11, జూన్ 2021, శుక్రవారం

నా గురించి నేను... నీ కోసం...

ప్రియతమా,

నీ తాజా ఆరోపణకు సమాధానం చెప్పాలనే అనుకుంటున్నా. ‘మనసావాచాకర్మణా నమ్ముతున్నానని’ నీవు భావిస్తున్న సిద్ధాంతం పట్ల నాకు నమ్మకం లేదని నీవు మిత్రుల వద్ద చేసిన ఆరోపణపై చర్చకు సిద్ధంగా లేనుకాని... నాకు నేను శోధన చేసుకుని, తర్కించుకుని సమాధానం చెప్పుకునే తీరాలి. ఆ సమాధానం నా జ్ఞానాజ్ఞానాల పరిధికి లోబడి మాత్రమే ఉంటుందన్న పరిమితిని ముందుగానే నాకు నేను గుర్తు చేసుకుంటున్నా. 

నిజంగా... నేనేమీ సైద్ధాంతికి పుస్తకాలను అధ్యయనం చేయలేదు. సాహిత్య అధ్యయనం, సిద్ధాంత ఆచరణలో ప్రాణాలొదిని కొద్దిమంది జీవితాలు, నీతోపాటు, విడిగా పాల్గొన్న కొన్ని రాజకీయ తరగతులు, చిన్నప్పటి నుంచీ ఇంటిలో జరుగుతున్న చర్చలు, నాన్న ఆచరణ, పెళ్లైన తరువాత నా మావగారి ఆచరణ, పద్ధతులు... ఇవి తప్ప నాకు నిజంగానే సైద్ధాంతిక అవగాహన ఏమీ లేదు. కాకుంటే నేను నమ్మిన దానిని నిజాయితీ ఆచరించాలని, ఆచరించేదానిని మాత్రమే పైకి చెప్పాలని భావిస్తూ దానికోసం నిరంతారాయంగా ఘర్షణ పడుతూండడం మాత్రం నా అంతఃకరణాలకు అవగతమవుతూనే ఉంది. 

నిజమే... నేనేమీ వ్యక్తులను ఆరాధించలేను. వారివారి పుస్తకాలు, సాహిత్యం ఆధారంగా నేనేమీ పూజించలేను. వాటిని పుక్కిట పట్టి వల్లెవేయలేను. నాకు ఇష్టమైన పుస్తకాలను చదవడానికి ప్రయత్నిస్తా. వాటిలో ఉన్న మంచిని ఆచరించడానికి ప్రయత్నిస్తా. పదిమందికి చెప్పడానికి ప్రయత్నిస్తా. శ్రీశ్రీ నాకు ఇప్పటికీ అర్థం కాడు. అర్థవంతమైన పదాలతో శ్రామికుల పక్షాన నిలబడ్డాడని చిన్నప్పటి నుంచీ చెపితే విని పెంచుకున్న ఇష్టం తప్ప నాకేమీ పెద్దగా ఆసక్తిని కలిగించలేకపోయాడాయన. నా కౌమారంలో ఆయన జీవన శైలి నాపై వేసిన ప్రభావమూ వ్యతిరేకతకు కారణమైంది. శ్రామికుల గురించి, వారికోసమే రాసిన ఆయన కవిత్వం వారికి అర్థంకాకపోవడం, ఆ భాష మాట్లాడే వారిలో చాలా మంది ఆయన కవిత్వాన్ని విస్తృతంగా అర్థం చేసుకోలేకపోవడం... ఈ పరిమితి ఆయన్ను దూరం చేసింది. అర్థం కానిది ఎంత బాగున్నా ఆహ్వానించ లేని నా బలహీనతను చెప్పుకోవడానికి నేనేమీ సిగ్గుపడడం లేదు. 

నిజమే... నేను ఏ పార్టీలోనూ ఉండలేను. సిద్ధాంతం పేరుతో మనుషుల మధ్య గోడలు కట్టే పార్టీల్లో నేను ఇమడలేను. గిరిగీసి నిలబడమన్న చోట నిలబడడం నాకు సాధ్యం కాదు. అత్తమామలకు, అమ్మానాన్నలకు వ్యత్యాసాన్ని పెద్దగా నేను పాటించలేను. అవసరం కోసమే వ్యక్తులు... నాకు సాధ్యం కాదు. అడిగిన ప్రశ్నకు అవునా? కాదా? వంటి జవాబులు... నేనివ్వలేను. సిద్ధాంతాలు, పార్టీలకు వెలుపల మనుషులు చాలా మంది ఉన్నారని, తోటి వారికి సహాయం చేసేవారు, ఆదుకునే వారు, కుటుంబ సంబంధాల్లో ఎంతో బాధ్యతగా ఉంటున్న వారు, సమాజంలోని అసమానతలను చూసి ఇబ్బంది పడుతూ, తమదైన శైలిలో వాటిని పరిష్కరించాలని తపనపడుతున్నవారూ... ఇలాంటి వారందరినీ నేను ప్రేమిస్తాను. వారందరికీ దగ్గరగా ఉండాలని తాపత్రయపడతాను. అందుకనే చాలాసార్లు నేను శక్తికిమించి సాయం చేయాలని ప్రయత్నిస్తూ భంగపడుతూంటాను.

నీవు నమ్మిన సిద్ధాంత మూలపురుషుని జీవిత చరిత్రను అత్యంత శ్రద్ధతో చదివిన వాడిని. దానిలోని ప్రేమనురాగాలను, బాధ్యతను నా జీవితంలోనూ ఉండాలనుకుని మనఃపూర్వకంగా స్వీకరించిన వాడిని... అక్కడితోనే ఆగిపోయా. ఆయన సిద్ధాంత పుస్తకాలను అధ్యయనం చేసి ఆకళింపు చేసుకోగలిగిన సత్తా లేదని విస్పష్టంగానే నిర్ధారించుకున్నా. పెద్దగా ఊహ తెలియకముందే, ‘నా తండ్రి పేరు కారణంగా నాకు వస్తున్న నాయకత్వ బాధ్యతలు’ వద్దని తిరస్కరించిన వాడిని. వాటిని అడ్డంపెట్టుకుని నాకున్న అవగాహన పరిమితులను దాటాలనుకునే కాంక్షలేని వాడిని. 

మావయ్య ఆశయాలు నెరవేర్చడమంటే ఆచరణ మాత్రమేననీ, ఏడాదికోసారి సంస్మరణలో, ఆయన వదిలేసి వెళ్లిన జాతరలను ప్రతీ సంవత్సరం మొక్కుబడిగా నిర్వహించడమో కాదని త్రికరణ శుద్ధిగా నమ్మిన వాడిని. ఆయన నడిచిన నేలను యథాశక్తి ఉంచడానికి చేసిన ప్రయత్నం ఆస్తిమీద మమకారంతో కాదని ఎవరికైనా అర్థమైతే బావుండు. ‘మా తరం వరకూ దాని పవిత్రను కాపాడతాం’ అని నేను చేసిన వాగ్దానం నాలికపై నుంచి వచ్చినది కాదని నీకు అర్థమైందా నేస్తం? నిజమే నేను చాలా సార్లు హృదయంతోనే మాట్లాడతాను. అందు వల్ల వచ్చే చిక్కులను ఎదుర్కోవడానికి పడిలేస్తూనే ఉంటాను. ఏం చేద్దాం... నాకున్న మరోపరిమితి ఇది.  


నోట్: 2019 జనవరి 28న రాసింది... దేనికోసమో వెతుకుతుంటే దొరికింది.

1 వ్యాఖ్య:

pratika చెప్పారు...

సత్యా, సత్యం రమ్యంగా చేప్పావు.