25, ఫిబ్రవరి 2012, శనివారం


పోలీస్ దాష్టీకం
వణుకుతున్న రాళ్ళగెడ్డ

55కుటుంబాలు వుండే రాళ్ళగెడ్డ గరిజన గ్రామం
విశాఖ మన్యంలో పోలీసులు మరోసారి చెలరేగిపోయారు. చింతపల్లి మండలంలోని పీటీజీ గ్రామం రాళ్ళగెడ్డపై తెల్లవారు ఝామున తెగబడి అడ్డం వచ్చిన వారినల్లా చితకబాదారు. గాలిలోకి కాల్పులు, పొగబాంబులు, డమ్మీ గ్రెనేడ్ లతో బీభత్సం సృష్టించారు. ఇద్దరిపై వున్న వారెంట్లను అమలు చేయటానికి తప్పలేదంటూ పోలీసులు సమర్థించుకునే ప్రయత్నం చేశారు. గిరిజనం మాత్రం మారని పోలీసు తీరు చూసి భరోసా కోసం మరోదిక్కు చూస్తున్నారు.

చింతపల్లి మండలంలో లోతుగెడ్డకు 10కీ.మీ. దూరంలో వున్న ఓ చిన్న పీటీజీ గిరిజన గ్రామం రాళ్ళగెడ్డ. ఇది చింతపల్లికి సుమారుగా 40కి.మీ. దూరంలో వుంది. మావోయిస్టు ప్రభావిత బ్లాకుగా పోలీసుల రికార్డులలో వున్న బలపం పంచాయితీలో ఇది కూడా ఓ గ్రామం. చుట్టూతా వున్న కొండల నడుమ వున్న ఈ లోయ గ్రామంలో మొత్తం 58 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వీరిలో పీటీజీలైన కోందు తెగ వాసులు అత్యధికులు. కొద్ది మంది మాత్రం గౌడు తెగకు చెందిన వారు వున్నారు. పోడుసాగు వీరి ప్రధాన జీవనాధారం. రాజమా, వరితోపాటు పసుపు పంటలు వేస్తారు. లోతుగెడ్డ నుంచి 12కి.మీ. అధ్వాన్నపు బండరాళ్ళ దారిలో ప్రయాణం చేస్తే వచ్చే ఈ గ్రామంలో ఓ చిన్న ప్రాథమిక పాఠశాల మాత్రం వుంది. ఈ గ్రామానికి ప్రారంభంలోనే చెరువూరు ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల జ్ఞాపకార్ధం గత ఏడాది అమరవీరుల వారోత్సవాల సందర్భంగా అన్నలు నిర్మించిన ఎర్రని స్మారక స్థూపం వుంటుంది. కొన్ని రేకులు, మరికొన్ని పెంకులు, మిగిలినవి ఆకులతో వేసిన చిన్నిచిన్ని ఇళ్ళతో కనిపించే బడుగు గిరిజన పచ్చటి పల్లె ఈ రాళ్ళగెడ్డ.
గ్రామం ప్రారంభంలో కనిపించే మావోల స్థూపం

అలాంటి రాళ్ళగెడ్డ ఇప్పుడు వణికిపోతోంది. రాత్రి అయితే ఏ తుపాకీ చప్పుడు వినాలోనని భయంతో కుంగిపోతోంది. దోపిడీ దొంగల్లా అర్థరాత్రి జొరబడి ఎవరు అఘాయిత్యం చేస్తారోనని గుబులుతో ముడుచుకుపోతోంది. పరాయివారితో మాట్లాడాలంటే అనుమానంగా కదిలే కంటిపాపల వెనుక సన్నటి కన్నీటి తెర పచ్చిగా మనస్సుల్లో వున్న ఓ భయంకర అనుభవానికి సూచికగా కనిపిస్తోంది. పల్లెలో ఎవరిని కదిలించిన ఒక్కటే మాట... ''పోలీసుల తీరు మారలేదు. అమానుషంగా ఇళ్ళలోకి జొరబడి కొట్టడం వారికి అలవాటు. ఊరుదాటి వెళ్ళే స్వేచ్ఛను, ప్రశాంతగా నిద్రపోయే హక్కును కోల్పోయి జీవించం ఎట్లా? మీ మంచి కోసమే నంటూ వచ్చే వారిని నమ్మేది ఎలా?''. ఈ ప్రశ్నల వెనుక భరోసా కోసం భవిష్యత్తులో మరో దిక్కు చూసే అవకాశమూ లీలగా ధ్వనిస్తూనే వుంది. 

గాయపడ్డ గిరిజన సంఘీభావం
బలపంలో మావోయిస్టులు ఏపీఎఫ్ డీసీ కాఫీతోటలును పంచి నేటికి ఏడాదికి పైగా అవుతోంది. మావోయిస్టులకు సహకరించారన్న కారణంలో 90మందికి పైగా గిరిజనులపై పోలీసులు  కేసులుపెట్టారు. వారిలో చాలా మంది ఇప్పటికే పోలీసుల ఎదట హాజరయ్యారు. మరో ఇద్దరు మాత్రం ఇప్పటికీ హాజరుకాకుండా తిరుగుతున్నారు. చేయనితప్పును చెప్పుకోటానికి స్టేషన్ కు పోతే ఏంజరుగుతుందోనన్న భయంతో వారు ఇప్పిటికీ పోలీసులను తప్పుకునే తిరుగుతున్నారు. స్టేషన్ రాకుండా తిరుగుతున్న నిందితులను పట్టుకోకపోతే పోలీస్ శాఖకే నామర్దా అని భావించారో? లేక తమ సత్తా ఏమిటో చాటాలని అనుకున్నారో? తెలియదు కానీ సుమారు 200మందికి పైగా స్పెషల్ పార్టీ పోలీసులు, గ్రేహౌండ్స్ అండతో రాళ్ళగెడ్డను చుట్టుముట్టటానికి పథకం వేశారు. పథక రచనకు ముందుగా అన్నవరం ఎస్ ఐ గ్రామానికి వెళ్ళారు. మీ సమస్యలు ఏమిటో చెప్పడంటూ వారితో సమావేశమయ్యారు. ఆనుపానులన్నీ జాగ్రత్తగా ముద్రించుకున్నారు. తమకు కావలసిన ఇల్లు ఏదో మరో సారి నిర్ధారించుకున్నారు. గ్రామస్తులు చెప్పిన మంచినీరు, సాగునీటి సమస్యలను, రహదారి ఇబ్బందులను మొక్కుబడిగా విని వెనకు వచ్చేశారు.అంతే గ్రామంపై దాడికి పథకం సిద్ధమైంది. బుధవారం తెల్లవారుఝామున ముహూర్తం నిర్ణయించారు పోలీసు పెద్దలు. సరికాదేమో ఆలోచించండి అంటూ చెప్పిన కొద్ది మంది సీనియర్ల మాటను హోదా తోసిరాజంది. 

గాయపడిన వికలాంగ విద్యావాలంటీర్
బుధవారం రాత్రి నుంచే కూబింగ్ పార్టీలు గ్రామం చుట్టుపక్కల కొండలను జల్లెడపట్టాయి. అన్నివైపులా సురక్షితమన్న సంకేతాలను అందుకున్న స్పెషల్ పార్టీ పోలీసులు గ్రామంలోకి తెల్లవారుఝామున రెండుగంటల ప్రాంతంలో చొరబడ్డారు. గాఢనిద్రలో వున్న ఆ పల్లెకు విద్యుత్ సౌకర్యాన్ని బంద్ చేశారు. ఇళ్ళబయటపక్క గొళ్ళాలు పెట్టారు. తమకు కావలసిన ఇంటికి వెళ్ళి మెల్లగా తలుపులు కొట్టారు. కామ్రేడ్ అంటూ కేక వేశారు. ఎవరు? అంటూ లోపలి నుంచి వచ్చిన ప్రశ్నకు మేం అన్నలం తలుపు తీయండి అంటూ సమాధానం చెప్పారు. లోపలి నుంచి వచ్చిన సింథేరి కార్లను అమాంతం దొరకబుచ్చుకుని ఈడ్చుకు వెళ్లటం ప్రారంభించారు. అడ్డం వచ్చిన కార్ల భార్య సీతమ్మనూ చితకకొట్టారు. ముఖానికి మాస్కులు వేసుకున్న వారు ఎవరో అర్థంకాని స్థితిలో వారు దీనంగా మొరపెట్టుకున్నారు. ఏ తప్పు చేయని మమ్ములను తీసుకుపోతున్నారు. మీరు ఎవరో చెప్పండంటూ వేడుకున్నారు. విన్నపాలకు బదులుగా లాఠీలు లేచాయి. చిత్తం వచ్చినట్లు నాట్యమాడాయి. దీనితో సీతమ్మ దొంగలు, దొంగలు అంటూ కేకలు వేసింది. ముఖానికి వున్న మాస్కులను గుంజింది. పక్క ఇళ్ళకు పెట్టిన గొళ్ళాలను తప్పించింది. దీనితో మెల్లగా ఊరంతా పోగయింది. ఎప్పుడూ సిద్ధంగా వుండే చేతికర్రలు, కత్తులతో గిరిజనమంతా చేరిపోయింది. దీనితో పోలీసులు ఒక్కసారిగా తెగబడ్డారు. గాలిలోకి కాల్పులు జరిపారు. ఆ వెంటనే పొగబాంబులను విసిరేశారు. అక్కడితో ఆగకుండా డమ్మీ గ్రెనేడ్లను విసిరేశారు. ఈ క్రమంలో అడ్డం వచ్చిన వారిని వచ్చినట్లు చితకకొట్టారు. మహిళలను అత్యంత అవమానకరంగా వివస్త్రలను చేశారు. గంటకు పైగా సాగిన ఈ పోలీసు దాష్టీకంలో అన్నవరం ఎస్ ఐ నేరుగా పాలుపంచుకున్నారని బాధితుల ఆరోపణ. 


నిశ్శబ్దం రాజ్యమేలే ఆ నిశీధిలో చిల్లుపడే శబ్దాలు గ్రామస్తుల గుండెలలో గుబులను రేపింది. చెల్లాచెదురవుతున్న గ్రామస్తులపై రాళ్లు, లాఠీలు నాట్యమాడాయి. పరిగెత్తలేని గర్భిణీలు, వికలాంగులు ఈ దౌర్జన్యానికి బలయ్యారు. విద్యావాలంటీర్ గా పనిచేస్తున్న వికలాంగుడు వంతల రామారావు తలపగలి కూలబడ్డాడు. మరో గర్భిణీకి దెబ్బలు తగిలాయి. సీతమ్మ అత్యంత అవమానంగా పోలీసుల చేత హింసించబడింది. మొత్తం మీద పోలీసులు సింథేరి కార్లను ఎటువంటి హెచ్చిరిక లేకుండా వున్నవాడిని వున్నట్లు, ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఈడ్చుకు వెళ్ళారు. వంతల ప్రేమ్ సింగ్ పోలీసుల వల నుంచి తప్పించుకున్నాడు. 


అన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద సహచరుడి జాడ కోసం ఆందోళన
రాళ్ళగెడ్డ మావోయిస్టులతో నిత్యం సంబంధాలలో వున్న పల్లె అన్నది పోలీసుల వాదన. అయితే ఆ గ్రామంలో మావోయిస్టులుగా పనిచేస్తున్నవారో, లేక గతంలో పనిచేసిన వారో ఎవ్వరూ లేరన్నది పోలీసు రికార్డుల సమాచారం. సానుభూతి పరులుగా వ్వవహరిస్తున్నారన్న ఏకైక అనుమానంతో పోలీసు కేసులలో తమను ఇరికించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాఫీతోటల కేసులలో తమపై పెట్టిన కేసులలో గతంలోనే లొంగిపోయామని, మాకు మావోయిస్టులతో ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. దొంగల్లాజొరబడి తమను ఎందుకు ఇలా హింసిస్తున్నారో అర్థంకావటం లేదని వారు వాపోతున్నారు. అరెస్టు చేసిన కార్లను ఏం చేశారో చెప్పాలంటూ వందలాది మంది గిరిజనులు అన్నవరం పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో సీనియర్ పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. సంప్రదింపులు జరిపారు. అదుపులోకి తీసుకున్న గిరిజనుడికి ఎలాంటి హానీ తలపెట్టమని స్పష్టమైన హామీ ఇచ్చారు. బెయిల్ పిటీషన్ ను తామే దాఖల చేయిస్తామని అన్నారు. దీనితో అన్నవరం పోలీస్ స్టేషన్ నుంచి గిరిజనం వెనకు మరలింది. 

ప్రశాంతంగా వున్న గిరిజనంపై పోలీసుల అమానుష ప్రవర్తన దారుణమని ఇప్పటికే వామపక్షాలు గళమెత్తుతున్నాయి. గిరిజనులకు అండగా సీపీఎం పార్టీ రంగంలోకి దిగింది. గిరిజనులను చింతపల్లి కోర్టుకు తీసుకువెళ్ళింది. న్యాయాధికారికి మొరపెట్టుకున్నారు. జరిగింది వివరించారు. పోలీసులను నిలవరించి మమ్మల్ని బతకనివ్వాలని అభ్యర్థించారు. న్యాయాధికారి ఎస్పీ కి ఫిర్యాదు చేయాలని సూచించినట్లు సమాచారం. ఇప్పుడు గిరిజనులంతా హ్యూమన్ రైట్స్ కమిషన్ వద్దకు వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు. మావోయిస్టుల పేరుతో గిరిజనులు భయభ్రాంతులకు గురిచేసే ఆటవిక న్యాయానికి పోలీసులు అంతంపలకాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
జట్టుతో కలిసి రాళ్ళగెడ్డలో...

అనుకున్నదొకటి... అయింది మరొకటి అంటూ పోలీస్ వర్గాలు నిట్టూరుస్తున్నాయి. మరింత నష్టం జరగకముందే జాగ్రత్తచర్యలు చేపట్టాయి. తమ బలగాలపై తామే కేసులు నమోదు చేసినట్లు ప్రకటించాయి. దాడి చేసిన వారిని గుర్తిస్తామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చింతపల్లి సీఐ శ్రీనివాసరావు ఏబీఎన్ కు తెలిపారు. బుధవారం తెల్లవారుఝామున జరిగిన పోలీస్ యాక్షన్ లో తమ బలగాలలకు కూడా దెబ్బలు తగిలాయని పోలీసులు చెపుతున్నారు. 

భవిష్యత్తులో మరిన్ని కేసులలో చిక్కుకోకతప్పదని గిరిజనం భయపడుతోంది. పోలీసుల నుంచి వేధింపులు నిత్యకృత్యం అయ్యే సూచనలు వున్నాయని వారు వణికిపోతున్నారు. ఓ పక్క మావోల తుపాకీల సవ్వడి, మరో దిక్కున పోలీసుల చట్టపరమై చర్యల పేరుతో వేట... నడుమ ఛిద్రమైయ్యే జీవితాలకు వెలుగుపెప్పుడో అన్న ఆక్రోశం ఆ పల్లె హృదయంలో మారుమోగుతోంది.

కామెంట్‌లు లేవు: