22, ఫిబ్రవరి 2016, సోమవారం

లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక...

ఆర్భాట ప్రకటనలు... హంగు, పొంగులతో స్థలాల పరిశీలనా పర్యటనలు... మూడు నెలలుగా మన మంత్రులు, 
ఎమ్మెల్యేల తీరిది. అత్యుత్తమ ప్రకటన అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు 
నుంచి జిల్లాలో జూనియర్ మంత్రి గంటా శ్రీనివాసరావు వరకూ ప్రకటించని వారే లేరు. సందట్లో సడేమియా... తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా బిజెపి ఎమ్మెల్యే నేతృత్వంలో సమావేశం కావటం, ఆయన ఆధ్వర్యంలో ఐటి కంపెనీలను తనిఖీ చేసి మీ చేతకాని తనాన్ని చూస్తూవూరుకోం అంటూ రంకెలేయటం..ఇప్పుడు జిల్లాలో ఇవి హాట్ టాపిక్స్. అసలు వీటి వెనుక మర్మమేమిటో? జనాలను వేధిస్తోన్న సందిగ్ధ సందేహం. తరచి, తొలిచి చూస్తే వచ్చే ఆసక్తికరమైన అంశాలే నేటి ఎబిఎన్ కథనం...
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జనాలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే ఏ పని అయ్యింది? అంటే, ఠకామని చెప్పటం ఒకింత కష్టమే. కానీ, విశాఖపట్టణం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను తీసుకురావటానికి, 24గంటలూ 
లోహపురెక్కల జడిసప్పుడు నగరం నెత్తిన రొదపెట్టటానికి అవసరమైన అనుమతుల సాధనకు నాటి ప్రజాప్రతినిథులు పాపం ఎంతగానో కష్టపడ్డారన్న విషయాన్ని విస్మరించటం ఎంతమాత్రమూ సముచితం కాదని విజ్ఞులైన పెద్దల అభిప్రాయం. ఇప్పుడు ప్రశ్న అల్లా ఆ విజ్ఞులైన పెద్దల్లో నేటి పాలకులున్నారా? అన్నదే. చమటోడ్చి సాధించిన అంతర్జాతీయ హోదాను ఏమీ కాదన్నట్లు తీసేస్తారేమిటి? సరికొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకువస్తానంటారేమిటి? కాంగ్రెస్సోళ్ళను వేధిస్తోన్న ప్రశ్న. విశాఖలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును నిర్మిస్తాం అంటూ చంద్రబాబు... ఆ కట్టే పచ్చటి విమానాశ్రయాన్ని అచ్యుతాపురంలో కడతామని ఒక సారి, కేంద్ర బృందం స్థలపరిశీలన తరువాత నిర్ణయిస్తామని మరో సారి జిల్లాలో జూనియర్ మంత్రి గంటా శ్రీనివాసరావు పలుమార్లు ప్రకటించారు. దీనికితోడు పక్కజిల్లాల మంత్రులూ అబ్బే ఆ జిల్లాలో కాదంటూ ఇచ్చిన ప్రకటనలను విశాఖ జనం అస్సలు ఖాతరు చేయటం లేదులేండి. అందరూ అయిపోయారు, నేను మాట్లాడకపోతో బాగోదనుకున్నారో, లేక నిజంగా మాట్లాడాలనిపించే మాట్లాడారో తెలియదు కానీ... ''అబ్బే అక్కడా ఇక్కడా దేనికీ... దేశంలోనే రెండో మునిసిపాలిటీగా, డచ్ వారి పోర్టుగా వెలుగొంది చారిత్రిక ప్రాధాన్యం కలిగిన భీమునిపట్నం ఆనవాలును చెరిపేస్తూ 
మహావిశాఖలో ముంచేస్తున్నాం కాబట్టి... అక్కడే విమానాశ్రయాన్ని కట్టేస్తాం'' అంటూ జిల్లా సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలంగాణ రాజధాని హైదరాబాదులో మీడియా ముందు ప్రకటించేశారు. అంతే సముద్రంలో విమానాలు దిగుతాయంటూ నమ్మినబంటుల్లాంటి మీడియా గట్టిగా ఊదేసింది. అద్సరే... అసలు ఇంతకీ ఎయిర్ పోర్టు ఎక్కడొస్తుందహే? ఎందుకండీ అంత అసహనం... ఓపికపట్టండి సెపుతాంగా..!
సామాన్యులకు తెలిసిన ఓ నిజం చెప్పేస్తున్నా.అజాగ్రత్తగా సెవులురెండూ ఒగ్గేయకండే... ఇప్పుడున్న విమానాశ్రయంలో అన్ని హంగులూ వున్నాయి. దేశవిదేశాల నుంచి పారొచ్చేసి రాత్రిళ్లు దిగేయటానికి ఎంచగ్గా మిణుగురు దీపాలూ వున్నాయి. ఇమానం దిగేప్పుడు, ఎగిరేప్పుడూ పెట్టే పరుగుకు మరింత పెద్ద సిమెంటు రోడ్డు కావాలన్నా వేసుకోవటానికి తగినంత స్థలమూ వుంది. సామాన్యుడు పనికోసం పరుగెత్తిపోయే దుబాయికి, మననాయుడోరు నిత్యం పలవరించే సింగపూర్ కి ఎప్పటి నుంచో ఈ పెద్దపెద్ద ఇమానాలు ఎల్లొచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ కావలసిందాల్లా మరిన్ని ఇమానాలు ఎడాపెడా వచ్చేయటం. ఎక్కేవోడు లేక పల్లెవెలుగు ఎత్తేస్తున్నారు. ఎందుకంటారు..! ఆల్లంతా మరి ఇమానాలెక్కేసి దిగిపోయొచ్చేస్తారు మరి. అందుకే ఇమానాలూ ఇమానాలూ మా ఊరికి రండోచ్ అంటూ బొట్టూ, చీరెట్టి పిలుపులిచ్చేయటం మానేసి కొత్తవిమానాశ్రయం ఎందుకండీ? అంటూ ఉత్తరాంధ్ర అమాయకులు పాపం జవాబు రాదని తెలిసినా అడిగేస్తూనే వుంటారు. ఆ మద్దెన నావికాదళంలో పెద్దాయన మీడియాపెద్దోళ్ళతో పిచ్చాపాటీ మాట్లాడారు. విశాఖవిమానాశ్రయాన్ని అభివృద్ధి చేసుకోవటానికి మేం 
అడ్డంకికానేకాదు. అయితే దీనిని విడిచిపెట్టి మేం వెళ్ళటం వ్యూహాత్మకంగా కుదరదు. అంతేనా, అచ్యుతాపురం, రాంబిల్లి ప్రాంతాలలో విమానాశ్రయం ఏర్పాటును అంగీకరించబోమంటూ చాలా తెలివిగా గొట్టాలకేమీ సాక్ష్యమివ్వకుండా చెప్పారు. ఇకపోతే విజయనగరం జిల్లాలో వున్న బాడంగి ఎయిర్ స్ట్రిప్. అక్కడ వున్న 2500 ఎకరాల సుమారు వెయ్యి ఎకరాలకుపైగా రైతుల ఆక్రమణలలో వుండగా, మిగిలినది నావికాదళం అధీనంలోనే వుంది. దేశ రక్షణ అవసరాల రీత్యా దానిని ఒదులుకోవటానికి సిద్ధంగా లేమని సూచనాప్రాయంగా ఇప్పటికే భారతనావికాదళం చెప్పినట్లు సమాచారం. చివరిగా భీమిలిలో విమానాశ్రయం పెట్టేంత స్థలం లేదు, ప్రతిపాదన అంతకంటే లేదు అంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ యువరాజ్ ఓ కాలు కారులోనూ, ఓ కాలు రోడ్డుమీదా పెట్టి ఆమాటా ఈ మాటా మధ్యలో విలేఖరులతో అనేశారు. ఆనోటా ఈనోటా వచ్చిన ప్రతీఊరిలో రియల్టర్లు కార్లేసుకుని వాలిపోయారు. పండొలిచి నోట్లో ఎట్టినంత వివరంగా సెప్పానా... ఇంకా అంటే ఎట్టబ్బా..?!
విమానాలు వాటి ఆశ్రయాల సంగతి అటుంచితే... ఇప్పుడు జిల్లాలో తెలుగుతమ్ముళ్ళకు ఓ కొత్త బెంగపట్టుకుంది. కాలం గడిచేకొద్దీ అసలు పార్టీ వుంటుందా? లేక అంతా జాతీయ పార్టీనే మేలంటూ అటే వెళ్ళిపోతారా? ఇంతకీ తమ్ముళ్ళకు అంతసందేహం ఎందుకు వచ్చిందనేగా? ఇది విన్నతరువాత కూడా మీకు రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఆ మధ్య జిల్లాలో ఎన్నికైన తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా కలిసి ఓ హోటల్ లో గూణుపుఠానీ చేశారు. అంత వరకూ పెద్ద తప్పేమీ లేదు కానీ... దానికి నేతృత్వం వహించింది మాత్రం మొన్నటి కాంట్రాక్టర్లు కమ్ క్రికెట్ ప్రేమి, నిన్నటి ఐటీ కంపెనీ ఓనరు, ఇప్పటి బిజెపి ఎమ్మెల్యే అయిన విష్ణుకుమార రాజు కావటమే అసలు తంటా. దానికి సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు, రెండో సారి ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహిస్తున్న వెలగపూడి, రాజు తదితరులతోపాటు పలువురు హాజరు అయ్యారు. అక్కడితో ఆగకుండా మరోసారి నగరం నడిబొడ్డున వున్న ఐటీ కంపెనీలు విప్రో, టెక్ మహేంద్రలలో తనిఖీల పేరిట హడావిడి చేశారు. ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, విప్రో అధినేత ప్రేమ్ జీకి రాచమర్యాదలు చేసి ఇంకా స్థలం ఇస్తామంటూ హామీతో పాటు, ఇస్తున్నట్లు ప్రతాన్ని కూడా చేతిలో పెడితే... ఎమ్మెల్యేలు విప్రోకు  వెళ్ళి ఇవ్వాల్సిన ప్రకారం ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి నీ స్థలం లాక్కుంటామంటూ మీడియాముందు హూంకరించటం... ఎట్టెట్టా అంటూ ఉత్తరాంధ్ర జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఓ సీనియర్ రాజకీయనాయకుడు మాట్లాడుతూ, మాజీ మంత్రులు కూడా ఆలోచనారాహిత్యంతో, ఆవివేకంగా ప్రవరిస్తుంటే ఖర్మ అనిసరిపెట్టుకోవటం తప్ప ఏం చేస్తామండీ అంటూ నిట్టూర్చారు. ఇది ఇలాగే సాగితే రానున్నకాలంలో బిజెపి మరింత స్వతంత్రంగా వ్యవహరించటానికి చూస్తుందంటూ ఆయన జోస్యం కూడా చెప్పారు. ఇదే భయం ఇప్పుడు తమ్ముళ్ళనందరినీ వేధిస్తోంది మరి. వాయిస్ ఓవర్: గడచిన మూడు నెలల కాలంలో అది చేస్తాం, ఇది చేస్తాం... అక్కడ కడతాం, ఇక్కడ కడతాం... అంటూ చెప్పిన ఇంకా చెపుతున్న మాటలు తప్ప మరేమీ కనిపించని పరిస్థితులను ప్రజలు జాగ్రత్తగానే కనిపెడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఉత్తగొడ్డుకు అరుపులెక్కువ అనుకునే ప్రమాదం వుంది. అసలు రాష్ట్రంలో... ఉత్తరాంధ్రలో... మరీ ముఖ్యంగా ఇసాకపట్నంలో ఏం జరుగుతోంది? ఏమో లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక....

కామెంట్‌లు లేవు: