9, మార్చి 2020, సోమవారం

మనువాదం ఈ దేశ విజ్ఞానానికి మరణశాసనం రాసింది

10వ తరగతితో చదువాపేసి ఉద్యమాల్లోకి దూకిన కుర్రాడు. చిన్నతనంలోనే జనం పాటలు రాసిన గేయ రచయిత. హోటల్‌ వర్కర్‌గా, సోడాలమ్ముకునేవాడిగా, రైల్వే గ్యాంగ్‌మెన్‌గా జీవితాన్ని చూసిన శ్రామికుడు. గేయ నృత్యకారుడిగా వందల ప్రదర్శనలు చేసిన కళాకారుడు. 10వ గ్రహాన్ని నాసా ప్రకటించడానికంటే 10 ఏళ్ల ముందే గోడలకెక్కించిన స్వయం ప్రకాశిత మేధావి. తెలుగుతోపాటు హిందీ, సంస్కృతం, పాళీ భాషల్లో పట్టు సంపాదించిన పండితుడు. మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని, బౌద్ధాన్ని చదివిన వ్యక్తి. పాటలు, కథలు, పిల్లల సైన్సు పుస్తకాలు, తత్వశాస్త్రం, బౌద్ధంపై అనేక పుస్తకాలు రాసిన బహుజనుడు... బొర్రా గోవర్ధన్‌. మార్చి 15న 100వ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఆయనతో ముఖాముఖి...
1) కుటుంబ నేపథ్యం గురించి చెపుతారా?
గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా బొర్రావారిపాలెంలో పుట్టాను. నాన్న కమ్యూనిస్టు సత్యం అని ఊరంతా పిలుచుకునే బొర్రా సత్యనారాయణ. అమ్మ అంజమ్మ. 1962లో పుట్టిన నేను తాతగారి ఊరు తోటపల్లిలో పెరిగాను. 5 వరకూ అక్కడే చదువు. కూచినపూడిలో 6, 7 తరగతులు. సోషల్‌ మాష్టారు విశ్వనాథం గారు తన కిష్టమైన బుద్ధుడు, జాషువా గురించి బుర్రకెక్కించారు. నాన్నేమో శ్రీశ్రీని వంటబట్టించాడు. 8 నుంచి 10 వరకూ నగరంలో సాగింది.
2) రచయితగా తొలి గుర్తింపు...
‘మ్రోగింది మ్రోగింది స్వాతంత్య్ర భేరి... విరిసింది విరిసింది విరజాజిమల్లి’ అంటూ 9వ తరగతిలో దేశభక్తి గీతం రాశాను. తెలుగు మాష్టారు శ్రీహరి శర్మ దానిని సరిచేశారు. నాటి హెచ్‌ఎం దాసరి పిచ్చయ్యగారు జాతీయ పండుగలకు స్కూలులో పాడించేవారు. ఆ ఉత్తేజం, ఉత్సాహం అలా కొనసాగాయి. 1977లో రేపల్లెలో ఇంటర్‌ చేరా. నవంబరులో వచ్చిన తుఫానుకు దివిసీమ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లాను. అక్కడితో చదువు ఆగిపోయి జీవితం ఉద్యమాల బాట పట్టింది.
3) ఉద్యమకారునిగా, రచయితగా ఏకకాలంలో సాగిందా మీ ప్రయాణం?అబ్బో అప్పటి కష్టాలు చెప్పాలంటే చాలా అవుతుంది. నగరంలో జనసాహితి రవిబాబుగారి పరిచయంతో కళారూపాలపై ఆకర్షణ మొదలైంది. నృత్యరూపకాలకు సారథ్యం వహించేవాడిని. అమెరికా, రష్యా సామ్రాజ్యవాదులపై రూపొందించిన పాములవాడు నృత్య రూపకం కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చాం. ప్రజాసాహితి పత్రికలో క్రాంతికిరణ్‌ పేరుతో గీతాలు అచ్చయ్యేవి. మత్స్యకార జీవితాలపై రాసిన లాహిరి లాహిరిలో లంగరెత్తి కదిలింది అన్న పాట, తరిమెల నాగిరెడ్డి పుస్తకం తాకట్టులో భారతదేశం చదివిన తరువాత రాసిన ‘దోపిడి దోపిడి దోపిడీ... సులువుగా చేసే నిలువు దోపిడి’ పాట ఆ రోజుల్లో పాగా పాడేవాళ్లం. ఆ తరువాత గుంటూరు జనశక్తి కార్యాలయంలో ఉ సాంబశివరావు వద్ద ఉన్నా. ఆయన నాకు సాహిత్యగురువు. జిన్నాటవర్‌ సెంటర్‌లో రామచంద్ర విలాస్‌లో సప్లైయర్‌గా పనిచేస్తూ గుంటూరు జిల్లా హోటల్‌ వర్కర్స్‌ యూనియన్‌ని స్థాపించాం. అవసరాల రీత్యా అమరావతి సమీపంలోని మోతడక గ్రామానికి వెళ్లాను. అక్కడ తోపుడు బండిపై సోడాలు అమ్మాను. అక్కడి కష్టం జీవితాన్ని నేర్పింది. గుమ్మడిదల సుబ్బయ్య ఇంటిలో ఉన్నా. హిందూ, ముస్లిం గొడవలపై రాసిన ‘చితాగ్ని’ కొత్త గుర్తింపునిచ్చింది. ‘గుండెమంట’ పేరుతో మొదటి పాటల పుస్తకాన్ని జనసాహితి ప్రచురించింది. అక్కడ నుంచి బాపట్లకు రైల్వే గ్యాంగ్‌మెన్‌గా వెళ్లా. అక్కడే ‘పట్టి బిగించు... నట్టు పట్టి బిగించు’ పాట రాశాను. ఉద్యమమూ, రచనా కలగలిసే సాగాయి. నిర్మలానంద నాయకత్వంలో సన్నిశెట్టి రాజశేఖర్‌తో కలిసి పశ్చిమబెంగాల్‌, ఒడిస్సా, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చాం. ఊసా రాసిన ‘అమ్మా బయలెల్లినాదో... తల్లీ బయలెల్లినాదో’ పాటకు నృత్యరూపకంలో నాది ఇందిరాగాంధీ వేషం. 
 4) మధ్యలో హఠాత్తుగా శ్రీశ్రీతో మీ గాఢానుబంధం ఎలా?
ముందేచెప్పినట్లు నాన్న అంటించిన శ్రీశ్రీ మెల్లమెల్లగా నన్ను ఆక్రమించాడు. 1982లో ఆయనకు బాలేదని తెలిసి చెన్నై వెళ్లాను. ఆయనతో గడిపి వచ్చాను. నా అభ్యర్థన మేరకు సరోజగారితో కలిసి అదే ఏడాది నవంబరు 11న నగరం వచ్చారు. వారం రోజులు ఉన్నారు. ఆయన చెప్పిన సూచనే చరిత్రను, సంస్కృతాన్ని అధ్యయనం చేయమని.
5) కమ్యూనిస్టు పార్టీలు అంబేద్కర్‌ని చదవడానికి పెద్దగా ఇష్టపడని రోజుల్లోనే మీరు అంబేద్కర్‌ రచనలు అధ్యయనం చేయడం, రాయడం...
నిజమే. నగరం వచ్చిన కొత్తలో రాహుల్‌సాంకృత్యాయన్‌ చదవడానికి సరోజక్క ఎలా కారణమయ్యారో 1985లో అంబేద్కర్‌ని చదవాల్సిన అవసరం ఉందని చెప్పిన వ్యక్తి ఓపీడీఆర్‌ భాస్కరరావు. మరోసారి చదువులో కూరుకుపోయాను. అప్పటికి ఇంకా కారంచేడు ఘటన జరగలేదు. నేను రాసిన దానిని జనపథంలో ప్రచురించారు. బొర్రా గోవర్ధన్‌ పేరుతో ప్రచురితమైన తొలి వ్యాసమది. దళితబహుజనులు రాయగలరని ప్రపంచానికి చాడడం ముఖ్యమన్న వాదనతో నా అసలు పేరును పెట్టారు ఆయన. అంబేద్కర్‌ రాసిన బుద్ధుడు-ధర్మము పుస్తకం చదివిన తరువాతే బుద్ధుడిపై మరింత ఆసక్తి పెరిగింది.
6) కొంచెం గందరగోళంగానే ఉంది. ఇక్కడ నుంచి మరలా వేదాలు, ఉపనిషత్తుల్లోకి వెళ్లినట్లున్నారు?
అవును. 90ల్లో తాత్విక పండితులు నూతలపాటి రామ్మోహన్‌ గారితో పరిచయమైంది. ఆయన ప్రోద్భలంతో వేదాలు, ఉపనిషత్తులు, షడ్‌దర్శనాలు, పురాణాలు... ఆరు సంవత్సరాలు బాహ్య ప్రపంచంతో దాదాపు సంబంధం లేకుండా అధ్యయనంలో గడిచిపోయాయి. రుగ్వేదం, ఉపనిషత్తులు, దర్శనాలు ఆకర్షించాయి. ఆత్మ, పరమాత్మ, దేవుడు వంటి విభేదించే అంశాలునప్పటికీ భారతీయ తాత్వికతపట్ల అచంచలమైన ప్రేమను పెంచాయి. భౌతికవాదం అనగానే మనకు పాశ్చాత్య తత్వవేత్తలు మాత్రమే గుర్తుకు వస్తారు. కాని పంచభూతాల పేరుతో ఉపనిషత్తుల్లో ఎప్పుడో పేర్కొన్నారు. మన గురించి మనం తెలుసుకోలేకపోవడానికి కులమే కారణం. మనువాదం ఈదేశ విజ్ఞానానికి మరణశాసనం రాసింది. వేదాల్లో ఉన్నదీ, లేనిదీ వివరిస్తూ రాసిన పుస్తకం త్వరలో రాబోతోంది. గందరగోళమేమీ లేదు. వాటిని మార్క్సిజం, అంబేద్కరిజం చదవడం వలన బౌద్ధం మరింత తేలికగా బోధపడింది. కణాదుని వైశేషికం, కపిలుడి సాంఖ్యం, గౌతముని న్యాయదర్శనం, పతంజలి యోగదర్శనం... బౌద్ధంలో వాటికన్నా మెరుగ్గా కనిపించాయి.
7) బాగా గుర్తు... 1992 ప్రాంతాల్లోనే మీ స్కూలులో 10వ గ్రహం ‘ఆత్రేయ’ అని రాసి ఉండేది గోడలపైన..
అవును. నగరంలో ఊరి చివర ‘శాంతినికేతన్‌’ ఉండేది. 85లో స్కూల్‌ పెట్టిన తరువాత మూడేళ్లు కరెంటు లేదు. చికట్లోనే ఉండేవాళ్లం. రాత్రిళ్లు ఆరుబయట నక్షత్ర మండలాలను చూస్తూ గడిపేవాడిని. ఆక్రమంలోనే వాటి అధ్యయనం కూడా మొదలైంది. న్యూటన్ లాస్, కెప్లర్‌, బోడేస్‌ లా ప్రకారం మన సౌర కుటుంబంలోని గ్రహాల ద్రవ్యరాశిని బట్టి ఇంకో గ్రహం ఉండాలని లెక్కలేశాను. ఓ ఆర్టికల్‌ను రాసి సైన్స్‌ మ్యాగజైన్‌కు పంపాను. క్వాలిఫికేషన్‌ లేదంటూ వెనక్కు పంపారు. అప్పటికే నా స్కూలు గోడలపై భారీగా వేయించిన పెయింటింగుల్లోకి 10వ గ్రహం వచ్చి చేరింది. 2002లో అంటే పదేళ్ల తరువాత నాసా దీనిపై ప్రకటన చేసింది. ఆ రోజు దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికలూ నన్ను ప్రస్తావించాయి. ‘ఆంధ్ర శాస్త్రవేత్తలు’ అన్న పుస్తకంలో ఖగోళ విభాగంలో నాకూ స్థానం కల్పించారు. గ్రంథాలయ ఉద్యమకర్త వెలగా వెంకటప్పయ్యగారు పరిచయం... ఆయన ప్రోద్భలంతో పిల్లల కోసం సైన్సు పుస్తకాలు 25, గణితంపై 20 పుస్తకాలు రాశాను. వాటిలో 13 పుస్తకాల సెట్‌ ‘గణిత బాలశిక్ష’ విశేష ప్రాచుర్యాన్ని పొందింది. పేరం జయశీలరావుగారు ఇచ్చిన అవకాశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని బీసీ స్టడీ సర్కిల్స్‌లోనూ సివిల్స్‌ కోచింగ్‌ తీసుకొనే విద్యార్థులకు జాగ్రఫీ పాఠాలు చెప్పే వాడిని. 
8) బౌద్ధం, మార్క్సిజం, అంబేద్కరిజం... మూడూ వేర్వేరా? లేక ఏకరూపత కలిగిన మూడు వేర్వేరు మార్గాలా?
వేర్వేరని చాలా మంది భావన. కాని కాదు. ఒకే విషయాన్ని కేంద్రంగా చేసుకొని వేరువేరు దారుల్లో నడిచిన తాత్వికులు వీరు. ప్రపంచాన్ని తల్లిగా ప్రేమించిన వారు వీరు ముగ్గురూ. మార్క్స్‌ ప్రపంచాన్ని శ్రామిక, ఆర్థిక దోపిడీ, కార్మికవర్గం కోణంలో చూశారు. అంబేద్కర్‌ అంటరానితనం కోణంలో దేశాన్ని చూశాడు. ఈ రెండు సమస్యలతో పాటు మానవ సహజ స్వభావమైన ధార్మికకోణంలో నుంచి బుద్ధుడు ప్రపంచాన్ని విశ్లేషించారు. మార్క్సిజం, అంబేద్కరిజం.. బుద్ధిజంలో ఎలా భాగమో నా పుస్తకం వినయపీఠకంలో విశ్లేషించాను.
9) నేటి సామాజిక, రాజకీయ ముఖచిత్రంపై
కులనిర్మూలన దిశగా అనేక ఉద్యమాలుసాగుతున్నాయి. కుల సంఘర్షణ ఎక్కువగా కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ కులమే ప్రధానమన్న వాళ్ళంతా కులాల వ్యత్యాసమెందుకని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘర్షణ సమయంలో కుల రహిత భారతదేశాన్ని నిర్మించడానికి ఏకైక మార్గం బౌద్ధమే. ఈ సంక్లిష్ట సమయంలో మార్క్సిజం, అంబేద్కరిజానికి బుద్ధిజం అవసరం. హేతువాద, నాస్తిక, మానవతావాద శక్తులన్నీ బౌద్ధం చెట్టునీడకు చేరాల్సిన సమయమిది.
10) మీ 100వ పుస్తకం గురించి...
ఆంజనేయరెడ్డి, వీరనారాయణ రెడ్డి. ఇద్దరూ ఐపీఎస్‌లే. వీరనారాయణరెడ్డి బౌద్ధ పండితుడు. తరిమెల నాగిరెడ్డిగారి తాకట్టులో భారతదేశం తొలిపాఠకుడు. ‘నక్సలిజం వ్యక్తిగత హింసావాదం కాదు. సామాజిక సమస్య’ అని చెప్పిన పోలీస్‌ ఉన్నతాధికారి ఆయన. బౌద్ధంలో నాకు గురువు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ ‘బౌద్ధ దర్శనం’ను హిందీ నుంచి అనువాదం చేసినపుడు 8 సార్లు తిరగరాయించారు. ఆ తరువాత తిరిగి చూడలేదు. 35వ బౌద్ధ పుస్తకం... ‘బౌద్ధము - వైజ్ఞానిక మార్గం’ నా 100వ పుస్తకం.
11) కుటుంబం గురించి...భార్య శివపార్వతీ దేవి. పిల్లలు గౌతమి వైద్యురాలు. చిన్నమ్మాయి శ్రీశ్రీ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతోంది. నా రచనలు, అధ్యయనంలో 80 శాతం కృషి నిస్సందేహంగా ‘దేవి’దే. ప్రస్తుతం బుద్ధభూమి మాసపత్రిక ఎడిటర్‌గా ప్రతీ నెలా తీసుకురావడంపై దృష్టి పెట్టాను.

12) తెలుగు, సంస్కృతం, హిందీ, పాళి భాషల్లో పట్టు సంపాదించి మూల గ్రంథలను విస్తృతంగా అధ్యయనం చేసిన మీకు రావలసినంత పేరు ప్రఖ్యాతులు రాకపోవడానికి కారణం...
పాలకవర్గ సంస్కృతిని ప్రచారం చేసే ప్రధాన మాధ్యమాలలో చోటు దక్కని మాట, గుర్తించని మాట వాస్తవమే. అది సహజం కూడా. ఎందుకంటే నేను వారికి భిన్నమైన ప్రజా సంస్కృతిని, ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రచారం చేస్తున్నాను. అయితే ఆమేరకు నాకు లభిస్తున్న పేరుప్రఖ్యాతులతో నేను సంతృప్తికరంగానే ఉన్నాను.

2 కామెంట్‌లు:

bujji చెప్పారు...

స్పూర్తి దాయకం మీ రచనా శైలి. ప్రశంస దాయకం జీవనశైలి.

Unknown చెప్పారు...

అభినందనలు. నీ కలంనుండి మరిన్ని రచనలు రావాలి. శతమానం భవతి... జయశీలరావు