23, మార్చి 2020, సోమవారం

చరిత్ర శిఖరాధిరోహణకై..

మనమెవరం? మన తాతముత్తాతలు ఎవరు? అసలు మన పుట్టిన ఊరు ఏది? మూలాలను మరింత లోలోతుల్లోకి... తరాలు... దశాబ్దాలు... శతాబ్దాలు... వెళ్లి తెలుసుకోకపోతే, తెలియకపోతే, ‘కాలయంత్రం’లో జారిగిలపడకపోతే... ఎప్పటికీ మన గురించి మనం తెలుసుకోలేం. ఇది మా జాతి అని, ఇది మా నేల అని భావించనూలేం. ఈ నేల నుంచే తూర్పు ఆసియాలోని నలుచెరగులా రాజ్యాలేలిన రాజులున్నారనీ గ్రహించలేం. అస్తిత్వాతల కోసం కొట్లాడుకొంటూ కలిసుండడం ఎట్లనో తెలుసుకొనే అవకాశాలూ కోల్పోతాం. భావ దారిద్య్రం అనే జారుడు బల్లనెక్కిన మనం అడుగంటా జారకుండా ఆసరానుపట్టుకొని తిరిగి శిఖరానికి చేరడానికి కష్టపడాల్సిన సమయం ఎప్పుడో ఆసన్నమైంది. దానిని ఒకింత ఆలస్యంగానైనా... ఇప్పటికైనా గుర్తించకపోతే తెలుగుజాతి దారిద్య్రంలోకి కూరుకుపోతుంది. మనదైనా వాటినెన్నింటినో అన్యులు మాది అంటూ సగర్వంగా చాటుకుంటూ, తొక్కుకుంటూ వెళ్లిపోతారు. దీనికోసం పదునైన ఆయుధాలు... భావోద్వేగాలను తట్టిలేపి, ఉద్వేగాలను, ఉద్రేకాలను గంపలకెత్తగలిగే సాయుధ సంపత్తిని సమకూర్చుకోవడానికి ‘నర్తనశాల’లో మస్తిష్క మధనం ఆరంభమైంది.
సూరాడ వరప్రసాద్‌... ప్రసాద్‌సూరి... విశాఖ జిల్లా రాంబిల్లికి చెందిన 20 ఏళ్ల బీఎఫ్‌ఏ విద్యార్థి. తనదైన మూలాలను వెతుక్కొంటూ శతాబ్దాల వెనక్కి జారాలని కోరిమరీ ‘చారిత్రక కథారచన కార్యశాల’కు వచ్చాడు. నోరు తెరిచిన రెండు మూడు సందర్భాల్లోనూ తనకున్న జ్ఞాన సంపద చిన్నదేమీ కాదంటూ సహచర రచయితలను ఆశ్చర్యపరిచాడు. అతను వేసుకొన్న జీన్స్‌ జాకెట్‌పైకి ఎక్కిన శ్రీశ్రీ జగన్నాథ రథచక్రాలు ఉరకలేస్తున్న ఉడుకు ఆలోచనకు ప్రతీకనిపించింది. చిత్తర్వు మధు... కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం మామిడికోళ్ళకు చెందిన ఈ 68 ఏళ్ల నవ యువకుడు హృద్రోగ నిపుణుడు. హైదరాబాదులో పనిచేస్తున్నారు. పోలికే లేని విభిన్న వ్యక్తుల సమూహం... అందరూ తమదైన శైలిలో ఆకట్టుకొనే కథనాలతో తెలుగు ప్రజలకు సుపరిచితులైన రచయితలే. అయితేనేం రెండు రోజులపాటు... సుమారు 14 గంటలపాటు... మాట్లాడే వారివైపు దీర్ఘంగా చూస్తూ చెవులు రిక్కించి విన్నారు. విషయ పరిజ్ఞానంతో పరిపుష్ఠమై ఏకధాటిగా సాగిన మాటలను పొల్లుపోకుండా తలలకెత్తుకున్నారు. వంశధార, మంజీర, గుండ్లకమ్మ, చెయ్యేరు, హంద్రి.. నదులు, వాగులై.. చీలి, అభిప్రాయ ప్రవాహాలతో వెల్తువెత్తించి తొలిమాపు వేళ సంగమించారు. తెలుగుభాష సగర్వంగా తలెత్తుకొనేలా చేసిన శప్తభూమి నవలా రచయిత బండి నారాయణస్వామిని ఆత్మీయంగా సత్కరించుకున్నారు. ‘‘కుల, ప్రాంతీయ అస్తిత్వాలే నన్ను నడిపించాయి. చరిత్రకారునికి స్వీయ దృక్కోణాలు ఉండకూడదు. కాని కాల్పనిక చారిత్రక సాహిత్యనికి రచయిత, వ్యక్తి దృక్కోణాలు ఉంటాయి. రాయలసీమ అస్తిత్వాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి రెండు శతాబ్దాల వెనక్కి కాలంతో ప్రయాణించి వెళ్లాల్సి వచ్చింది. అయ్యవారిగా పల్లెల్లో ఉద్యోగం చేశానుగనుకే నేను ఈ నవల రాయగలిగాను. 18వ శతాబ్దంలో ఆ ప్రాంతంలో ఉన్న హింసకు నేను అద్దమయ్యానే తప్ప హెచ్చిస్తూ రాసిందేమీ లేదు’’ అంటూ ముఖాముఖి కార్యక్రమంలో నారాయణస్వామి పంచుకొన్న అభిప్రాయాలు.. సందేహాలను కొన్నింటిని తీర్చినా మరింకొన్ని ఆలోచనలను, ప్రశ్నలను లేవనెత్తినట్లే కనిపించింది.
అనుకున్న దానికన్నా తొలిరోజు సమావేశం ఓ అర్ధగంట ఆలస్యంగా ఆరంభమైంది. కొవిడ్‌ 19 భయాందోళనలు ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ వస్తారో, రారో అన్న నిర్వాహకుల సందేహాను పటాపంచలు చేస్తూ మొత్తం 36 మంది హాజరయ్యారు. మనదైన చరిత్రను తవ్వితాయాలన్న తాపత్రయం, నలుగురికీ పంచాలన్న తపన మెండుగా ఉన్న ఈమని శివనాగిరెడ్డి తొలి సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ‘ఆది ఆంధ్రుని అడుగులు ఐదు లక్షల సంవత్సరాల క్రితమే ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని జ్వాలాపురంలో 74 వేల సంవత్సరాలు క్రీస్తుపూర్వం ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతపు లావా వచ్చిపడింది. దానికింద అవశేషాలు లభ్యమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రాళ్లు, నాణాలు, శాసనాలు మన చరిత్రను మనకు పట్టిస్తాయి. మ్యూజియంలు ఎన్నో విశేషాంశాలను మనకు చెపుతాయి’ అంటూ ఉత్తేజపూరితంగా ఆయన తొలి విభాగాన్ని ఆరంభించారు.
శ్రీకాకుళం వాసి, సాహిత్యంలో చరిత్రను, ప్రత్యేకించి కళింగాంధ్ర చరిత్రను తవ్వితీసే పనిలో నిరంతరాయంగా కృషి చేస్తున్న దీర్ఘాసి విజయభాస్కర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. 15 రకాల అంశాలు చారిత్రక నేపథ్యాన్ని అందిస్తాయని వివరించారు. గతం, వర్తమానం మధ్య సంభాషణే చరిత్ర అని, నదులు ప్రవహిస్తున్న పురాణాలనీ విడమరిచారు. కళింగదేశ ప్రాచీనత, కళింగానికి జరిగిన అన్యాయాన్ని వివరించిన తీరు సిక్కోలు మాటకారితనాన్ని అందరికీ మరోమారు పరిచయం చేసింది. రామాయణ, మహాభారతాల్లోనే కళింగ దేశ ప్రస్తావన ఉందని ఆయన వివరించారు. రామాయణం, అయోధ్యకాండ 71వ సర్గలో కళింగ ప్రస్తావన ఉందని తెలిపారు. దుర్యోధనుని భార్య భానుమతి కళింగ యువరాణి అనీ, చిత్రాంగదుని కుమార్తె అని చెపుతూ... మహాభారతంలోనూ మమ్ముల్ని తొక్కేసారంటూ ఆ  ప్రాంతవాసుల లోలోపలి పొరల్లో ఉన్న అసంతృప్తిని నవ్వుతూనే బయటపెట్టేశారు. బౌద్ధ గ్రంథాలు, జాతక కథల్లోనూ కళింగ చరిత్ర ఉందని వివరించారు. సుత్తపిటకంలోని ఖుద్దక నికాయంలోని దీఘనికాయంలో పేర్కొన్న ‘దంతపురం’ ఇప్పుడు ఆముదాలవలసకు 12 కి.మీ. దూరంలోని రొట్టవలసకు సమీపంలో ఉన్న ‘దంతవరపుకోట’ అని తాజా తవ్వకాలు నిర్ధారించాయని వివరించారు. ‘దంతపురం’లో చాలాకాలంపాటు ఉన్న బుద్ధిని దంతాన్ని శత్రువులకు దక్కకుండా చేయడం కోసం నాటి పాలకులు తరలించిన తీరును వివరించారు. శ్రీలంకలోని కాండీ నగరానికి చేరిన ఆ దంతం ఇప్పటికీ టూత రెలిక్‌ టెంపుల్‌లో భద్రంగా ఉందని విజయభాస్కర్‌ వివరించారు.
‘చరిత్ర మెదడుని బరువెక్కించాలి. చారిత్రక సాహిత్యం మనస్సును తేలిక చేయాలి’ అంటూ తెలంగాణ వాసి కట్టా శ్రీనివాస్‌ తన మాటలను ప్రారంభించారు. తెలంగాణ పల్లెల్లో తనకు దొరికిన ఆధారాలు, వాటి ఆధారంగా చరిత్రను తవ్వుతూ వెళ్లిన సందర్భాలను పరిచయం చేశారు. తమ తవ్వకాల్లో వెలుగులోకి వచ్చిన చరిత్రను యథాతథంగా దినపత్రికలో ప్రముఖంగా ప్రచురితమైనప్పుడు రాని స్పందన, దానికి సాహిత్య విలువలను జోడిస్తూ ప్రచురించినపుడు వచ్చిన విషయాన్ని సందర్భోచితంగా వివరించారు. ఖమ్మం సమీపంలోని నాగులవంచ గ్రామ చరిత్రను వెలుగులోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాన్ని, ఆ క్రమంలో తెలిసిన అనేకానేక విషయాలను శ్రీనివాస్‌ వివరించారు. ఆయన తన పీపీటీలోని తొలి రెండు స్లైడ్లలో ఉంచిన అంశాలను మననం చేసుకోవాల్సిందే. ‘‘భారతీయ సాహిత్యం ఒక నిథి. తరాలుగా మనిషి ప్రవర్తనపై తన ప్రభావం చూపుతోంది’ అంటూనే ‘కళ మరియు జీవితం’ అంటూ తన చేస్తున్న పనిని క్లుప్తంగా చెప్పకనే చెప్పాడని అనిపించింది. రాయలసీమ నుంచి వచ్చిన వేంపల్లి గంగాధర్‌ తాను రాస్తున్నప్పటికీ అవి చాలవని, ఇంకా రాయాల్సింది ఎంతో ఉందని నిజాయితీగా ఒప్పుకొన్నట్లే కనిపించింది. సీమలో చరిత్రను చాటిచెప్పే చారిత్రక స్థలాలు ఎలా ధ్వంసమవుతున్నాయో, అసాంఘిక కార్యకలాపాలకు ఎలా నిలయాలవుతున్నాయో చెపుతూ దీని గురించి కూడా రాయాలేమో? అంటూ ధర్మాగ్రహాన్ని ప్రదర్శించాడు. బహుశా ఈ దుస్థితి దేశవ్యాపితంగా ఉందేమోనని అనిపించింది. చరిత్ర పట్ల పెద్దగా ఆసక్తి లేని జాతికి అదొక సంపద అని చెప్పడం, ఆసక్తిని రేకెత్తించడం చిన్న పనేమీ కాదనీ తోచింది. కాలగమనంలో దేవుళ్లను మనిషి ఎలా మారుస్తాడో కళ్లకు కట్టాడు. కడప జిల్లా దానవులపాడులోని పార్శ్వనాథుని విగ్రహం, బిత్తల సామిగా మారిన ఉదంతం ఒక్కటి చాలు... మన దేశంలోని అనేకానేక చారిత్రక ప్రార్థనాలయాల్లో ఏం జరిగి ఉంటుందో ఊహించుకోవడానికి. చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగర సంస్థానం ప్రత్యేకతను వివరిస్తూ ఓ కంఠాహారాన్ని హఠాత్తుగా తెరపైకి తెచ్చాడు. కనుక్కోండి చూద్దాం అంటూ ఊరించి మరు నిమిషంలోనే ఇది నిజాం నగ అని చెప్పాడు. సంబంధం ఏమిటా అని ఆలోచిస్తూంటే నిజాంకే వందల కోట్ల విలువ చేసే నగలు ఉంటే మరి శ్రీకృష్ణ దేవరాయులకు విలువైన నగలు ఎన్ని ఉండాలంటారు? అవన్నీ ఎక్కడ ఉన్నాయంటారు? అంటూ నవలకు సరిపడా ఓ ఉత్కంఠభరత ఊహను గదిలో వదిలి వెళ్లిపోయాడు.
భోజనశాలలోనూ మాటలు కొనసాగాయి. రోజూ విశ్రాంతి తీసుకొనే అలవాటు పీకుతున్నా... ఎవరికి వారు తమ గుంపును వెతుక్కొని చిన్న చిన్న పర్ణశాలల్లో కుదురుకున్నారు. సుమారు రెండు గంటలపాటు ఆసక్తికరమైన బృంద చర్చలు సాగాయి. చర్చోపచర్చల అనంతరం తలెత్తిన సందేహాలకు, అనుమానాలకు సాయి పాపినేని సమాధానమిచ్చారు. చరిత్ర వక్రీకరణకు గురవుతుందన్న భయంతో ఎక్కడా సాహితీ సృజన ఆగలేదని వివరించారు. విషయసేకరణ కష్టమూ, కొంత ఖర్చుతో కూడినదేనని అంగీకరిస్తూ అందుకు మనం సంసిద్ధులం కావల్సిందేనని స్పష్టం చేశారు. అయితే కార్యశాల ప్రధానోద్దేశం... చారిత్రక నవలలు, కథలు రాయడానికి ముందుకు వచ్చిన రచయితలకు తగిన సూచనలు, సమాచారం అందించడమేనంటూ హామీ ఇచ్చారు.
ఆదిత్య కొర్రపాటి... 28 సంవత్సరాల యువకుడు దక్షిణ భారత దేశ భాషలన్నింటిలోనూ ప్రవేశాన్ని కలిగి ఉండడం, ఆయా భాషల్లో ప్రముఖుల పుస్తకాలను తడిమి ఉండడం... అప్పుడే చూసిన వాళ్లందరికీ అబ్బురమే. మలిరోజు తొలి మాటలు తనవే. రాత్రంతా, మెలుకువ నిండిన నిద్రతో పడిన తాపత్రయం కనిపించింది. ‘కాలం నిరవధికం... పృఽథ్వీ విపులం’ అన్న స్లైడ్‌తో తన మాటలను ఆరంభించాడు. చారిత్రక నవలను ప్రత్యేకంగా నిర్వచించుకోవాల్సిన అవసరాన్ని చెపుతూనే చరిత్ర కథగా మారిన తీరును, అదే సమయంలో కథ చరిత్రగా రూపుతీసుకోవడాన్ని వివరించాడు. మహా, సూక్ష కథనాలు రెండు అవసరమే నంటూ నవలకున్న విస్తృతి ఉపయుక్తమని చెప్పాడు. నవలా క్రమంలో చారిత్రక సంభావ్యతని  ప్రతిఫలింప చేయాల్సిన అవరాన్ని నొక్కి చెప్పాడు. చరిత్రపట్ల విధేయత ఉంటే అత్యంత సహజంగా ఉండేలా స్వల్ప క్షణాలలో జారిపోయే వివరణలలో యుగ లక్షణాలని చెప్పగలగడం సాధ్యమేనంటూ వివరించాడు. కన్నడం, తమిళం, మలయాళం, గుజరాతీ, మరాఠీ భాషల్లో వచ్చిన విస్మరించలేని చారిత్రక నవలలను పరిచయం చేశాడు. 500 పేజీల నుంచి 2000 పేజీల వరకూ ఉన్న ఆ నవలల నిడివిని ప్రస్తావించినపుడు అసలు తెలుగు పాఠకుడు చదవుతాడా? అన్న సందేహం అక్కడున్న అందరి బుర్రల్లోనూ కదలాడింది. తమిళానికి చరిత్ర అన్నా, చరిత్రకు తమిళమన్నా అలవిమాలిన ప్రేమ అనీ, తమిళ సాహిత్యం గతాన్ని ఎప్పుడూ మరిచిపోదని చెప్పినపుడు మనమేం కోల్పోయామో అర్థమవుతూ వచ్చింది.
రెండు రోజుల పాటు కూర్చున్నా తరగని విశేషాంశాలున్నా కేవలం 10 నిమిషాల్లో ముగించండంటూ నిర్వాహకులు డీపీ అనురాధకు మైకు ఇచ్చారు. 5 నుంచి 11వ శతాబ్దం వరకూ మన తెలుగు నేల నుంచి వెళ్లిన వారు తూర్పు ఆసియా దేశాలన్నింటిలోనూ రాజ్యాలను స్థాపించారని, వాటికి తగిన ఆధారాలు ఆయా దేశాలలో మౌఖికంగానూ, చరిత్రలోనూ లభ్యమవుతున్నాయనీ ఆమె క్లుప్తంగా వివరించుకుంటూ సాగిపోయారు. దక్షిణ మయన్మార్‌లో 5-7 శతాబ్దాల మధ్య ‘మన్‌’ అనే రాజ్యాన్ని స్థాపించిన తెగ ఇప్పటికీ ఆ దేశంలో ఉందని చెప్పారు. మన్‌ తెగను ప్రత్యేకమైనదిగా ఆ దేశం గుర్తించిందన్నారు. ‘‘మన సామ్రాజ్యాన్ని పాలించిన రాజుల పేర్లు ఒక్కలప్ప, సామల, మగాడు. ఆ పేర్లన్నీ మన తెలుగు పేర్లే. చివరి రాజు రాజనీతి శాసా్త్రన్ని రచించాడు. ఆ తెగలో ఇప్పటికీ మౌఖికంగా ఓ జోల పాట ప్రాచుర్యంలో ఉంది. ఆ పాట... ‘మన నేల తెలంగాణ. మన రాజుకు అదృష్టం బాలేక యుద్ధంలో ఓడిపోతే పడవల్లో ఎర్రరాళ్లు ఉన్న ఈ సువర్ణ భూమికి వచ్చాం’ అంటూ సాగుతుంది. వీరి గురించి బ్రిటీష్‌ చరిత్రకారులు రాస్తూ కృష్ణా, గోదావరి ముఖ ద్వారం నుంచి వచ్చారని పేర్కొన్నారు’’ అని వివరించారు. ‘‘వీటిని మన చరిత్రకారులో, ఆర్కియాలజిస్టులో శాస్త్రీయంగా పరిశోధనలు చేసి నిర్ధారించాలన్న ఆసక్తిని ప్రదర్శించకపోవడం నిజంగా దురదృష్టం. వీరి తరువాత రాజ్యాధికారాన్ని చేపట్టిన వారు తమ వారేనంటూ తమిళులు మాత్రం క్లెయిం చేసుకొంటున్నారు’’ అంటున్నపుడు ఆమె ముఖంలో విచారం లీలగా కదలాడింది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు... మనం మేల్కొని మన ఖ్యాతిని చాటుకోవాల్సిన అవసరం ఉందని ఆమె ఆశావహదృక్పథంతో మాట్లాడినపుడు... నిజమే పూనుకోవాల్సిన తరుణమిదే అనిపించింది.
రెండు రోజుల కార్యశాల చర్చలను ఒక కొలిక్కి తీసుకు వచ్చే బాధ్యతను తీసుకొన్న వాడ్రేవు చినవీరభద్రుడు... మన చరిత్ర ప్రధానంగా మౌఖికమేనని, చరిత్రను ప్రత్యేకించి రికార్డు చేయడం ఉండదనీ, రాస్తూ పోతే చరిత్ర అవుతుందని అన్నారు. అస్థిత్వాల కోసం పోరాటం జరుగతున్న వేళ సంఘర్షణ జరగాలని స్పష్టం చేశారు. చరిత్రకీ, సాహిత్యానికి మధ్య ఉన్న సున్నితమైన తేడాను ఆయన చిన్న ఉదాహరణతో హత్తుకొనేలా చెప్పారు. గురజాడ వారి కథ ‘మీ పేరేమిటి?’ని ఈ సందర్భంగా ఆయన చదివి వినిపించారు. నేటికీ ఏ మాత్రం ప్రాధాన్యతను కోల్పోని రీతిలో ఉన్న ఆ కథాకథన గమనం మనకేమేమి విషయాలను చెపుతుందో క్లుప్తంగా వివరించారు. ‘‘తెలుగు వాళ్లు చాలా బద్దకస్తులు. వంట వండుకొనే తీరిక కూడా ఉండదు కాబట్టి ఆవకాయ పెట్టుకుంటారన్న మాట. వారికి నవల రాసేటంత శక్తి లేదు. ఈ తెలుగు వాళ్ళు మహాభారతాన్ని ఎలా అనువదించారో అస్సలు అర్థం కావడం లేదు. వందల పేజీల చారిత్రక నవలను తెలుగువాడు రాయడమనేది బహుశా ఓ వందేళ్ల తరువాత సాధ్యమేమో?’’ అంటూ ఒకింత రెచ్చగొట్టేందుకు నవ్వుతూనే ప్రయత్నించినా... అది నిజంగా తెలుగుసాహితీలోకం అవలోకనం చేసుకోవాల్సిన విషయమేనేమో?
కొండవీడు మ్యూజియం, కోట చూడడానికి బయలుదేరే ముందు సాయి చేసిన ప్రకటన అందరిలోనూ చిన్న కదలికను తెచ్చింది. ఏప్రిల్‌ 25 నాటికి హాజరైన వారంతా తలా ఒక కథ రాయాలని, జూలై నాటికి వాటికి ఒక రూపాన్ని ఇచ్చి పుస్తకంగా తీసుకు వస్తామని దృఢంగా చెప్పారు. ‘గుభేళ్లున’రాస్తే చాలు... కథ మీదే... దాని బరువు బాధ్యతలు మాత్రం మావి అంటూ ప్రకటించారు.
ఏదైనా రాయాల్సిందే అనుకుంటూ బయలుదేరిన సాహితీ బృందంలో సభ్యులు... పాపినేని శివశంకర్‌, వాడ్రేవు చిన వీరభద్రుడు, ఈమని శివనాగిరెడ్డి, దీర్ఘాసి విజయభాస్కర్‌, బండి నారాయణ స్వామి, మహి బెజవాడ, కుమార్‌ కూనపరాజు, బీఏ శివప్రసాద్‌, అనురాధ, ఖదీర్‌ బాబు, అన్వర్‌, ఝాన్సీ పాపుదేశి, వేంపల్లి గంగాధర్‌, బీ సరోజినీ దేవి, బొడ్డేడ బలరామస్వామి, జీవీ శ్రీనివాస్‌, ముని సురేశ్‌ పిళ్ళై, బొల్లోజు బాబా, వెంకట్‌ శిద్ధారెడ్డి, మత్తి భానుమూర్తి, ఉమ నూతక్కి, దేవదానం రాజు, పూడూరి రాజిరెడ్డి, అనిల్‌ డ్యానీ, బీ ప్రసూన, చిత్తర్వు మధు, సూరాడ, వరప్రసాద్‌, హనీఫ్‌, పూర్ణిమా తమ్మిరెడ్డి, ఆదిత్య కొర్రపాటి, రాణి శివశంకర శర్మ, కట్టా శ్రీనివాస్‌, ఆకునూరు హసన్‌, అరవింద్‌ ఆర్య, దగ్గుమాటి పద్మాకర్‌, మనోహర్‌...

ఆంధ్రజ్యోతి వివిధలో...
ఫోటోల కోసం...

కామెంట్‌లు లేవు: