22, జనవరి 2016, శుక్రవారం

మౌనం దారెటు?!

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ విశాఖ జిల్లాలో వివిధ ప్రధాన రాజకీయ పార్టీలలో వేడి రాజుకుంటోంది. జనం మాట ఎట్టా వున్నా గెలుపోటముల లెక్కలు, టిక్కెట్ల కోసం సిగపట్లు, ఆధిపత్య కుమ్ములాటలు రానురాను ఎక్కువయ్యాయి. ఏమీపట్టనట్టు పైకి కనిపించే జనం మాట ఎట్టావున్నా ఆయా పార్టీల అధినాయకత్వం మాత్రం తలలు పట్టుకుంటోంది. అధికార బలంతో మదించి వున్న కాంగ్రెస్ పార్టీతో పాటు జీవితం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్న టిడిపి, రేపటి అధికారం మాదేనని విర్రవీగుతున్న వైకాపలతో సహా ఎవ్వరూ ఈ విపరీతాలకు మినహాయింపుకాకపోవటమే ఇక్కడి విషాదం.
 విశాఖ జిల్లాలకు ఇద్దరు మంత్రులు. సీనియర్ మంత్రిగా పసుపులేటి బాలరాజు గిరిజన సంక్షేమ శాఖకు ప్రాతినిథ్యం వహిస్తుంటే, చిరంజీవి అండతో మంత్రి పదవిని అందుకున్న గంటా శ్రీనివాసరావు రాష్ట్ర మౌలిక వసతులు, పోర్టుల శాఖను నిర్వహిస్తున్నారు. విపరీతమైన చొరవ, ఏ పనినైనా తనకు సానుకూలంగా మార్చుకోగలిగిన చాతుర్యం కలిగిన గంటా శ్రీనివాసరావు మంత్రి పదివిని చేపట్టిన తొలినాళ్ళ నుంచే తనదైన వేగంతో ముందుకు సాగిపోయారు. ఈ క్రమంలో తనదైన కోటరీని బలంగానే తయారు చేసుకున్నారు. తన కులపోళ్ళే అధికప్రాధాన్యమిస్తున్నారన్న అపకీర్తినీ ఆయన మూటగట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన పిసిసి అధ్యక్షుడు, సీనియర్ మంత్రి అయిన బొత్స సత్యన్నారాయణకు దూరమయ్యారు. వీరి మధ్య విభేదాలకు కారణమేమిటన్నదానిపై ఇప్పటికీ బయటకు ఓ స్పష్టత రాకపోయినప్పటికీ ఏదో తెలియని ఎడం వారిద్దరి మధ్యా వుందన్న విషయాన్ని దాచుకోవటానికి వారిద్దరూ ప్రయత్నించటంలేదు. వాల్మీకి తెగనుంచి వచ్చి విద్యార్థి ఉద్యమం నాటినుంచే కాంగ్రెస్ రాజకీయాలలో ఢక్కామొక్కీలు తిని నేడు మంత్రిగా వున్న పసుపులేటి బాలరాజు వ్యక్తిత్వంలో మంత్రి గంటాకు పూర్తి భిన్నంగా వుంటారు. లోపిరికితో, అంతో ఇంతో ఆత్మనూన్యతాభావనతో బాలరాజు నిత్యం పోరాటం చేస్తూనే వుంటారు. బహుశా అందుకేనేమో అధికారులు తనకు సరైన గౌరవం ఇవ్వటం లేదంటూ రోజూ ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ వారిని దూరం చేసుకుంటూ వుంటారు. సహజంగా భిన్నధృవాలు ఆకర్షించుకోవాలి. ఎంతైనా అరాచకీయం కదా. ఈ భిన్నధృవాలు రెండు వికర్షించుకుంటున్నాయి. ఆ వికర్షణ ఎంత బలంగా వుందంటే దగ్గరకు చేరితే ఫెటేల్మని పేలేటంత. ఈ నేపథ్యంలోనే డిసిసిబి ఎన్నికలు రావటం, యలమంచలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు నేరుగా బాలరాజును ఛీకొట్టడం జరిగింది. కన్నబాబురాజుపై ఎన్ని అవినీతిమరకలు వున్నా నిస్సిగ్గుగా వెనకేసుకు వచ్చిన మంత్రి గంటాకు ఏం లాభం ఒనగూడిందన్నది బయటపడేందుకు ఎక్కువ కాలమేమీ పట్టదు. అయితే అరాచకీయ క్రీడలో  పైచేయి సాధించిన గంటా, కన్నబాబు ద్వయంపై మంత్రి బాలరాజు కారాలూ మిరియాలూ నూరుతూనే వున్నారు. ఇప్పుడు ఆయనకు వాటిని వారిచేత తాగించటం ఎట్టానో తెలియాలి అంతే. వీరిద్దరి మధ్యా తగవులో జిల్లా ప్రజాప్రతినిథులు నిట్టనిలువునా చీలిపోయారు. బహుశా ఆ కోవలోకి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ధర్మాన కూడా చేరినట్లే కనిపిస్తోంది. బొత్సను దూరం చేసుకున్న గంటా వర్గం వ్యూహాత్మకంగానే మంత్రి ధర్మానతో అంటకాగుతోందని కాంగ్రెస్ రాజకీయాలను అవపోసన పట్టిన సీనియర్లు గుసగుసలాడుతున్నారు. ఎట్టాగూ రేపటి ఎన్నికలలో గెలిచేనా చచ్చేనా అనుకుంటున్న తటస్థులు మాత్రం వినోదం చూస్తూ కూర్చున్నారు. 
ఇక తెలుగుదేశం పార్టీ. గత వైభవాన్ని తిరిగి సాధించుకోవటానికి అధినేత పడుతున్న పాట్లను సర్కస్ ఫీట్లు అనుకున్నారో ఏమో కానీ ఈ జిల్లాలో ఆ పార్టీ నేతలు ఏనాడూ సీరియస్ గా ప్రజా సమస్యలపై స్పందిచి ఆందోళనలు చేసిన పాపానపోలేదు. పార్టీ అనేక సార్లు ఇచ్చిన రాష్ట్ర వ్యాపిత పిలుపులకు మొక్కుబడి స్పందనతో మమ అనిపించటమే వీరికి తెలిసింది. చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యన్నారాయణ మూర్తి ... ఒకరు ఉప్పైతే మరొకరు నిప్పు. ఒకరు వచ్చిన ఉద్యమంలో మరొకరు కనిపించరు. అయ్యన్నను నమ్మకున్న నాయకులు, కార్యకర్తలు బండారు జోలికే పోరు. వీరిమధ్య అంతటి శత్రుత్వం నెలకొనటానికి కారణలేమిటన్నది ఆ పార్టీ కేడర్ కే ఇప్పటి వరకూ అర్థంకాలేదు. ఇక బయటవాళ్ళకెందుకు చెప్పండి. ప్రతీ చిన్నదానికీ రాజీనామా చేస్తానంటూ బెదిరించే అయ్యన్నపాత్రుడు మరోసారి రాజీనామా అస్త్రాన్ని సంధించారు. బండారు సత్యన్నారయణ మూర్తిని అవమానించారంటూ సస్పెండ్ చేసిన పీలా శ్రీనివాస్ కు మద్దతుగా ఆయన తనదైన శైలిలో చకచకా పావులు కదిపారు. జిల్లాలోని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆయన కోటరీలోకి చేరిపోయారు. కోటరీలకు దూరంగా వుండే విశాఖ తూర్పు ఎమ్మెల్యే కూడా కోటరీలో చేరి గ్రూపులు కట్టడం ఆపార్టీలో కొత్తగా ఊపిరిలూదుకుంటున్న కాంగ్రెస్ సంస్కృతికి నిదర్శనం. దీనికితోడు డిసిసిబి ఎన్నికలలో పార్టీ విప్ ను ధిక్కరించి కోట్లాదిరూపాయలకు ఎమ్మెల్యేతో సహా వివిధ సహకార సంఘాల అధ్యక్షులు అమ్ముడుపోవటంతో పరిస్థితి మరింత వికటించింది. అయితే దీనిని రాద్ధాంత స్థాయికి తీసుకువెళ్ళటంలో ఎందుకనో ఒకింత వివేచనాపూరిత సహనాన్ని ప్రదర్శించారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్. జరిగిన విషయాన్ని అధిష్టానానికి నివేదించి తనకుకానీ, తన తండ్రి దాడి వీరభద్రరావుకు కానీ అయ్యన్న వర్గంపై ఎలాంటి వ్యక్తిగత ద్వేషభావమూ లేదని చెప్పకనేచెప్పటానికి ప్రయత్నించారు. ఇన్ని పరిణామాల మధ్య ఏ కోటరీకీ చెందని వ్యక్తిగా, తనకంటూ ఓ శైలి వుందని నిరూపించుకోవటానికి నిరంతరం తాపత్రయపడుతున్న నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ ను అయ్యన్నవర్గం అనుచితరీతిలో దూరంగా పెట్టింది. ఒకటి రెండు సార్లు కలుపుకుపోవటానికి ప్రయత్నించిన వాసుపల్లి తన అహాన్ని చంపుకోవటానికి ఏమాత్రం సిద్ధపడకపోవటంతో సమస్య మరింత జఠిలమయ్యింది. దీనితో జిల్లా, నగర టిడిపి ప్రజాప్రతినిథి శ్రేణులు దాదాపుగా నిర్వీర్యమైపోయాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే పోయే వాళ్ళు పొండి అంటూ అధినేత ప్రకటిస్తారన్న వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యే వెలగపూడి రంగంలోకి దిగారు. అయ్యన్నను, మిగిలిన ఎమ్మెల్యేలను చంద్రబాబు వద్దకు నడిపించారు. చివరికి అయ్యన్న చేత పార్టీలోనే కొనసాగుతానని, త్రిసభ్య కమిటీ నిర్ణయానికి కట్టుబడి వుంటానని ప్రకటన ఇప్పించారు. దీనితో అంతా సద్దుమణిగినట్టే కనిపిస్తున్నా రెండు వర్గాలనూ కలుపుతూ వేసిన అతుకు ఏ క్షణమైనా ఊడిపోయి మరింత దూరమయ్యే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ గొడవలతో జిల్లాలో పార్టీ కార్యకర్తలు పూర్తిగా నిరాశానిస్పృలకు గురయ్యారు. 
ఇకపోతే వైఎస్సార్ సిపి. ఆది నుంచీ ఈ జిల్లాలో కొణతాల రామకృష్ణ, సబ్బం హరి వర్గాలుగా పార్టీ చీలిపోయే వుంది. నగరంతోపాటు జిల్లాలో పలు ప్రాంతాలలో పట్టుకోసం అటు కొణతాల, ఇటు సబ్బం వర్గాలు హోరాహోరీ ప్రయత్నాలు చేస్తూనే వున్నాయి. ఆయా నియోజకవర్గాలలో ఆధిపత్యం కోసం కుస్తీపట్లు పడుతూ నే టిక్కెట్లు తెచ్చుకోవటానికీ తంటాలు పడుతూనే వున్నారు. అయితే ఇప్పటికే ఆయా నియోజకవర్గాలలో సీట్లను ఎవరికి ఇవ్వాలన్న విషయంపై ఆ పార్టీ అధినాయ కుడు ఒక స్పష్టతకు వచ్చినట్లు చెపుతున్నారు. జిల్లాలో ఒక్క పశ్చిమ నియోజకవర్గం తప్ప మరేసీటూ ఖాళీలేదని ఆ పార్టీ వర్గాలే చెపుతున్నాయి. విశాఖ ఎంపీగా పార్టీ అధినాయక కుటుంబం నుంచి ఒకరిని నిలబెట్టాలని భావిస్తోందని వస్తున్న వార్తలపై ఆ పార్టీ ముభావంగానే వుంటోంది. ఆశావహులు మాత్రం ''అన్నీ పార్టీల తీరూ ఒక్కటే... బయటివాళ్ళనే అందలం ఎక్కిస్తారు'' అంటూ ఒకింత నిస్సహాయాగ్రంతో నిట్టూరుస్తున్నారు. ఎవరికి ఏ సీటన్న విషయాన్ని పక్కనపెడితే పార్టీ పరిశీలకులుగా నగరంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి సుజయ రంగరావు, ప్రసాదరాజులకు పెద్ద షాకిచ్చారు ఈ జిల్లా నేతలు. పనిచేసే వాడు ఎవ్వడో తెలుసుకుని పదవులు ఇవ్వండంటూ గండి బాబ్జీ తెగేసి చెప్పారు. నగర అధ్యక్షుడికి ప్రాధాన్యమివ్వకపోవటంపై ఒక వర్గం ఫిర్యాదు చేస్తే మరో వర్గం అసలు గుర్తించాల్సిన అవసరమే లేదంటూ తెంపరితనంతో తెగేసి చెప్పింది. అక్కడితో ఆగకుండా సమావేశాన్ని బాయ్ కాట్ చేసింది. దీనితో ఆధిపత్య పోరు ఈ పార్టీలోమరో సారి బహిర్గతమయ్యింది. ఎవరెంత జట్లు ముడేసుకున్నా జనం జగన్ వెంటేనంటూ డప్పుకొట్టిన వీరికి సహకార ఎన్నికలు ఎంతో కొంత నష్టం చేశాయి. కాదని బుకాయిస్తున్న ఆ పార్టీ నేతలు స్థానిక ఎన్నికలలో సత్తాచూపించటానికి సిద్ధమవుతున్నారు. 

ఏ పార్టీ అయినా ఒక్కటే. నాయకులంతా మూసలే. ఎవరు వచ్చినా ఒరగబెట్టేది, జీవితాలను మార్చేది ఏముంది అనుకుంటున్న మధ్యతరగతి జీవి మాత్రం జరుగుతున్న పరిణామాలను మౌనంగా చూస్తున్నాడు. ఈ మౌనం విస్ఫోటించి ఎవరిని గెలిపిస్తుందో అన్న ఆలోచన కార్యకర్తలను వేధిస్తున్నంత బలంగా నాయకు లకు లేకపోవటమే ఇక్కడి విషాదం.

కామెంట్‌లు లేవు: