19, జులై 2016, మంగళవారం

మన్నించండి

ఓ నాలుగు ముక్కలు నా గురించి నేను మాట్లాడుకోవలసిన సందర్భమనిపించింది. ఓ పెద్దాయన నన్ను చాలా గౌరవంగా మొక్కలు నాటే కార్యక్రమానికి పిలిచారు. నేను చాలా నిజాయితీగా వున్నానని ఆయన నమ్మినట్లే కనిపించారు. నాపై ఆయన చూపించిన అభిమానానికి నేను తగనని గాఢంగా భావించాను. మరో సారి నాలోకి నేను తొంగి చూసుకోవాలనుకున్నాను. ఎరుపుతగ్గి నలుపెంత పెరిగిందో చూసుకుని గుండె దిటవు చేసుకుని బతికే వుండాలని ముందుగానే గాఢంగా వాంఛిస్తున్నా. నా కోసమే నేను బతకాలనుకుంటున్నా. మృత్యువును హత్తుకునేటంత ధైర్యం బలుపెక్కలేదింకా. 
హిపోక్రసీ గురించి నేను రాసుకున్న రాతలు ఇంకా గుర్తే వున్నాయి. నాకు తోచిందేదో చెయ్యటమే తప్ప... తప్పుప్పొలు లెక్కలు పెద్దగా వేయని రోజులు నాకింకా జ్ఞాపకమున్నాయి. తక్కువ చేస్తారని తెలిసీ అనుకున్నదేదో ముఖాన్నే ఉమ్మేసిన క్షణాలూ పదిలమే. వచ్చిన మార్కులకు నాన్న పేరుచెప్పుకోకుండా సీటురాదని నమ్మి చచ్చినా నాన్న కాలేజీలో చేరనని భీష్మించుకున్న నాటి పిచ్చిదినాలు ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే వున్నాయి. నడిరోడ్డుపై పులిహోర పొట్లాలను చూపించి బాంబులంటూ లాఠీ ఎత్తి అడ్డూఆపు లేకుండా గొడ్డును బాదినట్లు బాదుతూంటే చేతిలోని ఎర్రటి జెండా పడేయటమంటే మోకాళ్ళపై మోకరిల్లటమేనన్న పిచ్చి భ్రమతో తట్లు తేలిన ఒంటితో జైలుకెళ్ళిన అమాయకపు రోజులు ఎలా మరిచిపోతాను. 
ఇప్పుడు నేను అంత అమాయకంగా, పిచ్చిగా ఏమీ లేను. నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. కడుపు పదిలంగా వుండాలన్న కాంక్షతో చూసినవి వదిలేస్తూ, చూడనవి రాసేస్తూ నిబ్బరంగా వున్నానంటూ రంకెలేస్తుంటాను. దేశాన్ని నేనొక్కడినే ఉద్ధరిస్తున్నానంటూ పనుల కోసం కందకుండా వెళ్ళగలిగే సౌకర్యాల కోసం వెంపర్లాడుతూంటాను. నా కోసమో... కాకుంటే కుటుంబం కోసమో... ఏడాదికొక్కసారి ప్రకటనలు వేస్తే వచ్చే కమీషన్ల కోసం కక్కుర్తి పడుతూనే వుంటాను. వెయ్యనంటే ఉద్యోగం కూడా వుండదనే భయాన్ని ముందుకు నెడతాను. 
జీవితమంతా రెండే జతలతో గడిపేసిన మా మావయ్యలా నేనుండలేను. ఏడు పదుల వయస్సు దాటినా, శరీరం నడవటానికి కూడా సహకరించకపోయినా, మానస్సు పెడుతున్న పరుగును అందుకోవటానికి స్లీపర్ క్లాసులో దేశాన్ని ఇప్పటికీ చుడుతూనే వున్న నాన్నలా నేను సాగలేను. ఆరోగ్యం కోసం పైసా ఖర్చు చేయటానికి పదిసార్లు ఆలోచించే నాన్న తన పెన్షన్ లో సగంపైగా సొమ్మును నమ్మిన ఉద్యమావసరాలకే ఖర్చు చేస్తూ... తక్కువ చేస్తున్నానుకుంటూ నిత్యం పడే వేదన నా వల్ల కానే కాదు. అవసరమైతే మరో పది ఎక్కువ వస్తే బాగుండు అనే అనుకుంటాను. వీళ్ళివ్వరింతే అంటూ నిష్టూరమూ ఆడుతాను. సహచరులంతా ఏదో తేడాగున్నాడే అంటున్నా... మనం చేసే పనికి ఈ జీతమే ఎక్కువ అంటూ ఉలిపికట్టెలా నాన్న అన్న రోజులు మొన్నన్నే అన్నట్లే వున్నాయి. నేను అలా ఎలా వుండగలను. 
అందుకునే అంటున్నా. నేనేమీ నిజాయితీగా లేను. వుండాలనీ అనుకోవటం లేదు. వుండటం సాధ్యం అన్న భ్రమల్లోనూ బతకటం లేదు. అందుకే నేను మాట్లాడటం మానేశాను. మాట్లాడేటప్పుడు తరిచిచూసుకుంటున్నాను. మరోసారి చెపుతున్నా... మీ అభిమానానికి నేను పాత్రుడిని కాలేను. మన్నించండి. 

కామెంట్‌లు లేవు: