21, జూన్ 2026, ఆదివారం

నాన్న‌ గురించి...

ఆయన నాకేమవుతాడు?

బాల్యంలో అలవిమాలిన కోపంతో కొట్టినప్పుడు ఆయన భయాన్ని కలిగించే ఓ మనిషి.


నా చదువు కోసం హాస్టల్ లో పడేసి, వెనక్కి తిరిగి చూసే సమయమే లేదన్నప్పుడు ఎవరి బిడ్డ నో తెచ్చి పెంచుకుంటున్న మారుటి తండ్రి.


కాలేజీకి వెళ్లే వరకూ ప్యాంటు కొననందుకు ఆయన నేను ద్వేషించే మనిషి


కనపడకుండా పొగ లాగినా 777 లా కనిపెట్టి మందలించినపుడు… ఆయన నా పాలిటి గూఢచారి.


ప్రేమకీ, కోరిక కి తేడా తెలియకుండా పంతం పట్టినప్పుడు ఆయన నాకు శత్రువు.


మరి ఆయన నాకు నాన్న ఎప్పుడయ్యాడు?


నన్ను కొట్టిన ప్రతి సారీ, నేను నిద్రపోయాను అనుకొని నా పక్కకు చేరి చేయి వేసి కన్నీటితో క్షమించమని అడిగినప్పుడు…


మోసపోయానన్న తీవ్ర మనోవేదనతో మతిచలించి మందులు మింగుతున్నప్పుడు మూడో కంటికి తెలియకుండా వేదనను దిగమింగుకుంటూ పొదివి పట్టుకున్నప్పుడు…


నా సిగరెట్టు వ్యసనాన్ని మాన్పించడానికి తానూ ఒక దమ్మేస్తూ ఎక్కువ తాగకురా ఆరోగ్యం చెడిపోతుంది అంటూ లాలించినప్పుడు…


అరకొర సంపాదనతో పెళ్లి చేసుకున్నప్పుడు నేను ఎక్కడ ఇబ్బంది పడతానో అని అనుక్షణం అవసరాలను గమనిస్తూ వచ్చినప్పుడు…


తాను ఎన్ని బాధలు పడుతున్నా పెదవి విప్పి చెప్పకుండా నా బాధల గురించి మాత్రమే నిరంతరం కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు…


ప్రతి ఆలోచన, ప్రతి రూపాయి పిల్లలకు ఎలా ఉపయోగపడుతుంది? అంటూ ఉన్నంతలో కటువుగా ఆలోచించినప్పుడు…


అమ్మకి మీ, ఆయన మరో అమ్మయినప్పుడు…


అప్పుడు…


నాన్న, నా చిన్నప్పటి నుంచి నాకు మాత్రమే దక్కిన అపురూపమైన సంపదని అర్థమైంది.


 హక్కుల ఉద్యమ కార్యకర్తగా, కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నిరంతరం అధ్యయనం చేస్తూ తనలో ఇముడ్చుకుంటూ వస్తున్న ప్రతి క్షణం నాకు నాన్న మరింత కొత్తగా పరిచయం అవుతూనే వచ్చాడు. మిత్రుడిగా, ప్రాణ స్నేహితుడిగా, మార్గదర్శిగా, నిరంతరం నన్ను వెన్నంటి ఉండే నీడలా…

నాన్న ఎప్పుడు మారాడు?  


చెప్పటం కష్టమే. 


పొరపాట్లను అంగీకరించగలిగిన కొద్దిమంది ధీమంతుల్లో నా మిత్రుడికి స్థానం ఉంది. ఆచరించలేని దానిని చెప్పటం అంత వెధవాయితనం మరేమీ లేదన్న స్పష్టత ఉన్న కొద్దిమందిలో నా మార్గదర్శి కూడా ఒకరు.


కమ్యూనిస్టు సిద్ధాంతం ఆయన బలం, బలహీనత. వృద్ధాప్యంలో యువకుడిలా నడిపించే శక్తి అది. నిరంతర ఆశాజీవి. నిర్లిప్తత, నిరాశ చీకటి మబ్బుల్లా కమ్ముకొస్తున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం మా నాన్నకు మాత్రమే సాధ్యమైన విషయం. 

కామెంట్‌లు లేవు: