22, జనవరి 2016, శుక్రవారం

తత్వం తలకెక్కిందా?!

మారిపోతుందోయ్రా జకీయం మారిపోతోందోయ్... మహానుభావా సమించేయండి. మీ మాటను ఆడేసుకుంతు న్నను... అదేనండీ వాడేసుకుంతున్నాను, చిన్న మార్పు చేసి. ఇదైతే ఏగంగా బుర్రకెక్కుదని నాకెలిగిందంతే. ఎహే... ఈడతో ఇదొదిలేయండే. రాద్ధాంతం సేయాల్సిన ఇసయాలు మా జిల్లాలో బోలెడు జరిగిపోనాయి. అన్నీ అడక్కండి, ఒకటో రెండో సెపుతాన్లే...
మొన్నామద్దిన మా మంత్రిగోరి అబ్బాయి ఇవాహం, అబ్బో సాన గొప్పగా సేసీసినాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు గోరు, గవర్నర్ గోరూ... గంటాతో జోడున్నోళ్లంతా మా ఇసాకపట్నం వచ్చేశారు. ఒకటా? రెండా? లెక్కేయలేక సాలొచ్చీసినాది. ఈడో మీటింగు, ఆడో మీటింగని పరుగులెట్టీసినారు అధికారులు. ఇక ఖాకోడి పనైతే సెప్పన
క్కర్నేదు. ఎట్టుకోవద్దురా బాబూ అన్నా ఇనకుండా ఎర్రదో, బులుగుదో బుగ్గొకటెట్టేసుకుని బయలెల్లిన పెతీ కారుకీ ముందు కుయ్యో, కుయ్యో మంటూ పరుగులెట్టీసినారు. పెళ్ళికొచ్చామా... తిన్నామా... ఎల్లామా అన్నట్టుంటే సెప్పుకునేదేటుంటుంది. గంటోళ్ళింట్లో పెళ్ళికొచ్చీసిన పెతీ మంత్రిగోరూ సమీచ్చల పేరుతో  సేసీసిన హడావుడి అంతా ఇంతా కాదు. తనఖీల పేరుతో పెట్టిన పరుగులు సెప్పనక్కర్లేదు. స్వామి కార్యం, స్వకార్యం చూసుకున్నార్లే అని సరిపెట్టుకుందామనే అనుకున్నా... ఎదవలకి పనా పాటా... ఉదయాన్నే నిద్దరట్టక లేచొచ్చి ఆ గట్టుమీద కూర్చుని ఇదే వాగుడు. అక్కడ తింటానికొచ్చి ఇక్కడ మా నెత్తిన ఖర్చు రాసేశారు... ఇదేమిన్యాయం? అని. ఇదంతా నిజవే?! ఏవో... స.హ.చ. కార్యకర్తలకు అంత తీరికెక్కడుటుంది? పైగా దీనితో పెద్దగా ఒరిగే పెయోజనం మాత్రం ఏటుంటుంది? ఇంత కడుపుమంట నీకెందుకనేగా సివరికి మీరడిగేదీ... వత్తున్నా... వత్తున్నా... ఆడకే వత్తున్నా... నా జోడి ఓ ఇద్దరున్నారు. కలెట్టరాఫీసులో పనిసేసేవోడొకడు, పోలీసోడు మరోడు. వచ్చినాళ్ళను సవరదీయటంతో పులుసుకారిపోయి, ఇంటికెల్లి జావగారిన మోఖాలతో జారగిలపడ్డారు. మా మంత్రిగారబ్బాయి పెళ్ళి, ఎల్లొద్దామే అని ఇంట్లో సెప్పిన మాట అటకెక్కటంతో పెళ్ళాలు ముద్దెట్టలేదు. మరి కడుపు కాలదా. ఆల్లు చించుకుంటే నా కాళ్ళమీద పడింది.
ఎర్రనక్షత్రం... అదేనండీ పేదోళ్ళు, ఆళ్ళ బాధలు... ఏదన్నా సేత్తే బావుండు... కాని నా దగ్గర అంత డబ్బులు లేవు... అంటూ అరుంధతీ నక్షత్రంలా కనిపిస్తూంటాడే... ఆయనేనండీ పవన్ బాబు. మా బాబు సానా మంచోడు. గిరిజనుల గురించి ఆల్లూ ఈల్లూ మాట్టాడకుండా ఒల్లకుండిపోతే ఈ బాబే ఏకంగా సిఎంనే నిలేశాడు. ఒక్కడే వున్న జనసేనలోకి జనాన్ని ఎప్పుడు పోగేస్తాడో ఏమో కాని... కుసింత ఇసయం వున్నట్టే కనిపిస్తున్నాడు. ఏదైనా గుప్పెట తెరిస్తేగా తెలిసేది. నిజమేలే. అమరావతి భూముల వద్ద ఆరంభమైన ఈ పవనం అలా బాక్సైట్ మీదుగా ఉద్దానం కిడ్నీ రోగుల వద్దకు ఎల్తుందని ఏడేడి టీ తాగుతూంటే ఓ మాటొగ్గేసాడు మా బాహుబలి. ఆ మాట జాగ్రత్తగా సెవినేసుకుని వచ్చానో లేదో... కళ్యాణుడు, చంద్రుడితో బాక్సైట్ పై మాట్లాడాడంటూ బ్రేకింగు బద్దలైపోయింది. రేపో మాపో అడవి మీదుగా పవనుడు సాగే అవకాశాలున్నాయన్న వార్తలు గాలివాటంగా వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఇప్పటికే బాక్సైట్ వ్యవహారంలో గిరిజనుల దృష్టిలో పలచబడిన అధికార పక్షం మరింత బలహీనపడే అవకాశాలున్నాయన్న భయం పసుపుతమ్ముళ్ళల్లో బలంగానే వుంది.

దేవుడోటి తలస్తే... మనిషి మరోటి తలుస్తాడు... కొద్దిగా అటూ ఇటూ తిప్పి ఇక్కడ ఏసుకుందామే. కొద్ది రోజుల క్రితం గవర్నమెంటోరు ఓ ప్రకటన జారీ చేశారు. ఇళ్ళు లేని నిరుపేదలు, పొట్టచేతపట్టుకుని పనికోసం పట్టణమొచ్చిన కార్మికులు అక్కడా, ఇక్కడా ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నారని గుర్తించామనీ, వారిని ఉద్ధరించటానికే మేం వున్నామని  సదరు ఏలిన వారు ఉదారంగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 60చ.గ.ల. లోపు ఆక్రమించుకున్న వారి స్థలాలను క్రమబద్ధీకరిస్తామని, దరఖాస్తు చేసుకోవాలని వారు ప్రకటించారు. ప్రకటన వచ్చిన రోజు నుంచి ఈ నెల నాల్గవ తేదీ వరకూ విశాఖ జిల్లాలో 25వేల దరఖాస్తులు వచ్చాయని మంత్రి గంటా శ్రీనివాసరావు గొట్టాల ముందు ప్రకటించారు. అక్కడితో ఆయన ఆగిపోలేదండోయ్. మొత్తం మీద 60 నుంచి 65వేల దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నామని కూడా సెప్పేశారు. పేదల గురించి మంత్రిగోరికి కాక ఎవరికి తెలుస్తుందంటా? అని సరిపెట్టుకుందామనే అనుకున్నారు అంతా. ఓ చిన్నచిక్కచిపడిందిక్కడే. ఆ మద్దిన మంగమారి పేటలో యథేచ్ఛగా భూములు ఆక్రమించేస్తున్నారనీ, వారి వెనుక కీలకమైన మనిషిగా అధికార పార్టీలో సదరు నియోజకవర్గంలో వెలగబెడుతున్న  ఓ మనీషి వున్నారని వార్తలొచ్చేశాయి. అంతే, అప్పటి వరకూ చూసీచూడనట్లూరుకున్న రెవెన్యూవోల్లు, ఖాకీలను వెంటేసుకుని ఆక్రమణలను కూల్చేశారు. అంతా సద్దుమణిగిందిలే అనుకున్న తరుణంలో ఓ 100మందిని వెంటనేసుకుని పసుపుచొక్కాలు సర్కారీ గృహానికి వచ్చాయి. బయటచొక్కాలందరికీ పెద్దోడిగా వున్న ఓ పసుపు ఖద్దరు పసుపు నేత రెండుమూడు సార్లు మంత్రిగారి వద్దకు వెళ్ళొచ్చారు. ప్రకటన చేసిన మంత్రిగారు బయటకు వచ్చి తాజా ఆక్రమణలను క్రమబద్దీకరించమంటూ వచ్చిన వినతులను సహజాతమైన నవ్వుతూ విని బయలుదేరెళ్ళిపోయారు. అంతా జగన్నాటకం. సూత్రధారులెవ్వరు? పాత్రధారులెవ్వరు? పచ్చనోట్ల పెరపెరల మత్తు వదిలితే సత్యం నగ్నంగా నర్తిస్తూ కనిపిస్తుంది. భరించటం కొద్దిగా కష్టమే.
మహానుభావుడు... ఏమంటా సనిపోయాడో కాని... ఆయన సెప్పిన నీతి ఇప్పటికీ రాజ్యమేలతా వుంది. ''నీవు బరీగా తిను, ఎదుటోడికి ఎంగిలిచేయి ఇదుల్చు... పదికాలాల పాటు సల్లగా వుంటావు''. నిజమే, ఆకలిగా వున్నోడికి పెట్టిన చేయి పుర్ర చెయ్యా? కుడి సెయ్యా?... సూసేదెవ్వడు? తత్వం తలకెక్కిందా?!

కామెంట్‌లు లేవు: