23, ఫిబ్రవరి 2016, మంగళవారం

చంద్రుడుకి ఎందుకు కోపం వచ్చింది?

మత్తు వదలలేదు. పక్క గదిలో లైటు వేసిన అనుభూతి. రెప్పలేవకుండానే మెలుకువ వచ్చిన ఫీలింగ్. అమ్మ ఎప్పుడూ ఇంతే. బంగారం లాంట నిద్ర చెడగొట్టాలా? మస్తిష్కంలో అన్నీ నమోదవుతూనే వున్నాయి. లేవాలన్న ప్రయత్నం విఫలమవుతున్న విషయమూ అర్థమవుతోంది. ఈ లోగా అలవాటు చొప్పున సొల్లు యంత్రం తన పని తాను చేసుకుపోయింది. పండుకుంది చాలు... లే అంటూ మోగటం మొదలుపెట్టింది. తప్పనిసరై ఒకింత విసుగుతోనే లేచిన గుర్తు. చప్పుళ్ళు వినిపిస్తున్న వంటగదిలోకి అడుగులేశాను. ఏంటమ్మా ఇది అంటూ విసుగ్గా రాబోయిన మాటలు పెదాల మాటునే ఆగిపోయాయి. నాన్న... బ్రెష్షు నోట్లో పెట్టుకుని కాఫీ కలుపుతున్నాడు. 
ఏంటండీ నిద్ర పట్టలేదా? అంటూ పదాలు అప్రయత్నంగానే దొర్లాయి. 
ఇప్పుడే లేచారా, అంటూ సమాధానం. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నా... నా ప్రశ్నలో ధ్వనించిన చికాకును నాన్న గ్రహించలేదన్న తేలికపాటి భావన. 
చకచకా తయారై తోలూడిన బూటేసుకుని వాకింగ్ కి బయలుదేరాను. నేను నడకకు పోకపోతే పొద్దు పొడవ దేమోనన్న ఫీలింగ్ బలంగా వుంటుంది. వెధవది, ఆ మాత్రం లేకపోతే ఠంఛనుగా మెలుకువ రాదని నా గట్టి నమ్మకం. ఇదే చాదస్తం అంటే, అని అప్పుడప్పుడూ మా ఆవిడ విసుక్కోవటమూ గుర్తుకు వచ్చింది. 
రోడ్డు దాటుతూంటే, ఎర్రటి చంద్రుడు పడమటకి జారిపోతున్నాడు. గుండ్రంగా ఎర్రగా కనిపించిన చంద్రుడుని చూడగానే ఎందుకంత కోపం అనిపించింది. నిజమే చంద్రుడికి ఎందుకో కోపం వచ్చింది. ఎర్రబడ్డాడు. మెల్లగా చెరువుగట్టుపై నడుస్తూన్నా... కోపబింబం వెంటాడుతూనే వుంది. లాభం లేదనుకుంటూ దానిని సెల్ ఫోన్ లో బంధించాలని చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. 
సందేహం తీరకుండా నడక సాగదనిపించింది. వెంటనే శ్రీమతికి ఫోన్ చేశా. మరో ఐదు నిమిషాలలో ఎటూ తను నిద్ర లేస్తుంది. ఫర్వాలేదులే అన్న ధీమా. 
హలో... నిద్ర మత్తులో శ్రీమతి గొంతు. 
బాగుంది, హస్కీగా. నాకు చాలా ఇష్టం ఆ ధ్వని. 
మురిపాన్ని పక్కనపెట్టి, చంద్రుడికి కోపం వచ్చిందోయ్. ఎందుకో అర్థం కావటం లేదు. బాగా ఎర్రబడ్డాడు. ఎందుకంట? అంటూ ఉగ్గపట్టుకున్న ప్రశ్నను అడిగేశాను. 
అవునా...? మత్తు వీడని మూడ్. 
అవును, ఎంత ఎర్రగా వున్నాడో అంటూ నా గొంతులో అదో రకమైన ఉద్వేగం. 
చాలా కూల్ గా... అడగలేకపోయావా... పెదాల చివర్న చిన్న నవ్వు వచ్చినట్లు కనిపించే సరికి, చిన్న సంతృప్తి. అంతలోనే అసంతృప్తి కమ్మేసింది. అర్థం కాలేదు. ఏం ఆశించాను? 
అసంకల్పితంగానే మరో ఫోన్.
హలో యంగ్ మాన్ గుడ్ మార్నింగ్ అంటూ పలకరింపు. 
గుడ్ మార్నింగ్, చంద్రుడికి కోపం వచ్చింది. ఎంత ఎర్రగా వున్నాడో, చూశావా? అంటూ గబగబా అడిగాను. 
అవునా, చూస్తాను ఆగు అనేలోగా చంద్రుడు జారుకున్నాడు. 
కనిపించడులే నీకు అంటూ ముక్తాయించాను. ఏదో మాటలు సాగుతూనే వున్నాయి. అన్యమనస్కంగానే వున్నా. ఇంతకీ చంద్రుడుకి ఎందుకు కోపం వచ్చింది? సమాధానం దొరకనేలేదు. వచ్చిన సమాధానం ఈ చెవి నుంచి ఆ చెవిగుండా జారిపోయింది. చిన్న వెలితి... రోజంతా కొనసాగుతూనే వుంది. అసలు ఏం కావాలి?...

కామెంట్‌లు లేవు: