23, డిసెంబర్ 2018, ఆదివారం

నేతల్లారా వర్థిల్లండి

యాంకర్: రాజకీయం అంటే నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్ లే కానక్కర్లేదు. మనిషి రాజకీయ జీవి. వాటికి అతీతంగా సమాజంలో బతకడం సాధ్యమే కాదని సాంఘిక, రాజకీయ పండితులు ఎప్పుడో తేల్చేశారు. జీవిక గురించి, జీవితం గురించి, ఓ ఘటన గురించి మనం మాట్లాడుకోవడమంటే, చర్చించుకోవడం అంటే దానిచుట్టూ ఉన్న రాజకీయం గురించి ఆలోచించడమే. కాకపోతే ఇక్కడ పడికట్టు పదజాలం ఉండదంతే.

వాయిస్ ఓవర్: సందర్భం గుర్తుకురావడం లేదు. ఓ కేంద్ర విశ్వవిద్యాలయంలో చదువుపూర్తి చేసుకొని ఓ ఖరీదైన బడిలో పంతులుగా పనిచేస్తున్న యువకుడొకడు చెప్పిన మాట వెంటాడుతోంది. కేంద్ర విశ్వవిద్యాలయం కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మట్టిలోమాణిక్యాలు అక్కడకు సహజంగానే చేరతాయి. దురదృష్టంలో అదృష్టమేమిటంటే సొమ్ములున్నోళ్ల పిల్లలు చాలామంది వాటి దరిదాపుల్లోకి వెళ్లడం దాదాపుగా మానేసి చాలా రోజులే అయ్యింది. ప్రతిమాటకూ మినహాయింపులుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో? ఇంటర్ కాగానే ఒడిసా నుంచి వచ్చాడో ఓ నూనుగు మీసాల యువకుడు. బితుకుబితుకుమంటూ ఆరంభమైన జీవితం, చదువే లక్ష్యంగా సాగింది. ఎన్నడూ పల్లె దాటని తన తల్లిదండ్రులకు, తన ఊరి జనాలకు సరికొత్త లోకం చూపించాలన్న అంతర్లీన తపనతో వాడు ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. పీహెచ్ డీలో చేరాడు. డాక్టర్ అనిపించుకోవడంలో వాడికేదో సరికొత్త ఆనందం దొరికినట్లే అనిపించింది. విదేశాలలో ఓ పేపర్ ని సబ్మిట్ చేయడానికి అనుమతులు వచ్చాయి. వీసా తయారయ్యింది. హఠాత్తుగా వాడికి జ్వరం. విశ్వవిద్యాలయంలోని ఆరోగ్య కేంద్రలో మందుబిళ్లలు తీసుకొన్నాడు. రెండు రోజులైనా పాడు జ్వరం విడవకుండా వస్తోంది. అక్కడ వైద్యుడు మరో ఆసుపత్రికి రిఫర్ చేశాడు. ఆ ఆసుపత్రిలో సరైన పరికరాలు లేవు, చికిత్స సరిగాలేదని దానిని నల్లజాబితాలో పెట్టి చాలాకాలమైంది. అలాంటి ఆసుపత్రికే ఆ కుర్రోడిని పంపించాడు. వాడికి అర్థమవుతూనే ఉంది అది మామూలు జ్వరం కాదని. ఆసుపత్రిలో ఐసీయూలో పెట్టారు. రెండు రోజుల తరువాత మరో ఆసుపత్రికి... వెళ్లగానే పరీక్షలన్నీ చకచకా చేశారు. డెంగ్యూ అని నిర్ధారించారు. అప్పటికే శరీరంలోని అంగాలు చాలా వరకూ దెబ్బతిన్నాయని తేల్చేశారు. బతకడం కష్టమని ప్రకటించారు. అంత బాధలోనూ చివరిక్షణాలని తెలుస్తూనే ఉంది. వాడికి అర్థంకానిదల్లా ‘తనకు అర్థమైంది, ఆ వైద్యులకు ఎందుకు అర్థం కావడం లేదు?’ అన్నదే. ధర్మసందేహంతోనే వాడు పోయాడు. బహుశా ఆ క్షణాన వాడి అప్రకటిత బాధ అంతా వాడి నిరుపేద, నిరక్షరాస్య తల్లిదండ్రుల గురించేనేమో? ఊరుదాటని వాడి అమ్మాబాబూ ఆ నగరానికి వచ్చారు. ఒరియా తప్ప మరేభాషారాని ఆ పల్లె నిరుపేద తల్లిదండ్రుల ఆవేదనకు మద్దతుగా రెండు రోజులు గొడవచేశారు విద్యార్థులంతా. ఆ తరువాత సెలవులు వచ్చాయి. అందరూ ఇంటికి వెళ్లారు. అలవాటవ్వాల్సిన దుఃఖం తోడుగా ఆ నిరుపేద తల్లిదండ్రులు కూడా ఊరికి చేరుకొన్నారు. ఊరు, విశ్వవిద్యాలయం... ఎక్కడ? ఏమిటి? అన్నది అప్రస్తుతం. అది ఎక్కడైనా... దేశంలో ఒక్కటే.

వాయిస్ ఓవర్: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం దేవాలయం వంశపారంపర్య ధర్మకర్తల కుటుంబానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు ఆయన. తన కుటుంబం ఆస్థిని... ఇంటి స్థలంతో సహా రెవెన్యూ అధికారుల అండదండలతో స్వయంగా తన్న అన్న కొడుకే నిర్లజ్జగ్గా అమ్మేస్తుంటే నాలుగేళ్లపాటు స్థానిక రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేశారాడు. చివరికి గత్యంతరం లేక తన వాహనాన్నే అవినీతి వ్యతిరేక ప్రచార అస్త్రంగా మలుచుకొని రాజధాని అమరావతిలోని సెక్రటేరియట్ కు చేరుకొన్నాడు. అలాగైనా సీఎం చంద్రబాబు చూడకపోతాడా? న్యాయం జరగకపోదా? అన్న పిచ్చి భ్రమతో ఆ సీనియర్ సిటిజన్ ఇక్కడి వరకూ వచ్చారు పాపం. కర్నూలు జిల్లా వెలుగోడు మండలం మాదవరం గ్రామానికి చెందిన ఓ రైతు ‘లంచం ఇవ్వాలి. ధర్మం చేయండి’ అంటూ భిక్షాటన చేస్తూ కనిపించిన దృశ్యం హృదయాలను కలిచివేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో తన స్వంత ఇంటి స్థలాన్ని కమ్యూనిటీ హాలుకు ఇవ్వాలంటూ జన్మభమి కమిటీ చేస్తున్న ఒత్తిళ్లను భరించలేకపోయాడో సామాన్యుడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక చావును ఆశ్రయించాడు. తన కుటుంబానికైనా ఆ స్థలం మిగులుతుందన్న గంపెడాశతో.

వాయిస్ ఓవర్: ఈ మధ్య కాలంలో జరిగిన, వెలుగులోకి వచ్చిన అతికొద్ది ఘటనల సమాహారమే ఇది. ఈ ఘటనలన్నీ నేటి సామాజిక రాజకీయ ఆర్థిక దుస్థితికి అద్దంపట్టేవే. ప్రభుత్వాల పనితీరుని ఎత్తిచూపేవే. ఆంధ్రప్రదేశ్ లోనా, తెలంగాణలోనా... లేక మరేదైనా ప్రాంతంలోనా? ఊరు, మనిషి పేరు మారుతుందేమో. అంతే. ఇంచుమించు బాధలన్నీ ఒకేలా ఉంటున్నాయి. ఈ వాస్తవాన్ని మీడియా పెద్దగా పట్టించుకోవడం మానేసింది. తన ప్రపంచానికి సంబంధం లేని విషయంగా భావిస్తోంది. వాస్తవ సమాజానికి దూరంగా మార్కెట్ మాయాజాలంలో చిక్కుకొని పరాయీకరణకు లోనవుతోంది. అడపాదడపా చిన్నా చితకా వార్తలేసి... ఆ ఘటనకు మాత్రమే పరిమితమైన పరిష్కారాన్ని సాధించి తన ఘనతేనంటూ భుజాలు చరుచుకొనే సరికొత్త సంస్కృతి ఇప్పుడు చలామణిలో ఉంది.

వాయిస్ ఓవర్: వాటన్నింటికన్నా ముఖ్యం రాబోయే ఎన్నికలు. అందుకనే రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి. కుల జనాభా లెక్కలు ఫైనల్ చేసే పనిలో నేతలు బిజీబిజీగా ఉన్నారు. పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న నేతలు నోట్ల కట్టలను సిద్ధం చేసుకోవడానికి రంగంలోకి దూకారు. అభిమానాన్ని నిండా నింపేసుకొని జెండా కోసం జీవితాన్ని బలిచేసుకొన్న కార్యకర్తలు, పెద్దగా సంపాదనే ఎరుగని నేతలు మరోసారి నిట్టూరుస్తున్నారు. పదవులు తమకు దొరకని ఎండమావులేనని మరోసారి గుర్తిస్తున్నారు. వేలాది కిలోమీటర్లు నడిచినా తనకెందుకు రావాల్సినంత గుర్తింపు రాలేదా అన్న పరిశీలనలో ప్రతిపక్షనేత మునిగితేలుతున్నాడు. మరోసారి సుడిగాలి యాత్రేమైనా చేపట్టాలా? అన్న ఆలోచనలో ఉన్నాడన్నది అభిజ్ఞ వర్గాల భోగట్టా. మరోవైపు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో గెలుపుకోసం వ్యూహాలకు పదునుపెడుతూనే కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకోవడానికి మార్గాల వెతుకలాటలో పడ్డారు. ఏ మార్గంలో వెళితే ఎంత వ్యతిరేకత వస్తుందో లెక్కలేసుకొనే క్రమంలో వార్తా కథనాలు పత్రికల్లో పతాక శీర్షికలవుతున్నాయి. మొత్తానికి రాష్ట్రంలో రాజకీయం వెడెక్కుతోంది. ప్రజల ఈతిబాధలు సంగతి దేవుడెరుగు... మనం గట్టెక్కే మార్గాలను చూసుకోవాలి ముందు... నేతల్లారా వర్థిల్లండి.

కామెంట్‌లు లేవు: