22, ఫిబ్రవరి 2016, సోమవారం

People decide leader’s fallows

సమైఖ్య రాష్ట్ర నినాదం అనూహ్యంగా వాడవాడలా ఎగబాకుతోంది. కార్చిచ్చులా వ్యాపిస్తున్న ఈ భావోద్వేగ ప్రదర్శనలపై పట్టుకోసం వివిధ రాజకీయ పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. 12రోజులు గడుస్తున్నా ముగింపుపై స్పష్టత లేకుండా ఏకనినాదంతో సాగుతున్న ఆందోళనలు నాయకులను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. బేధం లేకుండా నాయకులునందరినీ అనుమానపు చూపులతో, అవమానకరమైన మాటలతో ప్రజలు చూస్తుండటంతో నాయకులు ఖిన్నులవుతున్నారు. తమతమ నియోజకవర్గాలకు దూరంగా మసలుతున్నారు. 
విశాఖ జిల్లాలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఒక రాజ్య సభ సభ్యుడితో పాటు మరో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వున్నారు. వీరికితోడు నాలుగురు టిడిపి ఎమ్మెల్యేలు, ఒక వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే జిల్లాలో వివిధ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు సమైఖ్య నినాదంతో చాలా కాలంగా ఉద్యమకారులతో మమేకమవుతూ తన విధానాన్ని విస్పష్టంగా ప్రకటిస్తూ వస్తున్నారు. అడపాదడపా అని ప్రజలు అంటున్నా... ఆయన మాత్రం, నేను వీలున్నప్పుడల్లా జిల్లాలో సమైఖ్య ప్రదర్శనలలో పాల్గొంటున్నాను అనే చెపుతూ వస్తున్నారు. వివిధ జెఏసీల వద్దకు వెళ్ళి మద్దతు ప్రకటిస్తూ రావటం, రాజకీయేతర జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో పలువురిని తన ఏలుబడిలో ఓ వేదికపైకి తీసుకువచ్చిన గంటా, ప్రతిపక్షాల నుంచి ఘాటైన విమర్శలనే ఎదుర్కొన్నారు. స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమబాటను పునాది చేసుకోవాలని చూస్తున్నారంటూ గంటాపై విమర్శలు వెల్లువెత్తాయి. సమావేశం తరువాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎన్జీవో హోంనే తన స్వంత కార్యాలయంగా ప్రకటించటం తప్ప మరే కార్యక్రమంలోనూ ఈ జెఎసీ చురుకుగా పాల్గొనకపోవటం, కార్యాచరణ కోసం మంత్రివైపు చూస్తోందన్న మాట... నేపథ్యంలో నాన్ పొలిటికల్ జెఎసీ నామమాత్రంమైంది. ఢిల్లీ, హైదరాబాదు, విశాఖల మధ్య ఎప్పుడు ఎక్కడ వుంటారో తెలియకుండా ఎగురుతున్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఉద్యమాన్ని ఉధృతం చేయటానికి పావులు ఎలా కదుపుతారన్న ప్రశ్న ఉద్యమాభిమానులను వేధిస్తూనే వుంది. మరో మంత్రి పసుపులేటి బాలరాజు సమైఖ్యతకే కట్టుబడి వున్నానని చెపుతూనే... రాజీనామా చేయననీ, అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న తరువాత పెద్ద చేయగలిగేది ఏమీ లేదని బహిరంగంగానే చెపుతూ వస్తున్నారు. ఆ మాట అన్నందుకు నర్సీపట్నంలో ఆయన సమైఖ్యవాదుల నిరసనను ఎదుర్కొన్నారు. నిరసనకారుల పట్ల సాహానుభూతిని ప్రదర్శించాల్సిన మంత్రి సంయమనం కోల్పోయి వారిని పోలీసులకు అప్పచెప్పటంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. నిన్నటి వరకూ విశాఖలోనో కాకుంటే ఏజెన్సీలో ప్రజలకు అందుబాటులో వుండే మంత్రి బాలరాజు చాలా కాలంగా హైదరాబాదుకే పరిమితమై పోయారు. ప్రజల భావోద్వేగాలను సొమ్ముచేసుకునే రాజకీయ నాయకుల వరుసలో వుండటానికి ఇష్టపడకే దూరంగా వుంటున్నానని సన్నిహితులకు చెపుతున్నట్లు సమాచారం.  ఈ వ్యవహారశైలితో బాలరాజు రాజకీయ భవిష్యత్తు ఇబ్బందులలో పడిందన్న సన్నిహితుల ఆందోళనను ఆయన పరిగణలోకి తీసుకున్నట్లు లేరు. 
 ఉద్యమంలో కనిపించకపోతే రాజకీయంగా వెనుకబడిపోతామనుకున్న టిడిపి నేతలు కొద్దిగా ఆలస్యంగానైనా రాజీనామాల బాటపట్టారు. ఆ తరువాత అడపాదడపా ఉద్యమం పేరుతో చిన్నచిన్న ప్రదర్శనలకు పరిమితమయ్యారే తప్ప ఉద్యమకారులకు సంఘీభావంగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన దాఖలాలు లేవు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వటానికి మేం వ్యతిరేకంగా కాదు... ఇచ్చిన పద్ధతికే అన్న తమ పార్టీ వివరణతో ప్రజలలోకి సమర్ధవంతంగా వెళ్ళలేని పరిస్థితులలో నాయకులు పడ్డారు. దీనితో వీరిపని కుడితిలోపడ్డ ఎలుకల్లా తయారయ్యింది. పూర్తిగా సమైఖ్య ఉద్యమంలోకి వెళ్ళలేక, వెళ్ళకుండా వుండలేక అన్యమనస్కంగా టిడిపి ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రదర్శనలను ప్రజలు గమనిస్తూనే వున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఇంతకు భిన్నంగా ఏమీలేదు. రాజీనామాలు చేసినట్లు ప్రకటించిన వారు, ప్రకటించని వారూ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన దాఖలాలు లేవు. మంత్రి గంటా విమానం దిగగానే ఆయనను నీడలా వెంబడించి సాగే అవంతి శ్రీనివాసరావు, చింతలపూడి వెంకట్రామయ్యలు... మంత్రి విమానం ఎక్కగానే మాయమవుతున్న తీరును ఆయా నియోజకవర్గాలలో ప్రజలు నిగ్గదీస్తూనే వున్నారు. మరో ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తపడితే... మళ్ళ విజయప్రసాద్ అటు కప్పకీ, ఇటు పాముకీ కోపం రాకుండా అన్నచందాన వ్యవహరిస్తున్నారు. అందరికంటే ముందుగా రాజీనామా ప్రకటన చేసిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చేస్తున్న ఉద్యమాలు ఏమిటా అని ఆ నియోజకవర్గ ప్రజలు తేరిపారా చూస్తున్నారు. ఆయా నియోజకవర్గాలలో ఉద్యమబాటపడుతున్న ప్రజలకు, ఉద్యమాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు పలుకుతున్న ప్రజలకు ఇప్పుడు ఎమ్మెల్యేలు  ఎక్కడున్నారో చూసే తీరికే లేదు. అవసరం అంతకన్నా లేదు. అందుకే ఉద్యమాలు ఇప్పుడు ఏదో ఒక కేంద్రానికే పరిమితం కాలేదు. ఒక సమయానికి లోబడి సాగటంలేదు. పదిమంది ఎప్పుడు కలిస్తే అప్పుడు, ఎక్కడ కలిస్తే అక్కడ జై సమైఖ్య ఆంధ్రప్రదేశ్ నినాదం మారుమ్రోగుతోంది. అదిగో ఆ తీరే ఇప్పుడు నాయకులను గంగవెర్రిలెత్తిస్తోంది. 
అధిష్ఠానానికి సన్నిహితంగా వుంటారని అనుయాయీలు ఘనంగా చెప్పుకునే కేంద్ర మంత్రి పురంధేశ్వరి జూలై మాసాంతం నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా నియోజకవర్గంకు వచ్చిన దాఖలా లేదు. సమైఖ్యరాష్ట్రం కోసం పాటుపడుతున్నానంటూ ఢిల్లీ మీడియాకే పరిమితమవుతున్న కేంద్ర మంత్రి అంతకు నెలరోజుల ముందే తమ అధినేత్రికి ఓ లేఖ ఇచ్చారని ఆయా వర్గాలలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. రాష్ట్ర విభజన అంటూ జరిగితే ఏం చేయాలో సూచిస్తూ, సమైఖ్య భావనను తేలిక చేస్తూ ఇచ్చినట్లు చెపుతున్న ఆ లేఖ విషయాంశాల ప్రచారంతో ఆమె సరిపడినంత అపకీర్తినే మూటగట్టుకున్నారు. తమ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి విలువనివ్వాలో, తన నియోజకవర్గ ప్రజల మనోభీష్ఠాన్ని గౌరవించి మంత్రి పదవిని తృణప్రాయంగా భావించి ఎడమకాలితో తన్ని ఉద్యమంలోకి కుడికాలు పెట్టాలో తేల్చుకోలేని సంక్లిష్టావస్థలో పురంధేశ్వరి కొట్టుమిట్టాడుతున్నారు. నిన్నటి వరకూ అవిశ్రాంతంగా విశాఖ పార్లమెంటు నాకేనంటూ ఎలుగెత్తి చాటిన మరో ఎంపీ తిక్కవరపు సుబ్బరామిరెడ్డి పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీలేదు. వారానికో సంఘాన్ని ఫ్లోట్ చేసి ఆ సంఘాల ద్వారా ఆయా సామాజిక వర్గాలకు దగ్గరై విశాఖ ఎంపీసీటును సాధించుకోవాలనుకున్న తిక్కవరపు ఆశలను సమైఖ్య ఉద్యమం ఉప్పెనై ముంచేసింది. సోనియమ్మను కాదని ఆయన ఉద్యమంలోకి రాగలిగిన పరిస్థితిలేదు. అలాగని జై సమైఖ్యాంధ్ర అని అనకుండానూ వుండలేరు. అందుకే ఆయన ఇతరులను నొప్పించక, తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న చిన్ననాటి నీతి పద్యాన్ని గట్టిగానే గుర్తుచేసుకుంటున్నారు. 
నిన్నటి వరకూ తెలంగాణ ఇచ్చేస్తే ఏమిలే అనుకున్న వారంతా ఇప్పుడు హైదరాబాదు ఇచ్చేస్తే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. హైదరాబాదు తెలంగాణ వారిదే అంటే ఊరుకోం అంటూ మొదలైన మాట ఇప్పుడు అసలు రాష్ట్ర విభజనే కుదరదు అంటూ హోరెత్తుతోంది. ఈ ఉద్యమహోరులో పోరుబాట పట్టని నాయకులను ఓటరు చరిత్రహీనులను చేస్తారంటూ ఉద్యమకారులు చేస్తున్న హెచ్చరికలు నాయకులకు నిద్రను దూరం చేస్తున్నాయి. అందుకే తడబడుతూనైనా నాయకుల అడుగులు ప్రజాఉద్యమ బాటపడుతున్నాయి. రాజకీయనిరుద్యోగిగా మిగలకుండా వుండటానికి ఉద్యమం ముసుగు తొడుక్కుని ఫోజులు కొడుతున్నారు. ఏళ్ళ తరబడి సాగుతున్న వివాదానికి శాశ్వత పరిష్కారం విభజనే అన్నదానిలో నాయకులకూ, మెజారిటీ ప్రజలకు పెద్దగా బేధాభిప్రాయం లేకపోవచ్చు. పీకపట్టుకుంటుంది మాత్రం హైదరాబాదే. హైదరాబాదుని కేంద్రానికి ఇచ్చి ఇద్దరూ చెరో రాజధాని వెతుక్కుంటే సమస్య పరిష్కారమైనట్లే. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానానికి కావల్సిందీ అదే. అందుకేనేమో నాయకులూ నలుగురితో నారాయణ అంటున్నారు. Leaders decide people fallows అన్న నినాదాన్ని మార్చి People decide leader’s fallows అంటూ సరికొత్త పల్లవిని అందిపుచ్చుకున్నారు. సర్వకాల సర్వావస్తలందూ నాయకులారా... వర్ధిల్లండి.

కామెంట్‌లు లేవు: