16, ఫిబ్రవరి 2012, గురువారం


చలికౌగిలిలో...
కల...

రెయిన్ గేజ్... 1310మీటర్ల ఎత్తులో అర్థరాత్రి 12.30కు...
కాశ్మీర్ చూడాలన్నది నా కల. ఇప్పటికీ తీరని కల. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు, గడ్డకట్టిన నీళ్ళు, తెల్లటి రగ్గులు కప్పుకుని నిద్దురోయే నల్లటి రాదారులు... ఎప్పటికైనా తీరుతుందో లేదో తెలియని కల. ఇంతలోనే ఓ సాయంత్రం వేళ చింతపల్లి నుంచి ఫోన్ 'సార్, లంబసింగిలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది' అంటూ. అంతే ఒక్కసారిగా మనస్సు ఉరకలేసింది. పదపదమంటూ తొందరపెట్టింది. చేస్తున్న ఉద్యోగానికి పనికి వచ్చేదే అయినా అనుమతి నిరాకరణతో ఆగిపోవాల్సిన దుస్థితి. ఈలోగా వారూ, వీరు దానిని సొమ్ము చేసుకున్నారు. వెళ్లమంటూ పై వాళ్ళ సూచనమేరకు క్షణమైనా ఆలస్యం చేయకుండా కారులో బయలుదేరాను. నాతోపాటు కెమెరామెన్, నవ్య ఉత్తరాంధ్ర ప్రతినిథి అరుణ పప్పు. అసలు విశాఖ ఏజెన్సీలో ఎత్తైన ప్రాంతాలు ఏవి? మైనస్ డిగ్రీలు నమోదవుతున్నా నీరు ఎందుకు గడ్డకట్టడం లేదు? మీడియాలో వస్తున్న కథనాల తరువాత మనసాగక పరుగిడుతున్న పర్యాటకుల పరిస్థితి? ఒక రోజు సంబరం సరే... నిత్యం అదే చలిలో గిరిజనం జీవనం, జీవితం సాగుతున్న తీరు? ఇవన్నీ ఉద్యోగరీత్యా చూడాల్సిన అంశాలైతే... నా వరకు నాకు సడిసేయకుండా కురిసే మంచువానలో తడిసి ముద్దవ్వాలన్న కాంక్ష అలుపెరగకుండా సాగిపొమ్మంది, ఝుమ్మంటూ...కొండదారుల్లో....
జీ కే వీథిలో మంత్రి పసుపులేటి బాలరాజు ఇంటి
వద్ద అర్థరాత్రి 1.30కి...

ప్రయాణ ప్రారంభం...

సూర్యుడు మెల్లగా గూటికి చేరుకుంటున్నాడు. తన ప్రతాపాన్ని ఒడుపుగా కొంగున ముడివేసుకుని ఆడిస్తున్న శీతలానికి తలొగ్గి జారుకుంటున్నాడు. సబ్బవరం మీదుగా ప్రయాణం... పచ్చటి కొండల మధ్య ఒక్క రోజు జీవితానికి గుర్తుగా సాగిపోయింది. విశాఖ నుంచి సుమారుగా 140కి.మీ. దూరంలోని మండల ప్రధాన కేంద్రమైన చింతపల్లికి వెళ్ళటానికి బస్సులో సుమారుగా ఐదుగంటలు ప్రయాణించాలి. దీనిలో సుమారు 46కి.మీ. దట్టమైన అటవీ ప్రాంతంగుండా సాగే ఘాటీలో ప్రయాణమే. చింతపల్లికి 16కి.మీ ముందుగానే మనకి వార్తలలో ప్రాంతంగా వెలుగొందుతున్న లంబసింగి గ్రామం కనిపిస్తుంది. సముద్రమట్టానికి 1210మీటర్ల ఎత్తులో వున్న ఈ గ్రామం ఏవోబీ ప్రాంతంలో రెండో ఎత్తైన ప్రదేశం. సముద్రమట్టానికి 1310మీటర్ల ఎత్తులో వుండే మరో ప్రాంతంకూడా మన రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో వుండటం విశేషమే. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పరిగణించే సప్పర్ల ఘాటీలో ఆ ప్రదేశం వుంది. దీనిని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఆ ప్రాంతానికి రెయిన్ గేజ్ గా నామకరణం చేసింది. చిహ్నంగా ఓ చిన్న షెడ్డు లాంటి నిర్మాణం కూడా ఇక్కడ వుంది. జీ.కే. వీథి మండలంలో వున్న ఆ రెయిన్ గేజ్  ప్రాంతం చింతపల్లికి మరో 45కి.మీ.దూరంలో వుంది.
లంబసింగిలో టూరిస్టులతో...

నిశరేయి...

నర్సీపట్నం చేరుకునేటప్పటికే ఒక మాదిరి చలి. 7.30ప్రాంతంలో సరదాగా ఓ టీ తాగి, మిత్రుడిని పలకరించి ముందుకు సాగిపోయాం. చింతపల్లి ఘాటీ మధ్యలో వుండగానే ఓ బస్సు ఎదురుగా... తప్పించటానికి చిన్న కుస్తీ... అంతలోనే బస్సు చెడిపోయిందంటూ ప్రయాణీకులందరినీ దించేశారు. దాని వెనుకే అంటిపెట్టుకున్నట్లు వచ్చిన మరో బస్సులోకి బిలబిలమంటూ చలిటోపీలు, రగ్గులు ఎక్కాయి. మొత్తం వ్యవహారాన్ని బంధించేందుకు మా మధు విఫలయత్నం చూసి... ఎంతైనా బాస్ ని కదా, ఒకింత కోపం వచ్చింది. నల్లమాగాణిపై ఒత్తుగా పరుచుకున్న మరుమల్లెల్లా మత్తు కలిగించిన నక్షత్ర జాతర ఛటుక్కున మాయమైంది. చింతపల్లి చేరుకునేటప్పటికి తొమ్మిదిపైబడే అయింది. దయానంద్ స్థానికబలంతోనో లేక మంచితనంతోనే తెరిచిపెట్టి వుంచిన ఊరికి పెద్ద హోటల్ కి చేరుకున్నాం. సాధారణ పరిస్థితులలో రాత్రి 10గంటల వరకూ సందడిగా వుండే చింతపల్లి అప్పటికే బోసి పోయింది. అడపాదడపా రగ్గులమాటున, చలికోటుల చాటునో నడిచే  మనుషులు తప్ప మరే చప్పుడూ లేని పల్లెలో చాలా కాలం తరువాత... గట్టిగా ఊపిరి పీల్చి వదిలా. ఇంతలోనే ఓ తాగు బోతు, కావాలా? అంటూ అడిగి , తిట్లు తిని జారుకున్నాడు. వేడివేడిగా ఓ చపాతీని వేసి, మాంచి చలిలో ఓ దమ్ము వేస్తూ నిలుచున్నా. ఈలోగా సాగిన చర్చలో కష్టమైనా సరే, రెయిన్ గేజ్ వద్దకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. 

సప్పర్ల ఘాటీలో... బితుకుబితుకుమంటూ...

లంబసింగిలో వర్కింగ్ స్టిల్
దారిపొడవునా దట్టంగా కురుస్తున్న మంచు... దారిని ఏ మాత్రం కనబడనీయకుండా చేసేటంత మంచు. సన్నగా సాగే ఘాటీ రోడ్డు వెంబడి చిక్కటి అడవిలో, చిమ్మచీకటిలో ప్రయాణం. ఏ చిన్న అలికిడైనా అన్నలేమో అన్న బెరుకు చివరిదాకా వెంటాడుతూనే వుంది. దారిపొడవునా కనిపించీ కనిపించని స్థల పురాణాల వివరణ దయానంద్ నుంచి వస్తూనే వుంది. మధ్యమధ్యలో మంద్రంగా వద్దన్నా దూరే సినీగేయ సంగీతం. ఏవీ మనస్సును తాకటం లేదు. కనిపించీ కనిపించకుండా సాగుతున్న ఘాటీపైనే దృష్టంతా. మంత్రి బాలరాజు ఇంటి వద్దకు చేరుకోగానే అప్పటికే అక్కడ సిద్ధంగా వున్న మిత్రుడు చలిమంటలు వేసీవేసీ ఇప్పుడే అంతా ఇంటికి చేరుకున్నారన్న కబురు కష్టంమీదచెప్పాడు. చిన్ననిరాశ కలిగినా ముందుకే సాగిపోయాం. అక్కడికి మరో 30కి.మీ. దూరం ప్రయాణం చేస్తే కాని, రెయిన్ గేజ్ ప్రాంతం రాదు. దారిలోనే మావోయిస్టు ప్రభావిత గ్రామం సప్పర్ల. ఘాటీలో చిన్న పల్లుడు. దారిలో అడ్డం వచ్చిన చిన్న కర్రను తేలికగా తీసుకుని ముందుకు సాగానో లేదో... ఠకామని బ్రేక్ మీద కాలేయాల్సిన పరిస్థితి. అర్థగంటసేపు అంతచలిలోనూ చిరుచెమటలు పట్టించిన కర్రను తలుచుకుని సన్నటి నవ్వు పెదాలపై అలా అలలా సాగిపోయింది. అయ్యే ప్రతీ చప్పుడూ అన్నలేదేనేమో అన్న టెన్షన్ నాది. అందరిలోనూ అదే టెన్షన్ కనిపిస్తోంది నాకు. మెల్లగా అడ్డంకిని తొలగించుకుని, అమ్మయ్య అనుకుంటూ కారులో కూలబడ్డాం. తిరిగి ప్రయాణం మొదలు. మధు, అరుణలు మాంచి నిదురలోకి జారుకున్నారు. నేను, దయానంద్ మాత్రమే రెప్పవేయకుండా దారి పట్టుకుని పైకెక్కుతున్నాం. 

ఎట్టకేలకు రెయిన్ గేజ్ కి...

ఘాట్ రోడ్డులో ఓ పక్కనే కొండ మైదానం. చీకటిలో తప్పిపోతామన్న భయంతో ఒళ్ళంతా కళ్లు చేసుకుని మరీ చూశాం. చివరికి కారు దిగాం. కాలుతున్నకట్టె, వేడినిచ్చే మద్యం బాటిళ్ళ ఆనవాళ్ళు... అంతకుముందే ఎవరో ఆ ప్రాంతాన్ని వదిలెళ్ళారనటానికి గుర్తుగా వున్నాయి. నిదుర మత్తు వదిలించుకుని మిత్రులిద్దరూ మాతో కలసి కిందకు దిగారు. దిగిన వెంటనే అరుణ కామెంట్... 'ఈ చీకటిలో ఇంత దూరం ఎందుకు వచ్చాం? ఎక్కడ తీసినా ఇదే దృశ్యం కదా?' అని. నిజం చెప్పద్దొ, చిన్న నిరాశ. అయితేనేం, జీరో డిగ్రీల అనుభూతిని స్వంతం చేసుకోవటానికి ఏవోబీలో అత్యంత ఎతైన (1310మీటర్లు) ప్రాంతానికి చేరుకున్నామన్న ఆనందం దాన్ని మింగేసింది. కారు కాంతిపుంజాల శక్తి చాలటం లేదు. కనిపించినంత దూరం తిరిగి, కెమెరా ముందు వణుకుతూ రెండు మాటలు చెప్పి తిరిగి బయలుదేరాం. మొట్టమొదటి సారి, ఘాటీలో దారికనిపించని మంచుదాడిలో కారు నడపటం. కష్టమనిపించినా, థ్రిల్ దానిని మింగేసింది. చింతపల్లిలో కేవలం రెండుగంటలు మాత్రమే రెస్ట్ తీసుకుని తిరిగి లంబసింగికి బయలుదేరాం.

చింతపల్లి నుంచి లంబసింగికి ప్రయాణం...

స్థానికురాలితో కలిసి...
కేవలం 16కి.మీ దూరం. ఎంతకీ తరగనంటోంది. లంబసింగికి ముందే లోతుగెడ్డ జంక్షన్. అక్కడ నుంచే పాడేరు వెళ్ళే దారి చీలుతుంది. తెల్లవారుఝాము నాలుగు గంటలకే వాకిళ్ళను శుభ్రం చేసుకుంటున్న మహిళలూ, చిన్నమంట చుట్టూ చలికాగుతూ, వెచ్చగా పొగతాగుతూ వణుకుతున్న మొగోళ్ళు... అంతటి చలిలోనూ వెచ్చగా దొరికే కమ్మటి టీ...కణకణమండతున్న కట్టెల పొయ్యపై నుంచి పొగలు కక్కుతూ దిగుతున్న ఇడ్లీలు లోతుగెడ్డ జంక్షన్ లో కనిపించిన జీవన చిత్రాలు. అక్కడ నుంచి లంబసింగి ఎంతో దూరంలేదు. అక్కడికి చేరేలోపు మా మధు కోసం మూడు నాలుగు సార్లు ఆగాల్సి వచ్చింది. ఎటు చూసినా మంచు. పొగమంచు దట్టంగా కమ్మేసింది. తోడుగా చల్లటి గాలులు. కొద్దిసేపటికే చేతులు పట్టుకోల్పేయేటంత చలి. ఏరుకొచ్చుకున్న చితుకులు, కొనుక్కున్న బొగ్గులూ వెచ్చదనం కోసమే ఖర్చుచేయాల్సి వస్తున్న కాలం. 10నిమిషాలు ఆరుబయట నిలుచుంటే చాలు మంచు వర్షంలో తడిచి ముద్దవటం ఖాయం. భారీ చెట్లూ రక్షణ ఇవ్వలేని సిత్రం. తడిచిన ప్రతీ ఆకునుంచీ టపటపా పడే మంచు చినుకులతో నేల తడిచీర కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ముదురాకుపచ్చ, పచ్చటిపసుపు, గోధుమవర్ణాల ఆకుల వస్త్రధారణతో కనిపించీ కనిపించని చెట్లు ఓ వైపు... నిస్సిగ్గుగా వలువలు విడిచి నగ్నంగా, ఠీవిగా నిలిచిన వృక్షరాజాలు మరో వైపు... చూపును పదునెక్కిస్తాయి. మనస్సును ఉద్రేకాల సడి నుంచి జోకొడతాయి. ఆలోచనల జడి నుంచి మనస్సు సేదతీరుతుంది. మాట ప్రకృతి అందాల వెంట పరుగులిడుతూ మౌనాన్ని మనకొదిలేస్తుంది. 

లంబసింగిలో...

ఉదయం తొమ్మది గంటలకు చలికాగుతూ...
ఉదయం ఆరుగంటల వేళ లంబసింగి/లమ్మసింగి  జంక్షన్ లో వణికించే చలి. 30ఇళ్ళు, 40కుటుంబాలు వుంటున్న చిన్న గ్రామం. చింతపల్లి వెళ్ళే ప్రధాన రహదారి పక్కనే వుండటం, ప్రతీవారం జరిగే సంత, మైదాన ప్రాంతంవైపు ఘాటీ దిగే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయటానికి వుండే చెక్ పోస్టు... తప్ప మరే విశేషమూ లేని ఓ సాధారణ గిరిజన గ్రామం ఇది. లోతట్టు గిరిజన గ్రామాలకు, చింతపల్లివైపు వెళ్ళే దారులు రెండూ ఇక్కడ కలుసుకుని మైదాన ప్రాంతానికి సాగిపోవటానికి కొండ దిగుతాయి. మీడియాలో లంబసింగి గురించిన వార్తలు చూసిందే తడవుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు పరుగులెట్టుకుంటూ ఇక్కడకు చేరుకుంటున్నారు. అందమైన ప్రకృతికాంత ఒడిలో కుసింత సేదతీరాలని తాపత్రయపడుతున్నారు. శీతకాలం చీకటి వేళ ఇక్కడకు చేరుకున్న ప్రయాణీకులను కనీసం మంచినీరు కూడా దొరకని ఈ ప్రాంతం నిరాశపరుస్తోంది. అయితే అందాలను దోసిటపట్టాలన్న కాంక్షాభరిత జ్వాల అసౌకర్యాల లేమి కష్టాలను దహించేస్తోంది. తూ.గో.జిల్లా అనపర్తి నుంచి వచ్చిన ఓ మిత్ర బృందం ఆనందం వర్ణనాతీతం. పడతాపడతా ఇక్కడకు చేరుకున్న వీరికి గిరిజనులే ఆసరాగా నిలిచారు. వారికి చేతనైన పద్ధతిలో వండి వేడివేడిగా వడ్డించిపెట్టారు. కొద్దిమంది కారులో వెచ్చగా పడుకుంటే, మరికొద్ది మంది గిరిపుత్రుల నివాసాలలో మునగతీసుకుని పడుకున్నారు. మరికొంతమంది అంత రాత్రి వేళా 40కి.మీ. ఘాటీ దిగి నర్సీపట్నం చేరుకుని, తిరిగి ఉదయాన్నే చేరుకుంటున్నారు. చలిమంటల సెగల మధ్య గడచిన ఆ క్షణాలు పంచిన మధురానుభతిని మరువలేమంటూ వారు చెప్పే మాటలు వింటే రెక్కలు కట్టుకుని వాలాలనిపించని జఢులెవ్వరూ వుండరనిపించింది. ఉదయం 12గంటల వరకూ ఒంటిని తాకని కిరణ స్పర్శ, నిరంతరాయంగా పడుతూండే మంచుతుంపర్లు ప్రశాంత ప్రత్యూషోదయాలను దుర్భరం చేస్తున్నాయి. పనీ, పాటలను కుంపు చేస్తున్న ఈ చలి గతంలో ఎన్నడూ చూడలేదని స్థానిక వృద్ధులు చెపుతున్నారు. ఐసుగడ్డల్లా కోతకోస్తున్న నీటితో ఉదయాన్నే వంటావార్పు, అంట్లు తోమటం వంటి తప్పని పనులుచేసుకుంటూ సాగుతున్న గిరిజన మహిళలు ఎక్కడైనా ఇంతేనన్నట్లు ఏ భావమూ లేకుండా సాగిపోతున్నారు. బోరు బావి నుంచి వచ్చే నీరు కొద్దిగా వెచ్చగా వస్తున్నప్పటికీ అందుబాటులో వున్నది కొద్దిమందికే. గడ్డకెళ్ళి నీరు తీసుకొచ్చుకోవాలంటే మధ్యాహ్నం వరకూ ఆగవలసిందే. సాధారణంగా సంక్రాంతికి వేసే భోగి మంటల తరువాత తగ్గే చలి ఈ ఏడాది ఎందుకనో పెరిగిందంటూ గిరిజన వృద్ధ మహిళ గెమ్మలి రాజాం చెప్పింది. 

కొర్రిబయలు కథ...

లంబసింగి అంటే... లంబ అంటే పెద్దది, సింగి అంటే కొండ. పెద్ద కొండ అన్నమాట. దీనిని మన మైదాన ప్రాంత వాసులు లమ్మసింగి అంటూ పిలుస్తున్నారు. ఇవన్నీ మీడియా వెలుగులోకి తీసుకు వచ్చిన పేరులే. ఈ గ్రామ మూలవాసులను పలకరిస్తే మాత్రం దీనిపేరు కొర్రిబయలు అనే చెపుతారు. దీనికి అక్కడ ఓ కథ వాడుకలో వుంది. పూర్వ కాలంలో ఓ ఇంటిలో దొంగతనానికి పాల్పడిన ఓ యువకుడిని రాత్రంతా చెట్టుకు కట్టేశారు. తెల్లవారి చూసేటప్పటికి చలికి కొర్రైపోయాడు. అప్పటి నంచి దీనిని కొర్రిబయలుగా పిలుచుకుంటున్నారు. ఓ రోజో, రెండు రోజులో చూడటానికి బానే వుండే ఈ చలిలో బతకటమూ కష్టమేననిపించింది. చిన్నపిల్లల పరిస్థితి మరీ. ఒళ్ళంతా చలికి పగిలిపోతూంటే ఏం చేయాలో తెలియని గిరిపుత్రులు ఎంతో మంది. లంబసింగి జంక్షన్ లోని కొద్ది మంది మాత్రం వేజలైన్లు, కోల్డ్ క్రీములు రాసుకుంటున్నారు. ఇబ్బందులు ఎన్ని వున్నా, ఊరికి ఎంతో మంది వస్తూండటం, మరో విధంగా ఉపాథిని కూడా కల్పిస్తోందన్న ఆనందం వారిలో కనిపించింది. 

నీరు గడ్డ కట్టడం లేదా?

మైనస్ డిగ్రీలలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఎందుకు నమోదవుతున్నాయి? మరి అంతటి ఉష్ణోగ్రతలలో నీరు గడ్డకట్టకపోవటమేమిటి? సముద్రమట్టానికి ఇంత ఎత్తులో వున్న ప్రాంతాలలో ఈ చల్లదనం సాధారణమేనా? ఎన్నో ప్రశ్నలు. చింతపల్లిలోని ఆచార్య ఎన్ జి రంగా స్థానిక వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఏడాది క్రితం ఐఎండీ ఆధ్వర్యంలో రూ.50లక్షలతో అత్యాధునిక వాతావరణ పరిశోధనా యంత్రాలను అమర్చారు. ఈ కేంద్రం బాధ్యతలను చూస్తున్న డాక్టర్ టి రత్న సుధాకర్ తో మాట్లాడితే...  మైనస్ డిగ్రీలు నమోదు కావటం నిజమే అయినా అది కనీసం ఒక గంటసేపైనా కొనసాగితే నీరు గడ్డకట్టే అవకాశం వుంటుంది. కాని తెల్లవారుఝామున మూడు గంటల ప్రాంతంలో మైనస్ డిగ్రీలకు టచ్ అవుతున్న ఉష్ణోగ్రత కొద్దిసేపటికే మెల్లగా పెరుగుతూ జీరో దగ్గరకు వచ్చేస్తోంది. గరిష్ఠం నంచి కనిష్ఠానికి, తిరిగి గరిష్ఠానికి ఉష్ణోగ్రతల ప్రయాణంలో స్థిరంగా లేకపోవటం వల్లనే నీరుగడ్డకట్టడం లేదు అంటూ చెప్పారు. లంబసింగిలో ఓ యువకుడు మాత్రం అక్కడ వున్న ఒకే ఒక్క బావిలో నీటిపై రెండు రోజులపాటు ఐస్ పొరలా ఏర్పడిందని చెప్పుకొచ్చాడు. 

అనుభూతులను మూటగట్టుకుని తిరిగిప్రయాణమయ్యాం. భారీ ప్రహరీ గోడల మధ్య జైలులో జీవితం గడుపుతున్నట్లు సాగే పోలీసు బృందాలను పలకరించి, ఆ స్టేషన్ లో కలయతిరిగాం. చింతపల్లి జంక్షన్ లో ఓ తమిళ అయ్యర్  చేతి టిఫిన్ తిన్నాం. కొసరికొసరి వడ్డించే ఆమెను చూస్తూ పల్లె బంధాలు అంటూ చదివిన కథలు గిర్రున రీలులా తిరిగాయి. కమ్మటి ఆకులో వేడివేడి ఇడ్లీలు వడ్డించారావిడ. మా మమ్మీ ఇక్కడే, డాడీ తమిళనాడు అంటూ ఆవిడ తన చరిత్రను చెప్పుకొచ్చారు. ఓ తమిళ అయ్యర్ ను పెండ్లి చేసుకున్నానని చెప్పిన ఆమె, తన భర్త గొప్పతనాన్ని ఎంత మురిపెంగా చెప్పారో. ఆ మురిపాన్ని జాగ్రత్తగా నిక్షిప్తం చేసుకుని కిందకి బయలుదేరాం. శలవుల తరువాత బడికి రావటం ఎంత కష్టమో నాకిప్పటికీ బాగా గుర్తే. అలాంటి భావనే. ఏం చేస్తాం. తప్పదుగా. 

కామెంట్‌లు లేవు: