15, జులై 2016, శుక్రవారం

ఎండమావులే ఒయాసిస్సులు

మనిషి ఎంత ఆశాజీవి. ఎడారిలో ఎండమావిని చూసీ ఒయాసిస్సు అన్న భ్రమతో పరుగులు పెడతాడు. ఆశ నిరాశ కాకూడదని వేయి దేవుళ్ళకు మొక్కుకుంటాడు. ఇప్పుడు విశాఖ వాసీ చేస్తున్నదదే. పోలీస్ యంత్రాంగం కూసాలను కుదుపుతున్న వరుస ఘటనలు నిజం కావాలని, స్మార్ట్ సిటీ నిజార్థంలో వెలుగొందాలనీ గాఢంగా ఆకాంక్షిస్తు న్నాడు. ఇది ఖాకీలకే పరిమితం కాకూడదనీ ఆశిస్తున్నాడు. 
అధికారులు వస్తూంటారు. పోతూంటారు. మొన్నామధ్య ఓ దళిత ప్రజాప్రతినిథి అన్నట్లు ''రాజకీయ నాయకుల విజన్ ను ఆధారం చేసుకుని, నిర్దేశించిన మార్గాన్ని అనుసరించి అధికారులు నడుచుకుంటారు.'' అవును వారు స్వయంప్రతిపత్తితో చేసేది పెద్దగా ఏమీ వుండకపోవచ్చు. తప్పొప్పులకు అధికారులనే పూర్తిగా బాధ్యులను చేయ లేము. వారిని నడిపించాల్సిన రాజకీయ నాయకత్వపు అసమర్థ ధోరణలను దునుమాడటమే మంచిదన్నదీ ఆయన అభిప్రాయం కాకపోవచ్చు. కాని జరగాల్సింది అదేనేమో. ఎంతో మంది పోలీస్, రెవిన్యూ బాస్ ల ఏలుబడిని విశాఖ చూసింది, భరించింది. పరిస్థితులకు అనుగుణంగా కర్రతిప్పుతూ, ప్రజల నమ్మకాన్ని ప్రోది చేసుకున్న అధికారులను మాత్రం ఇప్పుడూ స్మరిస్తూనే వుంది. అధికారం మారినప్పుడల్లా రాజకీయం తన స్వలాభాపేక్షకు అనుగుణంగా అధికారం నడుచుకోవాలనుకుంటుంది. అలా నడుచుకోకపోతే తన సార్వభౌమాధికార ప్రకటనకు భంగంవాటిల్లినట్లేనని భ్రమిస్తుంది. కట్టను తెగ్గొట్టుకున్న వరద గోదారిలా ఆగ్రహం ఏడమ కాలు విదుల్చుతుంది. ఏ అప్రాధ్యాన్య పోస్టుకో బదిలీ బహుమానంగా వస్తుంది. అర్థం కానంత అమాయకుడు అధికారెలా అవుతాడు! రాజకీయం, అధికారం... సమాంతరంగా సాగుతూనే సహకరించుకోవాల్సిన రెండు వ్యవస్థలు. స్వరం మారింది. అధికారంపై స్వారీ చేయటానికి రాజకీయం. అంగీకరించాల్సిందే మరి. అలవాటుపడిపోయాం. అందుకే కోటలు దాటే మాటలు, గడప దాటని చేతలు ఇక్కడ చెల్లుబాటు అవుతాయి. లెక్కల్లో తకరారు... వాస్తవాలను జిలుగుల మాటున కప్పేస్తుంది. నిజాన్ని చూడాలనుకునే పాలకులను తాత్కాలికంగానైనా మభ్యపెట్టేస్తుంది.
పోలీస్ బాస్ గా కొత్తాయన వస్తున్నాడన్న వార్త కొద్ది రోజుల క్రితం వెలుగులోకి వచ్చినప్పుడు ఎవరొస్తారో అనుకు న్నారు. యోగానంద్ అన్న ప్రకటన రాగానే ఖాకీల్లో కొందరు ఉలిక్కిపడ్డారు. మరికొందరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టు కోవాలని నిర్ణయించుకున్నారు. మరికొందరు ఇక్కడ నుంచి పారిపోతే బెటర్ అనుకుని అలవాటైన పైరవీలకు దిగారు. స్వానుభవంలోకి వచ్చే వరకూ జరుగుతున్నదేమిటో అర్థమయ్యిందని ప్రకటించటానికి అంగీకరించలేని జనం ఎప్పటిలా నిశ్శబ్ధంగానే వుండిపోయారు. పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకుని పూర్తిగా రెండు నెలలు కూడా కాలేదు. బాధ్యతారాహిత్యానికి అంతో ఇంతో శిక్షలు వుంటాయన్న సత్యాన్ని ఇప్పుడిప్పుడే విశాఖ పోలీసులు అర్థం చేసుకుంటున్నారు. కొందరు సస్పెన్షన్ తో ఇంటివైపు వెళితే... మరికొందరు విఆర్ పేరుతో బెంచ్ ఎక్కారు. ధ్వజస్థంభాల్లా పాతుకుపోయిన వారు, మాకు స్థాన చలనం వుండదని భ్రమిసిన వారూ ఇప్పుడు సరికొత్తగా అడవి దారులను వెతుక్కుంటున్నారు. సిపి ఇంకా దస్త్రాలను తిరగేస్తూనే వున్నారు. అస్త్రాలకు పదును పెడుతున్నారు. విశాఖ వాసుల ఆశలకు రెక్కలొచ్చాయి. ఆకాంక్షలు ప్రబలమవుతున్నాయి. నైరాశ్యంలోకి జారిపోకుండా వుండటం సాధ్యమేనా? అన్న అనుమానాలూ మరో పక్క తొంగిచూస్తూనే వున్నాయి. అర్థిక నేరగాళ్ళన్న ఆరోపణలు ఎదు ర్కొంటున్న వారితో అంటకాగుతున్న ఖాకీ నేత్రాలున్నాయి. ఏళ్ళ తరబడి పాతుకుపోయిన మినీ బాసులున్నారు. ఆకలేసినప్పుడల్లా తమ పిల్లల్ని తామే తినేసే పాములున్నాయి. ఇప్పుడు వాటిని పట్టుకుంటారా? పట్టుకుని బోనెక్కిస్తారా? ప్రక్షాళన సాధ్యమేనా? మార్పులన్నీ పైపై మెరుగులా? రాజకీయం రంగంటకుండా ఖాకీ దుస్తులను కాపాడుకోవటం సాధ్యమేనా? సవాలక్ష సందేహాలు తొలిచేస్తూంటాయి కుమ్మరి పురుగులా.
వాతావరణం మారుతోంది. వానలొస్తున్నాయి. నిన్నటి వరకూ చంపేసిన ఎండ కొద్దిరోజులు మబ్బుల మాటుకు సాగిపోతుంది. వెన్నంటే అడివిని మలేరియా కాటేస్తుంది. నగరాన్ని డయేరియా వంటి అంటు వ్యాధులో, వైరల్ జ్వరాలో వెన్నాడుతాయి. చక్రంలా ఇది తిరుగుతూనే వుంటుంది. అందరికీ అర్థమవుతుంది. కాపాడాల్సిన చేతులు బద్ధకంగా కదులుతుంటాయి. ముందస్తు చర్యలు కోసం వడివడిగా అడుగులేయాల్సిన పాదాలు కందిపోతాయే మోనన్న ఆలోచనతో అడుగెనక్కు వేస్తుంది. సమీక్షలతో ఏసీ గదులకే పరిమితమవుతుంది. మరణాలు అడవిని దాటి నగరం బాట పడతాయి. గుట్టల్లోని చావులు కొండదిగి కేకపెట్టేసరికి ఆలస్యమవుతుంది. సాంధ్రత తగ్గుతుంది. కదలాల్సిన వాళ్ళు అప్పటికైనా కదిలితేనా? ఈ సారి మృత్యువు నగరం శివారుల్లో నృత్యం చేస్తుంది. నాలుగురోజుల్లో నలుగురు మరణశయ్యపైకి చేరుకుంటారు. అత్యాధునిక చరవాణి చేతిలో వున్న తరువాత అమెరికాలో వున్నా, విశాఖలో వున్నా... తేడా వుండదు. మంత్రి వర్యులు స్పందిస్తారు. పాత్రికేయుల సెల్లుల్లోకి సంక్షిప్త సందేశాలు వెల్లువెత్తుతాయి. అవే పత్రికల్లో అక్షరాలై పేలుతాయి... టీవీల్లో స్క్రోలింగులై దొర్లుతాయి. అప్పటి వరకూ బయటకు రాకుండా దాచిపెట్టామని సంబరపడుతున్న అధికారం ఉలిక్కిపడుతుంది. ఈలోగా స్వయంగా వైద్యుడైన శాఖా మాత్యులు మరో సందేశమై కనిపిస్తారు. మళ్ళీ సమీక్ష కోసం శీతల యంత్రం శబ్ధం చేస్తుంది. బిళ్ళ బంట్రోతు అల్పాహారాన్ని సిద్ధం చేస్తాడు. యాక్షనేదంటూ ప్రతిపక్షాలూ, ప్రజాసంఘాలూ గొంతెత్తుతాయి. కౌంటరేయకపోతే ఎట్టా అనుకుంటుందో ఏమో అధికారపక్షం బురదేస్తున్నారంటూ దాడికి దిగుతుంది. బాధను పక్కనపెట్టి బాధితులు, బంధువర్గం అలవాటైనా తమాషాని విషాదంగా చూస్తూ వుండిపోతుంది. 
మరో వైపు ప్రభుత్వం ఎన్ని కంప్యూటర్లు పెట్టినా, సరికొత్త యాప్ లను సెల్ ఫోనుల్లోకి అదే యావతో ఎక్కించేస్తున్నా... మీట నొక్కాల్సిన మనిషి మాత్రం మారకుండా మిగిలే పోతాడు. ఒకరి భూమిపై మరొకరు హక్కు నాదంటూ పోట్లాటకు దిగుతాడు. అధికారం పెద్ద మనిషి పంచాయితీ చేస్తుంది. అందినకాడికి బొక్కేస్తుంది. అడగాలంటే భయం అడ్డుపడుతుంది. భవిష్యత్తులో గుమ్మం ఎక్కటానికి చోటు దొరకదేమోనని సంకోచిస్తుంది. సల్లగా చూస్తాడేమో అని చంద్రంవైపు సంద్రమంత ఆశగా చూస్తోంది వైశాఖి. అసౌకర్యాల లేమితో సాగే సౌఖ్య జీవనమే స్మార్ట్ లక్ష్యమన్న ప్రకటను నిజార్థంలో అనుభవంలోకి తీసుకువచ్చే మరో అధికారిని కూడా వేస్తారేమోనని కళ్ళు విప్పార్చుకుని చూస్తోంది. సముద్రపొడ్డున ఆశ చిరుజ్యోతిలా వెలుగుతోంది... లక్షలాది చేతుల రక్షణ మధ్య.