవరిని గెలిపిస్తుందో అన్న ఆలోచన కార్యకర్తలను వేధిస్తున్నంత బలంగా నాయకు లకు లేకపోవటమే ఇక్కడి విషాదం.

క్యాష్ R క్యాస్ట్

రాష్ట్ర విభజనానంతరం ఏపీ పోలీస్ శాఖలో పోస్టింగ్ లు ఇప్పుడో హాట్ టాపిక్. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిథిలో కమిషనర్ అఫ్ పోలీస్ నుంచి ఎస్సై పోస్ట్ వరకు కాష్ కన్నా కాస్టుకే ఎక్కువ ప్రాధన్యతని పోలీసులు చెవులు కొరుక్కుంటున్నారు. జిల్లాలో పోస్టింగ్ లు ఒకింత భిన్నంగా సాగుతున్నాయన్న వాదనా వుంది. కాష్, కాస్ట్ తో పాటు రాజకీయ పలుకుబడి ఉన్నవారికే కీలక పోస్టులు... లేకపోతే ఎజెన్సీ యే గతి... నూతన ప్రభుత్వంలో హోంతో పాటు, జిల్లాకు చెందిన ఓ మంత్రి కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో పైరవీలు జోరుగా సాగుతున్నాయని వాపోతున్న వారి సంఖ్యా ఎక్కువగానే వుంది. ఆయా మంత్రుల ఇళ్ల చూట్టూ ప్రదక్షిణాలు చేస్తు న్న వారి సంఖ్య తక్కువగా ఏమీలేదన్న వాదనా వుంది. కాష్ అయితే అక్కడో ఇక్కడో సర్దుబాటు చేసుకోవచ్చు... పోస్టింగ్ కు కాస్ట్ తో ముడిపెడితే ఎలా అన్న ఆవేదనావాదనా నడుస్తోంది. సామర్థ్యమన్న అంటరాని పదమే వినపడని విశాఖ పోలీస్ పోస్టింగ్ ల తీరు ఇదీ...
విశాఖ కమిషనరేట్ పరిథిలో వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, ఫోర్త్ టౌన్, ఫిఫ్త్ టౌన్, ఆరిలోవ, పీఎంపాలెం, గాజువాక, పెందుర్తి, న్యూపోర్ట్, హార్బర్, పరవాడ, దువ్వాడ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రేడ్ వన్ పోలీస్ స్టేషన్లు కొన్నే. ఈ గ్రేడ్ లేమిటి? ఎప్పుడు పెట్టారు? కంగారు పడకండి. ఇది అనధికార పోలీస్ గ్రేడింగ్. మూడో కంటికి తెలియకుండా పెద్దగా పైకి డిమాండ్ చేస్తున్నట్లు కనిపించకుండానే జేబులు నింపుకునే యవ్వారం జోరుగా సాగే స్టేషన్లను గ్రేడ్ వన్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. పారిశ్రామక వాడలు, ట్రాన్స్ పోర్టు, స్క్రాప్ వ్యాపారం జోరుగా సాగే గాజువాక, దువ్వాడ, పరవాడ పోలీస్ స్టేషన్లు ఈ పరిథిలో వున్నాయి. ఇక్కడ సిఐ సీటుకు సునాయాసంగా నెలకు మూడు నుంచి నాలుగు లక్షలు పక్కాదాయం పక్కా అని అది లేని పోలీస్ వర్గాలే ఒకింత అసూయతో చెపుతూంటాయి. ఇక్కడ పోస్టింగ్ ల కోసం సిఎం పేషీ స్థాయిలో పైరవీలు సాగుతాయన్న అతిశయోక్తి అలంకారమూ వినిపిస్తూంటుంది. గ్రేడ్ టు పోలీస్ స్టేషన్ లుగా హార్బర్, పీఎం పాలెం, న్యూ పోర్ట్ స్టేషన్లు వున్నాయి. రియల్ ఏస్టేట్ వ్యాపారం జోరు, ఇంజినీరింగ్ కాలేజీలు, ఐటీ సెజ్ లతో పీఎం పాలెం పిఎస్ పరిథి కళకళలాడుతూంటుంది. ముక్కుకు గుడ్డకట్టుకుని పిఎస్ లో కూర్చుంటే చాలు...  షిప్పింగ్ కంపెనీల నుంచి నెలసరి హార్బర్ పిఎస్ గడప వద్దకే వచ్చేస్తుంటూంది. ఇక ఈ కేటగిరీలో చివరిది... న్యూ పోర్టు పిఎస్. కేసులు లేకుండా కాసులు పండించే స్టేషన్ అని పోలీసులు మురిపెంగా పిలుచుకుంటారు. ప్రశాంతంగా సంపాదించుకుందామనుకునే మారాజులకు ఇది అత్తారిల్లు. ఇక చివరిది గ్రేడ్ త్రీ. కమిషనర్ కార్యాలయానికి దగ్గరగా ఉండే పిఎస్ లన్నింటినీ ఈ కేటగిరీలోకి నెట్టేశారు. ఒకట్రెండు పిఎస్ లకు గ్రేడింగ్ లు ఇవ్వటంలో ఒకింత తడబడి మరచినా అవేమీ తక్కువ తినలేదండోయ్.
ఇక జిల్లాకొస్తే... ఇక్కడ రెండే రెండు కాటగిరీలు...  ఒక కేటగిరీలోని పిఎస్ లు మైదానంలో వుంటే రెండో కేటగిరిలోని పిఎస్ లు ఏజెన్సీలో వుంటాయి. ప్లేయిన్ ఏరియాలోని పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్ కావాలంటే నిన్నటి వరకూ నడిచి ప్రాతిపదికలేమీ ఇప్పుడు నడవటం లేదని సమాచారం. ఇక్కడ పచ్చనోటుకు ఒకింత తళుకులద్దుతూ కులం... దానికి మరింత బలాన్ని ఇస్తూ రాజకీయ పలుకుబడి వుండాల్సిందే. ఇక ఎలాంటి పలుకుబడి లేని వారిని... సొమ్ములు అంతగా ఇచ్చుకోలేని వారిని, కుల బలం లేనివారినీ ఇక్కడకు ఉదారంగా పంపిస్తుంటారు. అదో పనిష్మెంట్ జోన్ అని ఈ అసమర్థ పోలీస్ లు భావిస్తే ఎవరేం చేయగలరు చెప్పండి. మావోయిస్టులతో యుద్ధం పేరిట నిరంతరాయంగా సాగే కూబింగ్ ఆపరేషన్లు, ఎక్కే కొండా... దిగే కొండా... కుటుంబానికి దూరంగా... ప్రశాంతంగా వుంటుంది. ఫిట్ గా వుండాలంటే ఏజెన్సీనే బెటర్ అంటూ మైదానంలో స్థిరపడిన అర్హులు ధీమాగా చెపుతూంటారు. మైదాన ప్రాంతాలలో కూడా చిన్నచిన్న తేడాలున్నాయండోయ్. నర్సీపట్నం రూరల్ లో నాతవరం, గొలుగొండ, కోటవురట్ల పిఎస్ లకు ఒక్కరే సిఐ వుంటారు. ఈ స్టేషన్ల పరిథిలో రంగురాళ్ళ తళుకులు రారమ్మంటూ పిలుస్తూంటాయి. ఇక్కడ పని చేయాలంటే రాజకీయం అండ కొండంతుండాల్సిందే. రోలుగుంట, కొత్తకోట, రావికమతం, మాకరవరపాలెం పిఎస్ లకు సిఐ కొత్తకోటలో వుంటారు. ఈ పరిథిలో లెక్కల్లోకి రాని గంజాయి రవాణా తెచ్చిపెట్టే పచ్చనోట్ల పెరపెరలు పెద్ద ఎత్తునే వుంటాయని వినికిడి. దీనికితోడు మాకవరపాలెం పిఎస్ పరిథిలోని ఆన్ రాక్ వంటి కంపెనీల అతిథ్యపు పలకరింపులు సరేసరి... కొయ్యూరు సిఐ పరిథిలోకి వచ్చే మండ, కె డి పేట, కొయ్యూరు స్టేషన్లు... ఈ సర్కిల్ ప్రాధాన్యతా క్రమంలో చివరదని వేరేగా చెప్పాలా చెప్పండి? హైవేలో జోరుగా దూసుకుపోయే అవకాశం... కుప్పలు తెప్పలుగా కంపెనీలు... అవి తెచ్చిపెట్టే సొమ్ములు... ఇవన్నీ కావాలంటే మాత్రం ఎలమంచలి, అనకాపల్లి రూరల్  సర్కిల్స్ ను ఎంచుకోవాల్సిందే. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్ రాయవరం, ఎలమంచలి టౌన్, రూరల్, అచ్యూతాపురం, రాంబిల్లి, అనకాపల్లి రూరల్ స్టేషన్ల పరిథిలో నెలకు ఎంత లేదన్నా కనిష్టంగా మూడు వరకూ వస్తుందని లెక్కలేసుకుంటున్నాయి కాకీలు.. 
సామర్థ్యం ఇప్పుడిక ఎంత మాత్రమూ ప్రాతిపదిక కాదు. మారుమనుస్సు పొందిన సీఎం చంద్రబాబు అవినీతి అంతం చూస్తామంటూ వేస్తున్న రంకెలు నిన్నటివి కావు... గతానుభవ పాఠాలు నేర్పిన మ్యావు మాటలే. డబ్బు పట్టు... కులాన్ని ముందుకునెట్టు... రాజకీయ నేతల కాళ్ళు పట్టు... ఓ మంచి పోస్టింగ్ కు ముచ్చటగా మూడు సూత్రా లంటూ వల్లె వేస్తోంది ఇప్పుడు విశాఖ పోలీస్. ఇదంతా నిజమేనా? అంటూ హాశ్చర్యపోకండి. నిజం దేముడెరుగు... నీరు పల్లమెరుగు... ఏదేమైనా నిలకడగా తెలిసేదే నిజమన్న మాటలో సత్యమెంతుంటుందో రేపు విశాఖ పోలీస్ కమిషనర్ పోస్టింగ్ తో తేలిపోదూ...?! అంటున్న వారి మాట ఒక్కసారి వింటే పోలా?