22, ఫిబ్రవరి 2016, సోమవారం

సమైక్యం కొత్తపోకడలు ఏ దారికి?


 భావోద్వేగాల సందిట రాగద్వేషాలు రెచ్చగొట్టబడుతున్న సందర్భంలో రాష్ర్టంలోని దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలు చిక్కువడివున్నారు. దీనికి ఉత్తరాంధ్ర ప్రజలు మినహాయింపేమీ కాదు. అందుకేనేమో కొద్దిపాటి వివేచన వున్నట్లు కనిపించే నేతలు, మేథావులు ఛీత్కారాలకు గురవుతున్నారు. నోరువిప్పటానికి భయపడుతున్నారు. ఏ రోటికాడ ఆ పాట పడగలిగే సామర్థ్యం వున్న నేతలు మాత్రం దర్జాగా సాగిపోతున్నారు. ఇంతటి భావోద్వేగాలు నడుమా కులాధిపత్య ధోరణులు పచ్చగాసాగుతూ వుండటాన్ని అర్ధం చేసుకోవటం సాధ్యంకాని సామాన్యుడు తనరోజు కూలీలో అధికభాగం రవాణాకే ఖర్చు చేయాల్సి వస్తున్న విషాద సందర్భం మరింకెంత కాలమోనంటూ నిట్టూరుస్తున్నాడు.  


నేటి కాలపు రాజకీయాలకు బొత్తిగా పనికిరాని పెద్దింటి మేథావి దగ్గుపాటి పురంధేశ్వరి. సమైక్య ఉద్యమ నేపథ్యంలో ఏదోటి మాట్లాడి అటు సమైక్యవాదులకో, ఇటు పార్టీ అధిష్ఠానానికో దగ్గరవాళ్ళమనిపించుకుంటున్నామన్న సంతృప్తి తో చాలామంది నేతలు బతికేస్తూంటే ఆవిడ మాత్రం వాటి న్నింటికీ తాను దూరమన్నట్లు ప్రవర్తిస్తున్నారు. సున్నితమైన విషయాలపై బహిరంగంగా వ్యాఖ్యానించటమంటే అగ్నికి ఆజ్యాన్ని తోడివ్వటమేనన్నది చిన్నమ్మ భావిస్తున్నారని ఆమె వర్గీయులు అడిగిన వారికి, అడగని వారికి సర్దిచెప్పుకుంటున్నా... లోపల మాత్రం వెనుకబడిపోతున్నామన్న దిగులు వారిని వేధిస్తోంది. విశాఖ రానంతసేపూ ఏదోలా సర్దిచెప్పేశాం. విదేశీ పర్యటనలలోనో, అధిష్టానాన్ని ఒప్పించే యత్నాలలోనో మేడం బిజీ అంటూ బిల్డప్పులిచ్చాం. విశాఖ నుంచి మరెక్కడికో ఎగిరిపోవటానికి అవసరమైన విమానం గురించి చర్చించటానికి స్టార్ హోటల్ మీటింగ్ కు హఠాత్తుగా నగరానికి రావటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి చెప్మా అంటూ వీరవిథేయులు మల్లగుల్లాలుపడుతున్నారు. ఒచ్చారేపో... ఒక్క మాట కూడా సమైక్యవాదులకు మద్దతుగా మాట్లాడకుండా పోవటమేమిటా అంటూ చేతులు పిసుక్కుంటున్నారు. స్టార్ హోటల్ సమావేశానికి మీడియాకు ఆహ్వానం పంపిన నిర్వాహకులు ఆ తరువాత ఏమనుకున్నారో ఏమో కాని, అనుమతి లేదంటూ మీడియాను బయటకు గెంటేశారు. పాత్రికేయుల నుంచి వచ్చే ప్రశ్నలను తప్పించుకోవటానికి కేంద్రమంత్రే మీడియాను బయటకు నెట్టించారని సహజంగానే వాళ్ళూ వీళ్ళూ చెవులుకొరుకుతున్నారు. ఈ వ్యవహారంతో పురంధేశ్వరి వర్గం మరింత డిఫెన్స్ లో పడిపోయింది. సమైక్యాంధ్ర కోసం ఢిల్లీలో చాలా చేస్తున్నానని చెపుతున్న చిన్నమ్మ ఇక్కడ ఏదో ఒక శిబిరం వద్దకు వెళ్ళి మద్దతు పలికితే బాగుండేది కదా అంటూ నిత్యం ఆమె కోసం కారుల్లో బారులు తీరే వారే బాధపడుతూంటే, ప్రతిపక్షాలు తమ సహజ దుమ్మెత్తిపోత తత్వాన్ని వీడి మౌనముద్ర వహించారు.
రాజ్య సభ సభ్యుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి సమైక్యాంధ్రకు జై అన్నా రాజీనామా చేయనందుకు గో బ్యాక్ నినాదాల మధ్య చిక్కుబడిపోయారు. తానొవ్వక, ఇతరులను నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న పద్యం మాకూ తెలుసు, మీ పప్పులేమీ ఉడకవంటూ ఉద్యమకారులు ఎదురుతిరిగారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకు మాత్రం ఉద్యమకారులు మినహాయింపునిచ్చారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తూ సీఎంకు లేఖనిచ్చానని చెప్పి ఉద్యమాకారుల వెంట జెండా పట్టుకుని సాగిపోవటం ఆయనకు మాత్రమే చెల్లుబాటయ్యింది. రాజీనామా చేసి ఎలాంటి కార్యకలాపాలు చేపట్టటం లేదంటూ చెపుతున్న సదరు మంత్రిగారి వెంట ప్రభుత్వం కేటాయించిన పిఏ యథావిథిగా సాగుతూనే వున్నారు. అధికారులు వచ్చి దండాలు పెడుతూనే వుంటారు. ఏది ఎప్పుడు ప్రారంభించాలో ఆయనే నిర్ణయిస్తారు. ఉద్యమాభిమానిగా వెలుగొందటానికి అధికారాన్ని ఆయన ఉపయోగపెట్టుకున్నంతగా మరెవ్వరూ ఉపయోగించుకోలేదంటే అతిశయోక్తిమీలేదు. ఎలాంటి అనుమతులూ లేకపోయినా జాతీయ రహదారిపక్కనే రాత్రికి రాత్రే ప్లై ఉడ్ బేస్ మెంట్ తో తెలుగుతల్లి విగ్రహాన్ని కార్పొరేషన్ అధికారుల చేత పెట్టించి ప్రారంభించిన ఘనత ఆయనకే చెల్లింది. నాన్ పొలిటికల్ జెఎసీ పేరుతో తన తురుఫు ముక్కలను రంగం మీదకు ప్రవేశపెట్టి పార్టీలకతీతంగా ఉద్యమాకాంక్ష వున్న నేతగా మీడియాకెక్కారు. గవర్నర్ ను కలిసి రాజీనామాను ఆమోదింపచేసుకుని ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని విశాఖలో ప్రకటించిన కొద్దిగంటలకే,  హైదరాబాదులో... సీఎం కిరణ్ రాజీనామా వద్దని బుజ్జగిస్తారు. అంతే మాట తిరగబడుతుంది. సీఎం ప్రేమ ముందు పార్టీకన్నా ప్రజలే మిన్న అన్న మాట వెనకబడుతుంది. గంటా గారి మేనేజ్ మెంట్ టెక్నిక్ తెలియక పాపం తిక్కవరపు గోబ్యాక్ నినాదాల మధ్య చిక్కుబడిపోయారు. 
ఆత్మస్తుతి, పరపార్టీ దూషణ, నిన్నటి వరకూ కనిపించిన రాజకీయ చిత్రం. కొంత ఆత్మనింద, మరింత పరనింద నేటి రాజకీయ సిత్రం. నాయకుల తీరేమేకాని... గతంలో ఎన్నడూ లేనంతాగా ఫ్లెక్సీలు వికృతరూపం దాల్చుతున్నాయి. చూ పులు కలిసిన శుభవేళ అంటూ షర్మిల, చంద్రబాబుల ఫోటోలు... సోనియా - కెసిఆర్ లకు పెళ్ళంటూ బ్యానర్లు... రాజకీయ అసమర్థత తెచ్చిన ఉద్యమక్రీడ మరిన్ని కొత్తపోకడలు పోతోంది. కలిసి వుండాలన్న డిమాండ్ కు, విడిపోవాల్సిందే అన్న పోరుకేకకు మధ్య సంధి ఎప్పుడు కుదురుతుందో తెలియని సామాన్యుడు నిత్యజీవన పోరాటం లో సాగిపోతూనే వున్నాడు. 

కామెంట్‌లు లేవు: