22, ఫిబ్రవరి 2016, సోమవారం

ఆణిముత్యాలు దొరికేనా!?

రాజకీయ ఆకాంక్షలు, సమైక్యాంధ్ర ఉద్యమాభిలాషల జమిలి నాయకత్వం విశాఖలో ప్రజలను ఉద్యమబాట పట్టిస్తోంది. సీమాంధ్రలలోని మిగిలిన 12 జిల్లాలతో పోలిస్తే విశాఖ ఉద్యమవేడి ప్రదర్శనలో ఒకింత వెనుకబడే వుందన్న భావన నలుగురిలోనూ వుంది. ఆయా జిల్లాలలో మరెక్కడా లేని ప్రత్యేకమైన భౌగోళిక స్వరూపం భౌతికవాస్తవమైతే... ఏకతాటిపై నడిపించగలిగే నాయకత్వలేమి లోపంతో జిల్లాలో ఉద్యమం కొట్టిమిట్టాడుతోంది. ఉన్నంతలో ఉద్యమాన్ని ఓ ఊపు ఊపాలని భావిస్తున్న నాయకులు పలువురు సరికొత్తగా ఉద్యమనేపథ్యంలో తెరమీదకు వచ్చారు. జిల్లాలో పలు రాజకీయ పార్టీలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకత్వ శూన్యతను పూరించే సమర్థలు ఎవ్వరైనా ఆయాకొత్తముఖాలలో కనిపిస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. 
ప్రశాంతతకు నిలయంగా ఘనంగా ప్రకటించుకుంటున్న విశాఖ నగరానికి ఉద్యమ చరిత్రలు కూడా వున్నాయండోయ్. నగరవీథులలో ప్రైవేటు బస్సులు ఇష్టారాజ్యంగా తిరుగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూంటే ఉవ్వెత్తున ఎగిసిపడిన విద్యార్థుల ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చింది. నగరవీథులలో ఆర్టీసీ రథచక్రాలకు మార్గం వేసిన ఆందోళన అది. ఎర్ర జెండాను ఎదకు హత్తుకుని ఆదివాసీల జీవితాలలో వెలుగులు నింపటానికంటూ సాగిన నక్సల్స్ ఉద్యమానికి నీడనిచ్చింది విశాఖ ఏజెన్సీనే. అనేకానేక చారిత్రాత్మక కార్మిక పోరాటాల చారిత్రిక నేపథ్యం విశాఖ స్వంతం. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు నినాదంతో దద్ధరిల్లిన ఈ గడపకు ఉద్యమస్ఫూర్తిని నేర్పాల్సిన అవసరం వుందా?!. నిరంతరాయంగా ఉపాథి కోసమో, నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసమో సాగే చిన్నాచితకా పోరాటాలు వుండనే వున్నాయి. తోడుగా సరికొత్తగా ఎగసిపడుతున్న సమైక్య ఉద్యమాలు. సకలజనులను ఉద్యమబాటలోకి ఇముడ్చుకుంటూ సాగుతున్న పోరుహోరు. విద్యార్థులు, ఉద్యోగులు, భిన్న సామాజిక వర్గాల ప్రజలు... ఒక్కొక్కరూ ఒక్కోనాయకత్వపు నీడన... నగరంలో, జిల్లాలోనూ నిత్యం ఏదో ఒక మూల... మీడియాల రాకతో సంబంధమే లేదన్నట్లుగా  ఉద్యమ ప్రవాహ ఉధృతి సాగిపోతూనే వుంది. రాష్ట్ర విభజనపై  అప్పుడు ఇప్పుడు  మొదటిగా  స్పందించింది విశాఖ నగరమే.  ఉద్యమానికి ఆజ్యం పోసేది ఆంధ్రయూనివర్శిటీయే.. 2009 నుంచి ఇప్పటి వరకూ సమైక్యరాగం ఆలపించిన నగరం విశాఖే అంటే అతిశయోక్తేమీ కాదు.
సమైక్యాంధ్ర ఉద్యమంతో 2009 నుంచి నిరంతరాయంగా కనిపిస్తూ వచ్చిన వారిలో ఆడారి కిషోర్ కుమార్ ఒకరు. సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసీ నేతగా మొన్నటి వరకూ రాష్ట్రాన్ని చుట్టిన కిషోర్ అనకాపల్లి వాస్తవ్యుడు. సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థి నేతగా, తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన చరిత్ర వుంది. విశ్రాంత విద్యార్థివంటూ పలువురు గుర్తు చేయటంతో యువజన జెఎసీ పేరుతో సమైక్య ఉద్యమరంగంలో కొనసాగుతున్నాడు. గడచిన ఎమ్మెల్సీ ఎన్నికలలో  'దేశం' రెబల్ గా పోటిచేసే ప్రయత్నం చేశాడు. అందరితో సత్ సంబంధాలను కొనసాగిస్తూ, ఆయా సంఘాల బలాన్ని తన బలంగా ఊహించుకుంటూ వుంటాడు. పిలవని పేరాంటాలకు సైతం వెళ్లీ పోటోలకు ఫోజులిస్తుంటాడని గిట్టనివాళ్లంటారు.   కుసింత పిక్కలు వెనకేసుకున్న ఆడారి అనకాపల్లి భోగీ ఎక్కి పసుపుకండువాతో అసెంబ్లీ గడపతొక్కాలని ఆశపడుతున్నాడు. తానుపుట్టిన గవరకులం తనకు వెన్నంటి వుంటుందన్న కొండంత నమ్మకంకు సమైక్య ఉద్యమపాపులారిటీ, నాలుగుమాటలు ఉద్దేశ్యపూర్వక ఆవేశంతో మాట్లాడగలిగే లాఘవం అక్కరకొస్తాయన్నది మావాడి ఆలోచనంటూ అయినవారు చెపుతూంటారు.
కిషోర్ కు పోటీగా విద్యార్థి జెఎసీ పెట్టి ఇప్పటికీ విద్యార్థులమే కాబట్టి మేమే అసలు సమైక్య విద్యార్థి ఉద్యమకారులమంటూ ముందుకు వచ్చిన ముగ్గురిలో ఆరేటి మహేష్ ఒకరు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ చైర్మన్ గా ప్రకటించుకున్న ఈయన మాట్లాడినప్పుడల్లా 14 యూనివర్శిటీల విద్యార్థులమంటూ చెపుతూంటే సహచరులే నోరు తెరిచి మనోడు భలే మాటకారే అంటూ ఎటకారమాడుతూంటారు. 2009 డిసెంబర్ లో రాష్ట్ర విభజన ప్రకటన రాగానే ఏయూలో విద్యార్థులను కదిలించింది మావోడు కాదేటి అంటూ మరికొందరు వెనకేసుకొస్తూంటారు. అప్పటి నుంచి ఇప్పటికి కాలందేకేటప్పటికి మనోడు ఒంటరయ్యాడు. నమ్మకం స్థానాన్ని అపనమ్మకం మింగేసింది. రాజకీయాలపట్ల ఆసక్తి వున్నా ముందుకు వెళ్ళే శక్తిలేక ఇలా తీర్చుకుంటున్నాడని వారువీరూ అనేమాట. మరో విద్యార్థి జేఏసీ నేత లగుడు గోవింద్. గతంలో పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీగా పోటీచేసి చేతులుకాల్చుకున్నాడు. రాజకీయాలంటే ఉత్సుకత వున్నా అందుకు అవసరమైన ప్రణాళికాబద్ధ కృషి, నిబద్ధతా పూర్తిగా లేవని వెనకనుంచే నిజాలను రాళ్ళలా విసిరేస్తున్నారు. మరో విద్యార్థి నేత కాంతరావు. వైసిపి విద్యార్థి విభాగంలో వుంటున్నానని చెప్పుకుంటాడు. జగనిజాన్ని తలకెక్కించుకున్న కాంతారావు భవిష్యత్తుపట్ల కుసింత బెంగగానే వున్నట్లు కనిపిస్తాడు. వీరు ముగ్గురూ కలిశారంటే ఓ ప్రెస్ మీట్, కాకుంటే పోస్టర్ రిలీజ్. తప్పనిసరిగా కనీసం 10మందినైనా వుంచుకోండయ్యా అంటూ మీడియావాళ్ళు చేసే గొడవ భరించలేక నానాతిప్పలూ పడుతున్నారు. 
ఏపిఎన్జీవోల జెఎసీ, ఆర్టీసీ కార్మికుల జెఎసీ, విద్యుత్ ఉద్యోగుల జెఎసీ, జీవియంసీ కార్మికుల ఉద్యోగుల జెఎసీ, రెవెన్యూ ఉద్యోగుల జెఎసీ, వాణిజ్యపన్నులశాఖ ఇలా పోతే శాఖకొక జెఎసీ ఏర్పాటయ్యింది. ఎవరికివారే శక్తి వంచన లేకుండా కృషి చేస్తూనే వున్నారు. ఏపిఏన్జీవోల జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈశ్వరరావు  కెజిహెచ్ లో సినియర్ ఆస్టెంట్ గా పనిచేస్తున్నారు. గతంలో రాజకీయపార్టీలతో పెద్దగా సంబంధాలు లేవు. ఆయన పిలుపునందుకుని ఎపిఎన్జీవోల వరకూ కదిలే పరిస్థితి.  రెవెన్యూ అసోసియేషన్ నాయకుడైన నాగేశ్వరరెడ్డి నాయకత్వపటిమ కలవారే. ఎపీ ఎన్జీవోల సంఘంలో వున్నప్పుడు పలు పదవులను అలంకరించిన ఈయన ప్రస్తుతానికి జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షునిగా, రాష్ట్ర కమిటీలో కీలకబాధ్యతలలోనూ వున్నారు. కలెక్టరాఫీసులో పాలనాధికారిగా పనిచేస్తున్నారు. ముక్కుసూటిగా వెళ్ళే మా రెడ్డికి రాజకీయాలు నప్పవు, అసలాయనకు అలాంటి ఆలోచనకూడా లేదంటూ సహచరులే కొట్టిపారేస్తూంటారు. సమైక్యాంధ్ర సాగర లక్షగళ గర్జనలో ఆవేశంగా ఉరిమిన  ఆర్డీవో  వెంకటేశ్వరరావు  స్టేట్  డిప్యూటి కలెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా  పనిచేస్తున్నారు. రాజకీయాలంటే తనకు బొత్తిగా పడదనీ, మనిషిగా పుట్టిన తరువాత పరోపకారార్థం వెధవ శరీరం అన్ననానుడిని నమ్మాలి కదా అంటూంటారు. 
విద్యుత్ ఉద్యోగుల సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పోలాకి శ్రీనివాస రావు తరుచూ ఉద్యమవార్తల్లో కనిపిస్తున్న వ్యక్తి. ఈపిడిసియల్ విశాఖవాణిజ్యవిభాగంలో ఎడిఇగా పనిచేస్తున్నారు. విద్యుత్ ఇంజనీర్ల సంఘం ప్రతినిధిగా, విద్యుత్ ఉద్యోగులు బీసి సంఘం  అధ్యక్షునిగా ఇలా పలు పదవులను నిర్వహించిన వాడు. రాజకీయాలపట్ల ఆసక్తి. ప్రజారాజ్యం పెట్టిన కొత్తల్లో చేరిపోదామనుకుని గుమ్మందాకా వెళ్ళి వెనక్కి వచ్చాడు మా పోలాకి అంటూ అనుచరులు పరాచకాలాడతూంటారు. ఉద్యమ నేపథ్యాన్ని ఉపయోగించుకుని రాజకీయాలలోకి వెళితే అన్న ఆలోచన లేశమాత్రంగా వున్నా లక్కు కలిసిరావాల్లే అంటూ వేదాంతం చెప్పే హితులూ వున్నారు. జీవీఎంసీ కార్మికుల సంఘం నేత ఆనందరావును ముందుకు నెట్టి ఘనంగా సమైక్య శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించి ఆటలవీరుడు శ్రీనివాస్ అవకాశం కోసం చూస్తున్నాడు. కులం, ధనం కలిసి తనను ఏదో ఒక పదవిలో కూర్చోబెడతాయని ఆయన నమ్మకం. అందరితో కలిసిపోయి తలలో నాలుకలా మెలిగే శ్రీనుకేం తక్కువ అంటూ సమర్థించే వారూ ఎక్కువే. మొదటి నుంచి సమైక్య ఉద్యమ నినాదంతో బస్సు యాత్రలనీ, విలేఖరుల సమావేశాలనీ హడావిడి చేసిన నగర స్థాయి కాంగ్రెస్ నాయకుడు జీ.ఏ.నారాయణరావు. గ్రాండ్ గా గంటా ప్రవేశాన్ని ప్రకటించి ఉద్యమం నుంచి హఠాత్తుగా మాయమైపోయాడు. ఇక నాన్ పొలిటికల్ జెఎసీ ఛైర్మన్ బాలమోహన్ దాసు. మంత్రి గంటా వేసిన రూట్ మాప్ ని అనుసరించటం తప్ప పెద్దగా నాయకత్వపు లక్షణాలేలేని వివాదరహిత వ్యక్తి అన్నది జనాభిప్రాయం. నా రూటే సెపరేటు అన్న స్టైల్ లో  ఎవరున్న లేకున్నా.  ఎవరు వచ్చినా రాకున్నా .. ఏక్ నిరంజన్  ఉద్యమాలకు ఫ్యామస్.. సమైఖ్యాంధ్ర పోలిటికల్ జేఏసీ నేత జెటి రామారావు. ఢీఫరెంట్ ప్రెజెంటేషన్స్ చేస్తూ మీడియా ఏటెంక్షన్ ను తెప్పించుకొగలుగుతున్నాడే గానీ, నాయకుడు అనడానికి కూడా ఛాన్సే లేదంటారు సాగరతీరవాసులు.
పైన కరిమబ్బు కరుగుతూంటే నేలపై వాగులూ వంకలూ బుసబుసా పొంగిపొరులుతూంటాయి. ఆకాశం తేటబారిన మరుక్షణం ఆనవాళ్ళు మాత్రమే మిగిల్చి కనిపించకుండా పోతాయి. ఎవరు కర్త? ఎవరు కర్మ? ఇదో భావావేశం. భావోద్వేగం. అందుకనే పదండిముందుకు పదండి తోసుకు అంటూ వడివడిగా సాగుతున్నారు. కదిలివస్తున్నోళ్ళను అక్కడికక్కడ కూడేసే మెరుపులు తాత్కాలికమే. శాశ్వతమైన ఆణిముత్యాలు దొరుకుతాయా లేదా అన్నది కాలమే తేల్చాలి.

కామెంట్‌లు లేవు: