15, జనవరి 2016, శుక్రవారం

అనుకోకుండా అలా ప్రయాణం...

క్షణాల్లో నిర్ణయమైన పర్యటన. ఎలాంటి ముందస్తు ప్రణాళికలూ లేని ప్రయాణం. అనుకోకుండా అలా
కుదిరిపోయిందంతే. భోగి మంటల వద్దకు ఉదయాన్నే వెళ్ళాల్సి వచ్చింది. తెల్లవారుఝామున నాలుగు గంటలకే బయలుదేరి అనిల్ అట్లూరిని తీసుకుని మురళీనగర్ చేరుకున్నా. అత్యంత వేడుకగా సాగుతున్న పండుగ చిత్రీకరణలో మునిగిపోయిన నాకు అనిల్ చెవిలో జోరీగలా మోగటం మొదలుపెట్టాడు. మూలాలు మిస్ అవుతున్నాం అన్న తన వేదన అర్థమవుతూనే వుంది. చేయగలిగింది ఏముంది? ప్రయాణం చాలా దూరం సాగిపోయింది.

మేం వచ్చామోచ్ అని చెపుదామని అప్పటికి మూడు సార్లు ఫోన్ చేశా. సమాధానం లేదు. ఎట్టకేలకు తిరిగ అరుణ పప్పు ఫోన్ చేశారు. భోగి వేడుకుల వద్దకు వచ్చారు. మా జూనియర్ తో కలిసి అందరం అరుణ ఇంటికి చేరుకున్నాం. వేడి వేడి టీ తాగుతున్న సందర్భంలోనే అడవి, వెన్నెల, చుక్కలు, దీపక్ చిత్రం... ఇలా మాటలు సాగాయి. వెళ్దామా అనుకుంటే వెళ్దామా అనుకున్నాం. సాయంత్రం మూడు గంటలకు ప్రయాణం స్టార్ట్ అనుకున్నాం. అర్థ గంట ఆలస్యంగా అరుణ ఇంటికి అనిల్, నేను చేరుకున్నాం. ఉదయం అనుకున్న ప్రయాణం మరిచిపోయి ప్రశాంతంగా చుట్టాల పాపతో ఆడుకుంటోంది. మమ్ములను చూసి నాలుకు కరుచుకుని హడావిడిగా బయలుదేరింది. కారు నేనే నడుపుతానని పట్టుపట్టింది. ఊరు దాటే వరకూ... కాదు ఘాటీ చివరికి చేరే వరకూ బిక్కుబిక్కు మంటూనే కూర్చున్నా. మధ్యలో చెరువు నీటిలో పడమటకి జారుతున్న సూర్యాస్తమయ దృశ్యపు నీడను చూసి ఠక్కున కారుదిగాం. నాలుగు చిత్రాలు తీసుకున్న అనిల్ ఆవురావురుమంటూ అప్పటికే సిద్ధంగా వున్న పులిహోర ఆహా అద్భుతహ అంటూ లాగించేశాడు. చీకటిపడింది. గాలికొండ వ్యూ పాయింట్ చేరుకున్నాం. చల్లటి హోరు గాలి. దుప్పటి కప్పుకున్నా వణికించేస్తోంది. చుట్టూ చిక్కటి చీకటి. అప్పుడుప్పుడూ వెళుతున్న వాహనాల కాంతి దృష్టిని ఇబ్బంది పెడుతోంది. చుక్కల పందిరిలో చాపం చంద్రుడు కాంతులీనుతూ మురిపిస్తున్నడు. అంత చలిలోనూ గట్టుపై అరుణ వెలికిల్లా పడుకుంది. ఆకాశం బోర్లించినట్లు బాగుంది అంటూ మురిసిపోయింది. నిశ్శబ్ధం ఎంత బాగుందో అనిపించింది చాలా కాలం తరువాత.

రయ్యుమంటూ దూసుకువచ్చిన కారు హఠాత్తుగా మా దగ్గర ఆగింది. అనిల్  పెద్దగా... ప్రణీత్ వచ్చేశాడోచ్ అంటూ కేక వేశాడు. ప్రణీత్ రాకతో కొత్త సందడి. మెల్లగా నడుచుకుంటూ కొద్ది దూరం నడిచాం. రోడ్డు వారా పిట్టగోడపై కూర్చున్నాం. తిరిగి వ్యూ పాయింట్ కు చేరుకున్నాం. వ్యూ పాయింట్ దగ్గర వున్న చలి హోరు పక్కకు నాలుగు అడుగులు వేస్తే లేకుండా పోవటం భలే గమ్మత్తనిపించింది. ప్రణీత్ ప్రేమతో 15కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చిన వేడివేడి పుల్కాలు రమ్మంటూ పిలిచాయి. వేడి పుల్కాలు, ఘాటైన శాకాహారం కూరలు. భలే వుంది జీవితం. ఎరక్కపోయి చేతులు చన్నీళ్ళతో కడిగా. అంతే గడ్డకట్టుకుపోయాయి. పరుగోపరుగు. ఒక్క గంతులో కారులోకి వెళ్ళి హీటర్ ఆన్ చేసుకుని కూర్చున్నా. కొద్ది సేపటికి ప్రాణం కుదుటపడింది. మెల్లగా తిరుగు ప్రాయాణమయ్యాం. ఘాట్ దిగేటప్పుడూ అరుణే డ్రైవింగ్ ఈ సారి మెరుగ్గా వుంది. సగం దూరం తరువాత నేను కొద్ది దూరం నడిపి నిద్ర వస్తోందంటూ చేతులెత్తేశా. యథాస్థానంలోకి వచ్చి గుర్రు పెట్టా ప్రశాంతంగా... మెలుకువ వచ్చే సరికి నగరంలో వున్నా... మరలా రేపటి పరుగు కోసం, కుసింత జవాన్ని సమకూర్చుకున్నానన్న తృప్తితో...

కామెంట్‌లు లేవు: