12, సెప్టెంబర్ 2024, గురువారం

ఊహ కోసం...

పంట బోదెలు, పిల్ల కాలువలు... చిన్ననాటి జ్నాపకం.


చిరు సంగీత సవ్వడి. కదిలించినా... ఉత్తర క్షణంలోనే నేల కనపడేటంత స్వచ్ఛత. 

మనసుకు హాయినిచ్చేది.

నది... బోలెడన్ని నీళ్లు సుడులు తిరుగుతూ సాగే ప్రవాహవం.

నన్ను ఎప్పడూ భయపెట్టేది. చిన్నప్పుడు... డిగ్రీ చదివేటప్పుడు కూడా... రైలు చివరి పెట్టెలో ఎక్కేవాడిని. నది దాటేటప్పుడు చివరి పెట్టె పడకుండా ఉంటుందన్న అపోహ.

ఆ భయం వెనుకే ఓ చిన్న  ఉత్సుకత.

సముద్రం... గంటల తరబడి ఒడ్డున కూర్చున్న రోజులు ఎన్నో. ఆవలి తీరం ఎక్కడో తెలియదు. లోతు ఊహకందదు. ఎగసిపడే ప్రతి అలా ఏదో చెప్పడానికి వస్తున్నట్లే ఉంటుంది. ఏమీ చెప్పకుండానే వెనక్కి మళ్లుతుంటుంది.

దిగుళ్లు, గుబుళ్లు, భయాలు... అన్నీ దాని గంభీరం ముందు చిన్నవే అన్నట్లు ఓ స్వాంతన. దగ్గరకు వెళ్లలేని బలహీనత.

నాకు మొదటి రెండు వాక్యాలే ఇష్టం. బాల్కోవ్ లోని ఓ రెండు కథల్లా.

మనల్ని వెదుక్కుంటూ వచ్చే కథలు... మనల్ని చంపేసి అవి బంగారంలా బతుకుతాయి.

మనం వెతుక్కుంటూ వెళ్లే కథలు... అవి మరణిస్తూ... మనం మనశ్శాంతితో బతకడానికి ఊపిరినిస్తాయి.

నాకు మొదటి వాక్యమే ప్రాణం.

ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం.

ఎందుకు చెప్పాలనిపించిందో తెలియదు. బహుశా చాలా కాలానికి చెప్పిన అభిప్రాయం ఇది.

చదవడం, నాతో నేను మాట్లాడుకోవడం... మరొకరు చదివితే బాగుంటుంది అనుకుంటే దానినే శబ్ధం చేయకుండా పంచుకోవడం... పరిమితమయ్యాను.

చాలా కాలం తరువాత నియమాన్ని బ్రేక్ చేశావు రా.

నీదైన ఆలోచనలు మరింత ఉన్నతమవ్వాలి. ఇనుప కచ్చడాలు దాటి విశాలమవ్వాలి.

నీ వాక్యం ఓ భావోద్వేగమ్వాలి. ఆలోచనలతో రగిలే ఉద్రేకమవ్వాలి.

శుభాశిస్సులు...

సతీష్ బాబు చిగురుపాటి

5.9.2024

కామెంట్‌లు లేవు: