22, అక్టోబర్ 2025, బుధవారం

ఓ బంధం తెగింది...

 

రేపు తిరువూరు వెళ్లాలి.

సందిగ్ధత వెనక్కి లాగుతోంది.

అసలు అవసరమా..? అన్న ప్రశ్న వేధిస్తోంది.

ఏం చేశాడని చివరిసారిగా తనని చూడాలి? తననే నమ్మి వచ్చిన భార్యను సుఖపెట్టలేకపోయాడనా..?

‘అవినీతి, అక్రమాలకు ఎదురొడ్డి నిలబడగలిగిన ధైర్యం నాకుంది. ఏ పనైనా సరే చేయగల సత్తా నాది’ అని ధీమాగా మాట్లాడిన గొంతు కాలక్రమంలో తాగుడుకు బానిస అయిందని వెళ్ళనా..!

మనసు చంపుకోలేక ఇంటిదాకా వెళ్లిన నేను... ఇంట్లోని దయనీయమైన పరిస్థితి చూసి అనునయంగా హెచ్చరించినా నా మాటల్ని పెడచెవిన పెట్టాడన్న కోపంతో వెళ్లి చూడాలా..?

‘నీ జీవితం ఎట్లా అయినా పోనీ... కొడుకు జీవితమైనా బాగుపడేలా చూడు’ అంటూ పదే పదే చెప్పిన వినిపించుకోలేదన్న ఆగ్రహంతో వెళ్ళనా..!

‘సార్... ఆయన ఓ రూ.1,000 ఇచ్చాడండి... సార్, నేను కొంచెం మందు పుచ్చుకున్నా... బయటకు వెళితే బాగోదు... ఐటం పంపిస్తాను సార్...’ ఉన్నది ఉన్నట్లు చెప్పగలిగిన నిజాయితీని చివరి వరకూ కోల్పోలేదని నమ్మినందుకు వెళ్లనా..?

చాలా కాలం తరువాత... చివరి ప్రస్థానానికి  ఓ నెల రోజుల ముందు హఠాత్తుగా ఫోను. ‘సార్, నన్ను ఆగిపొమ్మని అంటున్నారు. మీరైనా చెప్పండి. నేను చేస్తాను’ అంటూ... అప్పటికే సమాచారం ఉండడంతో కేకలు వేసి ఫోన్ పెట్టేసిన నేను... ఎవరికీ చెప్పలేక నిమ్మకుండిపోయానన్న ఆత్మనూన్యతతో వెళ్లనా..?

రామకృష్ణ... నీ జీవితం అలా ముగియడానికి ఈ వ్యవస్థతోపాటు నేనూ కారణమే. ఇది నా మనసు నాకు చెపుతున్న నిజం. అందుకే నిన్ను చివరిసారిగా పలకరించే అర్హతను నేను కోల్పోయాను.

రెండు రోజులు పోతే మళ్లీ అంతా మామూలే. నిన్ను కోల్పోయిన బాధను దిగమింగుకుంటూ నీ భార్య... నీ చేదు గురుతులతో నీ కొడుకు... మిగిలిన జీవితాన్ని కొనసాగించడానికి బండబారిన మనసులతో నిస్తేజంగా ముందుకు సాగుతారు.

ఓ బంధం తెగింది...

కామెంట్‌లు లేవు: